Tuesday, August 30, 2022

దైవసేవకుడు జోసఫ్ తంబి: మరో అస్సీసిపుర ఫ్రాన్సిస్!

దైవసేవకుడు జోసఫ్ తంబి: మరో అస్సీసిపుర ఫ్రాన్సిస్!
రెవ. ఫా. ప్రవీణ్ గోపు OFM Cap.
వైస్ పోస్టులేటర్


 దైవసేవకుడు జోసఫ్ తంబి మరో అస్సీసిపుర ఫ్రాన్సిస్! ఎందుకన, తంబిగారు, ఫ్రాన్సిసువారి సభను, ఆధ్యాత్మికతను మిక్కిలిగా ప్రేమించి, ఆ జీవిత విధానాన్ని, ముఖ్యముగా ఫ్రాన్సిసువారి దారిద్ర్యాన్ని మరియు జీవితమే ఓ సువార్తా ప్రచారం అను గొప్ప సుగుణాన్ని ఆలింగనం చేసుకున్నారు. అందుకే ఆ సభలో చేరి తృతీయ సభ్యునిగా జీవించారు. అస్సీసిపుర ఫ్రాన్సిసువారివలె, దారిద్ర్యాన్ని యిష్టపూర్వకముగా జీవించారు; తన జీవితమే సువార్త ప్రచారముగా మార్చారు. అనేకచోట్లకు వెళుతూ తన జీవితం, మాట, బోధన, అద్భుతకార్యాలద్వారా సువార్తను ప్రకటించారు. ఫ్రాన్సిస్ వారివలె పంచగాయాలను పొందారు.

11 నవంబరు 1886లో సైగోన్ (వియత్నాం)లోని ఇప్పుడు “హో షిన్ మిన్హ”గా పిలువబడుచున్న అప్పటి ఫ్రెంచ్ కాలనీలో, ఉద్యోగ నిమిత్తమై వెళ్ళిన, కరైకాల్, పాండిచేరి వాస్తవ్యులైన శవరిముత్తు, రోసమల్లె మరియ అను పుణ్యదంపతులకు జన్మించారు. ‘రాయప్ప జోసఫ్ శవరి’ అని నామకరణం చేసారు. 1888వ సం.లో స్వదేశానికి తిరిగి రావడం వలన, రెండు సం.ల. వయస్సు నాటినుండి, కరైకాల్, పాండిచేరిలోనే పెరిగారు. స్వగ్రామములోనే జ్ఞానస్నానం పొందారు.

తనకు ఒక తమ్ముడు మైకేల్ ధైరియాన్ తంబి (జననం 1891) ఉన్నారు. తన ఏడేళ్ళ వయస్సున, తల్లి ఆకస్మిక మరణముతో, తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు (1894). పినతల్లికి యిష్టం లేకున్నను 1898లో భద్రమైన అభ్యంగనం, దివ్యసత్ర్పసాదాలను స్వీకరించారు. పినతల్లి మేరితెరెసా పెట్టే కష్టాలను తాళలేక, ఇల్లు విడచి, కేరళ రాష్ట్రములో ఒక పుణ్యాత్మురాలి నీడన పెరిగారు. తమ్ముడు మైకేల్ ధైరియాన్ తంబికి (+1935) ముగ్గురు కుమారులు (ఆల్బర్టు +1941, రాబర్టు +1985, విక్టరు +1979), ఒక కుమార్తె (గాబ్రియేల్ మరియ తెరెసా, 1913-1985). ఆమె పాండిచేరిలోని కార్మెల్ మఠసభలో చేరి మఠకన్యగా జీవించినది. జోసఫ్ తంబిగారి పినతల్లికి ఒక కుమార్తె కలదు.

1928లో ఉత్తరప్రదేశ్’లోని, సర్ధానలో కపూచిన్ సభలోచేరి తృతీయసభ సభ్యునిగా మారారు. 1928 నుండి 1932 వరకు పాండిచేరిలో, వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ, తన ప్రేషిత సేవలను కొనసాగించారు. 1933 నుండి 1935 వరకు తమిళనాడులోని మనత్తిడల్ గ్రామములో సువార్తా ప్రచారం చేసారు. అచట తృతీయ సభ సంఘాలను కూడా స్థాపించారు. 1936వ సం.లో పచ్చమల అను కొండ ప్రాంతములో గిరిజనుల మధ్య సువార్త ప్రచారం చేసారు.

1936 నుండి 1938 వరకు కేరళ (త్రిశూరు, ఎర్నాకుళం, మలబారు), జోసఫ్ అట్టిపెట్టి మేత్రాణులు స్థాపించిన ‘తెరేసియన్ సహోదరసభ’ సభ్యులకు కొంతకాలం తర్ఫీదును ఇచ్చారు. మరల 1939లో ఆంధ్ర రాష్ట్రము నుండి కేరళ రాష్ట్రమును, ముఖ్యముగా విజయవాడ మేత్రాసణములోని పేదవారికి ఆర్ధిక సహాయము చేయుటకు  సందర్శించారు.

1938లో ఆంధ్రప్రదేశ్’లోని నెల్లూరు మేత్రాసణములోగల బిట్రగుంట గ్రామములో, అటుపిమ్మట విజయవాడ సమీపములోని కేసరపల్లి గ్రామములో కొంతకాలం సువార్తా సేవను చేసారు. 1939లో పెదావుటపల్లి విచారణలో తన నివాసాన్ని ఏర్పరచుకొని, చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శిస్తూ, సువార్తను ప్రకటిస్తూ, అద్భుతకార్యాలు చేస్తూ 15 జనవరి 1945లో ధన్యమరణాన్ని పొందారు.

పెదావుటపల్లి ఓ చిన్న అస్సీసి అని చెప్పుకోవచ్చు! వేలాదిమంది భక్తులు, జోసఫ్ తంబిగారి సమాధిని సందర్శించి, ఆయన మధ్యస్థ ప్రార్ధనద్వారా దేవున్ని ప్రార్ధిస్తూ ఉంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటారు; నిద్రలు చేస్తూ ఉంటారు. ప్రశాంతతను పొందుతూ ఉంటారు.

పెదావుటపల్లి జోసఫ్ తంబిగారు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి – గొప్ప ప్రార్ధనాపరుడు, వినమ్రుడు, పేదరికం, పేదవారికి సహాయం, ఆయన పొందిన పంచగాయాలు, చేసిన గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, తక్షణగమనవరం, దర్శనకారి, ప్రవచనవరం, పవిత్రజీవితం, చిన్నపిల్లలనగా ఎనలేని ప్రేమ...

జోసఫ్ తంబిగారు గంటల తరబడి మోకాళ్లమీద ఉండి ప్రార్ధన చేసేవారు. ఆయన గొప్ప ప్రార్ధనాపరుడని, ప్రార్ధనలో పంచగాయాలను పొందేవారని ఎంతోమంది గురువులు, విశ్వాసులు ప్రత్యక్షసాక్ష్యమిచ్చారు. ఆయన ప్రార్ధనా జీవితం, పశ్చాత్తాపము, ఉపవాసముతో, దీక్షతో బలపడినది.

