Thursday, July 2, 2020

ఆంధ్రావనిలో జోసఫ్ తంబి గారు: బిట్రగుంట-కేసరపల్లిలో పరిచర్య

అధ్యాయము 07
ఆంధ్రావనిలో జోసఫ్ తంబి గారు: బిట్రగుంట-కేసరపల్లిలో పరిచర్య

బిట్రగుంటలో పరిచర్య

క్రీ.శ. 1937వ సంవత్సరము. జోసఫ్‌ తంబిగారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునకు ఏతెంచారు. మొదటగా నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట అను ప్రదేశమునకు ఫిబ్రవరి 1937వ సం.లో వచ్చియున్నారు. బిట్రగుంటలో తమిళనాడు నుండి రైల్వే ఉద్యోగులుగా పనిచేయుచున్నవారి మధ్యన తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు. వారితో తమిళ భాషలో సంభాషించేవారు.

ఇంటింటికి వెళ్లి ప్రజలను సందర్శించేవారు. వారితో ఎంతో ఆప్యాయముగా, ప్రేమగా మాట్లాడేవారు. కుటుంబ ప్రార్ధనలను నిర్వహించేవారు. ప్రజలను దేవాలయము వద్ద ప్రోగుచేసి ప్రార్ధన చేయడం నేర్పించేవారు. జపమాలను ఎలా వల్లించాలో నేర్పించేవారు. బైఋలు గురించిన విషయాలను ఎన్నింటినో వారికి బోధించారు.

చిన్న పిల్లలతో ఎంతో ఆప్యాయముగా ఉండేవారు. దివ్యపూజాబలిలో పాల్గొనుటకు వారిని ప్రోత్సహించేవారు. వారి తపై తన చేతును చాచి ప్రార్ధన చేసి, వారిని ఆశీర్వదించేవారు.

అనారోగ్యముతో బాధపడుతున్న వారికోసం ప్రార్ధన చేసి వారిని స్వస్థత పరచేవాడు. జోసఫ్‌ తంబిగారు తన దగ్గర ఉన్న డబ్బుతో పేదలకు సహాయం చేసేవారు.

కేసరపల్లిలో పరిచర్య

క్రీ.శ. 1937వ సంవత్సరము అక్టోబరులో జోసఫ్‌ తంబిగారు, బిట్రగుంట నుండి విజయవాడ పట్టణమునకు 20 కి.మీ. సమీపముననున్న కేసరపల్లి అను గ్రామమునకు వచ్చియున్నారు. కేసరపల్లిలో పునీత పాదువాపురి అంతోని వారి పేరిట ఒక చిన్న దేవాలయము ఉన్నది.

ప్రార్ధన చేసుకోవడానికి దేవాలయములోనికి ప్రవేశిస్తుండగా, కొంతమంది అతనిని పిచ్చివాడుఅని భావించి అక్కడనుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసారు. తెలుగు భాషకూడా అప్పటికి జోసఫ్‌ తంబిగారికి వచ్చేదికాదు, కనుక వారితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడియున్నారు. ఎక్కడనుండి వచ్చాడో, ఏ ఉద్దేశ్యం కొరకు వచ్చాడో ప్రజలకు కూడా ఏమీ అర్ధం కాలేదు. స్కూలు హెడ్‌మాష్టారు అయిన దయా సాముయేలు జోసఫ్‌ తంబిగారిని దూషించినను, అవమానించినను, ఆయన అక్కడనుండి వెళ్లిపోలేదు.

నెమ్మదిగా, జోసఫ్‌ తంబిగారి విశ్వాస జీవితాన్ని, ప్రార్ధన జీవితాన్ని గమనించిన కొంతమంది కతోలిక క్రైస్తవులు పశ్చాత్తాప హృదయముతో, గ్రామస్థులు చేసిన అవమానాలకు, దూషణలకు క్షమించమని వేడుకున్నారు. జోసఫ్‌ తంబిగారు వారిని క్షమించడం మాత్రమేగాక, వారితో ఎంతో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచు కున్నారు. కేసరపల్లి గ్రామములో అందరి క్షేమాన్ని కనుగొని, అనారోగ్యముతో బాధపడుతున్న వారి యిండ్లకు వెళ్లి వారికోసం ప్రత్యేకముగా ప్రార్ధనను చేసేవారు.

