అధ్యాయము 01
కుటుంబము, బాల్యము, యౌవ్వనము
బ్రదర్ జోసఫ్ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోస్ మల్లి మరియ. పుట్టు క్రైస్తవ కతోలిక విశ్వాసులు. వీరి స్వస్థలం దక్షిణ భారతదేశమున ఆగ్నేయ తీరమున నున్న కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని ‘కారైకాల్’ పట్టణము. ఆనాటి పాండిచ్చేరి ఒక ఫ్రెంచి కాలని. వీరికి ఫ్రెంచి పౌరసత్వం ఉన్నది. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోస్ మల్లి మరియ గృహిణి.
ఉద్యోగ నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్’ దేశమునకు వెళ్ళాడు. ‘సైగోన్’ ప్రస్తుత వియత్నాం దేశములోని అప్పటి ఫ్రెంచి కాలని. ప్రస్తుతం ‘హోషిన్ మిన్హ’గా పిలువబడుచున్నది. వారు అచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు వారు ‘రాయప్ప జోసఫ్ శౌరి’ అని పేరు పెట్టారు. ఈ ‘రాయప్ప జోసఫ్ శౌరి’యే నేటి మన ‘దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి’ గారు.
