దైవ సేవకుడు జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా
విశ్వాసులు పొందిన మేలులు
1. నా పేరు బేబి రాణి. నాకు పెద్ద ప్రేగు సమస్య ఉన్నదని వైద్యుని దగ్గరకు వెళ్ళాను. పరీక్షించి స్కానింగ్ చేయాలని చెప్పారు. నాకు ఎలాంటి రోగము లేదని వస్తే, తంబి గారి వద్దకు వచ్చి దేవునికి స్తోత్రము చెల్లించు కుంటూ, సాక్ష్యం ఇస్తానని మొక్కుకొని యున్నాను. నిజముగానే నాకు ఎలాంటి జబ్బు లేదని స్కాంనింగ్‌లో వచ్చినది. యేసు ప్రభువు, తంబిగారి మధ్యస్థ ప్రార్ధనద్వారా నాకు గొప్ప మేలు, స్వస్థతను చేసియున్నాడు. దేవునికి స్తోత్రం!
2. దేవునికి స్తోత్రం! దేవుని బిడ్డలందరికీ నా హృదయ పూర్వక వందనాలు. జోసఫ్ తంబిగారికి నా హృదయ పూర్వక వందనాలు. నా పేరు సూర్యనారాయణ నేను 5సం॥రాలు క్రిందట అనారోగ్యంతో ఎంతో బాధ పడ్డాను. ఎన్నో సంఘాలకు తిరిగాను. ఎన్నో హాస్పిటల్‌కు తిరిగాను. తగ్గలేదు. ఒకరోజు పిన్నమనేని హాస్పిటల్‌కు వచ్చి చూపించుకుని అక్కడకు దగ్గరగా వుందని తంబి సన్నిధికి వచ్చాను. ఆ తంబి సమాధి మీద పడుకొని ఏడ్చి ఈ బాధను తీసివేయవాలి అని కన్నీరుతో ప్రార్ధించగా, దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేశారు. నాకు ఎంతో స్వస్థత కలిగింది. నేను ఆరోగ్యం పొంది, పొలం పనులకు వెళ్ళడానికి దేవుడు నాకెంతో ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి వేలాది కోట్లాది వందనాలు కలుగును గాక! అదేవిధంగా, నాకు ఇద్దరు బిడ్డలు. ఒక పాప ఒక బాబు. మా కూతురు పట్ల కూడా దేవుడు ఎన్నో మేలులు చేశారు. అదేవిధంగా మాబాబు పట్ల ఎంతో గొప్ప కార్యము చేశారు. మా స్ధితికి మించిన చదువును చదివించ డానికి దేవుడు ఎంతో కార్యం చేశారు. మా బాబు పేరు సురేష్ బాబు. ఎమ్.టెక్‌లో ర్యాంక్ రావడానికి ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడకి వెళ్ళి చదువు కుంటున్నాడు. ఆ చదువుకు అయ్యే ఖర్చు డబ్బు వారే నెలకు 12,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ విధంగా మా బాబు చదువు విషయంలో ఎంతో కార్యం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.
3. దేవునికి స్తోత్రం! తంబిగారికి
నాహృదయపూర్వక వందనాలు. నా పేరు సునంద. నా భర్త పేరు విజయ్ కుమార్ రాజు. నాకు
ఇద్దరు బిడ్డలు. తేజశ్వని (5) అక్షిత్ కుమార్ (2). దేవుడు నాపట్ల ఎన్నో మేలులు, ఆశ్చర్య
కార్యాలు చేశారు. నాకు మొదట ఎక్కువగా రక్తస్రావం జరుగు తుండేది. అప్పుడు నేను
వెంటనే సూర్య కామినేని హాస్పిటల్‌కు వెళ్ళాను. అక్కడ నాకు స్కానింగ్ చేసి, గర్భసంచిలో
నీటిబుడగలు వున్నాయని చెప్పారు. కాళ్ళమీద మచ్చలు కూడా వచ్చాయి. శరీరంలో బ్లడ్
తక్కువగా ఉందని ఐరన్ ఇంజక్షన్స్‌ను ఎక్కించారు. అయిన నీరసం తగ్గలేదు. కాళ్ల మీద
మచ్చు తగ్గలేదు. మేము పిన్నమనేని హాస్సిటల్‌కు చూపించు కుంటానికి అని బయలు దేరగా
ట్రైన్ మిస్సయి టైం ఎక్కువగా అవడం వలన, మా అమ్మగారు తంబిగారి గుడికి వెళ్ళి ఈ రోజు ఇక్కడ
ప్రార్ధన చేసుకొని రేపు ఉదయం హాస్పిటల్‌కి
వెళ్ళి చూపించు కుందాము అన్నది. తంబి సమాధిమీద పడుకొని ప్రార్ధన చేసుకో! మీ
నాన్నకు తగ్గించిన దేవుడు నీకు స్వస్థత కలుగ జేస్తారు. నీకు కూడా మంచి ఆరోగ్యం
దేవుడు ఇస్తారు అని అన్నది. అప్పుడు తంబి సన్నిధికి వచ్చి, నా ప్రభువా!
నా పట్ల నీవు కార్యం చేయవా ప్రభువా! ఆరోగ్య వంతురాలుగా చేయి ప్రభువా! లేకపోతే నీ
రాజ్యం తీసుకుపో ప్రభువా! అని ఏడ్చి కన్నీరుతో తంబి సమాధి మీద పండుకొని ప్రార్ధన
చేయగా, దేవుడు
నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో టెస్ట్‌లు చేశారు.