కొద్ది కాములోనే కేసరపల్లిలోని కతోలిక సంఘస్తుందరు కూడా, తమ బాగోగుపట్ల ఆసక్తిగ పుణ్యాత్ముడైన జోసఫ్‌ తంబిగారు వారి గ్రామములో ఉండటంపట్ల మిక్కిలిగా సంతోషపడ్డారు. గ్రామస్తుందరికి కూడా జోసఫ్‌ తంబిగారంటే మిక్కిలిగా గౌరవం, ఇష్టం ఏర్పడినది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరు కూడా ఆయనను ఎంతగానో గౌరవించేవారు.

దేవాలయ ప్రాంగణమునకు ఎదురుగా ఒక బావి ఉండేది. ఆ బావికి ఎదురుగా, గ్రామ పెద్ద అయిన పుల్లెల్లి రాయప్పకు ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలములో భక్తిపరుడైన జోసఫ్‌ తంబిగారికి ఒక చిన్నపాటి పాకతో కూడిన ఇంటిని ఒకటి నిర్మించారు. ఆ ఇంటిలో నివాసము చేస్తూ రాత్రింబవళ్ళు ప్రార్ధనలో, ధ్యానములో గడిపేవారు. జోసఫ్‌ తంబిగారు తన యింటిలో రాత్రిళ్ళలో మోకాల్లూని ప్రార్ధించడం పుల్లెల్లి రాయప్ప వారు అనేక సార్లు గమనించారు.

పుల్లెల్లి రాయప్ప వారిది చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబముతో జోసఫ్‌ తంబిగారు చాలా సన్నిహితముగా ఉండేవారు. వారి ఇంటిలో తరుచుగా భుజించేవారు.

గ్రామస్థులతో కలిసి పొలాలలో పనికి వెళ్లి, తన జీవనోపాధిని కొనసాగించారు. ఇతర పనివారితో కుపుగోలుగా ఉండేవారు. ఈవిధముగా, త్వరలోనే తెలుగు భాషను నేర్చుకున్నారు. మాతంగి మరియన్న అను బాలుడు జోసఫ్‌ తంబిగారికి తెలుగు నేర్పించి యున్నాడు.

ప్రజలకు యేసు ప్రభువు గురించి, విశ్వాసము గురించి, ప్రార్ధన గురించి వారితో మాట్లాడటం ప్రారభించారు. సాయంత్రం వేళలో ప్రజలను గుడి వద్దకు పిలిచి ఆరంభములో వారికి జపమాలను ఎలా ప్రార్దించాలో నేర్పించారు. ఆ తరువాత ఒక్కొక్కరి యింటిలో జపమాలను ప్రార్ధించడం, ఆ కుటుంబము కొరకు ప్రార్ధన చేయడం చేసేవారు.

ఒక సహోదరునివలె, స్నేహితునివలె ప్రతీ యింటిని సందర్శిస్తూ, అనారోగ్యముతో బాధపడుతున్న వారికోసం ప్రార్ధన చేసేవారు. తనకు తెలిసిన నాటువైద్యం చేస్తూ తన శక్తివంతమైన మధ్యస్థ ప్రార్ధనద్వారా సకల వ్యాధులను, బాధలను నయం చేసేవారు. కేవలం క్రైస్తవులతో మాత్రమేగాక, హైందవ, ముస్లిం సోదరులతో కూడా మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.

కేసరపల్లి గ్రామము, అవుటపల్లి విచారణకు అనుసంధానమైన గ్రామము. అయినప్పటికిని ఆదివారాలలో కూడా దివ్యపూజాబలి ఉండేది కాదు. అప్పుడప్పుడు మాత్రమే దివ్యపూజాబలి ఉండేది.

కనుక, తరుచుగా, జోసఫ్‌ తంబిగారు విశ్వాసులను ప్రోగుచేసి దివ్యపూజాబలిలో పాల్గొనుటకు, ముఖ్యముగా ఆదివారములలోను, పండుగ రోజులలోను అవుటపల్లి విచారణ దేవాలయమునకు తీసుకొని వెళ్ళేవారు.

ఒకసారి జోసఫ్‌ తంబిగారు 40 మంది విశ్వాసులను కేసరపల్లి గ్రామము నుండి అవుటపల్లి విచారణకు తీసుకొని వచ్చారు. అంతమంది విశ్వాసులను చూసి, విచారణ గురువుతో పాటు, అవుటపల్లి గ్రామస్తులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆరోజు అందరు జోసఫ్‌ తంబిగారి గురించే మాట్లాడుకున్నారు.

