Sunday, June 28, 2020

జోసఫ్ తంబి - బోయపాటి కుటుంబము

అధ్యాయము 09
జోసఫ్ తంబి - బోయపాటి కుటుంబము

జోసఫ్‌ తంబిగారు అవుటపల్లికి వచ్చిన కొద్ది రోజులకే అందరికి సుపరిచితుడయ్యారు. అతను ఒక పవిత్రమైన వ్యక్తియని, పుణ్యాత్ముడని, దేవుని శక్తివలన ఎన్నో అద్భుతాలను చేయుచున్నారని ప్రజలు గుర్తించారు.

అవుటపల్లిలో బోయపాటి బసవయ్య, సీతారావమ్మ అనే హిందు కుటుంబము ఉండేది. ఈ కుటుంబముతో జోసఫ్‌ తంబిగారికి పరిచయం ఇలా మొదలైంది. సీతారావమ్మగారి నాయనమ్మ వేమూరి సుబ్బమ్మగారు క్రిందపడి కాలు విరిగడం వలన, విపరీతమైన నొప్పితో బాధ పడుతూ ఉంది. అనేక మంది వైద్యులకు చూపించి చికిత్స చేయించారు. అయినను కాలునొప్పి తగ్గలేకుండా ఉన్నది. కాలు వాపు కూడా ఎక్కువై ఉన్నది.

ఒకరోజు బోయపాటి వారి యింట్లో పనిచేసే పనిమనిషి తండ్రి, ఆమెను చూడటానికి వచ్చారు. ఆ వ్యక్తి వారితో, ‘ఏమండీ, అవుటపల్లి దేవాలయము వద్ద ఒక సన్యాసి (జోసఫ్‌ తంబి) ఉన్నారు. ఒకసారి అతనిని పాము కాటువేసినను, ఏమీ కాలేదు. ఒకసారి పిలిపించి చూపించండిఅని చెప్పాడు.
బోయపాటి బసవయ్య దేవాలయము వద్దకు వెళ్లి విచారణ గురువులైన గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారిని కలిసి జోసఫ్‌ తంబిగారిని ఒకసారి తమ యింటికి పంపవసినదిగా కోరియున్నాడు. ఆ సమయములో అక్కడ జోసఫ్‌ తంబిగారు లేనందున, రాగానే పంపిస్తానని చెప్పియున్నారు.

జోసఫ్‌ తంబిగారు రాగానే వంట మనిషి అయిన మాదాను శౌరితో బోయపాటి వారి యింటికి పంపించారు. నొప్పితో బాధపడుతున్న సుబ్బమ్మగారి కొరకు ప్రార్ధన చేయమని వేడుకున్నారు. అప్పుడు జోసఫ్‌ తంబి యింటిలోపలోకి ప్రవేశించకుండా
, ‘‘ఈ యింటిలో మూడు పిశాచాలు ఉన్నాయి. విచారణ గురువు అనుమతి లేనిదే నేను ఈ యింటిలోనికి ప్రవేశించను’’ అని చెప్పగా, బోయపాటి బసవయ్య మరల విచారణ గురువు దగ్గరకు వెళ్లి అనుమతిని కోరాడు. పరువా లేదు. అనుమతిని ఇస్తున్నానుఅని గురువు చెప్పగా, పరుగు పరుగున తిరిగి వచ్చి ఆ వార్తను జోసఫ్‌ తంబిగారికి తెలియ జేశాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు బోయపాటివారి యింటిలోనికి ప్రవేశించి, సుబ్బమ్మ గురించి ప్రార్ధన చేసి, సిలువ గురుతు వేసి, ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

మరుసటి రోజు జోసఫ్‌ తంబిగారు తేలప్రోలు గ్రామములో ఉన్నారని తెలిసి బసవయ్యగారు వెళ్లి జోసఫ్‌ తంబిగారిని తీసుకొని వచ్చారు. రాగానే, సుబ్బమ్మ పడుకొనియున్న మంచము దగ్గరకు వెళ్లి జోసఫ్‌ తంబిగారు, ‘‘అమ్మా! లెమ్ము’’ అని పిలిచి, ‘‘నీవు మీ గ్రామమునకు వెళ్ళుము. అచ్చట మీ మనవళ్లు నిన్ను చూసుకుంటారు’’ అని చెప్పి, ఆమె జీవిత గాథను మొత్తం చెప్పియున్నారు.

ఆశ్చర్య పోయిన బోయపాటి దంపతులు తమ గురించి కూడా తెలుసుకోవాలనే ఉత్సుకతతో వారి గురించి కూడా చెప్పమని కోరారు. వారి గురించి కూడా చెప్పిన తరువాత, వారికి మరియతల్లి, జోజప్ప, బాలయేసు చిత్ర పటాలను, ప్రార్ధనా పుస్తకాన్ని ఇచ్చి ప్రతీరోజు ప్రార్ధన చేయమని చెప్పియున్నారు. ఎంతో సంతోషముగా వారు ప్రతీ రోజు ప్రార్ధన చేస్తూ ఉండేవారు.

ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి! బోయపాటి వారి దంపతులలో ఏదో సంఘర్షణ! కనిపించని దైవీకశక్తి ఏదో వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఈ అంత:రంగిక సంఘర్షణలో, జోసఫ్‌ తంబిగారిని సహాయము చేయమని కోరారు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు వారి యింటిలో ఒక పీఠమును నిర్మించి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారికి అంకితం చేసియున్నారు.

క్రీ.శ. 1939వ సంవత్సరములోని తపస్కాలములో జోసఫ్‌ తంబిగారు కేరళ రాష్ట్రమునకు వెళ్ళినప్పుడు, గురుశ్రీ పౌల్‌ ఖజూర్‌ గారు స్వయముగా చేసి ఇచ్చిన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి ప్రతిమను ఆ పీఠముపై ప్రతిష్టింప జేసియున్నారు.

అయితే, ఆరంభములో జోసఫ్‌ తంబిగారి కోరిక మేరకు యింటిలో పీఠమును నిర్మించుటకు బసవయ్యగారు అంగీకరించారు, కాని చాలా చిన్నదిగా ఉండాలని చెప్పి, పొలం పనులకు వెళ్ళారు. బసవయ్యగారు పొలం పనులనుండి తిరిగి వచ్చేసరికి జోసఫ్‌ తంబిగారు పెద్ద పీఠమును నిర్మించారు. దానిని చూసిన బసవయ్యగారు కోపోద్రిక్తుడై దానిని కూల్చి వేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయములో పెద్ద మెరుపులతో వెలుగులు వచ్చాయి. బసవయ్య మూర్ఛపోయి క్రింద పడిపోయాడు. జోసఫ్‌ తంబిగారు అతనిపై తీర్ధజమును చల్లగా, తేరుకొని, వెంటనే జోసఫ్‌ తంబిగారి కాళ్ళపై పడి క్షమాపణను వేడుకున్నాడు.

జోసఫ్‌ తంబిగారు ప్రతీ రోజు ఈ దంపతులకు యేసు ప్రభువు గురించి బోధించాడు. కతోలిక క్రైస్తవ ప్రార్ధనలను, విశ్వాసాన్ని నేర్పించాడు. బోయపాటి వారి కుటుంబములో చోటుచేసుకుంటున్న ఆధ్యాత్మిక పరిణామాలను, పరిపక్వతను విచారణ గురువు జాన్‌ బి. కల్దెరారో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తానుకూడా స్వయముగా మిషనరీ, క్రీస్తు సేవపట్ల ప్రేమ కల్గినవాడు కనుక ఈవిషయములో జోసఫ్‌ తంబిగారిని ఎంతగానో ప్రోత్సహించాడు.

బోయపాటి దంపతులు జ్ఞానస్నానము పొందుట
బోయపాటి దంపతులలో పెరిగిన క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి
, జోసఫ్‌ తంబిగారు విచారణ గురువుకు చెప్పి వారికి జ్ఞానస్నానము ఇప్పించాడు. అయితే వారిది హిందూ కుటుంబము కాబట్టి, బహిరంగముగా జ్ఞానస్నానమును ఇచ్చినచో ఇతర కుటుంబాల నుండి, వ్యతిరేకత, సమస్యలు తలెత్తుతాయని తలంచి, 22 జూలై 1939వ సంవత్సరం అర్ధరాత్రిలో ఆ దంపతులకు విచారణ గురువు జాన్‌ బి. కల్దెరారో జ్ఞానస్నానము ఇచ్చియున్నారు. జోసఫ్‌ తంబిగారి కోరిక, సలహా మేరకే బసవయ్యకు ఫ్రాన్సిస్‌అని, సీతారావమ్మకు క్లారమ్మఅని పేర్లను పెట్టియున్నారు.

బోయపాటి ఫ్రాన్సిస్‌, క్లారమ్మలకు ఇదివరకే నలుగురు అమ్మాయిలు పుట్టారు. వారిలో ఇద్దరు పురిటిలోనే మరణించారు. మగ సంతానాన్ని పొందాలని వారు ఎంతగానో ఆశించారు. ఇదే విషయాన్ని జోసఫ్‌ తంబిగారికి చెప్పగా, ‘‘మీకు త్వరలోనే మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకు బాలస్వామిఅని పేరు పెట్టండి’’ అని వారితో చెప్పాడు. జోసఫ్‌ తంబిగారు చెప్పిన విధముగానే 6 మే 1940వ సంవత్సరమున, అనగా, వారు జ్ఞానస్నానము పొందిన పదవ నెలలో, వారికి మగ బిడ్డడు జన్మించాడు. ఆ బిడ్డకు 26 మే 1940వ సంవత్సరమున బాలస్వామిఅని పేరు పెట్టి జ్ఞానస్నానం ఇప్పించి యున్నారు.