ఆయన జీవించియుండగనే ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు చేసారు. కాలుపైనున్న ఒక వ్యక్తి పుండును నాలుకతో నాకి స్వస్థతపరచారు. ఎంతోమందికి ఏవో ఆకులురాసి, ప్రార్ధనచేసి, సిలువగురుతు వేసి స్వస్థతపరచేవారు. తను వండుకున్న చిన్న కుండలోనుండి ఎంతోమందికి భోజనం పెట్టేవారు. క్షణములో తాను అనుకున్న స్థలానికి వెళ్ళగలిగే అద్భుత తక్షణగమన వరాన్ని జోసఫ్ తంబిగారు కలిగియుండేవారు. ఈ వరము వలననే, పెదావుటపల్లిలో ఉండగనే, తరచుగా కేరళ (1939), పాండిచేరి, ఉత్తరప్రదేశ్’లోని ఝాన్సి (1944), అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనేక ప్రదేశాలలో కనిపించేవారు.

ఆయన పేదరికములో జీవిస్తూ, పేదవారిని ఎప్పుడు అక్కున చేర్చుకొనేవారు. కేరళ, పాండిచేరి తరుచుగా వెళ్ళేది, ధనాన్ని ప్రోగుచేసి పేదవారి సహాయమునకై విజయవాడ మేత్రాణులకు ఇచ్చేవారు. దుస్తులు, డబ్బును పేదవారికి పంచేవారు. పేదవారి దుస్తులు తనువేసుకొని తన దుస్తులను వారికి ఇచ్చేవారు. తన ప్రోద్భలముతోనే పెదావుటపల్లిలో అప్పటి విచారణ గురువులు జాన్ బి. కల్దెరారోగారు వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. తన జీవనోపాధి కొరకై తానే కాయకష్టం చేసుకొని సంపాదించుకొనేవారు. పనివారితో కలిసి పొలం పనులకు వెళ్ళేవారు. ప్రజలతోనే ఉంటూ వారు ఇచ్చిన స్థలములో నివాసముండేవారు.

రెండవ ప్రపంచ యుద్ధకాలములో జరుగుతున్న సంఘటనలను ప్రార్ధనలో ఎన్నో దర్శనాలద్వారా గాంచేవారు. అవే మరుసటిరోజు వార్తలలో వచ్చేవి. హైందవులైన బోయపాటి ఫ్రాన్సిస్, క్లారమ్మ దంపతులు జ్ఞానస్నానం తీసుకుంటే, ఎన్నో ఏళ్లనుండి మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న వారికి మగబిడ్డ పుడతాడని ప్రవచించారు. అలాగే, వారికి మగబిడ్డడు పుట్టడం జరిగింది. వారి ముగ్గురికి జోసఫ్ తంబిగారే జ్ఞానతండ్రిగా ఉండటం రికార్డులలో చూడవచ్చు! మరణావస్థలోనున్న ఒక బాలుడు బ్రతుకుతాడని, పెదావుటపల్లి గ్రామములో అగ్నిప్రమాదం జరుగునని, బోయపాటివారి యింటికి మాత్రము ఏమీకాదని, అలాగే పెదావుటపల్లి గ్రామములో ముగ్గురు గురువులు ఉన్నప్పటికీ తాను అవస్థ అభ్యంగనం పొందలేనని చెప్పారు. అవన్నీ అలాగే జరిగాయి. జోసఫ్ తంబిగారి ఆదర్శ జీవితం, అద్భుతకార్యాల వలన, పెదావుటపల్లి, చుట్టుప్రక్కల గ్రామాలలో ఎంతోమంది హైందవ కుటుంబాలు క్రైస్తవాన్ని పుచ్చుకున్నాయి. తన మరణం గురించి మూడు నెలలు ముందుగానే ప్రవచించారు. శవపేటికను చేయించుకొని, అప్పుడప్పుడు దానిలో పడుకొని మరణం గురించి ధ్యానించేవారు. వారు చెప్పిన తేదీ, సమయానికే బోయపాటివారి గృహములో తుదిశ్వాసను విడిచారు.

ఎవరైనా దొంగతనం చేసినను, మనసులో దుష్టతలంపులు తలంచినను, జోసఫ్ తంబిగారు చెప్పేవారు. వారు మారుమనస్సు పొందునట్లు చేసేవారు. యిండ్లలో దాచిపెట్టిన వస్తువులు ఫలానాచోట ఉన్నాయని ఖచ్చితముగా చెప్పేవారు. భవిష్యత్తులో ఫ్రాన్సిసువారి సభకు చెందిన మఠవాసులు, మఠకన్యలు పెదావుటపల్లిలో సేవలు అందిస్తారని చెప్పినవిధముగానే 1968 నుండి ఫ్రాన్సిస్కన్ కపూచిన్ మఠవాసులు, 1979నుండి ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ మఠకన్యలు సేవలను అందిస్తున్నారు.

జోసఫ్ తంబిగారికి చిన్నపిల్లలు అనగా ఎంతో ప్రేమ. వారిని ప్రేమతో ఆదరించేవారు. విద్యాబుద్ధులు నేర్పించేవారు. ఏ ప్రదేశానికి వెళ్లినను, ప్రార్ధనలు, సత్యోపదేశము, బైబులు గాధలను చెప్పేవారు. పిల్లలు చెప్పినమాట విననప్పుడు, మోకాళ్లమీదనుండి వారిని ప్రాధేయ పడేవారు. కుటుంబాలను సందర్శించేవారు. పెద్దవారిని జపమాలకు పిలిచేవారు. విచారణ దేవాలయానికి దివ్యపూజాబలికి తీసుకొని వెళ్ళేవారు. విచారణ గురువులకు సహాయముగా ఉండేవారు. ఇవన్నీకూడా ఆయన దైవాంకిత జీవితానికి, దైవసేవకు, సువార్తా ప్రచారానికి తార్కాణం.

జోసఫ్ తంబిగారికి మరియతల్లి యెడల ఎనలేని భక్తి, విశ్వాసం. ఎప్పుడు తనతో సిలువను, జపమాలను తీసుకొని వెళ్తూ ఉండేవారు. ప్రతీరోజు జపమాలను జపించేవారు. పునీతులపట్ల, ముఖ్యముగా పునీత అంతోనివారిపట్ల ప్రత్యేకమైన భక్తి కలిగియుండేవారు. ఆయన వెళ్ళిన అన్నిచోట్ల అంతోనివారి దేవాలయం ఉండేది (బిట్రగుంట, కేసరపల్లి). జోసఫ్ తంబిగారికి జేసుతిరు హృదయంపట్ల  చాలా భక్తి, ప్రేమ. తాను పెదావుటపల్లికి వచ్చినపుడు తనతో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి స్వరూపాన్ని తీసుకొని వచ్చారు.

జోసఫ్ తంబిగారు ఎక్కడికి వెళ్లినను, పునీతుల పేరిట పీఠములను నిర్మించి, అచ్చట ప్రార్ధనలు చేసేవారు. మనత్తిడల్ గ్రామములో పునీత స్తెఫాను పేరిట పీఠమును నిర్మించారు. పెదావుటపల్లి గ్రామములో బోయపాటి గృహములో అస్సీసిపుర ఫ్రాన్సిసువారి పేరిట పీఠమును నిర్మించారు. అలాగే పెదావుటపల్లిలో తాను నివసించిన గృహములో పీఠమును నిర్మించారు. అచట ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకు పంచగాయాలను పొందేవారు.

జోసఫ్ తంబిగారు శాంతిప్రదాత, సఖ్యత చేకూర్చువారు! ప్రజలమధ్య, కుటుంబాలమధ్య సఖ్యత చేకూర్చి అందరు శాంతి, సమాధానాలతో జీవించాలని కోరేవారు. బాధలలోనున్నవారిని ఓదార్చేవారు. వారికోసం ప్రార్ధన చేసేవారు. ఎవరిమీద కోపపడినా, వెంటనే క్షమాపణ కోరేవారు.

