Friday, June 26, 2020

చుట్టుప్రక్కల గ్రామాలలో దైవసేవ

అధ్యాయము 10
చుట్టుప్రక్కల గ్రామాలలో దైవసేవ

జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికిని, తరుచుగా దైవ సేవ నిమిత్తమై చుట్టుప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేవారు. క్రీ.శ. 1939వ సంవత్సర ఆరంభములో జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచు కున్నారు. క్రీ.శ. 1945వ సంవత్సరములో తన మరణము వరకు, మొత్తం ఆరు సంవత్సరాలు అయన అక్కడ నివాస మున్నారు. ఈ ఆరు సంవత్సరాలలో కూడా జోసఫ్‌ తంబిగారు చుట్టుప్రక్కల అనేక గ్రామాలను, కొన్ని సార్లు సుదూర ప్రాంతాలైన తమిళనాడు, కేరళ ప్రాంతాలను సందర్శించేవారు. రోజు, కొన్నిసార్లు నెలలపాటు వెళ్ళేవాడు.

‘‘అవుటపల్లి అపోస్తలుడు’’గా పేరు గాంచిన జోసఫ్‌ తంబిగారు, చుట్టుప్రక్కల గ్రామాలలో సాధ్యమైనంత వరకు ప్రజలను రక్షకుడైన క్రీస్తు రక్షణ మార్గములో నడిపింపాలనే ధ్యేయముతో, సంకల్పముతో తన సువార్తా పరిచర్యను తనదైన శైలిలో కొనసాగించాడు.

దైవాశీస్సులతో జోసఫ్‌ తంబిగారు తన ప్రేషిత కార్యములను అవుటపల్లి చుట్టుప్రక్కల గ్రామాలలో విస్తరింప చేసియున్నాడు. జోసఫ్‌ తంబిగారు సందర్శించిన గ్రామాలు: మానికొండ, తేలప్రోలు, ఉయ్యూరు, వట్లూరు, దెందులూరు, ఉప్పలూరు, కేసరపల్లి, వేంపాడు, అజ్జంపూడి, అల్లపురం, భూతమల్లిపాడు, ప్రొద్దుటూరు, మర్రీడు, కోడూరుపాడు, కిష్టవరం, గ్లొపల్లి, వల్లూరుపాలెం, తొట్లవల్లూరు, కొండపావులూరు అలాగే గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెం, మొదగునవి.

మానికొండ గ్రామము

మానికొండ గ్రామము అవుటపల్లి గ్రామము నుండి 15 కిలోమీటర్ల దూరములో ఉన్నది. బోయపాటి క్లారమ్మ సోదరుడు మానికొండ వాస్తవ్యుడు వేమూరి సుబ్బయ్య, జోసఫ్‌ తంబిగారి ప్రార్ధన ద్వారా స్వస్థత పొంది, క్రీస్తును విశ్వసించారు. తన కుటుంబము జ్ఞానస్నానమును పొందాలని సమ్మతిని తెలియ జేశారు.

అయితే వేమూరి సుబ్బయ్య కుటుంబము జ్ఞానస్నానం పొంది, క్రైస్తవ మతములో చేరుతున్నారని తెలిసిన మానికొండలోని కొంతమంది హిందువులు తమ అభ్యంతరాన్ని తెలిపియున్నారు. అయితే, అతని కుటుంబము ఎలాంటి అభ్యంతరాలకు, బెదిరింపులకు జడవక, ప్రభువునందు విశ్వాస ముంచి, 31 మార్చి 1940వ సంవత్సరములో అతను మరియు అతని భార్య సుశీల్యమ్మ, కల్దెరారో గురువు చేతుల మీదుగా అవుటపల్లిలో జ్ఞానస్నానమును పొంది కతోలిక విశ్వాసములో అడుగిడినారు. వేమూరి సుబ్బయ్యకు, ఆరోగ్య శౌరిలు అని పేరు పెట్టడం జరిగింది. కొన్నాళ్ళకు మానికొండలోని అనేక కుటుంబాలు క్రైస్తవ మతమును స్వీకరించాయి.