హాస్పటల్‌లో ఆ రోజు రాత్రి 10గం॥లు ప్లేట్‌లెట్స్ టెస్ట్ చేయగా అందులో 5,000 అని వచ్చింది, వెంటనే
డాక్టర్‌లు ఎంతో కంగారు పడి ఐ.సి.యు.లో పెట్టారు. వెంటనే ఇంటి కాడా ఉన్న వారికి
కూడా ఫోన్ చేసి ఒక గం॥లో వచ్చేయాలి, ఇలోగా వైద్యం చేస్తామని చెప్పారు. అదేరీతిగా మా
దగ్గర డబ్బు లేక పోయినా వారు వైద్యం మొదలు పెట్టేశారు. కాని గంటలే చెప్పారు. మూడు రోజులు
గడిచే దాకా గ్యారంటీ చెప్పలేము అన్నారు. తరువాత ప్రెవేట్ హాస్పటల్‌లో డబ్బు
ఎక్కువగా అవుతున్నాయని అన్నప్పుడు, శ్రీనివాస్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు రాశారు.
అక్కడ డాక్టర్‌లు వైద్యం బాగా చేశారు. తెల్ల
రేషన్ కార్డు మీద వైద్యం జరిగింది. మరి ‘‘దేవుడు నా పట్ల ఎంత గొప్పకార్యం చేశాడు.’’ ఆరోగ్యంగా అటు
ఇటు తిరుగుతూ బాగానే వున్నాను అంటే అది కేవలం దేవుని కృపయే’’ దేవుడు నాలో
ఉండి వైద్యం జరిపించి నన్ను మరణ ఛాయల నుండి నా ప్రాణాన్ని రక్షించి మీ అందరి
మధ్యకు నన్ను సజీవు రాలుగా తీసుకు వచ్చిన
ప్రభువునకు వేలాది,
కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు కలుగును గాక! నా బిడ్డకు తల్లిగాను, నా భర్తకు
భార్యగాను, సంఘంలో
విశ్వాసురాలు గాను దేవుడు నన్ను నిలిపి నందుకు ఆయనకు మహిమ కలుగును గాక! ఆమేన్.
4. నా పేరు ఆత్మకూరి సత్యానందం. మాది
కృష్ణా జిల్లా, పెదపారుపూడి
మండలం, యలమర్రు
గ్రామము. నేను అనారోగ్యముతో బాధపడు చున్నాను. బ్రదర్ జోసఫ్ తంబిగారి సమాధివద్ద
ప్రార్ధన చేసుకొనగా నాకు మంచి ఆరోగ్యము చేకూరినది. దేవునికి వందనము తెలియ జేసుకుంటున్నాను.
బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనద్వారా, దేవుడు మా కుటుంబములో ఎన్నో మేలులు
చేసియున్నాడు. దైవ సేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబిగారికి కృతజ్ఞతలు.
ఆత్మకూరి సత్యానందం, సమాధానం, యలమర్రు.
5. నా పేరు Mrs. బెంజమిన్, కేరళ
రాష్ట్రము నుండి. మూడు సంవత్సరము క్రితం నేను విజయవాడ వచ్చినప్పుడు, పెదవుటపల్లిలోని
బ్రదర్ జోసఫ్ తంబిగారి సమాధిని దర్శించాను. అప్పటినుండి, తంబిగారి
ప్రార్ధన సహాయాన్ని కోరుచున్నాను. నేను డయాబెటిక్‌తో బాధపడుచున్నాను. మందులు వాడు చున్నాను.
మూత్ర విసర్జన సమస్య కూడా ఉన్నది. బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా
ప్రభువును విశ్వాసముతో,
నమ్మకముతో ప్రార్ధించగా నేను పూర్తిగా స్వస్థతను పొంది యున్నాను. అలాగే, మా మేనల్లుడు
గుండె జబ్బుతో బాధపడు చుండగా, తంబిగారికి ప్రార్ధన చేయగా స్వస్థత పొందినాడు. ఇప్పుడు మా
చిన్న కుమారుని ఉద్యోగము పోయినది. మాకు సొంత యిల్లు కాని, భూమి కాని
లేదు. మరల తంబిగారి ప్రార్ధనను వేడుకొంటున్నాము. ఈ మా మనవులను దేవుడు ఆలకిస్తాడని
దృఢముగా విశ్వసిస్తున్నాను.
బెంజమిన్, కేరళ.
6. మాది ఏలూరు మేత్రాసనం, తెడ్లం విచారణ, పాశ్వానగరం.
గత సంవత్సరము మా కుటుంబము చాలా ఇబ్బందులకు గురి అయినది. దీనివలన, నేను చాలా
మనోవ్యధను అనుభవించి యున్నాను. ఎన్నోసార్లు, ప్రార్ధన చేసియున్నాను. కాని దేవుడు నా మొరను
ఆకించలేదని తంచినాను. ఆ సమయములో ఉపదేశి మా ఊరి
దేవాలయములో బ్రదర్ జోసఫ్ తంబిగారి గురించి చెప్పడం విని యున్నాను. ఆరోజు
మోకరించి తంబిగారిని వేడుకున్నాను. ఆ ప్రార్ధనలో నా కుమారునికి, నా చిన్న అల్లుడికి
ఉద్యోగం రావాలని ప్రార్ధించాను. వారిరువురికి
ఉద్యోగాలు వచ్చినట్లయితే, తంబిగారి సమాధిని సందర్శించి సాక్ష్యము చెప్పు కుంటానని తలంచు
కున్నాను. తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా, దేవుడు నేను కోరిన మేలులను దయచేసి నందులకు
సాక్ష్యము ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం!
పచ్చిగోళ్ళ ప్రసాద్ బాబు, లూర్దుమేరి, సంపత్ కుమార్, మాన్విక. ఫిబ్రవరి 2019.
7. నా పేరు పి. జాన్సన్ బాబు. ఊరు కొమరోలు దగ్గర గోపానిపల్లె, ప్రకాశం జిల్లా. 2005వ సంవత్సరములో CRPF లో చేరినాను. 2010వ సంవత్సరములో నాకు సుస్మితతో వివాహ మైనది. మా పిల్లలు ప్రశాంతి, ప్రణవి, ప్రభుదాస్ ప్రణయ్ కుమార్. 2000ల సంవత్సరములో నాకు నోటిలో గడ్డ అయినది. ఆసుపత్రికి వెళ్ళితే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అయితే నేను తంబిగారి సమాధిని సందర్శించి, నా చెంపను తంబిగారి సమాధికి ఆనించి ప్రార్ధన చేసాను. నా తిరుగు ప్రయాణములో నాకు పూర్తిగా నోటిలోని గడ్డ నయమై పోయినది. దేవుడు తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా చేసిన ఈ గొప్ప మేలుకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం!