జోసఫ్‌ తంబిగారు కేసరపల్లిలో ఉండగా జరిగిన కొన్ని అద్భుతాను గురించి తెలుసుకుందాం:

ఒకసారి గ్రామములోని చిన్న పిల్లలందరినీ చేరబిలిచి వారితో, ‘‘అనారోగ్యముతో బాధపడుతున్న వారందరికీ మందులు ఇచ్చి వారికి స్వస్థత చేయబోవుచున్నాను. కనుక ఈ విషయాన్ని గ్రామస్థుందరికి తెలియ జేయండి’’ అని చెప్పారు. అప్పుడు పిల్లలు అందరు కూడా గ్రామములో చాటింపు చేసారు. అది తెలుసుకోనిన గ్రామస్థులలో చాలామంది దేవాలయము వద్ద గుమిగూడారు.

జోసఫ్‌ తంబిగారు దేవాలయం గుమ్మం దగ్గర కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఒక బిందె నిండా నీళ్ళను పక్కన పెట్టుకున్నారు. దేవాలయ ఆవరణలో నున్న చెట్ల ఆకులను కోసి, నూరి, చిన్న చిన్న ముద్దలు చేసి ఒక పళ్ళెములో పెట్టుకున్నారు. ఒక్కొక్కరిని పిలచి నోట్లో ఒక మందు ముద్దను వేసి గొంతులో నీళ్ళుపోసి ప్రార్ధన చేసాడు. ఆ సమయములో పుల్లెల్లి రాయప్ప చిన్న కుమారుడు చలి జ్వరముతో బాధపడుతున్నందున అతని భార్య పిల్లవానిని జోసఫ్‌ తంబిగారి వద్దకు తీసుకొని వచ్చింది. జోసఫ్‌ తంబిగారు మందు ఇచ్చి, ప్రార్ధన చేయగా, ఆరోజునుండి ఆ బిడ్డ మంచి ఆరోగ్యముతో జీవించాడు.

పుల్లెల్లి రాయప్ప వారు తన ఏడు ఎకరాలలో చెరుకు పంట వేసారు. ఒకరోజు చెరుకు నరకడానికి కొంతమంది మనుష్యులను తీసుకొని వెళ్ళాడు. వారితో జోసఫ్‌ తంబిగారు కూడా వెళ్ళారు. అందరు చెరుకు నరకుతున్నారు. జోసఫ్‌ తంబిగారు కూడా పని చేయుచున్నారు. చెరుకు కొడుతూ ఉండగా, హఠాత్తుగా చెరుకు గెడను క్రింద పడేసి, ఆకాశంవైపు చూస్తూ దేవదూతమాట్లాడే పలుకులను శ్రద్ధగా ఆకిస్తూ అలాగే ఉండిపోయారు. ఏమైనదిఅని అడిగినప్పుడు, జోసఫ్‌ తంబిగారు, ‘‘నీ యింట్లో దొంగలు పడ్డారు. కోడిపెట్ట, రెండు మానికల బియ్యము దొంగతనం చేసారు అని దేవదూత నాతో చెప్పారు, కనుక నేను యింటికి వెళ్లి వస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయారు. జోసఫ్‌ తంబిగారికి దూత చెప్పినట్లుగనే అవే వస్తువులు దొంగిలింపబడ్డాయి. ఇది తెలుసుకున్న ప్రజలు నిజంగా ఇదిగొప్ప అద్భుతమని తలంచి దేవున్ని స్తుతించారు.

ఒకరోజు సాయంత్రం పుల్లెల్లి అంతోని, అతని స్నేహితుడు జోజప్ప అను పిల్లలిద్దరు దేవాలయము వద్ద ఆడుకొనుచుండగా, జోసఫ్‌ తంబిగారు వచ్చి, ‘‘అంతోని, జోజప్ప, నాతోపాటు వస్తారా? పెద్ద మర్రి చెట్టు వరకు నాతో రండి’’ అని అనగా, పిల్లలిద్దరు సంతోషముగా జోసఫ్‌ తంబిగారితో వెళ్ళారు. కేసరపల్లికి గన్నవరంకి మధ్యన ఒక పెద్ద మర్రిచెట్టు ఉన్నది. దాని సమీపములోనే కుష్ఠురోగుల ఆసుపత్రి  ఉన్నది.