దేవునికి కృతజ్ఞతగా తన యింటిలో ఆరోగ్య శౌరిలు ఒక పీఠమును నిర్మించాడు. జోసఫ్‌ తంబిగారి సమక్షములో పీఠము ఆశీర్వదింప బడినది. ఉప్పులూరు విచారణ గురువు వచ్చి దివ్యపూజా బలిని సమర్పించారు. మానికొండ గ్రామమునకు వెళ్లినప్పుడల్ల, జోసఫ్‌ తంబిగారు ఈ పీఠము ముందు మోకరించి ప్రార్ధన చేసేవారు. ప్రార్ధన చేయుచుండగా అనేకసార్లు పంచగాయాలను కూడా పొందియున్నారు.

ఒకరోజు మానికొండ గ్రామమునకు వచ్చిన జోసఫ్‌ తంబిగారు రాత్రి వీరి యింటి ముందు నిద్రపోతూ ఉన్నారు. రాత్రిలో పెద్ద వర్షం వచ్చినది. వేమూరి ఆరోగ్య శౌరిలు జోసఫ్‌ తంబిగారిని లోపల పడుకొమ్మని పిలిచాడు. కాని జోసఫ్‌ తంబిగారు లేవలేదు. అలాగే పడుకుండి పోయారు. అంత పెద్ద వర్షం వచ్చినను జోసఫ్‌ తంబిగారు తడవలేదు. ఉదయాన్నే దీనిని గమనించిన కుటుంబ సభ్యుందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు.

వేమూరి శౌరిలు అల్లుడు ఒకసారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడు చుండగా, జోసఫ్‌ తంబిగారు నాలుగు బియ్యపు గింజలను ఆశీర్వదించి తినమని చెప్పారు. తినిన కొద్ది సమయానికే కడుపు నొప్పినుండి సంపూర్ణ స్వస్థతను పొందియున్నాడు. మరల ఎన్నటికి కడుపు నొప్పి రాలేదు.

అలాగే వేమూరి శౌరిలు ద్వితీయ కుమారుడు పుట్టుకతోనే హెర్నియా సమస్యతో బాధపడు చున్నాడు. జోసఫ్‌ తంబిగారు వచ్చి ప్రార్ధన చేయగా వారం పది రోజులలో పూర్తిగా స్వస్థతను పొందియున్నాడు. ఈ అద్భుతము జరిగిన తరువాత మానికొండలోని  ఆరు కుటుంబాలు క్రైస్తవ మతములోనికి రావడం జరిగింది.

 అలాగే, బోయపాటి క్లారమ్మ చిన్న సోదరుడు వేమూరి పరంధామయ్య కూడా మానికొండలోనే ఉండేవారు. జోసఫ్‌ తంబిగారు ఈ కుటుంబమును కూడా తరుచుగా సందర్శిస్తూ జ్ఞానస్నానము తీసికోవాలని ప్రోత్సహించేవారు. కొన్నిసార్లు ఆ కుటుంబముతో యింటి వరండాలో కూర్చొని వారితో కలిసి కూరగాయలు అమ్ముటకు సహాయం చేసేవారు. అచ్చట వరండాలోనే పడుకునేవారు. అనేకసార్లు రాత్రంతయు మెలకువగా ఉండి ప్రార్ధన చేసేవారు.

ఆ తరువాత జోసఫ్‌ తంబిగారు తరుచుగా మానికొండ గ్రామమును సందర్శించేవారు. విశ్వాసులకు ప్రార్ధనను నేర్పించేవారు. జపమాలను చెప్పించేవారు. జోసఫ్‌ తంబిగారి సందర్శన, బోధన, ప్రార్ధన, ఆదర్శ వంతమైన జీవితము వలన కతోలిక క్రైస్తవుందరూ కూడా ఎంతో ప్రయోజనాన్ని పొందియున్నారు.

మానికొండలో తంబిగారు చేసిన కొన్ని అద్భుతాలు

తెలగతోటి పౌల్‌ మానికొండలోని రోమన్‌ క్యాథలిక్‌ స్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. 27 డిసంబర్‌ 1944వ సంవత్సరములో, నీళ్ళ తొట్టివద్ద జారి కింద పడటం వలన కుడిచేయి మణికట్టుకు బలముగా గాయం అయినది. ఆయన అత్తగారు కుడారి లేయమ్మ, ఆమెకు తెలిసిన వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళింది. ఎన్నిరోజు లైనను నొప్పి తగ్గలేదు.

