ఆ కాలములో విచారణ గురువులైన
గురుశ్రీ జాన్ బి. కల్దెరారో వారు ఒక చిన్న ఆసుపత్రిని అవుటపల్లిలో నడుపుతూ
ఉండేవారు. ఆ ఆసుపత్రికి అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారు వచ్చేవారు. ఆ వచ్చే రోగులను
జోసఫ్ తంబిగారు తన యింటికి పిలిచి ఆతిధ్యము ఇచ్చేవారు. వారికి భోజనము పెట్టేవారు.
తనకు తెలిసిన నాటు మందులను ఇచ్చి, ప్రార్ధన చేసి ఎంతో మందికి స్వస్థతను చేకూర్చారు.
భోజనాలు ముగిసిన తరువాత అందరిని
యింటిలోనికి పిలిచాడు. వారిలో ఉన్న ఒక స్త్రీ ఆమె యింటిలోనుండి ఎదో దొంగతనం
చేసినది. జోసఫ్ తంబిగారు ఆమెను పిలచి అడుగగా, ఆమె చేసిన దొంగతనమును ఒప్పుకొని క్షమాపణ
కోరుకున్నది. ఆమెను ఆశీర్వదించి మరల ఎన్నటికీ దొంగతనం చేయకు అని చెప్పారు.
అవుటపల్లి విచారణ గురువు
గురుశ్రీ జాన్ బి. కల్దెరారో జోసఫ్ తంబిగారిని మనసులో ఎంతగానో అభినందించేవారు, ప్రోత్సహించేవారు, కాని బయటికి
చెప్పేవారు కాదు. జోసఫ్ తంబిగారు చేయుచున్న అద్భుతమును చూసి అప్పుడప్పుడు, ఇతను
మంత్రగాడు, ఏవో
ఆకులు, అలములతో
ప్రజలను స్వస్థపరుస్తున్నాడు అని అనేవారు. అవుటపల్లి విచారణలోనున్న ఇతర గురువులు
గురుశ్రీ రాశివారు, గురుశ్రీ
శౌరివారు మాత్రము జోసఫ్ తంబిగారు చేసే దయాపూరిత కార్యాలను, స్వస్థతలను, అద్భుతాలను
విశ్వసించేవారు.
ఒకరోజు జోసఫ్ తంబిగారు తన
యింటిముందు ఉన్న పెద్ద చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. జాన్ బి. కల్దెరారో వారు
వచ్చి కర్రతో జోసఫ్ తంబిగారిని రక్తం కారేటట్లుగా కొట్టారు. కల్దెరారో వారు
కర్రను మెట్లమీద విసిరేసి లోపలికి వెళ్ళిపోయాడు. జపమాలను తీసుకొని బయటకి వస్తుండగా
ఆ కర్ర పాముగా మారి, కల్దెరారో
వారిని బయటకు రాకుండా అడ్డుకుంటుంది. వంట శౌరిని పిలచి లోపలికి వెళ్లి తుపాకిని
తీసుకు రమ్మని చెప్పారు,
కాని ఆ పాము వంట శౌరిని లోపలికి వెళ్ళనీయలేదు. గురుశ్రీ శౌరివారు కూడా అక్కడే
ఉన్నారు. కొద్దిసేపటి తరువాత, గురుశ్రీ శౌరివారు జోసఫ్ తంబిగారి వద్దకు వచ్చి, అక్కడ పాము
వచ్చింది అని చెప్పారు. అప్పుడు జోసఫ్ తంబిగారు, ‘‘నేను వెళ్ళను, కల్దెరారో
వారు నన్ను కొట్టారు’’
అని చెప్పారు. అలా ఒక గంట సమయం గడిచింది. చివరికి జోసఫ్ తంబిగారే వచ్చి ఆ
కర్రను తీసివేసారు.
