Thursday, June 18, 2020

తక్షణ గమన వరము

అధ్యాయము 14
తక్షణ గమన వరము

తక్షణ గమనముఅనగా ఒకచోటనున్న వ్యక్తి క్షణములో ఇంకొక చోట ప్రత్యక్షం కావడం! ఇలాంటి గొప్ప దైవ వరాన్ని జోసఫ్‌ తంబిగారు కలిగి ఉండటం అనేకమంది సాక్ష్యమిచ్చారు.

గురుశ్రీ జార్జి కుడిలింగల్‌, వట్లూరు విచారణ గురువు, టీచర్ల మీటింగునకు విచారణ గురువు ఆహ్వానం మేరకు ప్రతీ నెల అవుటపల్లి గ్రామమునకు వచ్చే వారు. సాధారణముగా, టీచర్ల పాపసంకీర్తనాలు వినుటకు వచ్చేవారు. అలా వచ్చినప్పుడల్లా, అవుటపల్లిలో జోసఫ్‌ తంబిగారిని కలిసి మాట్లాడేవారు.

అలా ఒకసారి అవుటపల్లికి వచ్చినప్పుడు, వట్లూరు గ్రామమును సందర్శింప వసినదిగా జోసఫ్‌ తంబిగారిని ఆహ్వానించారు. అది శుక్రవారము. జోసఫ్‌ తంబిగారు ప్రతీ శుక్రవారము పంచ గాయాలను పొందేవారు. జార్జి కుడిలింగల్‌ వారు ప్రత్యక్షముగా చూసియున్నారు. అందుకే జోసఫ్‌ తంబిగారు, ‘‘తప్పకుండా వస్తాను, కాని ఈరోజు రాలేను. ఇంకొక రోజు వస్తాను’’ అని సమాధానమిచ్చారు.

జార్జి కుడిలింగల్‌ వారు వట్లూరుకు పయనమై వెళ్ళిపోయారు. ఉదయం 10.30 గంటకు రైలుబండి ఎక్కి 11.30 గంటలకు వట్లూరు చేరుకున్నారు. వట్లూరులో దిగగానే పనిమనిషి సైకిలుతో వేచియున్నాడు. జార్జి కుడిలింగల్‌ వారు సైకిలుమీద విచారణ గురు నిలయానికి వెళ్ళాడు.

ఆశ్చర్యం, అద్భుతం! అప్పటికే జోసఫ్‌ తంబిగారు వట్లూరు విచారణకు చేరుకొని పూజా సామాను గది తలుపు వద్ద కూర్చొని యున్నారు. గురువు కూడా ఆశ్చర్యపోయారు! ఇంత త్వరగా ఎలా రాగాలిగాడో ఎంతమాత్రం అర్ధం కాలేదు!

వెంటనే, జోసఫ్‌ తంబిగారిని పకరించకుండా, స్కూలు వద్దకు పరుగెత్తుకొని వెళ్లి జోసఫ్‌ తంబిగారు ఇక్కడకు ఎప్పుడు వచ్చారని హెడ్‌ మాష్టారును ఆరా తీయగా, ‘అరగంట క్రితం నుంచి ఇక్కడే ఉన్నారుఅని చెప్పాడు.

జార్జి కుడిలింగల్‌ వారు, ‘బ్రదర్‌ గారూ! ఈరోజు మీరు రాలేను అన్నారు. మరొక రోజు వస్తానని అన్నారు. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగారు? మేము ఎక్కిన రైలు తప్ప మరొక రైలులేదు. ఒకవేళ అదే రైలులో వచ్చిన, స్టేషన్‌ నుండి రావడానికి సమయం పడుతుంది. నీ వద్ద సైకిలు లాంటి వాహనం ఏదీ లేదు కదా! ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పుఅని ఎంతో ఆతృతతో అడిగారు. జోసఫ్‌ తంబిగారు కన్నీటి పర్యంతమై, ‘‘ఈ విషయాన్ని ఎవరికీ చెప్పనంటే మీకొక రహస్యాన్ని చెబుతాను. అదేమిటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళానుకున్నప్పుడు ఒక అదృశ్య హస్తం నా వీపు తట్టి నేను చేరవసిన చోటుకు క్షణములో చేరుస్తుంది’’ అని చెప్పారు. అది వినిన జార్జి కుడిలింగల్‌ వారు నిర్ఘాంతపోయారు.

ఇంకొక సందర్భములో, జార్జి గురువులు గుణదల వెళ్ళుటకు సిద్ధమయ్యారు. జోసఫ్‌ తంబిగారు, ‘‘నేను కూడా మీతో వస్తాను. నాకు కూడా విజయవాడలో పని ఉంది’’ అని అన్నారు. అందుకు జార్జి గురువులు ససేమిరా ఒప్పుకొనలేదు. వెమ్మటే మోటారు సైకిలు మీద గుణదలకు వెళ్లి పోయారు. జార్జి గురువులు గుణదల వెళ్లే సరికి జోసఫ్‌ తంబిగారు గుణదల దేవాలయములో ప్రార్ధన చేస్తూ ఉన్నారు. ‘ఎప్పుడు వచ్చావు?’ అని అడుగగా, “నన్ను నీవు తీసుకొని రాలేదు కదా. నేను దేవుని సహాయముతో ఇక్కడికి వచ్చాను” అని సమాధానం ఇచ్చారు.

No comments:

Post a Comment