ఆయన జీవితం అద్భుతం, పవిత్రం! ఆయన నిష్కపట మనస్సు, భక్తిపూర్వకమైన జీవితం ఎంతోమందిని ఆకర్షించినది. అందుకే, లక్షలాది ప్రజలు ఆయన సమాధిని సందర్శించి, ఆయన మధ్యస్థ ప్రార్ధనలను వేడుకుంటున్నారు. ఆయన సమాధిని కతోలిక క్రైస్తవులు మాత్రమేగాక, ఇతర క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు కూడా సందర్శిస్తూ ఉంటారు.

పిల్లలులేని దంపతులకు పిల్లలు కలగడం, అనారోగ్యాల నుండి స్వస్థత పొందడం... గురించి అనేకమంది సాక్ష్యాన్ని ఇస్తున్నారు. జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనలద్వారా ఎంతోమంది ఎన్నో మేలులను, స్వస్థతలను పొందుచున్నారు.

నేడు జోసఫ్ తంబిగారిపట్ల భక్తి అనేక చోట్ల ప్రాచుర్యం చెందినది. ఆయన మధ్యస్థ ప్రార్ధనలద్వారా మేలులు పొందినవారు, స్వతహాగా ఆయన స్వరూపాలను, ప్రార్ధనా మందిరాలను (విజయవాడ మేత్రాసణములోని మానికొండ, ఉప్పులూరు; నెల్లూరు  మేత్రాసణములోని బిట్రగుంట; తెలంగాణలోని వరంగల్ మేత్రాసణములోని తిమ్మరావుపేట) ప్రతిష్టించడం చూడవచ్చు. పెదావుటపల్లిలోకూడా బ్రదర్ జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము ఎల్లప్పుడు భక్తులతో కళకళలాడుచూ ఉన్నది.

జోసఫ్ తంబిగారి మరణ వార్షికోత్సవాన్ని జనవరి 13, 14, 15 తేదీలలో లక్షలాదిమంది భక్తులతో కొనియాడబడుచున్నది. ఆయన జీవించిన, ప్రదర్శించిన పవిత్ర జీవితమునుబట్టి, 24 జూన్ 2007న తల్లి శ్రీసభ జోసఫ్ తంబిగారిని ‘దైవసేవకుడిగా’ ప్రకటించినది. త్వరలోనే పునీత పట్టం రావాలని ప్రార్ధన చేద్దాం.

జోసఫ్ తంబిగారు దైవానుభూతులు, అద్భుతవ్యక్తి, ప్రార్ధనాపరులు, దీనులు, ధన్యులు, గొప్పవేదప్రచారకులు! ఎంతోమందిని క్రైస్తవ విశ్వాస పధములో నడిపించాడు. దైవసేవకుడు జీవించిన నిరాడంబర జీవితం నేటికీ ఎంతోమందికి ఆదర్శనీయం. దక్షిణ భారత రాష్ట్రాలలో ఆయన కీర్తి అమోఘం!

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా పొందిన మేలులను, స్వస్థతలను, అద్భుతాలను ఈ క్రింది చిరునామాకు తెలియజేయగలరు. 

Rev. Fr. Praveen Gopu, OFM Cap.
Vice Postulator of Joseph Thamby Cause
Peddavutapally – 521 286
Unguturu, Krishna Dist., Andhra Pradesh
955 0629 255 (WhatsApp)

Thursday, July 9, 2020

కుటుంబము, బాల్యము, యౌవ్వనము

అధ్యాయము 01
కుటుంబము, బాల్యము, యౌవ్వనము 

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోస్ మల్లి మరియ. పుట్టు క్రైస్తవ కతోలిక విశ్వాసులు. వీరి స్వస్థలం దక్షిణ భారతదేశమున ఆగ్నేయ తీరమున నున్న కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని ‘కారైకాల్‌’ పట్టణము. ఆనాటి పాండిచ్చేరి ఒక ఫ్రెంచి కాలని. వీరికి ఫ్రెంచి పౌరసత్వం ఉన్నది. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోస్ మల్లి మరియ గృహిణి.

ఉద్యోగ నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్‌’ దేశమునకు వెళ్ళాడు. ‘సైగోన్‌’ ప్రస్తుత వియత్నాం దేశములోని అప్పటి ఫ్రెంచి కాలని. ప్రస్తుతం ‘హోషిన్‌ మిన్హ’గా పిలువబడుచున్నది. వారు అచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు వారు ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’ అని పేరు పెట్టారు. ఈ ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’యే నేటి మన ‘దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి’ గారు.

Wednesday, July 8, 2020

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యుడు

అధ్యాయము 02
పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యుడు


జోసఫ్ తంబి
దైవ సేవకుడు
కేరళ రాష్ట్రములోని వేరాపొలిమేత్రాసణములోని కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములో జోసఫ్‌ తంబి ఉపదేశిగా తన సేవను అందించుచున్న సమయములోనే, కార్మలైట్‌ మిషనరీ ద్వారా క్లొల్లం’ (‘కోయిలోన్‌’) అను ప్రదేశానికి, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీల ఆగమనం గురించి జోసఫ్‌ తంబిగారు తెలుసుకొని యున్నారు. జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ పౌరసత్వమును కలిగి యుండటము వలన, అలాగే ఫ్రెంచ్‌ భాషకూడా బాగా వచ్చియుండుట వలన, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను కలుసుకొనుటకు ఆసక్తిని చూపారు.

Tuesday, July 7, 2020

‘మనత్తిడల్’లో దైవ సేవ, తృతీయ సభ స్థాపన

అధ్యాయము 03
‘మనత్తిడల్’లో దైవ సేవ, తృతీయ సభ స్థాపన

 క్రీ.శ. 1933వ సంవత్సరములో, జోసఫ్‌ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం కుంభకోణంఅతిమేత్రాసణములో ఉన్న మణత్తిడల్‌అనే చిన్న గ్రామానికి ఇరువురు బాలురులతో వెళ్ళారు. అప్పటిలో మణత్తిడల్‌గ్రామము మైకేల్‌ పట్టిఅను విచారణ క్రింద ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు అప్పటి విచారణ గురువులు.

గురుశ్రీ జ్ఞానాధిక్యం గురువులతో తంబి

Monday, July 6, 2020

‘పచ్చమలై’కు పయనం

అధ్యాయము 04
‘పచ్చమలై’కు పయనం

క్రీ.శ. 1936వ సంవత్సరములో మణత్తిడల్‌గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్‌ వారి రాకతో జోసఫ్‌ తంబిగారు ముందుగా కొత్త పాలాయంఅను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పది రోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్‌ తంబిగారికి చక్కటి స్నేహం, అనుబంధం ఏర్పడినది.

కొత్త పాలాయంనుండి తొండమందురైఅను ప్రదేశమునకు వెళ్లి, అచటనుండి పచ్చమలైఅను మారుమూల గ్రామమునకు వెళ్లి యున్నారు. ఇది కొత్త పాలాయంవిచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పచ్చమలైఅనునది తిరుచిరాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. కుంభకోణంమేత్రాసణములోని తొండమందురైవిచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల (ఆదివాసీల) ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్‌ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. ఆరంభములో కొండజాతి ప్రజలు జోసఫ్‌ తంబిగారిని వింతగా చూసారు. కాలం గడిచే కొద్ది ప్రజలు అతనికి దగ్గరయ్యారు. జోసఫ్‌ తంబిగారు వారితోనే జీవించారు. వారు భుజించేదే, తాను భుజించాడు.