బోయపాటి దంపతులు
బోయపాటి దంపతులు
 బోయపాటి దంపతులు క్రైస్తవ మతమును స్వీకరించారనే వార్త గ్రామములోని హిందువుందరికీ తెలిసి పోయింది. అయితే భయపడినంత వ్యతిరేకతగాని, సమస్యలుగాని తలెత్తలేదు. ఎందుకన, వారు పొందిన మగ సంతానం దేవుని వరము అని హిందువులు అంతాకూడా నమ్మియున్నారు. అదేవిధముగా, జోసఫ్‌ తంబిగారితో వ్యక్తిగతముగా పరిచయమున్నవారు అనేకమంది కూడా క్రైస్తవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారు. క్రీ.శ. 1940వ సంవత్సరమునుండి అనేకమంది హిందువులు జ్ఞానస్నానమును పొందియున్నారు.

ఈవిధముగా అర్ధరాత్రిలో బోయపాటి దంపతులు జ్ఞానస్నానం ఎన్నో కుటుంబాలు తల్లి తిరుసభలో చేరడానికి నాంది అయ్యింది.

అది పవిత్ర వారములోని పెద్ద బుధవారము. కల్దెరారో, విన్సెంజో గురువు మరియు జోసఫ్‌ తంబిగారు, ముగ్గురుకూడా ఆరుబయట మాట్లాడు కుంటున్నారు. అప్పుడు బోయపాటి ఫ్రాన్సిస్‌ అక్కడికి వచ్చారు. కొన్ని రోజుల క్రితమే విజయవాడలోని అమెరికన్‌ ఆసుపత్రిలో అనారోగ్యము పాలైన అతని కుమారుడు బాలస్వామిని చేర్పించారు. అయితే, ఆ బాలుడు రక్తవాంతి చేసుకున్నందు వలన, ఇక బ్రతకడు, యింటికి తీసుకొని వెళ్ళాలని చెప్పారని తెలిపాడు. ఫ్రాన్సిస్‌ ఈ విషయాన్ని చెప్పుతూ బోరున విలపించాడు. ఇది విన్న గురువు ఎంతో బాధపడ్డారు. ఫ్రాన్సిస్‌ను ఓదార్చారు.

అయితే అక్కడే ఉన్న జోసఫ్‌ తంబిగారు మాత్రం, ‘‘పిల్లవాడు చనిపోడు, ఇది వెళ్ళిపోయే మేఘము వంటిదే’’ అని నవ్వుతూ చెప్పారు. ఆ మాటకు విన్సెంజో గురువుకు చాలా కోపం వచ్చింది. వైద్యుల కంటే నీకు ఎక్కువ తెలుసా? బాధలోనున్న వారిని ఓదార్చే పద్ధతి ఇదేనా?’ అని జోసఫ్‌ తంబిగారిపై అరిచారు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు చిరునవ్వుతో, ‘‘నేను చెప్పేది నిజం. నాకు తెలుసు. ఆ బిడ్డ చనిపోడు. అయితే బిడ్డను ఇంకొక్క రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంచమని చెప్పండి. పూర్తిగా కోలుకుంటాడు’’ అని అన్నారు. జోసఫ్‌ తంబిగారి మాటను విశ్వసించిన బోయపాటి ఫ్రాన్సిస్‌, ఇంకా రెండు రోజులు పిల్లాడిని ఆసుపత్రిలోనే ఉంచేట్లుగా ఒప్పించాడు.

రెండు రోజులు గడచి పోయాయి. అది పెద్ద శనివారము. పాస్కా గంటలు మ్రోగాయి. అదే సమయములో, ఆసుపత్రిలో పిల్లాడు కండ్లు తెరచి సగం సీసా పాలు త్రాగాడు. పూర్తిగా కోలుకున్న బిడ్డను యింటికి తీసుకొని వచ్చారు.
జోసఫ్‌ తంబిగారికి అవుటపల్లిలోని బోయపాటి దంపతులతో మాత్రమే అనుబంధము గాక, బోయపాటి క్లారమ్మ బంధువులతో కూడా దగ్గరి సంబంధాన్ని కలిగి యున్నారు.