ఒకరోజు ఆయన అత్తగారు పౌలును అవుటపల్లిలోని జోసఫ్‌ తంబిగారి వద్దకు తీసుకొని వెళ్ళింది. జోసఫ్‌ తంబిగారు మణికట్టుకు నూనె రాసి కట్టుకట్టి ప్రార్ధన చేసారు. ప్రతీరోజు మూడు జపమాలను జపించమని చెప్పారు. మానికొండకు తిరిగి వస్తుండగనే, దారిమధ్యలోనే నొప్పి తగ్గినట్లుగా పౌలు అనుభవించాడు. కొద్ది రోజులలోనే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.

ఒకరోజు మానికొండ డ్రామా ట్రూపు అవుటపల్లికి వచ్చింది. వారు మొత్తం ఇరువై మంది ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయములో రాజీ స్వాములవారితో ఉండగా, జోసఫ్‌ తంబిగారు, ‘‘రండి, రండి, త్వరగా రండి. యుద్ధాలు జరుగు చున్నాయి. బిడ్డలు ఒకరి నొకరు చంపుకుంటున్నారు’’ అని అందరిని పిలిచాడు. రాగానే అందరిని దేవాలయములోనికి తీసుకొని వెళ్లి, ఒక గంట సేపు ప్రార్ధన చేసాడు.

తెల్లవారు నాటకాలు అయ్యాక జోసఫ్‌ తంబిగారే అందరికి భోజనాలు పెట్టారు. స్వయంగా జోసఫ్‌ తంబిగారే అందరికి వడ్డించారు. వారు వెళ్లిపోతాము అని అన్నప్పుడు, ‘‘వెళ్ళిపోతే, మిగిలిన అన్నం ఎవరు తింటారు? సాయంత్రం వరకు ఉండి భోజనము చేసి వెళ్ళండి’’ అని అన్నారు. వారు సాయంత్రం నాలుగు గంటవరకు ఉండి భోజనాలు చేసి మానికొండకు తిరిగి వెళ్ళారు.

ఒకరోజు కేసరపల్లిలో డ్రామా వేస్తుండగా, మబ్బుపట్టి, పెద్ద గాలి దుమారం లేచింది. ఇక నాటకం సాగదని అనుకున్నారు అంతా. అక్కడే ఉన్న జోసఫ్‌ తంబిగారు స్టేజీ ముందు మోకరిల్లి ప్రార్ధన చేయగా ఆరోజు ఏ ఆటంకము జరుగకుండా డ్రామా జరిగింది.

ఒకరోజు బలుగూరి మిఖాయేలు ముఖమును చూచి జోసఫ్‌ తంబిగారు, ‘‘ఆ...! నీవు మోహపు తంపుతో పాపము చేయుటకు సిద్ధపడుతున్నావు’’ అంటూ ఆ స్త్రీ పేరు కూడా చెప్పారు. అప్పుడు దు:ఖముతో మిఖాయేలు మనస్తాప పడ్డాడు. ఈవిధముగా మోహపు పాపమునుండి అతనిని రక్షించారు.

కేసరపల్లిలో మామిల్ల సూర్యనారాయణరావుకు బట్టల దుకాణం ఉండేది. దర్జీ పని కూడా చేసేవాడు. అతని కుటుంబం హిందువులు. క్రీ.శ. 1942వ సంవత్సరములో ఒకరోజు జోసఫ్‌ తంబిగారు సగానికి చినిగిన ఒక సంచీతో అతని వద్దకు వచ్చి కుట్టమని అడిగాడు. సూర్యనారాయణరావు ఆలస్యం చేసే సరికి, జోసఫ్‌ తంబిగారే స్వయముగా కుట్టు మిషన్‌ మీద చినిగిపోయిన సంచీని కుట్టారు. ఆ తరువాత జోసఫ్‌ తంబిగారు, ‘‘భోజనము పెడతావా?’’ అని అడిగారు. అందుకు సూర్యనారాయణరావు యింటికి తీసుకొని వెళ్లి భోజనం పెట్టాడు.