Sunday, July 5, 2020

కేరళ రాష్ట్రములో ...

అధ్యాయము 05
కేరళ రాష్ట్రములో ...

 క్రీ.శ. 1936వ సంవత్సరం. తమిళనాడు నుండి కేరళ చేరుకున్న జోసఫ్‌ తంబి అనేక చోట్ల తిరిగి త్రిశూరు జిల్లాకు చేరుకున్నారు. అచ్చట లతీను దేవాలయమును కనుగొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ ఉన్నన్ని రోజులు దివ్యపూజాబలిలో పాల్గొన్నారు. రాత్రి పుత్తూరు’ (‘పొన్నుకర’)లోని మిషన్‌ దేవాలయములో పడుకొనెడివారు. అప్పుడప్పుడు సిరియన్‌ గురువు చేసే దివ్యపూజాబలిలో కూడా పాల్గొనేవారు.

జోసఫ్‌ తంబి తన ప్రేషిత సేవను ఎక్కువగా ఎర్నాకులంప్రాంతములో కొనసాగించి యున్నారు. కొచ్చిన్‌ప్రదేశములోని వీధులలో తిరిగుతూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి గురించి, ‘తృతీయ సభగురించి బోధించాడు. అయితే, పోలీసు సిబ్బంది అతని వేషధారణను చూసి అనుమానించారు. వీధులో తిరిగి అడుగుకొనుటను అడ్డుకున్నారు. అతనిపై చేయికూడా చేసుకున్నారు.

Saturday, July 4, 2020

ఉత్తర భారత దేశములోని ‘ఝాన్సి’లో జోసఫ్ తంబి

అధ్యాయము 06
ఉత్తర భారత దేశములోని ‘ఝాన్సి’లో జోసఫ్ తంబి

జోసఫ్‌ తంబిఅద్భుత రీతిన భారత దేశములో పలుచోట్ల పర్యటించారు. ఎక్కడికి  వెళ్ళినను పవిత్ర జీవితాన్ని, ప్రార్ధనా జీవితాన్ని, సేవా జీవితాన్ని జీవించారు.

జనవరి నెల, ఆదివారము, 1944వ సంవత్సరము! ఝాన్సి నగరం! మిలిటరీ ప్రాంతం. జేసు తిరు హృదయ దేవాలయం! మిలిటరీ దేవాలయం! దేవాలయములో దివ్యపూజాబలి జరుగుతుంది. చందా పడుతూ ఉన్న తోమాసు ఎం. కురిసింకల్‌ అనే వ్యక్తి గుడి మధ్యలో భిక్షగానివలెనున్న జోసఫ్‌ తంబిగారిని గమనించాడు. జోసఫ్‌ తంబిగారి చేతిలో ఏదో లతీను పుస్తకం ఉండటము గమనించాడు.

Thursday, July 2, 2020

ఆంధ్రావనిలో జోసఫ్ తంబి గారు: బిట్రగుంట-కేసరపల్లిలో పరిచర్య

అధ్యాయము 07
ఆంధ్రావనిలో జోసఫ్ తంబి గారు: బిట్రగుంట-కేసరపల్లిలో పరిచర్య

బిట్రగుంటలో పరిచర్య

క్రీ.శ. 1937వ సంవత్సరము. జోసఫ్‌ తంబిగారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునకు ఏతెంచారు. మొదటగా నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట అను ప్రదేశమునకు ఫిబ్రవరి 1937వ సం.లో వచ్చియున్నారు. బిట్రగుంటలో తమిళనాడు నుండి రైల్వే ఉద్యోగులుగా పనిచేయుచున్నవారి మధ్యన తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు. వారితో తమిళ భాషలో సంభాషించేవారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలను సందర్శించేవారు. వారితో ఎంతో ఆప్యాయముగా, ప్రేమగా మాట్లాడేవారు. కుటుంబ ప్రార్ధనలను నిర్వహించేవారు. ప్రజలను దేవాలయము వద్ద ప్రోగుచేసి ప్రార్ధన చేయడం నేర్పించేవారు. జపమాలను ఎలా వల్లించాలో నేర్పించేవారు. బైఋలు గురించిన విషయాలను ఎన్నింటినో వారికి బోధించారు.

Tuesday, June 30, 2020

అవుటపల్లిలో నివాసం

అధ్యాయము 08
అవుటపల్లిలో నివాసం

అవుటపల్లి (పెదావుటపల్లి) గ్రామము విజయవాడ మేత్రాసణములోని పురాతన విచారణలలో ఒకటి. క్రీ.శ. 1925వ సంవత్సరములో అవుటపల్లి విచారణగా ఏర్పడినది.


క్రీ.శ. 1939వ సంవత్సరమునుండి జోసఫ్‌ తంబిగారు తన నివాసాన్ని అవుటపల్లిలో ఏర్పరచుకున్నారు. గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో (PIME) అప్పటి విచారణ గురువులు. ఆయన ఇటలీ దేశస్థుడు. 14 సెప్టెంబరు 1927వ సంవత్సరములో అవుటపల్లికి చేరుకున్న వీరు 1 మార్చి 1928వ సంవత్సరములో విచారణ గురువుగా బాధ్యతలు తీసుకున్నారు. విచారణ గురువుగా క్రీ.శ. 1969 వరకు కొనసాగారు.


గృహము లోపల
అవుటపల్లి గ్రామము జోసఫ్‌ తంబిగారి ఆధ్యాత్మిక కార్యాలకు ప్రధాన కేంద్రం అయ్యింది. క్రీ.శ. 1939వ సంవత్సరము నుండి 1945వ సంవత్సరము వరకు ఇక్కడే నివసిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్తను బోధిస్తూ జీవించారు.

జోసఫ్‌ తంబిగారు కేసరపల్లి గ్రామములో ఉన్నప్పుడు తరుచుగా పాపసంకీర్తనం చేయడానికి అవుటపల్లికి వచ్చేవారు. సహాయక విచారణ గురువు గురుశ్రీ రాశి వారి వద్ద పాపసంకీర్తనం చేసేవారు. వచ్చినప్పుడల్లా విచారణ గురువులైన జాన్‌ బి. కల్దెరారో వారిని తప్పక కలిసి వెళ్ళేవారు.

ఇలా ఒకరోజు వచ్చినప్పుడు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకోవాలనే తన మనసులోని కోరికను విచారణ గురువుకు తెలియజేసారు. తద్వారా ప్రతీరోజు దివ్యపూజాబలిలో పాల్గొని దివ్యసత్ప్రసాదమును స్వీకరించవచ్చని తలంచారు.

జోసఫ్‌ తంబిగారి విశ్వాసమును
, దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని చూసి విచారణ గురువు అందుకు సంతోషముగా సమ్మతించారు. విచారణ దేవాలయమునకు దగ్గరలోనే రెండు గదులతో కూడిన ఒక ఇల్లు ఒకటి ఉన్నది. దానిలో వంటచేయు మాదాను శౌరి ఒక గదిలో ఉండేవాడు. వేరొక గదిలో జోసఫ్‌ తంబిగారు ఉండుటకు విచారణ గురువు ఏర్పాట్లను చేసియున్నారు. ఇక క్రీ.శ. 1939వ సంవత్సరము నుండి అవుటపల్లి జోసఫ్‌ తంబిగారి నివాస స్థానమయింది.

విచారణ గురువులకు అన్ని విషయాలలో తన వంతు సహాయ సహకారాలను అందించి యున్నారు.

