Tuesday, June 30, 2020

అవుటపల్లిలో నివాసం

అధ్యాయము 08
అవుటపల్లిలో నివాసం

అవుటపల్లి (పెదావుటపల్లి) గ్రామము విజయవాడ మేత్రాసణములోని పురాతన విచారణలలో ఒకటి. క్రీ.శ. 1925వ సంవత్సరములో అవుటపల్లి విచారణగా ఏర్పడినది.


క్రీ.శ. 1939వ సంవత్సరమునుండి జోసఫ్‌ తంబిగారు తన నివాసాన్ని అవుటపల్లిలో ఏర్పరచుకున్నారు. గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో (PIME) అప్పటి విచారణ గురువులు. ఆయన ఇటలీ దేశస్థుడు. 14 సెప్టెంబరు 1927వ సంవత్సరములో అవుటపల్లికి చేరుకున్న వీరు 1 మార్చి 1928వ సంవత్సరములో విచారణ గురువుగా బాధ్యతలు తీసుకున్నారు. విచారణ గురువుగా క్రీ.శ. 1969 వరకు కొనసాగారు.


గృహము లోపల
అవుటపల్లి గ్రామము జోసఫ్‌ తంబిగారి ఆధ్యాత్మిక కార్యాలకు ప్రధాన కేంద్రం అయ్యింది. క్రీ.శ. 1939వ సంవత్సరము నుండి 1945వ సంవత్సరము వరకు ఇక్కడే నివసిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్తను బోధిస్తూ జీవించారు.

జోసఫ్‌ తంబిగారు కేసరపల్లి గ్రామములో ఉన్నప్పుడు తరుచుగా పాపసంకీర్తనం చేయడానికి అవుటపల్లికి వచ్చేవారు. సహాయక విచారణ గురువు గురుశ్రీ రాశి వారి వద్ద పాపసంకీర్తనం చేసేవారు. వచ్చినప్పుడల్లా విచారణ గురువులైన జాన్‌ బి. కల్దెరారో వారిని తప్పక కలిసి వెళ్ళేవారు.

ఇలా ఒకరోజు వచ్చినప్పుడు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకోవాలనే తన మనసులోని కోరికను విచారణ గురువుకు తెలియజేసారు. తద్వారా ప్రతీరోజు దివ్యపూజాబలిలో పాల్గొని దివ్యసత్ప్రసాదమును స్వీకరించవచ్చని తలంచారు.

జోసఫ్‌ తంబిగారి విశ్వాసమును
, దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని చూసి విచారణ గురువు అందుకు సంతోషముగా సమ్మతించారు. విచారణ దేవాలయమునకు దగ్గరలోనే రెండు గదులతో కూడిన ఒక ఇల్లు ఒకటి ఉన్నది. దానిలో వంటచేయు మాదాను శౌరి ఒక గదిలో ఉండేవాడు. వేరొక గదిలో జోసఫ్‌ తంబిగారు ఉండుటకు విచారణ గురువు ఏర్పాట్లను చేసియున్నారు. ఇక క్రీ.శ. 1939వ సంవత్సరము నుండి అవుటపల్లి జోసఫ్‌ తంబిగారి నివాస స్థానమయింది.

విచారణ గురువులకు అన్ని విషయాలలో తన వంతు సహాయ సహకారాలను అందించి యున్నారు.

కేసరపల్లి గ్రామములో వలెనె అవుటపల్లి గ్రామములో కూడా తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించారు. అతి త్వరలోనే అవుటపల్లి గ్రామస్తులు, అలాగే చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు జోసఫ్‌ తంబిగారు ఒక పుణ్యాత్ముడని గుర్తించారు.

No comments:

Post a Comment