ఒక కుష్ఠురోగి ఆ చెట్టుకింద కూర్చొని ఉండటం చూసారు. కప్పుకోవడానికి సరియైన దుస్తులు లేనందున, ఆ కుష్ఠురోగి చలికి బాగా వణికిపోతున్నాడు. జోసఫ్‌ తంబిగారు అతని దగ్గరకు వెళ్ళగా ఆ కుష్ఠురోగి జోసఫ్‌ తంబిగారి వంక దీనంగా చూసాడు. అప్పుడు జోసఫ్‌ తంబి తను కట్టుకున్న లుంగీని తీసి అతనిపై కప్పాడు. వెంటనే అద్భుత రీతిన ఇంకొక లుంగీ వచ్చి జోసఫ్‌ తంబిగారిని కప్పివేసింది. పిల్లలిద్దరు ఆశ్చర్యముతో జోసఫ్‌ తంబివైపు చూస్తూ అలాగే ఉండిపోయారు. వారు గమనించారని గ్రహించిన జోసఫ్‌ తంబిగారు వారిని అక్కడనుండి ఇంటికి వెళ్ళమని చెప్పారు. పిల్లలిద్దరు కూడా ఊరిలోకి వెళ్లి వారు చూసిన అద్భుతాన్ని అందరికి తెలియ జేశారు.

అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం! గన్నవరములో విమానాశ్రయం పనులు జరుగుచున్న రోజులు! సైనికులంతా ముమ్మరంగా పనులు చేయుచున్నారు. గ్రామ ప్రజలు చాలామంది, దేనికైనా ఉపయోగపడునని కొంత సిమెంటు తెచ్చుకొని యిండ్లలో దాచుకున్నారు. ఆ విషయం జోసఫ్‌ తంబిగారికి తెలియదు.

ఒక రోజు జోసఫ్‌ తంబిగారు, దేవాలయమువద్ద గుమికూడిన పిల్లలతో, ‘‘దేవాలయములో పీఠము వద్ద గోడ నిలువుగా పగిలియున్నది. దానికి మనం సిమెంటుతో మాసిక వేద్దాం. మీ యిండ్లలో ఎవరివద్దనైనా సిమెంటు ఉంటే తీసుకొని రండి’’ అని అడిగారు. మేం తెస్తాం, మేం తెస్తాంఅంటూ పిల్లలందరూ వెళ్ళారు. పుల్లెల్లి అంతోని అనే పిల్లవాడు కూడా ఇంటికి వెళ్లి, వాళ్ళ అమ్మను సిమెంటు ఇవ్వమని అడిగాడు. అందుకు వాళ్ళ అమ్మ, ‘సిమెంటు లేదు, ఏమి లేదుఅని చెప్పి పంపించి వేసింది. ఆ పిల్లవాడు జోసఫ్‌ తంబిగారి వద్దకు వచ్చి జరిగింది చెప్పాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు, ‘‘సిమెంటు మీ యింట్లో లేకపోవడం ఏమిటి! యింట్లోని కుండలో సిమెంటు ఉన్నది. నేను చెప్పాను అని చెప్పి తీసుకొని రా’’ అని చెప్పి తిరిగి పంపారు. పిల్లాడు మరల యింటికి వెళ్లి, ‘అమ్మా! ఎక్కడో కుండలో ఉన్నదంటా!అని చెప్పాడు. అందుకు వాళ్ళ అమ్మ, ‘నేను ఈ సాయంత్రమే సిమెంటు తెచ్చాను. ఈ విషయం జోసఫ్‌ తంబిగారికి ఎలా తెలుసు?’ అని అనుకుంటూ ఆశ్చర్యపోయింది.

క్రీ.శ. 1944వ సంవత్సరము. కేసరపల్లి వాస్తవ్యులు పుట్ల ఎలీషా కోడూరుపాడు అను గ్రామములో ఉపదేశిగా పనిచేయుచున్నారు. ఒక రోజు జోసఫ్‌ తంబిగారు అతని యింటికి వచ్చి, ‘‘కిష్టవరం అనే గ్రామానికి మనం వెళ్ళాలి’’ అని పిలిచారు. అందుకు ఉపదేశి, ‘నా భార్య జ్వరముతో బాధపడుచున్నది. నేను రాలేనుఅని అన్నాడు. జోసఫ్‌ తంబిగారు మౌనముగా అక్కడనుండి వెళ్ళిపోయారు. వెంటనే అతని భార్య జోసఫ్‌ తంబిగారికి తోడుగా వెళ్ళమని చెప్పినది. ఎలీషా పరుగు పరుగున వెళ్లి జోసఫ్‌ తంబిగారిని కలుసుకొని తోడుగా వెళ్ళాడు.