కేసరపల్లి గ్రామములో వలెనె అవుటపల్లి గ్రామములో కూడా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించారు. అతి త్వరలోనే అవుటపల్లి గ్రామస్తులు, అలాగే చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు జోసఫ్‌ తంబిగారు ఒక పుణ్యాత్ముడని గుర్తించారు.

Sunday, June 28, 2020

జోసఫ్ తంబి - బోయపాటి కుటుంబము

అధ్యాయము 09
జోసఫ్ తంబి - బోయపాటి కుటుంబము

జోసఫ్‌ తంబిగారు అవుటపల్లికి వచ్చిన కొద్ది రోజులకే అందరికి సుపరిచితుడయ్యారు. అతను ఒక పవిత్రమైన వ్యక్తియని, పుణ్యాత్ముడని, దేవుని శక్తివలన ఎన్నో అద్భుతాలను చేయుచున్నారని ప్రజలు గుర్తించారు.

అవుటపల్లిలో బోయపాటి బసవయ్య, సీతారావమ్మ అనే హిందు కుటుంబము ఉండేది. ఈ కుటుంబముతో జోసఫ్‌ తంబిగారికి పరిచయం ఇలా మొదలైంది. సీతారావమ్మగారి నాయనమ్మ వేమూరి సుబ్బమ్మగారు క్రిందపడి కాలు విరిగడం వలన, విపరీతమైన నొప్పితో బాధ పడుతూ ఉంది. అనేక మంది వైద్యులకు చూపించి చికిత్స చేయించారు. అయినను కాలునొప్పి తగ్గలేకుండా ఉన్నది. కాలు వాపు కూడా ఎక్కువై ఉన్నది.

ఒకరోజు బోయపాటి వారి యింట్లో పనిచేసే పనిమనిషి తండ్రి, ఆమెను చూడటానికి వచ్చారు. ఆ వ్యక్తి వారితో, ‘ఏమండీ, అవుటపల్లి దేవాలయము వద్ద ఒక సన్యాసి (జోసఫ్‌ తంబి) ఉన్నారు. ఒకసారి అతనిని పాము కాటువేసినను, ఏమీ కాలేదు. ఒకసారి పిలిపించి చూపించండిఅని చెప్పాడు.

Friday, June 26, 2020

చుట్టుప్రక్కల గ్రామాలలో దైవసేవ

అధ్యాయము 10
చుట్టుప్రక్కల గ్రామాలలో దైవసేవ

జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికిని, తరుచుగా దైవ సేవ నిమిత్తమై చుట్టుప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేవారు. క్రీ.శ. 1939వ సంవత్సర ఆరంభములో జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచు కున్నారు. క్రీ.శ. 1945వ సంవత్సరములో తన మరణము వరకు, మొత్తం ఆరు సంవత్సరాలు అయన అక్కడ నివాస మున్నారు. ఈ ఆరు సంవత్సరాలలో కూడా జోసఫ్‌ తంబిగారు చుట్టుప్రక్కల అనేక గ్రామాలను, కొన్ని సార్లు సుదూర ప్రాంతాలైన తమిళనాడు, కేరళ ప్రాంతాలను సందర్శించేవారు. రోజు, కొన్నిసార్లు నెలలపాటు వెళ్ళేవాడు.

Wednesday, June 24, 2020

అవుటపల్లిలో జోసఫ్ తంబి గారు చేసిన మహాద్భుతాలు

అధ్యాయము 11
అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబిగారు చేసిన మహాద్భుతాలు

ఆ కాలములో విచారణ గురువులైన గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు ఒక చిన్న ఆసుపత్రిని అవుటపల్లిలో నడుపుతూ ఉండేవారు. ఆ ఆసుపత్రికి అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారు వచ్చేవారు. ఆ వచ్చే రోగులను జోసఫ్‌ తంబిగారు తన యింటికి పిలిచి ఆతిధ్యము ఇచ్చేవారు. వారికి భోజనము పెట్టేవారు. తనకు తెలిసిన నాటు మందులను ఇచ్చి, ప్రార్ధన చేసి ఎంతో మందికి స్వస్థతను చేకూర్చారు.

అల్లపురం అనే గ్రామము అవుటపల్లికి దగ్గరలో ఉన్నది. ఆ గ్రామములో ఒక వ్యక్తి కాలుపై లోతైన గాయముతో చాలా కాలమునుండి బాధ పడుచున్నాడు. ఒకరోజు ఉదయమే ఆ వ్యక్తి జోసఫ్‌ తంబిగారి దగ్గరకు వచ్చాడు. అక్కడ జోసఫ్‌ తంబిగారితో తెలగతోటి ప్రభుదాసు (తంబిగారు పెట్టిన పేరు జోసఫ్‌ అంతోని’) ఉన్నాడు. ప్రతీ శుక్రవారం మానికొండ నుండి అవుటపల్లికి వచ్చి జోసఫ్‌ తంబిగారితో ఉండేవాడు. జోసఫ్‌ తంబిగారు ప్రభుదాసును పిలచి నీళ్ళతో ఆ గాయమును కడగమని చెప్పాడు. కడుగుతూ ఉండగా గాయములోనుండి తెల్ల పురుగులు బయటకి వచ్చాయి. రక్తము, నీరు కారుచున్నవి. కడిగిన తరువాత జోసఫ్‌ తంబిగారు ముందుకు వచ్చి ఆ వ్యక్తి కాలును చేతులోనికి తీసుకొని ఆ గాయాన్ని తన నాలుకతో నాకారు. ‘‘ప్రతీ ఆదివారము దేవాయానికి రావాలి’’ అని ఆ వ్యక్తితో చెప్పారు. ఆవిధముగానే ఆ వ్యక్తి తన మరణం వరకు దేవాలయానికి వచ్చాడు. ఆ వ్యక్తి జోసఫ్‌ తంబిగారి సమక్షములోనే మరణించాడు. జోసఫ్‌ తంబిగారి కోరిక మేరకు ఆ వ్యక్తిని అవుటపల్లిలోనే భూస్థాపితం చేసారు.

Monday, June 22, 2020

తుది ఘడియలు, పరలోక పయణం

అధ్యాయము 12
తుది ఘడియలు, పరలోక పయణం

జోసఫ్‌ తంబిగారు తన మరణమును నెల, తేధీ, సమయముతో సహా ముందుగానే ఎరిగియున్నాడు. దానికోసమై ఆధ్యాత్మికముగా ఎంతగానో సిద్ధపడ్డారు. తాను 15 జనవరి 1945వ రోజున చనిపోతానని మూడు నెలకు ముందుగానే కొంతమందితో చెప్పియున్నారు. దాని నిమిత్తమై, మూడు నెలలకు ముందుగానే శవపేటికను చేయించుకొని తన గదిలో పెట్టించుకున్నారు.

శవపేటిక కొరకు కావలసిన చెక్క కొరకు అవుటపల్లి గ్రామస్తుడైన కుటుంబరావును సంప్రదించారు. ఆ చెక్కను నిమ్మగడ్డ అంతోనికి అప్పగించి తన సైజు కొలతలతో శవపేటికను చేయమని కోరారు. రెండు రోజుల సమయములో శవపేటిక సిద్ధమైనది. జోసఫ్‌ తంబిగారు దానిలో పడుకొని, ‘‘ఇది నాకు సరిపోయిందా?’’ అని అడిగేవారు. “నా మరణ సమయము ఆసన్న మగుచున్నది. నేను ఈలోకము నుండి వెళ్ళిపోవసిన సమయం దగ్గర పడుచున్నది” అని అంటూ ఉండేవారు.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారివలె జోసఫ్‌ తంబిగారు కూడా మరణాన్ని ఎంతో సంతోషముగా ఆహ్వానించాడు. తన మరణానికి మూడు నెలలు ముందుగానే ఎంతో నిష్టగా ఉన్నారు. కేవలము డికాషిన్‌, నీళ్ళు మాత్రమే త్రాగుతూ ఉండేవారు. ఆహారమును చాలా మితముగా తీసుకునేవారు.