ఇది జరిగిన ఏడు రోజుల తరువాత
గురుశ్రీ కల్దెరారో వారికి పంటి నొప్పి విపరీతముగా వచ్చింది. నోరు తెరవడానికి, ఏమైనా
తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. విజయవాడలోని అమెరికన్ ఆసుపత్రికి
వెళ్ళాడు. పళ్ళను అన్నింటిని తీసివేయాలి, విషపూరితమై పోయాయి అని వైద్యులు చెప్పారు. రాశి
మరియు శౌరి గురువులు జోసఫ్ తంబిగారిని కల్దెరారోవారి దగ్గరకు తీసుకొని వెళ్లి
ప్రార్ధన చేయమని కోరారు. జోసఫ్ తంబిగారు దాదాపు రెండు గంటల పాటు ప్రార్ధన చేసి, సిలువ గుర్తు
వేయగా, వెంటనే, కల్దెరారోవారు
నోరు తెరచి కాఫీ తాగగలిగారు.
జోసఫ్ తంబిగారు మరణించిన
తరువాత కల్దెరారో వారు జోసఫ్ తంబిగారి పేరిట ఒక ఆశ్రమును కట్టాలని తంచారు.
అప్పటికి ప్రభుదాసు పెద్దవాడై, వివాహము చేసుకొని అవుటపల్లిలోనే టీచరుగా పనిచేయు చున్నారు.
కల్దెరారోవారు ప్రభుదాసుతో సంప్రదించగా, కొన్ని గ్రామాలు తిరిగి కొంత వరకు డబ్బు ప్రోగుచేసి
కల్దెరారో వారికి ఇచ్చారు. ఒకరోజు కల్దెరారోవారు పోస్టు ద్వారా 60వేల రూపాయలను
స్వీకరించాడు. అలాగే, ఒకరోజు
ఒక బస్తానిండా డబ్బును తన బల్లపై కనుగొన్నాడు. ఈ డబ్బునంత ఎవరు పంపారో, ఎక్కడ నుండి
వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ డబ్బుతోనే కల్దెరారో వారు అవుటపల్లిలో వృద్ధుల
ఆశ్రమమును, ఆసుపత్రిని
కట్టించారు. ఈ అద్భుతమున్నికూడా జోసఫ్ తంబిగారి ప్రార్ధన వలననే అని చెప్పడములో
ఎంత మాత్రము అతిశయోక్తి లేదు.
జోసఫ్ తంబిగారు దుష్టశక్తులను
పారద్రోలే గొప్ప శక్తిగలవాడు. ఒకసారి, జోసఫ్ తంబిగారు దైవభక్తుడని గ్రహించిన దేవరపల్లి
దేవదానం అను వ్యక్తి, ప్రార్ధనకై
తన యింటికి ఆహ్వానించాడు. అతడు హిందువు. జోసఫ్ తంబిగారితో పాటు వల్లభాపురపు జోసఫ్, నల్లమోతు
దానియేలు, మువ్వ
జీవరత్నం అనువారు కూడా వెళ్ళారు. యింటి ముందుకు రాగానే, జోసఫ్
తంబిగారు, ‘‘ఈ
యింటిలో సైతాను ఉన్నది. నేను లోపలికి రాను’’ అని అన్నారు. ‘నా యింటిలో సైతాను లేదు’ అని దేవదానం
సమాధానమిచ్చాడు. అప్పుడు,
జోసఫ్ తంబిగారు,
‘‘యింటి లోపల దండెం కర్రకు కట్టబడి ఉంది. దానిని తీసి పారేయండి’’ అని
ఆజ్ఞాపించాడు. అందరు లోనికి వెళ్లి వెదకగా దండెం కర్రకు ఒక గుడ్డ మూటలో తాయత్తు
కట్టబడి ఉన్నాయి. వాటిని
తీసుకొని వచ్చి జోసఫ్ తంబిగారికి ఇవ్వగా, అప్పుడు ఆయన యింటిలోనికి ప్రవేశించి ప్రార్ధన
చేసారు. వారందరూ కూడా తాయత్తుల మూట గురించి జోసఫ్ తంబిగారికి ఎలా తెలుసునోయని
మిక్కిలిగా ఆశ్చర్యపోయారు.
