Tuesday, June 16, 2020

జోసఫ్ తంబి గారి వ్యక్తిత్వము

అధ్యాయము 15
జోసఫ్ తంబి గారి వ్యక్తిత్వము

ప్రార్ధనాపరుడు
జోసఫ్‌ తంబిగారి జీవిత మంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్ధనకు ప్రతిరూపంఅని చెప్పవచ్చు. అనేకమంది సాక్షుల కథనాలను పరిశీలించినప్పుడు, అతని జీవితమంతా ప్రార్ధనా పూరితమైనదని చెప్పగలము.

జోసఫ్‌ తంబిగారికి అత్యంత యిష్టమైన ప్రార్ధనలో ఒకటి జపమాల. రోజుకు ఎన్నోమార్లు జపమాలను జపించే వారు. అతడు స్వయముగా వాడినట్టి జపమాలను పరిశీలించగా వాటి పూసలు అరిగిపోయి యుండుటను బట్టి, జోసఫ్‌ తంబిగారు జపమాలను ఎంతగా ప్రేమించే వారో అర్ధం చేసుకోవచ్చు. తను ప్రార్ధించుటయేగాక, అనేకమందిని జపమాల ప్రార్ధన చేయుటకు ప్రోత్సహించేవారు.

జోసఫ్‌ తంబిగారు ఎక్కడికి వెళ్ళినా కూడా అతని ప్రాధాన్యమైన ప్రేషిత కార్యం ప్రజలను ప్రార్ధనలో నడిపించుటయే. వీయిన చోట, అనగా దేవాలయము నందు, వీలు కానప్పుడు వివిధ గృహములందును ప్రార్ధనా కూటములను ఏర్పాటు చేసేవారు. తానే స్వయముగా ప్రార్ధనలను నడిపించే వారు. ఇటువంటి సామూహిక ప్రార్ధనతో పాటు, జోసఫ్‌ తంబిగారు గంటల తరబడి వ్యక్తిగత ఏకాంత ప్రార్ధనలో గడిపేవారు. దీనికి ఒక ఉదాహరణగా క్రింది విషయం చెప్పవచ్చు.
బోయపాటి క్లారమ్మగారి తమ్ముడు వెంకట సుబ్బయ్యగారి అల్లుడు అయిన గుత్తికొండ డోమినిక్‌ గారు, జోసఫ్‌ తంబిగారితో చాలా సన్నిహితముగా ఉండేవారు. వారు చాలాసార్లు మానికొండ నుండి అవుటపల్లికి వచ్చి, జోసఫ్‌ తంబిగారిని కలిసి వారితోనే బస చేసేవారు. బోయపాటి క్లారమ్మగారి ఇంకొక తమ్ముడు వేమూరి పరంధామయ్య గారు కూడా అనేకసార్లు జోసఫ్‌ తంబిగారి గదిలోనే బస చేసేవారు. అర్ధరాత్రి సమయములో లేచి చూస్తే జోసఫ్‌ తంబిగారు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్ధిస్తూ కనిపించే వారు. చాలా రాత్రులు జోసఫ్‌ తంబిగారు ఒక గంట మాత్రమే పడుకునే వారని తెలియు చున్నది. బోయపాటి వారి యింటిలో, జోసఫ్‌ తంబిగారును, క్లారమ్మ గారును కలిసి దివారాత్రలు ప్రార్ధించే వారని స్వయముగా క్లారమ్మగారే చెప్పినట్లు వారి కుమారుడు బోయపాటి బాలస్వామిగారు సాక్ష్యమిచ్చు చున్నారు. జోసఫ్‌ తంబిగారి జీవిత విధానమును గురించి క్లారమ్మగారు తన కూతురితో చెబుతూ ఉండేవారు.