Saturday, June 20, 2020

పంచగాయాలు

అధ్యాయము 13
పంచగాయాలు

జోసఫ్‌ తంబిగారు తరుచుగా క్రీస్తు ప్రభువు పొందిన పంచ గాయాలను పొందేవారు. ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు తమ సాక్ష్యాలను ఇచ్చియున్నారు. ఇప్పటికే, పై పీజీలలో జోసఫ్‌ తంబిగారి పంచగాయాల గురించి చదివి యున్నాము. ఇచ్చట జోసఫ్‌ తంబిగారి పంచగాయాల గూర్చిన మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

అది శుక్రవారము. మధ్యాహ్న సమయము. గురుశ్రీ విన్సెంజో పగానో వారు అవుటపల్లి విచారణకు సహాయక గురువులుగా బదిలీ అయిన రోజు! తనకు ఇవ్వబడిన పెద్ద గదిలో కూర్చుని ఏదో చదువు కుంటున్నారు. ఈ గది దేవాలయానికి వెనుకనే ఉంటుంది. అప్పుడు దేవాలయపు తలుపు మెల్లగా తెరుచు కున్నాయి. జోసఫ్‌ తంబిగారిని అదే మొదటిసారి విన్సెంజో గురువులు చూడటం. జోసఫ్‌ తంబిగారు చాలా బాధను అనుభవిస్తున్నట్లుగా కనిపించారు. అతనికున్న కురుచ తల వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి. శరీరము కృంగిపోతున్నది. సరిగా నడవలేక పోతున్నారు.

‘ఇతను ఎవరు! ఈ సమయములో ఇక్కడ ఎందుకు ఉన్నారు!అని విన్సెంజో గురువులు ఆశ్చర్య పోయారు. విన్సెంజో గురువులు గమనించగా, జోసఫ్‌ తంబిగారి చేతులు, కాళ్ళు, రొమ్ముపై రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏమి జరిగింది?’ అని విన్సెంజో గురువులు జోసఫ్‌ తంబిగారిని అడుగగా, ‘‘ఏదో జబ్బు చేసింది స్వామీ! దయచేసి ఇక్కడ కడుక్కోనివ్వండి’’ అని అన్నారు. అందుకు విన్సెంజో గురువు, ‘బ్లేడులతో, మేకులతో జాగ్రత్తగా ఉండాని తెలియదా!అని గద్దిస్తూనే, ఏదో ప్రత్యేకత ఉన్నదని మనసులో అనుకుంటూ, తన గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. చేతులమీద నీళ్ళు పోస్తూ ఉండగా, బాధ విపరీతమయ్యే సరికి నీళ్ళు పోయడం ఆపి వేసారు. కొన్ని నిమిషాల తరువాత, హఠాత్తుగా, జోసఫ్‌ తంబిగారి ముఖము తేజోవంత మవ్వగా, చిరునవ్వుతో, ‘‘జబ్బు తగ్గిపోయింది’’ అని అంటూ వేగముగా కాళ్ళు చేతులు కడుగు కున్నారు. అంతకుముందు విన్సెంజో గురువులు గమనించిన అంగుళం లోతు గాయాలు మచ్చుకైనా కనిపించలేదు.

Thursday, June 18, 2020

తక్షణ గమన వరము

అధ్యాయము 14
తక్షణ గమన వరము

తక్షణ గమనముఅనగా ఒకచోటనున్న వ్యక్తి క్షణములో ఇంకొక చోట ప్రత్యక్షం కావడం! ఇలాంటి గొప్ప దైవ వరాన్ని జోసఫ్‌ తంబిగారు కలిగి ఉండటం అనేకమంది సాక్ష్యమిచ్చారు.

గురుశ్రీ జార్జి కుడిలింగల్‌, వట్లూరు విచారణ గురువు, టీచర్ల మీటింగునకు విచారణ గురువు ఆహ్వానం మేరకు ప్రతీ నెల అవుటపల్లి గ్రామమునకు వచ్చే వారు. సాధారణముగా, టీచర్ల పాపసంకీర్తనాలు వినుటకు వచ్చేవారు. అలా వచ్చినప్పుడల్లా, అవుటపల్లిలో జోసఫ్‌ తంబిగారిని కలిసి మాట్లాడేవారు.

అలా ఒకసారి అవుటపల్లికి వచ్చినప్పుడు, వట్లూరు గ్రామమును సందర్శింప వసినదిగా జోసఫ్‌ తంబిగారిని ఆహ్వానించారు. అది శుక్రవారము. జోసఫ్‌ తంబిగారు ప్రతీ శుక్రవారము పంచ గాయాలను పొందేవారు. జార్జి కుడిలింగల్‌ వారు ప్రత్యక్షముగా చూసియున్నారు. అందుకే జోసఫ్‌ తంబిగారు, ‘‘తప్పకుండా వస్తాను, కాని ఈరోజు రాలేను. ఇంకొక రోజు వస్తాను’’ అని సమాధానమిచ్చారు.

జార్జి కుడిలింగల్‌ వారు వట్లూరుకు పయనమై వెళ్ళిపోయారు. ఉదయం 10.30 గంటకు రైలుబండి ఎక్కి 11.30 గంటలకు వట్లూరు చేరుకున్నారు. వట్లూరులో దిగగానే పనిమనిషి సైకిలుతో వేచియున్నాడు. జార్జి కుడిలింగల్‌ వారు సైకిలుమీద విచారణ గురు నిలయానికి వెళ్ళాడు.

ఆశ్చర్యం, అద్భుతం! అప్పటికే జోసఫ్‌ తంబిగారు వట్లూరు విచారణకు చేరుకొని పూజా సామాను గది తలుపు వద్ద కూర్చొని యున్నారు. గురువు కూడా ఆశ్చర్యపోయారు! ఇంత త్వరగా ఎలా రాగాలిగాడో ఎంతమాత్రం అర్ధం కాలేదు!

వెంటనే, జోసఫ్‌ తంబిగారిని పకరించకుండా, స్కూలు వద్దకు పరుగెత్తుకొని వెళ్లి జోసఫ్‌ తంబిగారు ఇక్కడకు ఎప్పుడు వచ్చారని హెడ్‌ మాష్టారును ఆరా తీయగా, ‘అరగంట క్రితం నుంచి ఇక్కడే ఉన్నారుఅని చెప్పాడు.

జార్జి కుడిలింగల్‌ వారు, ‘బ్రదర్‌ గారూ! ఈరోజు మీరు రాలేను అన్నారు. మరొక రోజు వస్తానని అన్నారు. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగారు? మేము ఎక్కిన రైలు తప్ప మరొక రైలులేదు. ఒకవేళ అదే రైలులో వచ్చిన, స్టేషన్‌ నుండి రావడానికి సమయం పడుతుంది. నీ వద్ద సైకిలు లాంటి వాహనం ఏదీ లేదు కదా! ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పుఅని ఎంతో ఆతృతతో అడిగారు. జోసఫ్‌ తంబిగారు కన్నీటి పర్యంతమై, ‘‘ఈ విషయాన్ని ఎవరికీ చెప్పనంటే మీకొక రహస్యాన్ని చెబుతాను. అదేమిటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళానుకున్నప్పుడు ఒక అదృశ్య హస్తం నా వీపు తట్టి నేను చేరవసిన చోటుకు క్షణములో చేరుస్తుంది’’ అని చెప్పారు. అది వినిన జార్జి కుడిలింగల్‌ వారు నిర్ఘాంతపోయారు.