రెండు, మూడు రోజు
తరువాత, జోసఫ్
తంబిగారు వల్లభాపురపు జోసఫ్ యింటికి రావడం చూసి క్రైస్తవుడైన మువ్వ జీవరత్నం కూడా
తన యింటికి ఆహ్వానించాడు. యింటి ముందుకు రాగానే, జోసఫ్ తంబిగారు, ‘‘ఈ యింటిలో
సైతాను ఉన్నది’’ అని
అన్నాడు. అందుకు జీవరత్నం,
‘నా యింటిలో సైతాను లేదు. నేను క్రైస్తవుడను గదా!’ అని
సమాధానమిచ్చాడు. జోసఫ్ తంబిగారు ఒక పలుగును తెప్పించి, పొయ్యి దగ్గర
త్రవ్వమన్నాడు. అచ్చట త్రవ్వగా గుప్పెడు తాయత్తులు బయట పడ్డాయి. వాటిని తీసి
పారేసిన తరువాత, జోసఫ్
తంబిగారు ఆ యింటిలోనికి ప్రవేశించి ప్రార్ధన చేసారు. అక్కడ ఉన్నవారందరు కూడా
మిక్కిలిగా ఆశ్చర్యపోయారు.
ఒకరోజు, మధ్యాహ్నవేళ వల్లభాపురపు
జోసఫ్, జోసఫ్
తంబిగారిని చూచుటకు ఆయన గృహానికి వెళ్ళాడు. ఆ సమయములో జోసఫ్ తంబిగారు ఒక్కరే ఆయన
యింటిముందు కూర్చుని ఉన్నారు. అతనిని చూడగానే, జోసఫ్ తంబిగారు, ‘‘నీకు రక్షణ లేదు’’ అని చెప్పి తన
చేతులను ఒకదానిపై ఒకటి పెట్టి, అలాగే పాదములను ఒకదానిపై ఒకటి పెట్టి బాధపడుచూ, ఏడ్చుచూ
ప్రార్ధన చేసాడు. అప్పుడు జోసఫ్ తంబిగారు పంచగాయాలను పొందియున్నారు. కొద్దిసేపటి
తరువాత వల్లభాపురపు జోసఫ్‌నకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధించాడు. తద్వారా
అతనిలో విశ్వాసం బలపడినది.
మరల 23 రోజుల తరువాత, వల్లభాపురపు
జోసఫ్‌ను, అతని
భార్యను పిలచి లాంతరును తెమ్మని చెప్పగా వారు అట్లే తెచ్చారు. ఆ సమయములో జోసఫ్
తంబిగారు పంచగాయాలను పొందటం వారు కళ్ళారా చూసారు. అది చూసిన వారు దేవుని
శ్లాఘిస్తూ, స్తుతిస్తూ
వారి యింటికి తిరిగి వెళ్ళిపోయారు.
ఒకసారి మాదాల అరుళయ్య భార్య
అనారోగ్యంపాలై విజయవాడలోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అరుళయ్య ఈ
విషయాన్ని విచారణ గురువులు కల్దెరారో వారికి చెప్పుచుండగా జోసఫ్ తంబిగారు విని, వివరాలను తెలుసుకున్నారు.
వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆమె కొరకు ప్రార్ధన చేయగా, ఆమె వెంటనే సంపూర్ణ స్వస్థతను
పొందియున్నది.
జోసఫ్ తంబిగారు ఎప్పుడు కూడా
మురికి బట్టలతో ఉండేవారు. వికృతమైన ఆకారములో ఉండేవారు. అందుకే కల్దెరారో గురువులు
జోసఫ్ తంబిగారిని అంగీని తీసివేసి సాధారణమైన దుస్తులలో ఉండమని ఆజ్ఞాపించారు.
అప్పటినుండి కల్దెరారో వారి మాటను విధేయించి, ‘తృతీయ సభ’కు చెందిన
అంగీని తీసివేసి లాల్చి, లుంగీ
కట్టుకొనేవారు.
ఒకరోజు మురికిగాఉండి చిరిగి
పోయిన జోసఫ్ తంబిగారి అంగీని మంటల్లో కాల్చివేయాని బోయపాటి క్లారమ్మ తలంచినది.
వంట గదిలోనికి తీసుకొని వెళ్లి మంటల్లో వేసింది కాని అంగీ ఎంతసేపటి కైనను మంటలో
కాలిపోలేదు.