మానికొండ గ్రామములోనున్న బోయపాటి క్లారమ్మగారి తమ్ముడు, వేమూరి సుబ్బయ్య జబ్బుతో బాధపడుచూ ఉన్నాడు. ఒకరోజు అక్కగారైన క్లారమ్మవారి యింటికి వచ్చియున్నాడు. ఈ విషయం జోసఫ్‌ తంబిగారికి చెప్పగా, యింటికి వచ్చి ప్రార్ధన చేసాడు. ఆ క్షణమునుండి అతని జబ్బు నయమైపోయినది. తరువాత క్లారమ్మ గారి తమ్ముడు కూడా జ్ఞానస్నానమును పొందియున్నాడు.

జోసఫ్‌ తంబిగారి ప్రార్ధన వలన క్లారమ్మగారి బంధువులలో కొన్ని కుటుంబాలు క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం పొంది కతోలిక క్రైస్తవులైనారు.

ఈవిధముగా బోయపాటి కుటుంబ సభ్యులు జోసఫ్‌ తంబిగారి ద్వారా ఎన్నో మేలులను, స్వస్థతలను పొంది యున్నారు.
బోయపాటి ఫ్రాన్సిస్‌, క్లారమ్మ ద్వితీయ పుత్రిక విమలమ్మ ఏడు సంవత్సరమునుండి వ్యాధితో బాధపడుచున్నది. ఈ విషయాన్ని జోసఫ్‌ తంబిగారితో చెప్పగా, అన్నం వండేటప్పుడు మూడు బియ్యం గింజలను తినమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. త్వరలోనే ఆమె వ్యాధినుండి స్వస్థతను పొందింది. ఒకసారి విమలమ్మకు కాలుపై పుళ్ళు అయ్యాయి. ఎంత వైద్యం చేయించినను తగ్గలేదు. ఈ విషయాన్ని జోసఫ్‌ తంబిగారికి చెప్పగా, మట్టితో మందును చేసి పుళ్ళపై రాయమని చెప్పారు. మూడు రోజుల తరువాత ఆ పుళ్ళు మాయమై పోయాయి.

వీరి కుటుంబములో జరిగిన మరొక గొప్ప అద్భుతం ఏమనగా, ఒకసారి జోసఫ్‌ తంబిగారు, ‘‘అవుటపల్లి గ్రామమంతా నిప్పు అంటుకొని తగులబడి పోతుంది, కాని బోయపాటి వారి యిల్లు మాత్రం సురక్షితముగా ఉంటుంది’’ అని భవిష్యత్తులో జరగబోయే దానిని ముందుగానే ప్రవచించి యున్నారు. జోసఫ్‌ తంబిగారు ప్రవచించినట్లుగనే, 1970వ దశకంలో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదములో, బోయపాటి వారి యిల్లు తప్ప, గ్రామమంతా తగులబడి పోయింది.

అలాగే, బోయపాటి ఫ్రాన్సిస్‌, క్లారమ్మల ప్రధమ పుత్రిక నర్రా కనకమ్మ కిందపడిపోయి, తీవ్రమైన దెబ్బ వలన అస్వస్థతకు గురవుతుందని, అప్పుడు సహాయక విచారణ గురువు గ్రురుశ్రీ రాశి వారికి తాను ఇచ్చిన చిత్రపటాన్ని చూపిస్తే ఆమె స్వస్థత పొందుతుందనిజోసఫ్‌ తంబిగారు చెప్పారు. జోసఫ్‌ తంబిగారు ప్రవచించి నట్లుగనే జరిగింది. ఎంతోమంది వైద్యులకు చూపించారు కాని ఆమెకు నయం కాలేదు. జోసఫ్‌ తంబిగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రాశి గురువు వద్ద ఉన్న చిత్రపటాన్ని ఆమెకు చూపించగా, ఆమె వెమ్మటే స్వస్థతను పొంది యున్నది.

జోసఫ్‌ తంబిగారు చరిత్రలో నిలచినంత కాలము, బోయపాటి కుటుంబము కూడా చరిత్రలో నిలిచి ఉంటుంది. క్రైస్తవ మతాన్ని ఆలింగనం చేసుకున్న ఈ కుటుంబం, జోసఫ్‌ తంబిగారి పట్ల ఎంతో ప్రేమానురాగాలను చూపించింది. జోసఫ్‌ తంబిగారి రంగు, వేషధారణ, జీవించే విధానం అందరికీ దూరం చేసినా, బోయపాటి వారి కుటుంబం మాత్రం ఆయన పట్ల ఎల్లప్పుడు ఎనలేని గౌరవాన్ని చూపించి ఆదరించింది. తాను అవుటపల్లిలో జీవించినంత కాలం ఈ కుటుంబము జోసఫ్‌ తంబిగారికి సొంత కుటుంబమైనది. అందుకే జోసఫ్‌ తంబిగారికి ఈ కుటుంబం ఎంతో ప్రీతిపాత్రమైనది.

No comments:

Post a Comment