Saturday, June 20, 2020

పంచగాయాలు

అధ్యాయము 13
పంచగాయాలు

జోసఫ్‌ తంబిగారు తరుచుగా క్రీస్తు ప్రభువు పొందిన పంచ గాయాలను పొందేవారు. ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు తమ సాక్ష్యాలను ఇచ్చియున్నారు. ఇప్పటికే, పై పీజీలలో జోసఫ్‌ తంబిగారి పంచగాయాల గురించి చదివి యున్నాము. ఇచ్చట జోసఫ్‌ తంబిగారి పంచగాయాల గూర్చిన మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

అది శుక్రవారము. మధ్యాహ్న సమయము. గురుశ్రీ విన్సెంజో పగానో వారు అవుటపల్లి విచారణకు సహాయక గురువులుగా బదిలీ అయిన రోజు! తనకు ఇవ్వబడిన పెద్ద గదిలో కూర్చుని ఏదో చదువు కుంటున్నారు. ఈ గది దేవాలయానికి వెనుకనే ఉంటుంది. అప్పుడు దేవాలయపు తలుపు మెల్లగా తెరుచు కున్నాయి. జోసఫ్‌ తంబిగారిని అదే మొదటిసారి విన్సెంజో గురువులు చూడటం. జోసఫ్‌ తంబిగారు చాలా బాధను అనుభవిస్తున్నట్లుగా కనిపించారు. అతనికున్న కురుచ తల వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి. శరీరము కృంగిపోతున్నది. సరిగా నడవలేక పోతున్నారు.

‘ఇతను ఎవరు! ఈ సమయములో ఇక్కడ ఎందుకు ఉన్నారు!అని విన్సెంజో గురువులు ఆశ్చర్య పోయారు. విన్సెంజో గురువులు గమనించగా, జోసఫ్‌ తంబిగారి చేతులు, కాళ్ళు, రొమ్ముపై రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏమి జరిగింది?’ అని విన్సెంజో గురువులు జోసఫ్‌ తంబిగారిని అడుగగా, ‘‘ఏదో జబ్బు చేసింది స్వామీ! దయచేసి ఇక్కడ కడుక్కోనివ్వండి’’ అని అన్నారు. అందుకు విన్సెంజో గురువు, ‘బ్లేడులతో, మేకులతో జాగ్రత్తగా ఉండాని తెలియదా!అని గద్దిస్తూనే, ఏదో ప్రత్యేకత ఉన్నదని మనసులో అనుకుంటూ, తన గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. చేతులమీద నీళ్ళు పోస్తూ ఉండగా, బాధ విపరీతమయ్యే సరికి నీళ్ళు పోయడం ఆపి వేసారు. కొన్ని నిమిషాల తరువాత, హఠాత్తుగా, జోసఫ్‌ తంబిగారి ముఖము తేజోవంత మవ్వగా, చిరునవ్వుతో, ‘‘జబ్బు తగ్గిపోయింది’’ అని అంటూ వేగముగా కాళ్ళు చేతులు కడుగు కున్నారు. అంతకుముందు విన్సెంజో గురువులు గమనించిన అంగుళం లోతు గాయాలు మచ్చుకైనా కనిపించలేదు.

“ప్రతీ శుక్రవారము మధ్యాహ్నము మూడు గంట సమయములో, ఈ జబ్బు వస్తుంది, ఒక గంటపాటు ఉంటుందిఅని జోసఫ్‌ తంబిగారు విన్సెంజో గురువులతో విశ్వసనీయముగా చెప్పియున్నారు. ఇదేదో వింతగా ఉన్నదని, మరుసటిసారి వచ్చినప్పుడు, ఎలాంటి భ్రమకు లోనుకాకుండా, నిశితముగా గమనించాలని, కొంత దూదిని సిద్ధము చేసుకొని పెట్టుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. విన్సెంజో గురువులు దూదితో జోసఫ్‌ తంబిగారు పొందిన పంచ గాయాలనుండి కారుతున్న రక్తాన్ని తుడిచాడు. దూది అంతా రక్తముతో తడిసి ముద్ధైపోయింది.