8. నా పేరు గంధం నాగేసు (జేమ్స్), టీచర్. నాకు 1995వ సంవత్సరములో
టీచర్ ఉద్యోగం వచ్చినది. నా భార్య పేరు లూర్దుమాత. హిందీ టీచర్‌గా పనిచేయు చున్నది.
నేను వికలాంగుడను. నా ఎడమ కాలు, ఎడమ చెయ్యి ఫోలియో ఉన్నది. 2007వ సంవత్సరములో నా కుడి కాలు విరిగినది.
ఆపరేషన్ నిమిత్తం ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి దగ్గర అప్పుగా రెండు లక్ష రూపాయలు
తీసుకున్నాము. నెలనెల వడ్డీ కడుతూ 2012లో ఎనభై వేలు ఇచ్చినాను. మిగిలిన లక్షల
ఇరవై వేలు 2014లో
ఇచ్చినాను. అప్పు మొత్తం కట్టినను, ఆ వ్యక్తి ప్రామిసరీ నోటు, ఖాళీ చెక్కు
ఇవ్వకుండా తన గ్రామానికి చెందిన మరోవ్యక్తి పేరుమీద ఐదు లక్షలకు నామీద, నా భార్య మీద
ఏలూరు జిల్లా కోర్టులో ప్రామిసరీ నోటు మీద దావా వేసినాడు. చింతపూడి కోర్ట్‌లో చెక్
మీద రెండు లక్షలకు ఇద్దరి మీద దావా వేయించినాడు. చెక్‌తో నా భార్యకు ఎలాంటి
సంబంధము లేదు. అయిన నా భార్యమీద చెక్‌మీద కూర్పులో క్రిమనల్ కేసు పెట్టినారు.
నేను యేసు ప్రభువును, మరియ
తల్లిని నమ్ము కున్నాను. అలాగే బ్రదర్ జోసఫ్ తంబిగారు అనిన ఎంతో విశ్వాసం. నేను
ప్రతీ సంవత్సరం తంబిగారి సమాధి దగ్గరకు వస్తూ ఉంటాను. తంబి గారంటే నాకు చాలా
ఇష్టం. ఏ బాధ వచ్చినను ఆయనకు ప్రార్ధన చేసు కుంటాను. అలాగే ఈ కష్ట సమయములో తంబి గారికి
ప్రార్ధన చేసుకున్నాను. ఈ కోర్ట్ కేసులో స్టే రావాలని ప్రార్ధన చేసాను. అలాగే
వచ్చినది. అలాగే, ఈ
కేసులన్నింటి నుండి బయట పడాలని ప్రార్ధన చేస్తున్నాను. అప్పుడు కూడా సాక్ష్యం
చెప్పు కుంటాను.
గంధం నాగేసు (జేమ్స్), టీచర్.
తేలెసోమవరం, వెలగపల్లి, చింతపూడి మండం, ప.గో. జిల్లా.
9. ముందుగా దేవునికి వందనములు. బ్రదర్
జోసఫ్ తంబిగారు మా కుటుంబములో ఎన్నో మేలులు చేసారు. ఒకప్పుడు నా భర్త లోకాశాలకు
గురై జీవిస్తుండగా, దేవుని
సన్నిధిలో ప్రార్ధన చేయగా నా భర్తని మార్చాడు. ఒకసారి మా కుమారుడు అలిగి
ఇంటిలోనుండి వెడలి పోవడం జరిగింది. రాత్రి 10 గంటల సమయము నుండి ఎంతో భయముతో ఎన్నో సార్లు ఫోన్
చేశాము, కాని, తీయలేదు. ఎంతో
దు:ఖముతో తంబిగారి ఫోటో వద్ద ఏడుస్తూ మా బిడ్డల కోసం ప్రార్ధన చేశాము. తెల్లవారి 3 గంటల సమయములో మా అబ్బాయి ఫోన్ చేసి మాతో
మాట్లాడాడు. ఈ విధముగా మా బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియ జేసినందుకు ఆ దేవాధి దేవునికి, తంబిగారికి
వేలాది స్తోత్రములను చెల్లించుకుంటున్నాము. ఇంకోసారి, నా భర్త కడుపు
నొప్పితో బాధ పడుతుండగా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాము. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని
చెప్పారు. ఒక కిడ్నీలో రాళ్ళు అడ్డం పడ్డాయని, ఒక కిడ్నీలో రక్తం సరిగా అందడం లేదని చెప్పారు.
నేను చాలా భయ పడ్డాను. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. నా భర్త కూడా
ఎంతో భయపడ్డాడు. తరువాత వస్తామని ఇంటికి వెళ్ళి పోయాము. నొప్పిని భరిస్తూ ఎంతో
బాధపడ్డాడు. ఆసుపత్రికి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇక మేము తంబిగారిని
నమ్ముకున్నాము. బాధనుండి విడుదల చేయమని ప్రార్ధన చేసు కున్నాము. అలాగే యూరిన్
ద్వారా కిడ్నీ రాళ్ళు వెళ్ళి పోయాయి. తంబిగారికి వందనాలు! నేను ఒకసారి కడుపులో గ్యాస్
సమస్యతో బాధపడ్డాను. ఆ రోజంత తంబి గారికి ప్రార్ధన చేసుకున్నాను. మరుసటి రోజు
డాక్టర్ చూసినప్పుడు ఏసమస్య ఉండకూడదని ప్రార్ధన చేసుకున్నాను. అలాగే, మరుసటి రోజు
డాక్టర్ స్కానింగ్ చేసి ఏమి లేదని చెప్పారు. ఈ విధముగా తంబిగారు మా కుటుంబములో
చేసిన మేలుకు సాక్ష్యమిస్తూ దేవునికి వందనాలు తెలుపు తున్నాను.
