అధ్యాయము 09
జోసఫ్ తంబి - బోయపాటి కుటుంబము
జోసఫ్ తంబిగారు అవుటపల్లికి వచ్చిన కొద్ది రోజులకే అందరికి
సుపరిచితుడయ్యారు. అతను ఒక పవిత్రమైన వ్యక్తియని, పుణ్యాత్ముడని, దేవుని శక్తివలన
ఎన్నో అద్భుతాలను చేయుచున్నారని ప్రజలు గుర్తించారు.
అవుటపల్లిలో బోయపాటి బసవయ్య, సీతారావమ్మ అనే హిందు కుటుంబము ఉండేది.
ఈ కుటుంబముతో జోసఫ్ తంబిగారికి పరిచయం ఇలా మొదలైంది. సీతారావమ్మగారి నాయనమ్మ వేమూరి
సుబ్బమ్మగారు క్రిందపడి కాలు విరిగడం వలన, విపరీతమైన నొప్పితో బాధ పడుతూ ఉంది. అనేక మంది
వైద్యులకు చూపించి చికిత్స చేయించారు. అయినను కాలునొప్పి తగ్గలేకుండా ఉన్నది. కాలు
వాపు కూడా ఎక్కువై ఉన్నది.
ఒకరోజు బోయపాటి వారి యింట్లో పనిచేసే పనిమనిషి తండ్రి,
ఆమెను చూడటానికి వచ్చారు. ఆ వ్యక్తి వారితో, ‘ఏమండీ, అవుటపల్లి దేవాలయము వద్ద ఒక సన్యాసి
(జోసఫ్ తంబి) ఉన్నారు. ఒకసారి అతనిని పాము కాటువేసినను, ఏమీ కాలేదు.
ఒకసారి పిలిపించి చూపించండి’ అని చెప్పాడు.