జోసఫ్ తంబిగారు తన మరణమును నెల, తేధీ, సమయముతో సహా ముందుగానే ఎరిగియున్నాడు. దానికోసమై ఆధ్యాత్మికముగా ఎంతగానో సిద్ధపడ్డారు. తాను 15 జనవరి 1945వ రోజున చనిపోతానని మూడు నెలకు ముందుగానే కొంతమందితో చెప్పియున్నారు. దాని నిమిత్తమై, మూడు నెలలకు ముందుగానే శవపేటికను చేయించుకొని తన గదిలో పెట్టించుకున్నారు.
శవపేటిక కొరకు కావలసిన చెక్క
కొరకు అవుటపల్లి గ్రామస్తుడైన కుటుంబరావును సంప్రదించారు. ఆ చెక్కను నిమ్మగడ్డ
అంతోనికి అప్పగించి తన సైజు కొలతలతో శవపేటికను చేయమని కోరారు. రెండు రోజుల సమయములో
శవపేటిక సిద్ధమైనది. జోసఫ్ తంబిగారు దానిలో పడుకొని, ‘‘ఇది నాకు
సరిపోయిందా?’’ అని
అడిగేవారు. “నా మరణ సమయము ఆసన్న మగుచున్నది. నేను ఈలోకము నుండి వెళ్ళిపోవసిన సమయం
దగ్గర పడుచున్నది”
అని అంటూ ఉండేవారు.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్
వారివలె జోసఫ్ తంబిగారు కూడా మరణాన్ని ఎంతో సంతోషముగా ఆహ్వానించాడు. తన మరణానికి
మూడు నెలలు ముందుగానే ఎంతో నిష్టగా ఉన్నారు. కేవలము డికాషిన్, నీళ్ళు
మాత్రమే త్రాగుతూ ఉండేవారు. ఆహారమును చాలా మితముగా తీసుకునేవారు.
మరల జోసఫ్ తంబిగారు శిఖామణితో, “ప్రతీ రోజు
సాయంత్రం ఏడు గంటలకు ఇంటి కప్పుమీద ఇద్దరు పిల్లలు [దేవదూతలు] కూర్చొని నన్ను
రమ్మని పిలుస్తున్నారు. దీని అర్ధం ఏమిటి?” అని ప్రశ్నించారు. అందుకు శిఖామణి, ‘మిమ్మును
రమ్మంటున్నారు. మీరు చనిపోతారు’ అని తడబడకుండా సమాధానం చెప్పాడు.
“అవును నేను చనిపోతాను. నాకు
శవపేటిక చేయించి పెట్టేవారు కూడా ఎవరు ఉండరని, నేను మూడు నెలలు ముందుగానే శవపేటిక చేయించి
పెట్టుకున్నాను’
అని జోసఫ్ తంబిగారు అన్నారు. జోసఫ్ తంబిగారు ఈ విధముగా, వారి మరణ సూచన
గురించి తెలియజేసి యున్నారు.
అది క్రీ.శ. 1944వ సంవత్సరం.
క్రిస్మస్ పండుగ అయిన వెంటనే, జోసఫ్ తంబిగారు మానికొండ గ్రామమునకు వెళ్ళారు. అచ్చట కూలీ
పనిచేస్తూ, ఉపవాసాలు
ఉండటము వలన అనారోగ్యం పాలైయ్యారు. 6 జనవరి 1945న తీవ్రమైన అస్వస్థతతో
అవుటపల్లిలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. అవస్థాభ్యంగనమును ఇవ్వమని కూడా
విచారణ గురువును కోరారు. కాని, చూడటానికి ఆరోగ్యముగా ఉన్నారని, విచారణ గురువు
జోసఫ్ తంబిగారికి అవస్థ అవస్థాభ్యంగనమును ఇవ్వలేదు.
తన మరణానికి నాలుగు రోజులు
ముందునుండి అతివిరేచనాలతో బాధపడ్డారు. ఈ పరిస్థితిలో ఎవరుకూడా ఆయన వద్దకు వెళ్ళుటకు
సాహసించలేదు. ఒకనాడు పోలంగి జోసఫ్, సిద్ధపు బాలస్వామి, జోసఫ్ తంబిగారిని చూడటానికి వెళ్ళారు.
ఆ సమయములో కల్దెరారో గురువు వచ్చి జోసఫ్ తంబిగారితో, ‘నీకు ఏమైనా
సాయం కావాలా? విజయవాడలోని
అమెరికన్ ఆసుపత్రికి పంపించాలా, లేదా ఇక్కడే ఉంటావా?’ అని అడిగారు. అందుకు జోసఫ్ తంబిగారు, “నాకు
ఆసుపత్రి అవసరం లేదు. నేను పరలోకమునకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది” అని సమాధాన మిచ్చారు.
అప్పుడు కల్దెరారో గురువు పోలంగి జోసఫ్‌తో, ‘జోసఫ్ తంబిగారు, విరోచనాతో
బాధపడుచున్నారు. అతని బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరు. జనాలు ఆయన దగ్గరికి
రావడానికి ఇబ్బంది పడతారు. ఆసుపత్రికి కూడా వెళ్ళడం లేదు. ఏమి చేద్దాం?’ అని అడిగారు.
అందుకు అతను, ‘స్వామి, నేను శుభ్రం
చేస్తాను. నేను జోసఫ్ తంబిగారి బాగోగులు చూసుకుంటాను’ అని చెప్పాడు.
15 జనవరి 1945 రానే వచ్చింది.