గోగులమూడి నాగేశ్వర రావు, కుటుంబ సభ్యులు, విజయవాడ.
10. నా పేరు ఆశాలత
అగస్తీను. నేను డయాబెటిక్ పేషంట్. నాకు పిల్లలు పుట్టరు అని అన్నారు. నేను జనవరి
6, 2018న పెదావుటపల్లి వచ్చినాను. నేను తంబిగారి సమాధి వద్ద
పాప కొరకు ప్రార్ధించమని వేడుకున్నాను. నేను పాపసంకీర్తనం చేసినప్పుడు, 5 మార్చిన శుభవార్త వింటానని కలలో వచ్చినది. నాకు పాప పుట్టినది. ఆ తరువాత
పాపకు ఆరోగ్యం బాలేనప్పుడు తంబిగారికి ప్రార్ధన చేసినప్పుడు, పాపకు మంచి ఆరోగ్యం దేవుడు దయ చేశాడు. తంబిగారి ప్రార్ధన సహాయమున నాకొరకు,
నాబిడ్డకొరకు ప్రార్దించి నందులకు దేవునికి వందనాలు.
ఆశాలత అగస్తీను, ఈస్ట్ మారేడుపల్లి, హైదరాబాద్.
11. నా పేరు నిర్మల.
దుర్గాపురము నుండి, అనుకోకుండా పెదావుటపల్లిలోని బ్రదర్ జోసఫ్ తంబిగారి సమాధి వద్ధకు
వచ్చి యున్నాము. దేవుడు మాకు ఒక గొప్ప కార్యమును చేసి యున్నాడు. ఆర్ధికముగా దేవుడు
మాకు ఎంతో సహాయము చేసియున్నాడు. బ్యాంకులో నున్న బంగారమును విడిపించుకొని
యున్నాము. మోటారు సైకిలును కొనుక్కో గలిగాము. మా భర్తగారి వాళ్ళ నాన్నకు
ప్రమాదములో రెండు కాళ్ళు దెబ్బ తిన్నాయి. కాళ్ళు బాగు కావాలని తంబిగారికి ప్రార్ధన
చేసి యున్నాము. ఈవిధముగా దేవుడు మా కుటుంబములో చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ
సాక్ష్యమును ఇచ్చుచున్నాము.
నిర్మల, దుర్గాపురము.
12. నా పేరు కొప్పుల
అన్నమ్మ. నా భర్త బాలస్వామి గారు. మాది విస్సన్నపేట. నా భర్తకి 2012లో కిడ్నీ తీసి వేసినారు. ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ మాత్రమే ఉన్నది. బాగానే
ఉన్నారు. అతని ఆరోగ్యాన్ని బట్టి దేవుడు గొప్ప వాడని కృతజ్ఞతా స్తోత్రములు
చెల్లిస్తున్నాము. అలాగే మా మనవడు కొప్పుల అర్విన్ మరణపు అంచుల వరకు వెళ్లి
తిరిగి వచ్చినాడు. దేవునికి కృతజ్ఞతలు! అలాగే నాకు కూడా కిడ్నీ సమస్య ఉన్నప్పుడు
బ్రదర్ జోసఫ్ తంబిగారి ద్వారా దేవునికి ప్రార్ధన చేసుకున్నాను. ఇప్పుడు నా
ఆరోగ్యం బాగా ఉంది. మా చిన్న కుమారునికి దేవుని దయ వలన ఉద్యోగము వచ్చినది, అలాగే వివాహము కుదిరినది. ఈ విధముగా మా కుటుంబములో స్వస్థతను దేవుడు ఇచ్చాడు.
దేవుడు ఎన్నో మేలులను చేసాడు. అందుకే ఈ సాక్ష్యము ద్వారా దేవునకు వందనాలు తెలుపు కొంటున్నాము.
కొప్పుల అన్నమ్మ, బాస్వామి, అర్విన్, వినోద్,
జ్యోతి, అలోక్.
13. నా పేరు బోడావుల సునంద. నేను 1-11-2018న తంబిగారి సన్నిధికి వచ్చాను. ఆరోజు నెలసరి వచ్చి రక్తస్రావం ఎక్కువ అగుచున్నది. మోషన్స్ ద్వారా కూడా రక్తం పోవు చున్నది. నన్ను బ్రతికించమని తంబిగారి సమాధి వద్ద కన్నీటితో ప్రార్ధన చేసాను. 2-11-2018న పిన్నమనేని హాస్పిటల్‌కి వెళ్ళినాను. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల టెస్టు చేసినారు కాని అన్నీ నార్మల్ అనే వచ్చాయి. సాయంత్రం 10 గంటకు ప్లేటులెట్స్ బాగా పడిపోవుట వలన ICUలో ఉంచారు. మూడు రోజుల వరకు ఏమీ చెప్పలేమని చెప్పారు. 20 రోజుల ఆసుపత్రిలో ఉన్నాను. అలాంటి స్థితిలో నున్న నాకు దేవుడు అద్భుత స్వస్థతను చేకూర్చాడు. మంచి వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నన్ను ఈరోజు సజీవురాలిగా ఉంచిన దేవునకు, తంబిగారికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను.
14. నా పేరు ఆర్.