ఇంకొక సందర్భములో, జార్జి గురువులు గుణదల వెళ్ళుటకు సిద్ధమయ్యారు. జోసఫ్‌ తంబిగారు, ‘‘నేను కూడా మీతో వస్తాను. నాకు కూడా విజయవాడలో పని ఉంది’’ అని అన్నారు. అందుకు జార్జి గురువులు ససేమిరా ఒప్పుకొనలేదు. వెమ్మటే మోటారు సైకిలు మీద గుణదలకు వెళ్లి పోయారు. జార్జి గురువులు గుణదల వెళ్లే సరికి జోసఫ్‌ తంబిగారు గుణదల దేవాలయములో ప్రార్ధన చేస్తూ ఉన్నారు. ‘ఎప్పుడు వచ్చావు?’ అని అడుగగా, “నన్ను నీవు తీసుకొని రాలేదు కదా. నేను దేవుని సహాయముతో ఇక్కడికి వచ్చాను” అని సమాధానం ఇచ్చారు.

Tuesday, June 16, 2020

జోసఫ్ తంబి గారి వ్యక్తిత్వము

అధ్యాయము 15
జోసఫ్ తంబి గారి వ్యక్తిత్వము

ప్రార్ధనాపరుడు
జోసఫ్‌ తంబిగారి జీవిత మంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్ధనకు ప్రతిరూపంఅని చెప్పవచ్చు. అనేకమంది సాక్షుల కథనాలను పరిశీలించినప్పుడు, అతని జీవితమంతా ప్రార్ధనా పూరితమైనదని చెప్పగలము.

జోసఫ్‌ తంబిగారికి అత్యంత యిష్టమైన ప్రార్ధనలో ఒకటి జపమాల. రోజుకు ఎన్నోమార్లు జపమాలను జపించే వారు. అతడు స్వయముగా వాడినట్టి జపమాలను పరిశీలించగా వాటి పూసలు అరిగిపోయి యుండుటను బట్టి, జోసఫ్‌ తంబిగారు జపమాలను ఎంతగా ప్రేమించే వారో అర్ధం చేసుకోవచ్చు. తను ప్రార్ధించుటయేగాక, అనేకమందిని జపమాల ప్రార్ధన చేయుటకు ప్రోత్సహించేవారు.

జోసఫ్‌ తంబిగారు ఎక్కడికి వెళ్ళినా కూడా అతని ప్రాధాన్యమైన ప్రేషిత కార్యం ప్రజలను ప్రార్ధనలో నడిపించుటయే. వీయిన చోట, అనగా దేవాలయము నందు, వీలు కానప్పుడు వివిధ గృహములందును ప్రార్ధనా కూటములను ఏర్పాటు చేసేవారు. తానే స్వయముగా ప్రార్ధనలను నడిపించే వారు. ఇటువంటి సామూహిక ప్రార్ధనతో పాటు, జోసఫ్‌ తంబిగారు గంటల తరబడి వ్యక్తిగత ఏకాంత ప్రార్ధనలో గడిపేవారు. దీనికి ఒక ఉదాహరణగా క్రింది విషయం చెప్పవచ్చు.

Sunday, June 14, 2020

అవుటపల్లిలో జోసఫ్ తంబిగారి కీర్తి

అధ్యాయము 16
అవుటపల్లిలో జోసఫ్ తంబిగారి కీర్తి

విజయవాడ మేత్రాసణములో అవుటపల్లి గ్రామము పురాతన విచారణలలో ఒకటి. క్రీ.శ. 1905వ సంవత్సరములో గురుశ్రీ సాంతాబ్రోజియో PIME వారు అవుటపల్లిలో మొట్టమొదటిగా జ్ఞానస్నానాలను ఇచ్చి యున్నారు. క్రీ.శ. 1907వ సంవత్సరములో గురుశ్రీ సపోర్తి, గురుశ్రీ ఘిడ్డోని వారు అవుటపల్లి చుట్టు ప్రక్కల సువార్తా బోధన చేసారు.

మొదటగా అవుటపల్లి గ్రామము వెన్నెనపూడివిచారణ క్రింద ఉండెడిది. క్రీ.శ. 1915 నుండి 1917 వరకు గురుశ్రీ పాస్కాలి PIME వారు అవుటపల్లిలో విచారణ వ్యవహారాను నిర్వహించారు. ఆ తరువాత, కొంతకాలం సరియైన విచారణ గురువులు లేకయే అవుటపల్లి విచారణ కొనసాగింది.

అవుటపల్లిలో మొట్టమొదటి దేవాలయాన్ని మోన్సిగ్నోర్‌ ఎచ్‌. పెజ్జోని వారు జేసు తిరు హృదయంపేరిట నిర్మించారు. 23 నవంబరు 1916వ సంవత్సరములో హైదరాబాదు మేత్రాణులు దియోనిసియో విస్మారావారు ఈ దేవాలయాన్ని ప్రతిష్టించి ఆశీర్వదించారు.

క్రీ.శ. 1925వ సంవత్సరములో కొద్దికాలం పాటు గురుశ్రీ బందనాధం మరియన్న వారు విజయవాడ నుండి వస్తూ విచారణ బాధ్యతలను నిర్వహించారు. పూర్తికాలపు విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించిన వారు గురుశ్రీ అంతోని లాంజా PIME వారు. 1925 నుండి 1928 వరకు ఆయన ప్రజలలో భక్తిభావాలు పెంపొందించారు.

గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో
ఆతరువాత
, గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు అవుటపల్లి విచారణ గురువులుగా 1 మార్చి 1928న బాధ్యతలను స్వీకరించి, 5 సెప్టెంబరు 1969వ సంవత్సరం వరకు కొనసాగారు. ప్రజలలో కలిసిపోయి, వారి సాధక బాధకాలను తీరుస్తూ, వేదవ్యాపకము చేశారు. ఆయన పేరు ప్రజలలో బాగా ప్రచార మైనది. వారి ప్రత్యేక శ్రద్ధ వలన, అవుటపల్లి విచారణలో క్రైస్తవ మతం వ్యాప్తి నొందినది. నాటి సంస్థలు వారి ప్రతిభచే ఉచ్చస్థితికి ఎదిగినవి.

క్రీ.శ. 1933వ సంవత్సరములో బెజవాడ’ (విజయవాడ) మేత్రాసణముగా విడిపోయినప్పుడు, అవుటపల్లి విచారణ కేసరపల్లి, తేలప్రోలు, కొండపావులూరు, వట్లూరు, అజ్జంపూడి, కోయిగురప్పాడు, బండారుగూడెం, మాదుగూడెం, ఆనందాపురం, పోసానపల్లి, కానుమోలు మొదలగు గ్రామాలతో అలరారినది.

నూజివీడు (1953), కేసరపల్లి (1961), తేలప్రోలు (1965), కొన్ని గ్రామాలు ఉప్పూరు (1923) మరియు వట్లూరు (1936) అవుటపల్లి విచారణనుండి విడిపోయి నూతన విచారణలుగా ఏర్పాడ్డాయి.