ఆరోగ్యము బాగా లేకున్నను ఆరోజు ఉదయము దేవాలయములోనికి తీసుకొని పోవసినదిగా అక్కడ
ఉన్నవారిని అడిగారు. దివ్యపూజాబలిలో పాల్గొన్న తరువాత, తనకు
అవస్థాభ్యంగనమును ఇవ్వవలసినదిగా కబురు పంపగా, రాశి గురువు జోసఫ్ తంబిగారి వద్దకు వచ్చారు. జోసఫ్
తంబిగారు ఆరోగ్యవంతునిగా కనిపించినందు వలన, గురువు, ‘నాతో పరిహాసాలాడుతున్నావా? నీవు పూర్తి
ఆరోగ్యముగా బలముగానే ఉన్నావు కదా’ అంటూ అవస్థాభ్యంగనమును ఇవ్వకుండానే వెళ్ళిపోయారు.
జోసఫ్ తంబిగారు నీరసముగా ఉన్నప్పటికిని
బోయపాటివారి యింటికి చేరుకున్నారు. వారి యింటిలో తానే స్వయముగా నిర్మించి, అస్సీసిపుర
ఫ్రాన్సిస్ వారికి అంకితం చేసిన పీఠము చెంత మడత కుర్చీలో కూలబడ్డారు. బోయపాటి
దంపతులు బాధతో, ఆశ్చర్యముతో
జోసఫ్ తంబిగారినే చూస్తూ ఉండిపోయారు, ఎందుకన తాను మరణిస్తానని చెప్పిన రోజు అదే కనుక!
జోసఫ్ తంబిగారు మరణించే రోజు
అని తెలిసిన అనేకమంది విశ్వాసులు, ఆయన భక్తులు, అభిమానులు, స్నేహితులు, ఆయన యింటివద్ద గుమికూడారు. కాని జోసఫ్ తంబిగారు
ఆయన గదిలో లేరు. ఆవరణ అంతా చూసారు, కాని ఎక్కడా కనిపించలేదు. ఈ విషయాన్ని కల్దెరారో
వారికి తెలియ జేసారు. వెమ్మటే బోయపాటివారి యింటిలో ఏమైనా ఉన్నారేమో చూసి రమ్మని
వంట మనిషి శౌరిని పంపారు. శౌరి అక్కడికి వచ్చేసరికి జోసఫ్ తంబిగారు అక్కడనున్న
వారితో మాట్లాడుతూ కనిపించడము వలన బానే ఉన్నారనుకొని, తిరిగి వెళ్లి
జోసఫ్ తంబిగారు బానే ఉన్నారని చెప్పాడు. ఇంతలో ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని
బోయపాటివారి యింటికి చేరుకున్నారు. వారితో సంతోషముగా మాట్లాడుతూ వీడ్కోలు పలుకులు
చెబుతున్నారు.
అప్పుడు ప్రభుదాసు అనే ఉపదేశి, ‘ప్రియమైన
జోసఫ్ తంబిగారా, మమ్మును
దిక్కులేని వారిగా చేసి మీరు వెళ్ళిపోతారా! మాకు క్రీస్తు మార్గమును చూపించావు.
నీవు వెళ్ళిపోతే, మాకు
దిక్కు ఎవరు? మార్గదర్శకులు
ఎవరు? మమ్ములను
దైవము వైపు నిడిపించే వారు ఎవరు?’ అని అన్నాడు. అందుకు జోసఫ్ తంబిగారు, “తండ్రి
దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై నున్న యేసు క్రీస్తు చెంతకు మీరంతా చేరండి. తన మందను
కాపాడు కొనగల మంచి కాపరి ఆయన. మందలోని ప్రతీ గొర్రెను రక్షించు కొనగలడు. ఆయన మనలను
ఎంతో ప్రేమించి తన ప్రాణమును మన కొరకు పణముగా అర్పించారు. రాబోవు కాలము గురించి
మీరు ఏమాత్రము దిగులు చెందనవసరము లేదు. క్రీస్తు ప్రభువు నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ
మనతో ఉన్నారు. నేను నా
తండ్రి వద్దకు చేరుచున్నాను. ఆయన తన అపార జ్ఞానముతో మిమ్మును ఎల్లవేళల కాపాడి
రక్షించును. మీకు కలుగు వ్యక్తిగత, సామూహిక కష్టనష్టములను తొలగించుటకు ఆయన నన్ను
సాధనముగా ఉపయోగించు కొనవచ్చును. అందుచేత నేను మిమ్ము ఇప్పుడు వదలి వెళ్ళినను
దేవుని కృప మీపై కురిపించుటకు నేను ఎ్లప్పుడూ మీతో ఉంటాను” అని వారిని
ఓదార్చారు.
సాయంత్రం నాలుగు గంటలకల్ల, జోసఫ్
తంబిగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక ఏమీ మాట్లాడలేక పోతున్నారు. ఆ తదుపరి
సాయంత్రం ఐదు గంటల సమయానికి తుది శ్వాసను విడిచారు.
సాయం సమయం అయినది. జోసఫ్
తంబిగారి దేహాన్ని ఆయన నివసించిన యింటిలోనికి తీసుకొని వచ్చి, తాను
చేయించుకున్న శవపేటికలో ఉంచారు. జోసఫ్ తంబిగారి మరణ వార్త చెవిన పడగనే, కడసారి వారి
స్నేహితున్ని, ఆప్తున్ని
కళ్ళారా చూసు కోవాలని ప్రజలు ఎంతోమంది అవుటపల్లికి వచ్చారు. దేవాలయ ప్రాంగణమంతా
ప్రజలతో నిండి పోయింది. రాత్రంతా జోసఫ్ తంబిగారి కొరకు జాగరణ ప్రార్ధనలు చేసారు.
No comments:
Post a Comment