పిచ్చేశ్వర రావు. 29-12-2018న గన్నవరం గర్ల్స్ హైస్కూల్
ఎదురుగా నూతనముగా నిర్మించబడుచున్న గృహము వద్ద రాత్రి 8 గంటకు
స్కూటర్ స్టార్ట్ చేసి బయలు దేరు చుండగా, పల్లంవైపు
వెళ్లుచుండగా, బ్రేక్ వేసి ఎడమ కాలును కింద పెట్టినాను. కాలుకు
పట్టు దొరకక జారి కింద పడిపోయాను. అప్పుడు పైకి లేచుటకు ప్రయత్నించగా లేవలేక
పోయాను. ఆవిధముగా 10 నిమిషాలు ప్రయత్నించాను కాని లేవలేక
పోయాను. ఆ సమయములో ‘‘దైవ సేవకుడు’’ బ్రదర్
జోసఫ్ తంబిగారిని నన్ను పైకి లేపమని మనసులో ధ్యానిస్తూ ప్రయత్నించగా లేచి కూర్చో గలిగాను,
కాని పైకి లేవలేక పోయాను. ఆ సమయములో జన సంచారం తక్కువ ఉండుట వలన,
చాలా సేపటికి బైకుపై వెళ్లేవారు నన్ను పైకి లేపినారు. మామూలుగా
నడిచాను. ఈ అద్భుత స్వస్థతకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించు కొంటున్నాను. నాకు 27-12-2010లో పక్షవాతము వచ్చి ఎడమవైపున పూర్తిగా చచ్చుపడి పోయినది. సరియైన సమయములో
వైద్యము అందుట వలన అపాయం నుండి బయట పడ గలిగాను. అయితే 15-1-2011న సాయంత్రము 3 గంటలకు జరిగిన తంబిగారి వర్ధంతి
ఆరాధనలో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేసాను. అప్పటినుండి నాకు మంచి
ఆరోగ్యమును దయ చేసిన దేవునకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను. తంబిగారి మధ్యస్థ
ప్రార్ధన ద్వారా జరిగిన మేలులకు యేసు ప్రభువునకు స్తోత్రము చెల్లిస్తున్నాను.
ఆర్. పిచ్చేశ్వర రావు, డోర్ నం. 1-221, శ్రీనగర్, గన్నవరం.
15. నా పేరు రవళి. నా భర్త
రాజశేఖర్. మా కుమారుడు రక్షిత్. మేరమ్మ, సమూయేలు మా అత్త
మామలు. నేను గర్భిణిగా ఉన్నప్పుడు, ఎనిమిదవ నెలకే డెలివరీ
అవుతుందని డాక్టర్ చెప్పినారు. మేము ఎంతగానో కలవర పడ్డాము. తంబిగారి ప్రార్ధన
ద్వారా దేవునకు మా మొరను విన్నవించు కున్నాము. చివరికి తొమ్మిదవ నెలకే డెలివరీ
అయినది. నేను నా బిడ్డ ఆరోగ్యముగా ఉన్నాము. దేవుడు నాయందు చేసిన ఈ మేలులకు కృతజ్ఞతలు
తెలియ జేసుకుంటున్నాము. మా కుటుంబము కొరకు ప్రార్ధింప మనవి.
రవళి మరియు కుటుంబ సభ్యులు, అగిరిపల్లి.
16. నా పేరు పల్లవి. నా
భర్త పవన్. మాది విజయవాడ. మాకు వివాహమై పది సంవత్సరాలు అయినది, కాని పిల్లలు లేరు. నేను పెదావుటపల్లిలోని తంబిగారి సమాధి వద్దకు వచ్చి పిల్లల
కొరకు ప్రార్ధించాను. తంబిగారి శక్తివంతమైన మధ్యస్థ ప్రార్ధన ద్వారా దేవుడు నా మొర
ఆకించి నాకు చక్కని మగ బిడ్డని దయచేసి యున్నాడు. దేవుడు నాకు చేసిన ఈ మేలులు,
కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించు కొంటున్నాను.
పల్లవి, విజయవాడ.
17. నా పేరు నండ్రు
కళ్యాణ రావు. గొర్రెల కాపరిని. నా మందలో అన్ని మేకలకు జబ్బు చేసినది. తంబిగారి
సమాధిని దర్శించి ప్రార్ధన చేయగా, నా మందలోని అన్ని మేకలకు
జబ్బు నయం అయినది. అలా, జబ్బు నయం అయితే మందలోని ఒక మేక
ఖరీదు కానుకగా యిస్తానని అనుకొని ఒక మేక ఖరీదు రూ. 6, 7000/- యిచ్చినాను. నా యెడల ఈ అద్భుతం తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా
జరిగినందుకు దేవునికి స్తోత్రములు, తంబిగారికి ధన్యవాదములు
తెలియ జేయుచున్నాను.
నండ్రు కళ్యాణ రావు, రుద్రవరం, నందిగామ, కృష్ణా జిల్లా.
18. నా పేరు బండి నిర్మల.
మాది వెంగళాయపాలెం, గుంటూరు జిల్లా. మాకు సంతానం లేకపోతే
బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా మాకు సంతానం కలిగినది. అలాగే నా
భర్తకు ఆక్సిడెంట్ అయినప్పుడు తంబిగారి దయ వలన చిన్న గాయాలతో భయట పడ్డాడు. జోసఫ్
తంబి గారికి కృతజ్ఞతలు.
బండి నిర్మల, వెంగళాయపాలెం, గుంటూర్ రూరల్.
19. నా పేరు ఎం. రత్న
కుమారి. నేను తంబిగారి సన్నిధికి, ఆయన సమాధి వద్దకు తరచూ
వస్తూ ఉంటాను. నాకు ఇద్దరు కుమార్తెలు. వారిలో నా చిన్న కుమార్తె, దీప్తి, మార్చి 15వ తారీఖున
మరణించినది. తనకి 11 నెలల బాబు ఉన్నాడు. బాబు పేరు కె.
భవదీప్. బాబును మా అల్లుడు వాళ్ళు తీసుకున్నారు. బాబు అక్కడ ఉండటం క్షేమం కాదు.
నా మనవడు నా దగ్గరకు రావాలని తంబిగారి సన్నిధిలో వేడు కున్నాను. అలాగే నా దగ్గరకు
వచ్చాడు. కాని వారు బాబును నాకు పూర్తిగా ఇవ్వలేదు. పూర్తిగా నా మనవడిని నేనే
పెంచాలని అనుకొన్నాను. ఐదు శుక్రవారాలు తంబిగారి సమాధి వద్ద నా మనవడితో వచ్చి
ప్రార్ధన చేసాను. తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా, దేవుడు
నేను కోరుకున్న వరమును దయచేసి నందుకు కృతజ్ఞతలు తెలియ జేయుచున్నాను.
ఎం. రత్న కుమారి.