జోసఫ్‌ తంబిగారితో అత్యంత సన్నిహితముగా మెలిగిన మరియొక అదృష్టవంతుడు, తెగతోటి ప్రభుదాసు గారు. జోసఫ్‌ తంబిగారు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రభుదాసు విద్యాభ్యాసమునకు అవసరమైన నిధులను సమకూర్చారు. కావసిన పుస్తకాలు, ఇతర సామాగ్రిని సమకూర్చే వారు. సెలవు దినాలలో అతను, జోసఫ్‌ తంబిగారి యింట్లోనే గడుపుచూ, యింటిపని, వంటపని చేస్తూ ఉండేవారు. ప్రభుదాసు గారికి ప్రార్ధించడం నేర్పినది జోసఫ్‌ తంబిగారే.

అనేక అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రభుదాసు గారి సాక్ష్యం ప్రకారం, జోసఫ్‌ తంబిగారు ఎప్పుడుకూడా ప్రార్దిస్తూనే కనిపించే వారు. అతని వద్దకు తండోపతండాలుగా వచ్చు రోగులను స్వస్థ పరచుటకు, ఆకలిగొన్న వారికి భోజనము పెట్టుటకు, ప్రార్ధనా శక్తితోనే చేసేవారు.

ఒకరోజు జోసఫ్‌ తంబిగారు, ప్రభుదాసు కలిసి మచిలీపట్నం సముద్ర తీరానికి వెళ్ళారు. అచ్చట జోసఫ్‌ తంబిగారు యిసుకపై మోకరించి చాలాసేపు ప్రార్ధించు చుండగా, వారిని అలానే చూస్తూ ఉన్న ప్రభుదాసు నిద్రలోనికి జారుకున్నాడు. మధ్యలో లేచి చూడగా, జోసఫ్‌ తంబిగారి ముఖము తేజో వంతముగా వెలుగొందు చున్నట్లు గమనించాడు. అది తెల్లవారు జాము రెండుగంట వేళ! ప్రభుదాసు భయపడి ఆ దివ్య వెలుగును అలాగే చూస్తూ, ‘తంబిగారా! నాకు భయం వేస్తుందిఅని అనగానే, జోసఫ్‌ తంబిగారు తన వద్దనున్న జపమాలను ప్రభుదాసు మెడలో వేసి, ‘‘భయపడకు! నేను నీకోసం ప్రార్ధిస్తున్నాను. వెళ్లి పడుకో’’ అని చెప్పగా ప్రభుదాసు మరల నిద్రపోయాడు.

దీనిని బట్టి జోసఫ్‌ తంబిగారు గంటల తరబడి నిరంత రాయంగా ప్రార్ధించేవారు. ఆయన జీవితమే ఒక ప్రార్ధన. జోసఫ్‌ తంబిగారు మరణావస్థలో నున్నప్పుడు
, ప్రభుదాసుతో, ‘‘భయపడకు! నాకోసం ఎ్లప్పుడు ప్రార్ధించు. నీవు ప్రార్ధనలో ఉన్నప్పుడు ఏది అడిగిన అది నీకు సమకూరుస్తాను’’ అని చెప్పారు. తనకోసం ప్రార్ధించమని కోరుతూనే, యితరుకోసం ప్రార్ధించే జోసఫ్‌ తంబిగారు మనందరికీ ఆదర్శం.

ధార్మికుడు

జోసఫ్‌ తంబిగారు గొప్ప ధార్మికుడు. ఆ విషయం జోసఫ్‌ తంబిగారు అవుటపల్లికి రాకముందే మణత్తిడల్‌గ్రామములో ఆయన చేసిన సేవలో మనకి రూఢీ అగుచున్నది. పరిశుద్ధ గ్రంథములోని క్రింది పలుకులు అక్షరాలా నిజం చేసారు జోసఫ్‌ తంబిగారు.

“ప్రభువు ఆత్మ నాపై యున్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చేరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ జేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను” (యెషయ 61:1-2, లూకా 4:18-19).