అప్పటినుండి విన్సెంజో గురువులు జోసఫ్‌ తంబిగారి పాపసంకీర్తనమును వింటూ ఉండేవారు. ఒకరోజు జోసఫ్‌ తంబిగారు విన్సెంజో గురువుల వద్దకు వచ్చి, ‘‘ఈ గాయాలు రాకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి?’’ అని అడిగారు. అందుకు, ‘అసు ఈ గాయాలు సరిగా ఎప్పుడు వస్తున్నాయి?’ అని తిరిగి ప్రశ్నించారు. అందుకు జోసఫ్‌ తంబిగారు, ‘‘శుక్రవారమున, క్రీస్తు పంచగాయాల ప్రార్ధన చేసిన తరువాత వస్తున్నాయి’’ అని చెప్పగా, ‘అయితే, ఆ ప్రార్ధనను చెప్పడం మానివేసి, ఈ బాధనుండి తప్పించమని దేవునికి ప్రార్ధన చేయిఅని విన్సెంజో గురువులు సలహా ఇచ్చారు.

క్రీస్తు పంచగాయాల ప్రార్ధనను జపించడం మానివేసినను, జోసఫ్‌ తంబిగారు ప్రతీ శుక్రవారం పంచ గాయాలను పొందాడు. ఈ పంచ గాయాల వలన జోసఫ్‌ తంబిగారు కొంచెం ఇబ్బంది పడేవారు, ఎందుకంటే, వీటి వలన, గ్రామాలకు వెళ్ళలేక పోతున్నాననే అసంతృప్తి కలిగి ఉండేవారు. అలాగే ప్రజలు చూస్తారేమోనని కూడా ఎంతగానో భయపడే వారు.

పెద్ద శుక్రవారాలలో రోజంతా తలుపులు మూసుకొని గదిలోనే ఉండేవారు. ఆ రోజంతా, మన రక్షకుడగు క్రీస్తుతో తాను ఎంత వేదనను అనుభవించినది తండ్రి దేవునకు మాత్రమే తెలుసు!

ప్రతీ సంవత్సరము అవుటపల్లి విచారణలో స్థానిక ఉత్సవాలను జరిపేవారు. పాపసంకీర్తనలు’ వినడానికి, పండుగలో సహాయం చేయడానికి విచారణ గురువులు ఇతర గురువులను పిలుస్తూ ఉండేవారు.

ఆ సంవత్సరము పండుగ గురువారము. గురుశ్రీ కల్దెరారో వారు ఏలూరు నుండి గురుశ్రీ అంద్రేయ వారిని, వట్లూరు నుండి గురుశ్రీ జార్జి కుడిలింగల్‌ వారిని, దెందులూరు నుండి గురుశ్రీ జోసఫ్‌ పన్నికోట్‌ వారిని ఆహ్వానించారు. వీరందరు కూడా ముందురోజే అవుటపల్లికి చేరుకున్నారు. వీరితో పాటు గుణదలలో బిషప్‌ గ్రాసి స్కూల్‌ స్థాపకులు అయిన గురుశ్రీ అర్లాటి వారుకూడా ఉన్నారు. దెందులూరు నుండి వచ్చిన జోసఫ్‌ పన్నికోట్‌ వారు అప్పటివరకు జోసఫ్‌ తంబిగారిని చూడలేదు. అతని గురించి, అతను పొందే పంచ గాయాల గురించి అనేక సార్లు విని యున్నారు. గురువారం జరిగే పండుగను చూసికొని మరుసటి రోజు శుక్రవారము ఉండి, జోసఫ్‌ తంబిగారి పంచ గాయాలను చూడాలనే ఉద్దేశ్యముతో అక్కడికి వచ్చియున్నారు.