20. నా పేరు బి. సునంద.
నేను ఎంతో బలహీనముగా ఉన్న స్థితిలో తంబిగారి సమాధి మీదపడి ఏడ్చి, ‘ప్రభువా! నన్ను బ్రతికించయ్యా! నన్ను గట్టి రాయి లాగా చేయి ప్రభువా!’
అని ప్రార్ధించినప్పుడు, తంబిగారు, నా ప్రార్ధనను ఆలకించి నాకు స్వస్థతను చేకూర్చారు. తంబిగారికి స్తోత్రములు.
నేను అస్వస్థతలో ఉన్నప్పుడు, బ్లడ్ ప్లేట్లెట్స్ ఐదు వేలకు
పడి పోయాయి. వైద్యులు గంటలే గ్యారంటీ ఇచ్చారు. కాని దేవుడు నా వెన్నంట ఉండి నేను
కొమాలోనికి పోకుండా చేశాడు. తంబిగారి ప్రార్దన ద్వారా, నా
ప్రాణాన్ని నిలబెట్టాడు. నన్ను సజీవురాలిగా ఉంచాడు. దేవునికి స్తుతి స్తోత్రములు!
బి. సునంద, తామరకొల్లు, కైకూరు మండం, కృష్ణా
జిల్లా.
21. నా పేరు వి. శ్యాము.
మాది జగన్నాధపురం. పెదవేగి మండలం. జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా దేవుడు
నాకు, నా కుటుంబమునకు ఎన్నో మేలులు చేశాడు. ఆరంభము నుండి,
మా కుటుంబమంతా తంబిగారి భక్తులమే! తరచుగా పెద్ద అవుటపల్లిలోని
తంబిగారి సమాధిని దర్శించు కొని ప్రార్ధన చేసుకుంటూ ఉంటాము. డి.టి.పి. షాపు,
అలాగే ఫ్లక్సీ ప్రింటింగ్ ఏర్పాటునకు దేవుడు నాకు ఎంతో సహాయం
చేసాడు. లోను తీసుకొని వీటిని ఏర్పాటు చేసుకున్నాను. నెల నెల ఎలాంటి ఇబ్బందులు
లేకుండా లోను కట్టుకో గలుగుతున్నాను. తంబి గారికి స్తోత్రము. దేవునకు వందనాలు.
వి. శ్యాము, జగన్నాధపురం.
22. నాకు కుడి రొమ్ములో
చిన్న గడ్డగా వచ్చినది. అది ఆపరేషన్ చేయించి తొలగించక పోతే అది కాన్సర్‌గా
మారుతుందని డాక్టర్ చెప్పారు. ఐదు శుక్రవారాలు నేను తంబిగారి గుడికి వెళితే నయమవు
తుందని నా బంధువులు కొందరు చెప్పారు. విశ్వసించి, దేవునిపై భారము
వేసి ఐదు శుక్రవారాలు తంబిగారి సమాధి వద్ద ప్రార్ధన చేస్తానని అనుకున్నాను. మొదులు
పెట్టిన మూడు వారాలకే గడ్డ బయటకు రావడం మొదులు పెట్టింది. ఇలాగే ఐదవ వారం గడ్డ తొలగి
పోయింది. ఇదంతా కేవలం దేవుని కృపతోనే జరిగింది. దేవునికి స్తోత్రము. అలాగే నా
మనవడికి ఉద్యోగం వచ్చింది. చని పోతుందని అనుకున్న పాడి గేదె ఆరోగ్యముగా ఉంది. నా
భార్తకూడా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తంబిగారి సమాధి వద్దకు తీసుకొని వస్తే
వెంటనే లేచి నడవ గలిగాడు. ఎన్నో అప్పులలో కూరుకొని పోయిన మా కుటుంబము అప్పులన్నీ
కూడా తీరి పోయాయి. ఇవన్నీ కూడా బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా
జరిగాయి. తంబిగారికి స్తోత్రము. దేవునికి ఆరాధను!
టి. విజయ లక్ష్మి, పాముపాడు, గుంటూరు జిల్లా.
23. నేను పేద కుటుంబము
నుండి వచ్చాను. తంబిగారి సమాధి వద్దకు వచ్చి, మాకు సమాజములో
ఒక గుర్తింపు రావాలని ప్రార్ధించాను. నాకు ఇప్పుడు పంచాయితీ ఆఫీసులో గుమస్తాగా
ఉద్యోగం వచ్చినది. మా ఆవిడకు అంగన్ వాడి సహాయకురాలిగా ఉద్యోగం వచ్చినది. ఇప్పుడు
బండి కూడా కొనుక్కొని అప్పు తీర్చు కోగలిగాము. మా కుటుంబము చాలా సంతోషముగా ఉన్నది.
దేవునకు స్తోత్రములు! అలాగే, మా మరదలు గర్భవతిగా ఉన్నప్పుడు, రక్తం సరిగా
లేకపోవుట వలన బిడ్డకు ఎదుగుదల లేదని వైద్యులు చెప్పారు. నూజివీడు నుండి విజయవాడ పిల్లలు
ఆసుపత్రికి మార్చాము. మా మరదలుకు నార్మల్ డెలివరి అయితే పెద్ద అవుటపల్లిలోని
తంబిగారి సమాధి వద్దకు వచ్చి దేవునకు కృతజ్ఞతలు తెలుపుకుంటా అని మనస్సులో
అనుకున్నాను. దేవుని కృప వలన, తంబిగారి మద్యస్థ ప్రార్ధన
ద్వారా, ఆమెకు నార్మల్ డెలివరి అయినది. తల్లి బిడ్డ
క్షేమంగా ఉన్నారు. అవుటపల్లి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెల్పియున్నాను.
ముల్లంగి వెంకట రామారావు, కొత్తగూడెం, కీసర.