కిష్టాపురంలో పనిని ముగించుకొని రాత్రి 10 గంటకు అవుటపల్లి చేరుకున్నారు. మరుసటి రోజు ఎలీషా యింటికి వెళ్ళగా, అతని భార్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది. జ్వరం ఎప్పుడు తగ్గిందిఅని అడుగగా, ‘నీవు జోసఫ్‌ తంబిగారిని కలుసుకున్న క్షణముననే నాకు జ్వరం తగ్గిపోయిందిఅని సమాధానం చెప్పినది.

ఒకరోజు గర్భిణీ స్త్రీ అయిన కూరగంటి శౌరిగారి భార్య మరియు ఇట్ట అంజమ్మ అనువారు దేవాలయం వద్దకు రాగా, జోసఫ్‌ తంబిగారు అంజమ్మతో, ‘‘నీకు మగ బిడ్డ పుట్టును. ఆ బిడ్డకు జ్వాన్నేసుఅని పేరు పెట్టుము’’ అని చెప్పారు. జోసఫ్‌ తంబిగారు చెప్పినట్లుగనే, ఆమెకు మగ బిడ్డ జన్మించడం జరిగింది. ఆ బిడ్డకు జ్వాన్నేసుఅని పేరు పెట్టారు.

కూరగంటి శౌరిగారి బంధువు సౌశీల్యమ్మ వణుకూరు గ్రామములో ఉండేవారు. ఆమెకు వివాహమై చాలా సంవత్సరములు అయినను పిల్లలు పుట్టలేదు. ఎప్పుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఎన్నో తాయత్తులు కట్టుకుంటూ ఉండేది. జోసఫ్‌ తంబిగారు మంచి మందులు ఇస్తున్నారని తెలిసి, తాయత్తులు అన్ని ముందుగానే తీసివేసి, శౌరిగారు ఆమెను అవుటపల్లికి తీసుకొని వెళ్ళారు. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారికి పంచగాయాలు రావడం వలన వారు బయటనే వేచియున్నారు.

ఒక అర గంట తరువాత వారిని పిలిచి వచ్చిన విషయం ఏమిటో కనుక్కున్నారు. విషయం తెలుసుకొని, ‘‘ఇకనుండి తాయత్తులు కట్టవద్దు’’ అని సౌశీల్యమ్మతో చెప్పియున్నారు. నూనెను ఆశీర్వదించి తలకు రాసుకొమ్మని చెప్పారు. అదే సమయములో మరియమ్మ అనే స్త్రీ కూడా కడుపు నొప్పితో అక్కడికి వచ్చింది. ఆమెకుకూడా ఆశీర్వదింపబడిన నూనెను ఇచ్చారు. తరువాత వారిరువురికి పిల్లలు పుట్టారు.

అది క్రీ.శ. 1940వ సంవత్సరం. వేసవికాలములో జోసఫ్‌ తంబిగారు కేసరపల్లి గ్రామమును సందర్శించినప్పుడు పావులూరి జోస్ఫీనమ్మతో పాటు పదిమంది దేవాలయము వద్ద కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు తాగడానికి పాలు తెచ్చి జోసఫ్‌ తంబిగారికి ఇచ్చారు. అయితే చెక్కరగాని, బెల్లంగాని కలుపలేదు. జోసఫ్‌ తంబిగారు జోస్ఫీనమ్మతో, ‘‘అమ్మా! మీ యింటిలో ఉన్న బెల్లమును కొంచెం తీసుకు వస్తావా?’’ అని అడిగాడు. మా యింటిలో బెల్లం లేదుఅని సమాధానం చెప్పింది. మరల జోసఫ్‌ తంబిగారు ఆమెతో కొంచెం బిగ్గరగా,‘‘మీ యింటిలో ఉన్న రెండవ అరలోని డబ్బాలో బెల్లం ఉంది. వెళ్లి తీసుకొనిరా’’ అని చెప్పారు. జోస్ఫీనమ్మ ఆశ్చర్యపోయింది. అక్కడ ఉన్నవారందరు, ‘ఒకసారి వెళ్లి చూడుఅని చెప్పారు. జోస్ఫీనమ్మ వెళ్లి చూడగా జోసఫ్‌ తంబిగారు చెప్పిన విధముగనే అక్కడ బెల్లం ఉన్నది. ఆమెకు నోట మాట రాలేదు. బెల్లం తెచ్చి జోసఫ్‌ తంబిగారికి ఇచ్చింది.

ఇలాంటి అద్భుతాలు జోసఫ్‌ తంబిగారు ఎన్నో చేశారు.

No comments:

Post a Comment