పండుగ రోజు సాయంత్రం దివ్యబలి పూజ అనంతరం ప్రదక్షిణ జరిగింది. సాయంత్రం ప్రారంభమైన ప్రదక్షిణ శుక్రవారం ఉదయం రెండుగంటల వరకు కొనసాగింది. ప్రదక్షిణ పూర్తవగానే జార్జి కుడిలింగల్‌, జోసఫ్‌ పన్నికోట్‌ గురువులు నిద్రించుటకు వెళ్ళిపోయారు. కల్దెరారో మరియు అర్లాటి గురువులు తెల్లవారు ఝామున దివ్యపూజను ముగించుకొని పడుకోవాలని తలంచారు. ఉదయం నాలుగు గంటల తరువాత అర్లాటి గురువు దివ్యపూజా బలిని సమర్పించారు. ఆ పూజలో జోసఫ్‌ తంబిగారు కూడా పాల్గొన్నారు.

దివ్యసత్ప్రసాదము తీసుకోవడానికి వచ్చినప్పుడు, జోసఫ్‌ తంబిగారి నొసటి నుండి రక్తం కారడం అర్లాటి గురువులు కళ్ళారా చూసారు. పూజానంతరం, జోసఫ్‌ తంబిగారి కొరకు వెదికారు. జోసఫ్‌ తంబిగారు గదిలో తలుపు వేసుకొని ఉన్నారు. పిలువగా తలుపు తీసారు. గురువు లోపలికి ప్రవేశించగనే, ప్రజలు వస్తారేమోనని, వెమ్మటే తలుపు వేసారు. అర్లాటి గురువులు జోసఫ్‌ తంబిగారి పంచ గాయాలను ప్రత్యక్షముగా చూసారు.

ఈ విషయాన్ని జోసఫ్‌ పన్నికోట్‌ గురువులకు చెప్పి వెళ్లి చూడమన్నారు. జోసఫ్‌ పన్నికోట్‌ గురువు లోపలికే రాగానే, జోసఫ్‌ తంబిగారు మంచంమీద కూర్చొమ్మని చెప్పారు. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారు, ఎవరుకూడా భరించలేనటువంటి విపరీతమైన బాధను అనుభవిస్తున్నారు. చేతునుండి, కాళ్ళనుండి, ప్రక్కనుండి రక్తము కారుతూ ఉన్నది. దాదాపు ఒక గంట సేపు జోసఫ్‌ పన్నికోట్‌ గురువు అచ్చట ఉన్నారు.

ఆ తరువాత జోసఫ్‌ పన్నికోట్‌ గురువు దివ్యపూజా బలిని అర్పించి, విచారణ గురువు కల్దెరారో వారితో కలిసి అల్పాహారము తీసుకున్న తరువాత, జోసఫ్‌ పన్నికోట్‌ గురువు, మరోసారు జోసఫ్‌ తంబిగారి గదిలోనికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే జోసఫ్‌ తంబిగారు, “స్వామి, ఇది సాతాను నుండా లేక దేవుని నుండా?” అని ప్రశ్నించారు. అందుకు జోసఫ్‌ పన్నికోట్‌ గురువులు, ‘నీవే ఆ బాధను అనుభవిస్తున్నావు కనుక, నీకే బాగా తెలిసి ఉండాలిఅని సమాధానం చెప్పారు. ఇలా ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత జోసఫ్‌ తంబిగారు, “ఇప్పుడు కొంచెం పరువాలేదు” అని చెప్పారు. పంచగాయాలు పోయిన వెంటనే, చాలా చురుకుగా కనిపించారు. పంచ గాయాల గుర్తుకూడా ఏమీ కనిపించలేదు. రక్తపు మరకు మాత్రమే కనిపించాయి.

ఈవిధముగా, జోసఫ్‌ తంబిగారు ప్రతీ శుక్రవారము పంచ గాయాలను పొందేవారు.

No comments:

Post a Comment