24. నాపేరు గారపాటి
అంథోని. కీసర గ్రామము. జనవరిలో తంబి గారి పండుగ రోజులో వచ్చి తంబిగారి సమాధిని
దర్శించుకొని ఆయన మధ్యస్థ ప్రార్ధనను వేడుకున్నాను. నేను కొన్ని సంవత్సరముల నుండి
నడుము నొప్పితో బాధపడు చున్నాను. వైద్యులను సంప్రదించి నప్పుడు ఆపరేషన్ చేయాలని
చెప్పారు. కాని, నేను 2019 తంబిగారి
వర్ధంతి మహోత్సవములో పాల్గొని ప్రార్ధించాను. ఆ తరువాత, వైద్యులను
సంప్రదించాను. టెస్టులు అన్నీ చేశారు. స్వయముగా వైద్యులే ఆపరేషన్ అవసరం లేదని
చెప్పారు. తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా పొందిన ఈ మేలులకు, త్రిత్వైక దేవునికి కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాను.
గారపాటి అంథోని, కీసర.
25. నా పేరు లిల్లీ
కుమారి. మేము ఏలూరులోని సెయింట్ మైకేల్ విచారణలో సంఘస్తులము. నేను పి.జి. చేశాను,
కాని ఉద్యోగం లేక, చాలా బాధపడ్డాను. బ్రదర్
జోసఫ్ తంబిగారి సమాధి వద్ద ప్రార్ధన చేసుకున్నాను. ఆయన మధ్యస్థ ప్రార్ధనను
వేడుకున్నాను. ఏలూరులో ఆర్.సి.యం. స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం వచ్చినది. యేసు
ప్రభువునకు స్తోత్రము. నా కుమారులు సాల్మన్రాజ్, బాలరాజ్
బాగా చదవాలని ప్రార్ధిస్తున్నాను. మా కుటుంబం కోసం ప్రార్ధించమని మనవి.
లిల్లీ కుమారి, ఏలూరు
26. నా పేరు విజయ లక్ష్మి. మాది కానూరు, పెనమలూరు మండలం. తమ్ముడుకి ఎన్ని వివాహ సంబంధాలు చూసినను కుదరలేదు. జ్ఞానస్నానం పొందిన అమ్మాయితో మాత్రమే వివాహం జరగాలని ఆశించాము. దేవుని కృపను బట్టి బ్రదర్ జోసఫ్ తంబిగారి సమాధి వద్దకు వచ్చి ప్రార్ధన చేసాము. అలా ప్రార్ధన చేసుకొని తిరిగి వెళ్ళిన కొన్ని రోజులోనే సంబంధం కుదిరి వివాహం జరిగినది. దేవునకు స్తోత్రాలు!
27. నా పేరు మోట్రు
రేణికమ్మ. ఆత్కూరు గ్రామము. నా కోడలుకు 20-6-2019న ఎనిమిది
నెలలకే నొప్పులు వచ్చాయి. నెలలు నిండలేదు. పదిహేను రోజుల తరువాత ఆపరేషన్
చేస్తానని డాక్టర్ చెప్పారు. నొప్పి వచ్చినప్పుడు మందు వేసుకొమ్మని ఇచ్చారు. ఆ
తరువాత రక్తం ఎక్కించాని అన్నారు. కోడలు బాధకు నాకు చాలా భయం వేసింది. తంబిగారి
మద్యస్థ ప్రార్ధనను వేడుకున్నాను. అయితే, అదే రోజు రాత్రి (21-6-2019)
9.30 నాకు పాప పుట్టింది. మామూలు కాన్పు జరిగినది. పాప బరువు
తక్కువుగా ఉన్నదని 8 రోజుల ఆసుపత్రిలో ఉంచి పంపించారు. తల్లి
బిడ్డలు క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం.
28. నా పేరు గంగుల వజ్రం. మాది మారేడుమాక గ్రామము. నా కుమారుని పేరు గంగుల జోసఫ్. పెళ్లి అయిన తరువాత మా కోడలు బ్రదర్ జోసఫ్ తంబిగారి యాత్రా స్థలమునకు వచ్చి ముడుపు కట్టిన తరువాతనే పాప పుట్టినది. పాప పేరు శారోను. ఒకసారి పాపకు మంటజ్వరము వచ్చినది. మాకు చాలా భయము వేసినది. జోసఫ్ తంబిగారిని తలంచుకొని, పాపను ఆయన సమాదివద్ధకు తీసుకొని వచ్చి నిద్ర చేయించాము. ఇక్కడకు రాగానే పాపకు జ్వరము నయమైనది. దేవునికి స్తోత్రం!
29. నా పేరు నీలం సురేష్
కుమార్. నేను ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిర పడ్డాను. అనుకోని కారణాలతో నేను నా
ఉద్యోగాన్ని కోల్పోయాను. ఏడు నెలల తరువాత హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. దేవుని
చిత్తం అని నేను ఉద్యోగంలో చేరాను. కుటుంబాన్ని వదిలి నేను ఒక్కడినే అక్కడ ఉంటూ
ఎన్నో ఇబ్బందులు పడ్డాను. భార్య, కుమారుడు, కుమార్తెకు దూరంగా ఉంటూ ఎన్నో రోజులు ఉన్నాను, ఎంతగానో
బాధపడ్డాను. ప్రతి రోజు ప్రార్ధనలో తంబి గారిని గుర్తు చేసుకుంటూ, నన్ను నా కుటుంబాన్ని ఒకచోట ఉండేటట్లు చేయుమని వేడుకున్నాను. బెంగళూరులోనే
మంచి ఉద్యోగం రావాలని, కుటుంబంతో కలిసి ఉండాలని, కలిసి ప్రార్ధించాలని తంబి గారిని వేడుకున్నాను. బెంగళూరులో నాకు ఉద్యోగం వస్తే సాక్ష్యాన్ని ఇతరుతో
పంచుకుంటానని అనుకున్నాను. నేను దృఢమైన నమ్మకంతో ప్రార్ధన చేసాను. అలాగే, నాకు బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చింది. అసాధ్యమైన దానిని దేవుడు తంబిగారి
మధ్యస్థ ప్రార్ధన ద్వారా సుసాధ్యం చేసాడు.