మర కొంత కాలము తరువాత, జోసఫ్‌ తంబిగారు ఈ కుటుంబాన్ని సందర్శించినప్పుడు, సూర్యనారాయణరావు దంపతుకు పిల్లలు లేరని చెప్పారు. సూర్యనారాయణరావు భార్యతో, ‘‘నీకు ఒక బిడ్డ పుట్టునని విశ్వసిస్తున్నావా?’’ అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, ‘విశ్వసిస్తున్నానుఅని సమాధానం చెప్పింది. జోసఫ్‌ తంబిగారు ప్రవచించిన విధముగనే, వీరికి ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు జోజిఅని పేరు పెట్టారు.

తేలప్రోలు గ్రామము

అవుటపల్లిలో శాశ్వత నివాసమును ఏర్పరచు కొనక ముందుగానే జోసఫ్‌ తంబిగారు, తేలప్రోలు గ్రామములో కొన్నాళ్ళు ఉన్నారు.

అవుటపల్లి విచారణ గురువు గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు నెలకొకసారి తేలప్రోలు గ్రామములో దివ్యపూజాబలిని సమర్పించుటకు వెళ్ళేవారు.

ఒకరోజు జోసఫ్‌ తంబిగారు తేలప్రోలు గ్రామమును సందర్శించి, ప్రజలతో మాట్లాడారు. ఆయన మాటలను బట్టి గ్రామ ప్రజందరు కూడా ఎంతగానో ఆకర్షితులైనారు. జోసఫ్‌ తంబిగారు వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. మరుసటి ఆదివారము, కల్దెరారో గురువు దివ్యపూజా బలిని సమర్పించడానికి వచ్చినప్పుడు, క్రైస్తవ విశ్వాసం గురించి వారికి తెలియ జేయుటకు, బోధించుటకు, జోసఫ్‌ తంబిగారిని, తమ గ్రామములోనే ఉంచవసినదిగా విన్నవించు కున్నారు. వారి విన్నపమును మన్నించిన కల్దెరారో వారు దేవాలయ ఆవరణలోనే ఒక చిన్న తాటాకు పాకను ఏర్పాటు చేసారు. వంట వండుకోవడానికి కొన్ని పాత్రలను కూడా ఏర్పాటు చేసారు. స్కూలు, దేవాలయము పక్కపక్కనే ఉండేవి. జోసఫ్‌ తంబిగారు వచ్చినప్పుడల్లా ఆ చిన్న యింటిలో ఉంటూ, ప్రేమతో, ఉత్సాహముతో తన ప్రేషిత కార్యమును ఆగ్రామములో కొనసాగించారు.

చిన్నపిల్లలను, పెద్దలను ప్రోగుచేసి దేవాలయములో ప్రార్ధనలు చేసేవారు. ప్రజలు ఆయనతో చాలా సరదాగా ఉండేవారు. వారికి ఏమైనా ఇబ్బంది, అస్వస్థత కలిగినచో జోసఫ్‌ తంబిగారి వద్దకు వచ్చి చెప్పుకొనేవారు. ఆయన వారిపై చేతులు చాచి ప్రార్ధన చేసేవారు. ఇంటింటిని సందర్శించే వారు. ఒక్కొక్కరిని పేరుపెట్టి, ప్రేమగా, ఆప్యాయముగా పిలిచేవారు. వారి బాగోగుల గురుంచి ఎప్పుడుకూడా అడిగి తెలుసు కొనేవారు.

స్కూలులో మధ్యాహ్న భోజన సమయములో పిల్లలందరినీ చేరబిలచి, తాను వండుకున్న కొద్ది భోజనాన్నే అద్భుత రీతిన అందరికి వడ్డించేవారు. భోజన పాత్రను ఎవరినీ కూడా చూడనిచ్చేవారు కారు. ఒక్కోసారి జోసఫ్‌ తంబిగారు బయట ఉన్నప్పుడు, పిల్లలు కుండమీద మూత తీసి చూడగా, అందరు తిన్న తరువాతకూడా కుండ నిండుగా అన్నం ఉండేది.