అంబ్రోస్‌ ది బత్తిస్త
బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారు స్థాపించిన తృతీయ సభ్యుడు కనుక
, అదే పునీతుడు స్థాపించిన మొదటి సభకు చెందిన గురువులు అవుటపల్లి విచారణకు వస్తే బాగుంటుందని తలంచి, విజయవాడ మేత్రాసణలు అంబ్రోస్‌ ది బత్తిస్త వారి ఆహ్వానం మేరకు, ఫ్రాన్సిస్కన్‌ కపూచిన్‌ సభకు చెందిన గురువులు అవుటపల్లి విచారణకు వచ్చియున్నారు.

క్రీ.శ. 1968వ సంవత్సరములో గురుశ్రీ అవిటో పొట్టుకులం, గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారికి సహాయ గురువుగా ఉండి
, 5 సెప్టెంబరు 1969వ సంవత్సరములో విచారణ గురువులుగా బాధ్యతలను స్వీకరించారు. తరువాతి కాలములో అనేకమంది కపూచిన్‌ గురువులు ఆధ్వర్యములో అవుటపల్లి విచారణ అద్భుతమైన పురోగతిని సాధిస్తూ ఉన్నది.

కపూచిన్‌ గురువులు గురుశ్రీ అడాల్ఫ్‌ కన్నడిపర వారు అవుటపల్లిలో నూతన దేవాలయాన్ని
నిర్మించారు. 14 జనవరి 1986వ సంవత్సరములో విజయవాడ మేత్రాణులు జోసఫ్‌ తుమ్మా వారు నూతన దేవాలయమును ప్రతిష్టించి ఆశీర్వదించారు.

1968వ సంవత్సరమునుండి కపూచిన్‌ సభకు చెందిన గురువులు విచారణ పరిధిలోగల గ్రామములోని ప్రజలతో విశ్వాస లక్షణములను పెంపొందించుటయే గాక ఎన్నో సాంఘిక, సంక్షేమ, కార్యక్రమములను చేపట్టి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించు చున్నారు. వృద్దాశ్రమమును నడుపుచున్నారు. విచారణలో నూతన దేవాలయమును నిర్మించి, అలాగే, విచారణలోని గ్రామాలలో కొన్ని నూతన దేవాలయాలు నిర్మించి, విచారణను మిక్కిలి అభివృద్ధి పధంలో నడిపించు చున్నారు.

ప్రస్తుత కేంద్ర దేవాలయమును బహువిధ ప్రతిష్టాత్మకంగా నూత్నీకరించి, పాలరాతి ప్రభతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసియున్నారు. నిత్యము వచ్చే పుణ్యక్షేత్ర దర్శనోత్సాహక భక్తులకు అసౌకర్యము కలుగని విధంగా సకల ప్రాంగణమును సంస్కరించి, ప్రతిష్టాత్మకంగా రూపొందించి యున్నారు. అక్కడే నున్న దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిని సర్వాంకార సంశోభితంగా పాలరాతి ప్రభతో తీర్చిదిద్ది యున్నారు.

ఇప్పుడు అవుటపల్లి బ్రదర్‌ జోసఫ్‌ తంబి
మహిమలావిష్క్రుత పుణ్యక్షేత్రము
భక్త జనుల యాత్రా క్షేత్రము.

జోసఫ్ తంబి గారి కీర్తి
గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు అవుటపల్లి విచారణ గురువులుగా ఉన్న సమయములో, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి తృతీయ సభ సభ్యునిగా, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు ఆంధ్రావనిలోనికి అడుగిడి, క్రీ.శ. 1939వ సంవత్సరములో అవుటపల్లిలో తన నివాసమును ఏర్పరచుకొని పుణ్య జీవితమును జీవించారు. ఎంతోమంది హిందువులు క్రీస్తు విశ్వాసములో నడచుటకు కృషి చేసాడు. ఆయన జీవించిన కాలములో ఒక లెజెండ్‌ వలె జీవించినారు.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి నిష్కపట మనస్సు, భక్తిపూర్వకమైన జీవితం ఎంతో మందిని ఆకర్షించినది. క్రీస్తు శ్రమలలో పాలుపంచు కొనుటకు తరుచుగా పంచ గాయాలను పొందారు. అద్భుత రీతిన స్వస్థతా వరమును, తక్షణ గమన వరమును పొంది యున్నారు.

క్రీ.శ. 1945వ సంవత్సరములో దైవభక్తుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి మరణ రోజునుండి ఈనాటి వరకు కూడా ఆయనను పూజ్యునిగా గౌరవించడం అధికమధిక మగుచున్నది. ఆయన సమాధి వద్ద ప్రార్ధనలు చేయుటకు, ఆయన మధ్యస్థ ప్రార్ధన ద్వారా దైవాశీస్సులను, అనుగ్రహాలను పొందుటకు వేలాది భక్తులు, విశ్వాసులు తరలి వస్తున్నారు. ఆయన సమాధిని సందర్శించే వారిలో కేవలం కతోలిక క్రైస్తవులు మాత్రమే గాక, ఎంతో మంది ఇతర క్రైస్తవ సంఘాల వారు, హిందువులు, ముస్లిములు, ఇలా అన్ని మతాలవారు, అంతస్థులవారు ఉండటం గమనార్హం!

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిని, పుణ్యక్షేత్రమును సందర్శించే వారిలో కేవలం తెలుగు రాష్ట్రాల వారేగాక, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలనుండి కూడా తరలి వస్తున్నారు. ఇలా ఆయన కీర్తి పలు రాష్ట్రాలకు పాకి పోయింది. అవుటపల్లిలోని ఆ మహనీయుని సమాధి వద్దకు నేటికీ దేశం నలుమూల నుండి ప్రజలు వచ్చి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతలను పొందు చున్నారు. వీరి మహిమల వలననే అవుటపల్లి పెద్ద పుణ్యక్షేత్ర స్థాయికి ఎదిగినది.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా ఎంతో మంది అద్భుతాలను చవి చూస్తున్నారు. వారి జీవితములో పొందిన అద్భుతాలను వ్రాతపూర్వకముగా సాక్ష్యమును ఇస్తున్నారు. విశ్వాసులు పొందే దైవానుగ్రహాలలో పిల్లలు లేని దంపతులు పిల్లలను పొందటం, వివిధ రకాలైన అనారోగ్యము నుండి స్వస్థత పొందటం, అపాయము నుండి రక్షింప బడటం మొదలగునవి.

ఆయన మరణ వార్షికోత్సవమును పురస్కరించుకొని ప్రతీ సంవత్సరము 13,14,15 జనవరి తేదీలలో ఆయన పేరిట ఉత్సవాలు ఘనముగా, వైభవముగా కొనియాడ బడుచున్నాయి. ఈ వేడుకలలో అనేక రాష్ట్రాలనుండి, ఆయన భక్తులు, వేలమంది, అవుటపల్లిలోని ఆయన సమాధిని సందర్శించి, మొక్కుబడులు చెల్లించి ప్రార్ధనలు చేయు చున్నారు. వేలాది మంది యాత్రికులు కుల, మత, జాతి బేధము లేకుండా ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఈ మూడు రోజులు కూడా దివ్యపూజా బలులు అర్పించ బడుచున్నాయి.

కేవలము వర్ధంతి వేడుకలకు మాత్రమే గాక, సంవత్సరం పొడవునా, వేలమంది భక్త జనులు ఆయన సమాధిని సందర్శిస్తున్నారు. ప్రసన్న వదనాలతో ప్రార్ధనలు చేయుచున్నారు.

ఈ విధముగా, అవుటపల్లి దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి కీర్తితో ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా వెలుగొందు చున్నది.