నీలం సురేష్ కుమార్, విజయరాణి, దేవాశిష్ తంబి, బబిత.
30. మాది మందపాడు గ్రామము. నా
పేరు కె. జోషి మేరి. మా వారికి కాలు విరిగింది. అప్పుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి
మధ్యస్థ ప్రార్ధన ద్వారా ప్రార్ధించగా కాలు నొప్పి తగ్గింది. మొక్కు ప్రకారం,
పెదావుటపల్లిలోని తంబిగారి సమాధిని దర్శించి కృతజ్ఞతలు తెలిపి యున్నాము.
కొరివి జార్జి, జోషి మేరిదివ్య, రాఘవేంద్ర, తేజు, మందపాడు గ్రామము, సిరిపురం విచారణ.
31. నా పేరు దొడ్డి మార్త (వర
లక్ష్మి). మా వూరు విశాఖపట్నంలో అల్లిపురం. నేను నా కుటుంబము హిందూ కుటుంబానికి
చెందినప్పటికిని, మా చెల్లి ద్వారా తంబిగారి అద్భుత శక్తి తెలుసుకొని, ఆయన సమాధిని
దర్శించుకొని ప్రార్ధించిన వెంటనే, నా జీవితములో అద్భుత మహిమలు చూడగలిగాను. నా
శరీరములో ఉన్న లోపం ఏమిటో తెలియకుండా చాలా బలహీనముగా మారి, చనిపోయే పరిస్థితి వరకు
వచ్చాను. హాస్పటలుకు వెళ్లి పరీక్షలు చేయగా కామెర్లు ఎక్కువగా ముదిరాయి అని
చెప్పారు. నా యిద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయకుండానే చనిపోతానని భయపడ్డాను. మా
చెల్లిని తీసుకొని తంబిగారి సమాధి చెంతకు మూడుసార్లు వచ్చి సమాధి మీద పడుకొని,
ప్రార్దిన చేసుకొని ఇంటికి వెళ్లాను. నాకు నిద్రలో చింపిరి గడ్డం, వెంట్రుకలతో ఒక
పేద వ్యక్తి రూపములో నా చెంతకు వచ్చి నన్ను పిలచి నా చేయి పట్టి లేపి నాకు ధైర్యం
చెప్పారు. అదే సమయములో నాలో మార్పును, స్వస్థతను చూడగలిగాను. ఆ తరువాత నేను, హిందూ
గుడిలో చేయుచున్న ఉద్యోగమును ఒక విధవరాలికి ఇచ్చి, జ్ఞానస్నానమును పొందితిని.
ఇప్పుడు నా బిడ్డల పిల్లలతో నేను చాలా సంతోషముగా ఉన్నాను. ప్రతి క్షణం తంబిగారిని
తలంచుకొని ప్రార్ధన చేయుచున్నాను. ఆ దేవుడు తంబిగారి ప్రార్ధన ద్వారా చేసిన ఆ
అద్భుత మహిమకు కృతజ్ఞతలు తెలుపు చున్నాను.
దొడ్డి మార్తమ్మ (వలలక్ష్మి), అల్లిపురం, విశాఖపట్నం.
32. నేను బత్తుల లూర్ధమ్మను.
జ్ఞానాపురం నివాసిని. నేను తంబిగారిని దర్శించు కోవాలని జన్మభూమి రైలు 12.30కి
దిగి ఎస్కలేటరులో ప్రవేశించిన వెంటనే పడిపోయాను. నాకు ఏమీ తెలియలేదు. ఎవరో దానిని
ఆపుచేయగా పైకి వెళ్లి క్రిందకు దిగి పెద్ద అవుటపల్లి బస్సులో ప్రయాణం చేసి సమాధి
దగ్గర ఆరాధనలో పాల్గొన్నాను. ఆరాధనలో, ఇక్కడికి వచ్చిన వారిలో గొప్ప ప్రమాదములో
చిక్కుకొని సురక్షితముగా ఇక్కడికి రాగలిగారు అని విన్నాను. ఇది అక్షరాల నా పట్ల
తంబిగారి ద్వారా ప్రభువు నాకు తిరిగి జీవమిచ్చారని మనసారా నమ్ముచున్నాను. ఈ
అద్భుతము ద్వారా నాలో గొప్ప ధైర్యం కలిగింది. ఫిబ్రవరి 7న కొంతమంది పోటా
ధ్యానాశ్రమానికి తీసుకొని వెళ్ళగలిగాను. క్షేమముగా తిరిగి వచ్చాను. దేవునికి
కృతజ్ఞతలు.
బత్తుల లూర్ధమ్మ, మాన్యువేలు వీధి, వాల్తేరు R.S., జ్ఞానాపురం,
విశాఖపట్నం.
33. నా పేరు సిరి. నేను
హైదరాబాదులో ఉంటాను. 25రోజుల క్రితం నేను చాలా వేదనతో, బాధతో బ్రదర్ జోసఫ్
తంబిగారి సమాధి వద్దకు వచ్చాను. కన్నీటితో ప్రార్ధన చేశాను. నాకు “endometrium
thickness” వచ్చింది. కాన్సర్ అయి ఉండొచ్చని డాక్టర్ చెప్పారు. అది చాలా మందంగా
ఉన్నది. ఆపరేషన్ చేసి ముక్కను టెస్టుకు పంపాలి అని చెప్పారు. నాకు చాలా భయం
వేసింది. తంబిగారి సమాధి వద్దకు వచ్చి ప్రార్ధన చేసుకున్నాను. ఎటువంటి ఆపరేషన్
లేకుండా ఆ మందం కరిగిపోవాలని, అది ఎటువంటి ప్రమాదమైనది కాకుండా ఉండాలని సమాధి వద్ద
కన్నీటి ప్రార్ధన చేసుకున్నాను. ఇప్పుడు ఆ మందం కరిగిపోయింది. టెస్టులో కాన్సర్
కాదని వచ్చింది. బ్రదర్ జోసఫ్ తంబిగారికి వందనములు.
D. సిరి ప్రియ, హైదరాబాదు.
No comments:
Post a Comment