ఆత్మచే నడిపించ బడిన జోసఫ్‌ తంబిగారు మణత్తిడల్‌గ్రామము నందు పేదవారైన ఆటవిక తెగకు చెందిన గిరిజనుల అవసరాను గుర్తించారు. వారి కొరకు ప్రార్ధించుటతో పాటు, వారికి కావసిన ఆహార పదార్ధములను, కట్టుకొనుటకు తగిన వస్త్రములను సమకూర్చేవారు. అందు నిమిత్తము, జోసఫ్‌ తంబిగారు భిక్షమెత్తుటకు  ఏనాడు వెనుకాడ లేదు. తాను చేసే సేవా కార్యక్రమాలతో అతనెప్పుడూ సంతృప్తి చెందేవారు కారు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదన్న సత్యమును ఎప్పుడూ గుర్తెరిగి అహర్నిశలు ఎదుటి వారి సంతోషమును కోరుకొనుచు వారికి కావలసిన నిత్యావసరములను సమకూర్చుట కొరకు నిరంత రాయముగా శ్రమించేవారు.

పచ్చమలైలో సేవచేయు సందర్భములో వారికి తగిన బట్టలు గాని, పౌష్టికాహారము గాని లేవని గ్రహించిన జోసఫ్‌ తంబిగారు, పాండిచ్చేరి నగర వీధులలో తిరుగుచూ పచ్చమలైప్రజలకోసం పండ్లు, ఫలహారాలు, పిల్లలకు బట్టలు, ముఖ్యంగా స్త్రీలకోసం రవికలు జమచేసి వాటిని పంచే వారు. డబ్బు కూడా పంచే వారు.

ఒకానొక రోజు గురువుకు వంట చేసే శౌరిగారు, జోసఫ్‌ తంబి గారింట్లో చిందర వందరగా పడేసిన డబ్బుల కట్టలను చూసి, ‘ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎక్కడ నుండి వచ్చింది?’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానముగా జోసఫ్‌ తంబిగారు, ‘‘మా బంధువులు పంపించారు’’ అని చెప్పారు. మరి ఈ డబ్బు ఏమి చేస్తావు?’ అని అడుగగా, ‘‘అవసరమున్న వారికి పంచిపెడతాను’’ అని అన్నారు. అన్నట్లుగానే, రెండు రోజుల్లో డబ్బంతా పంచిపెట్టివట్టిచేతులతో తిరిగి వచ్చి శౌరి గారిని భోజనం పెట్టమని అడుగగా, ‘నీ దగ్గరున్న డబ్బంతా ఏం చేసావు?’ అని అడుగగా, ‘‘పేదలకు పంచాను’’ అని చెప్పారు.

జోసఫ్‌ తంబిగారి ధార్మిక గుణం తెలియ జేసే ఒక ముఖ్య ఘటన అవుటపల్లిలో చాలాసార్లు చోటు చేసుకుంది. అదియే, ఆకలితో తన వద్దకు వచ్చిన వారందరికి జోసఫ్‌ తంబిగారు భోజనం వడ్డించేవారు. తన యింట్లో ఒకరిద్దరికి మాత్రమే సరిపడ వండుకునే మట్టి పాత్రలే ఉండేవి. తన భోజనం తనే వండుకునే వారు.

