Showing posts with label K. అవుటపల్లిలో అద్భుతాలు. Show all posts
Showing posts with label K. అవుటపల్లిలో అద్భుతాలు. Show all posts

Wednesday, June 24, 2020

అవుటపల్లిలో జోసఫ్ తంబి గారు చేసిన మహాద్భుతాలు

అధ్యాయము 11
అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబిగారు చేసిన మహాద్భుతాలు

ఆ కాలములో విచారణ గురువులైన గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు ఒక చిన్న ఆసుపత్రిని అవుటపల్లిలో నడుపుతూ ఉండేవారు. ఆ ఆసుపత్రికి అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారు వచ్చేవారు. ఆ వచ్చే రోగులను జోసఫ్‌ తంబిగారు తన యింటికి పిలిచి ఆతిధ్యము ఇచ్చేవారు. వారికి భోజనము పెట్టేవారు. తనకు తెలిసిన నాటు మందులను ఇచ్చి, ప్రార్ధన చేసి ఎంతో మందికి స్వస్థతను చేకూర్చారు.

అల్లపురం అనే గ్రామము అవుటపల్లికి దగ్గరలో ఉన్నది. ఆ గ్రామములో ఒక వ్యక్తి కాలుపై లోతైన గాయముతో చాలా కాలమునుండి బాధ పడుచున్నాడు. ఒకరోజు ఉదయమే ఆ వ్యక్తి జోసఫ్‌ తంబిగారి దగ్గరకు వచ్చాడు. అక్కడ జోసఫ్‌ తంబిగారితో తెలగతోటి ప్రభుదాసు (తంబిగారు పెట్టిన పేరు ‘జోసఫ్‌ అంతోని’) ఉన్నాడు. ప్రతీ శుక్రవారం మానికొండ నుండి అవుటపల్లికి వచ్చి జోసఫ్‌ తంబిగారితో ఉండేవాడు. జోసఫ్‌ తంబిగారు ప్రభుదాసును పిలచి నీళ్ళతో ఆ గాయమును కడగమని చెప్పాడు. కడుగుతూ ఉండగా గాయములోనుండి తెల్ల పురుగులు బయటకి వచ్చాయి. రక్తము, నీరు కారుచున్నవి. కడిగిన తరువాత జోసఫ్‌ తంబిగారు ముందుకు వచ్చి ఆ వ్యక్తి కాలును చేతులోనికి తీసుకొని ఆ గాయాన్ని తన నాలుకతో నాకారు. ‘‘ప్రతీ ఆదివారము దేవాయానికి రావాలి’’ అని ఆ వ్యక్తితో చెప్పారు. ఆవిధముగానే ఆ వ్యక్తి తన మరణం వరకు దేవాలయానికి వచ్చాడు. ఆ వ్యక్తి జోసఫ్‌ తంబిగారి సమక్షములోనే మరణించాడు. జోసఫ్‌ తంబిగారి కోరిక మేరకు ఆ వ్యక్తిని అవుటపల్లిలోనే భూస్థాపితం చేసారు.