శుక్రవారము, ముఖ్యముగా మధ్యాహ్న సమయములో ఎక్కువగా తన యింటిలో తలుపు వేసుకుని ఉండేవారు, ఎందుకంటే, ఆ సమయములో పంచగాయాలను పొందేవారు. కొంతమంది గ్రామస్థులు గుడ్డలతో వచ్చి గాయాలనుండి కారుచున్న రక్తమును తుడచేవారు.

ఇలా జరుగుతుందని విచారణ గురువు కల్దెరారో వారికి ప్రజలు చెప్పగా, మొదట్లో ఆయన నమ్మలేదు. ఒక శుక్రవారము ఆయనే స్వయముగా వచ్చి చూసినప్పుడు నమ్మియున్నారు.

యారాము సుందరరావు ఏలూరు వాస్తవ్యులు. అతని మేనత్త తేలప్రోలులోని ఆసుపత్రిలో పనిచేయు చున్నందున సుందరరావు కొంతకాలం మేనత్త యింటిలో ఉండేవాడు. ఒకరోజు సుందరరావు అనారోగ్యం పాలైనప్పుడు, అత్తమామలు సుందరరావును జోసఫ్‌ తంబిగారి వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు నల్లని చూర్ణముఏదో ఇచ్చి ప్రార్ధన చేసారు. అది గొంతులో వేసుకున్న పది నిమిషాలో సంపూర్ణముగా ఆరోగ్యవంతుడైనాడు.

జోసఫ్‌ తంబిగారు ఈ కుటుంబమును తరుచుగా సందర్శించేవారు. ఈ సమయములో సుందరరావు మేనత్తను నూజివీడు దగ్గరలోనున్న గొల్లపూడి అను గ్రామమునకు బదిలీ చేశారు. అక్కడ కూడా ఈ కుటుంబమును జోసఫ్‌ తంబిగారు తరుచుగా సందర్శించేవారు. క్రీ.శ. 1940 లేదా 1941వ సంవత్సరములో గొల్లపూడిలోని ఈ కుటుంబాన్ని సందర్శించారు. దాదాపు ఒక నెల రోజులపాటు వారితో అచ్చట ఉన్నారు.

ఒకరోజు మధ్యాహ్న భోజనము తరువాత, మూడు గంటలకు పంచగాయాలను పొందాడు. ఆ సమయములో సుందరరావు అత్త మామలు యింటిలో లేరు. జోసఫ్‌ తంబిగారు గుడ్డ ముక్కను అడుగగా సుందరరావు తెచ్చిఇచ్చాడు. దానితో రక్తాన్ని తుడిచాడు. ఒక అరగంట తరువాత, నొప్పి తగ్గిన తరువాత, నవ్వుతూ మంచంమీద కూర్చున్నారు.

పాతరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా

గురుశ్రీ పి. బాలస్వామి గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెంలో విచారణ గురువులుగా ఉన్న సమయములో జోసఫ్‌ తంబిగారు పాతరెడ్డిపాలెం గ్రామమును సందర్శించారు. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందటం గమనించారు. గురువు స్వయముగా గాయములలోనుండి కారుతున్న రక్తమును తుడిచారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జోసఫ్‌ తంబిగారు ఆ గురువుతో చెప్పారు.

ఒకరోజు ఇరువురు కలిసి భోజనం చేయుచుండగా, బాలస్వామి గురువు గిన్నెలోనుండి  చేపల కూరను పళ్ళెములో వేసుకొని రుచిచూడగా, అది చేదుగా  ఉన్నదని జోసఫ్‌ తంబిగారితో చెప్పారు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు మరొకసారి కూరను గిన్నెలోనుండి వేసుకొమ్మని చెప్పారు. ఆయన చెప్పిన విధముగనే, గురువు రెండవసారి చేపల కూరను అదే గిన్నెలోనుండి వేసుకోగా, ఆశ్చర్య కరముగా చేపల కూర బహు రుచిగా ఉండెను.

జోసఫ్‌ తంబిగారు ఎక్కడికి వెళ్ళినను, పేదలకు, ఆకలితో ఉన్నవారికి, పిల్లలకు అన్నదానము చేసెడివారు. పాతరెడ్డిపాలెం గ్రామమును సందర్శించినప్పుడు కూడా పేదవారికి అన్నదానము చేసాడు.


No comments:

Post a Comment