జోసఫ్ తంబిగారు దూరదృష్టిగల
వ్యక్తి. ప్రపంచములో ఎక్కడో జరుగుతున్న విషయాలను తన మనోదృష్టితో చూసేవారు. రెండవ
ప్రపంచ యుద్ధము జరుగుతున్న రోజులు. ఒకరోజు జోసఫ్ తంబిగారు అవుటపల్లి విచారణ సహాయక
గురువైన గురుశ్రీ విన్సెంజో పగానో గురువు దగ్గరకు హుటాహుటిన వచ్చి, వెంటనే తనతో
పాటు దేవాలయము లోనికి వచ్చి ప్రార్ధన చేయాలని కోరారు. ఎందుకన, జోసఫ్
తంబిగారు తన మనోదృష్టితో ఎక్కడో జరుగుతున్న భయంకర విషయాలను కళ్ళకు కట్టినట్లుగ
చూడగలుగు చున్నారు. యుద్ధ కాలము గనుక ఎక్కడో ఏదో భయంకరమైన వినాశనము జరుగుతున్నదని
విన్సెంజో గురువులు భావించారు. అప్పుడు జోసఫ్ తంబిగారు గురువుతో, ‘‘దేవుని బిడ్డలు
ఎంతోమంది ఒకరిని ఒకరు చంపు కోవడం నేను చూస్తున్నాను. కనుక మనం శాంతి, సమాధానాల
కొరకు ప్రార్ధన చేద్దాం. ఇతర గురువులను కూడా పిలవండి. ఒక గంట పాటు ప్రార్ధన
చేద్దాం’’ అని
చెప్పారు.
దేవాలయము లోనికి వెళ్ళి
ప్రార్ధన చేయుచున్నారు. విన్సెంజో గురువులు ప్రార్ధన చేస్తున్నారు, కాని జోసఫ్
తంబి గారు మాత్రం అక్కడ యుద్ధభూమిలో జరుగుతున్న భయంకర సంఘటనను కళ్ళారా
చూస్తున్నారు. కళ్ళెదుట చూస్తూ వణకుతున్నారు, పెద్దగా ఏడుస్తూ ప్రార్ధన చేయుచున్నారు. గంటపాటు
ప్రార్ధన చేసిన తరువాత వారు దేవాలయమునుండి బయటకు వచ్చారు. అప్పడు గురువులు, ‘ఈ ఘోరం ఎక్కడ
జరుగుచున్నది?’ అని
ప్రశ్నింపగా, జోసఫ్
తంబిగారు తన చేతి వ్రేలితో ఒక దీవి యొక్క ఆకారాన్ని నేలపై గీసి దానిలో ఉత్తర భాగాన
చూపిస్తూ గుర్తు పెట్టారు.
మరుసటి రోజు అదే వార్త పేపరులో
రావడం గమనార్హం! జర్మనీ సైనికులు ‘క్రీట్’ ద్వీపములోని ‘మాలేమి’ విమానాశ్రయముపై దాడులు చేయుచున్నారు. ఈ దాడులు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
రక్షణ దళముపై కొనసాగాయి.
విన్సెంజో గురువు ‘పడక కుర్చీ’లో కూర్చొని వార్తా పేపరు చదువు చుండగా, జోసఫ్ తంబిగారు వచ్చి ప్రక్కనే నేలపై చతికలబడి కూర్చుని వార్తా విశేషాలను అడిగారు. అడుగుతూనే, హటాత్తుగా, మూర్చిల్లినట్లుగా బిగుసుకు పోయారు. కళ్ళు తెరిచే ఉన్నాయి కాని స్పృహ తప్పిన స్థితిలో ఉన్నారు. నిటారుగా కూర్చొని తదేకముగా చూస్తూ ఉండిపోయాడు. గురువు పిలిచారు, కదిపి చూసారు. అయిన ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు గురువు ఒక అగ్గిపుల్లను జోసఫ్ తంబిగారి కళ్ళెదుట వెలిగించారు, చేతుల క్రింద మండించారు, కాని ఎలాంటి చలనం లేదు. 20 నిమిషాల తరువాత తేరుకొని, తను చూసిన విషయాలను గురువుకు తెలియజేసాడు. వార్తా పత్రికలు, రేడియోకన్నా జోసఫ్ తంబిగారే నయమని, ఇకముందు కూడా తాను చూసే విషయాలను తెలుపమని జోసఫ్ తంబిగారిని గురువు కోరారు. అయితే, మరునాడు మామూలుగానే ఆరోజు వార్తలు ఏమిటోయని గురువులను అడిగి తెలుసుకున్నారు.
No comments:
Post a Comment