సెలవు దినాలలో తను చదివిస్తున్న తెలగతోటి ప్రభుదాసు వంట చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా చాలా మంది ప్రజలు జోసఫ్‌ తంబిగారిని కలవడానికి మానికొండ గ్రామము నుండి వచ్చారు. వారందరికీ భోజనం పెట్టమని చెప్పారు. తంబిగారా! గిన్నెలో ఒకరికి సరిపెడ అన్నం మాత్రమే ఉందిఅని ప్రభుదాసు చెప్పాడు. ‘‘భయపడకు. దేవుడు చూసుకుంటాడు’’ అని పలుకుతూ వచ్చిన వారందరికీ తృప్తిగా భోజనం పెట్టారు జోసఫ్‌ తంబిగారు. ప్రభుదాసు, వంటశౌరి జోసఫ్‌ తంబిగారికి సహాయం చేసారు. అందరు తృప్తిగా తిన్న తరువాత, కుతూహలం కొద్ది ప్రభుదాసు భోజన పాత్రను చూడగా, అందరికి భోజనం పెట్టక ముందు, ఎంత అన్నం ఉన్నదో అంతే మిగిలి ఉన్నది. ఇటువంటి సంఘటనలు అనేకసార్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియ జేశారు. వండిన కొద్దిపాటి ఆహారమును సంవృద్ది పరచడం గొప్ప అద్భుతం అయితే, ఆకలిగొన్న వారిని ఆదుకోవాలన్న అతని తలంపు అతని గొప్ప ధార్మిక మనస్సును తెలియ జేస్తున్నది.

ఒకసారి జోసఫ్‌ తంబిగారు మానికొండకు వెళ్ళినప్పుడు, అచ్చటి భక్తులు ఒక జత క్రొత్త బట్టలను అతనికి కానుకగా ఇవ్వగా, అవి వేసుకొని, జోసఫ్‌ తంబిగారు అవుటపల్లికి రాగా, గురు నిలయము వద్ద కూర్చున్న ఒక భిక్షగాన్ని చూసి, అతని దగ్గరకు వెళ్లి, ‘‘నీవు వేసుకున్న బట్టలు నాకిస్తావా? అని అడిగారు. అలా ఎందుకు అడిగారో అర్ధంకాని ఆ పేదవాడు యివ్వనన్నాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు తాను వేసుకున్న కొత్త బట్టలను తీసివేసి, ప్రక్కనపెట్టి, పేదవాని బట్టలు విప్పి, ఆ చింపిరి బట్టలను తను వేసుకొని, తన బట్టలను ఆ పేదవానికి తొడిగాడు. తన సుఖం కంటే, యితరుల మేలునే ఎక్కువగా ప్రేమిస్తూ వారి అభ్యున్నతికి పాటు బడిన గొప్ప ధార్మికుడు జోసఫ్‌ తంబిగారు.

అన్ని దానముకన్న విద్యాదానం మిన్నఅని అంటారు. జోసఫ్‌ తంబిగారు ఈ విషయాన్ని గ్రహించి చిన్న పిల్లల చదువుల యెడల ఎక్కువ శ్రద్ధ చూపేవారు. మానికొండకు చెందిన తెలగతోటి ప్రభుదాసు ఈ విషయములో అదృష్టవంతుడు. ఎందుకంటే, జోసఫ్‌ తంబిగారి చేత ప్రత్యేకముగా ఎన్నుకొనబడి వారి సహాయముతో చదువుకున్నాడు గనుక. జోసఫ్‌ తంబిగారు మానికొండకు వెళ్ళినప్పుడెల్ల, ప్రభుదాసు గారి విద్యాభ్యాసం కొరకు కావసిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, యితర వస్తువులను సమకూర్చే వారు. సెలవు దినాలలో ప్రభుదాసు ఎక్కువగా జోసఫ్‌ తంబిగారి వద్దనే ఉండేవారు. జోసఫ్‌ తంబిగారు ప్రభుదాసును మాత్రమేగాక, యింకా చాలా మంది పిల్లలకు ముఖ్యముగా అనాధ పిల్లలకు విధ్యాభ్యాస అవసరమును సమకూరుస్తుండేవారు.

జోసఫ్‌ తంబిగారి ఉదార స్వభావానికి మరొక ప్రత్యక్ష సాక్షి అవుటపల్లి వాస్తవ్యులు నిమ్మగడ్డ అంతోనివారు. ఒకరోజు అంతోని వారి యింట్లో లాంతరు వెలిగించుటకు కిరోసిన్‌ అయిపొయింది. దీపం వెలిగించలేని పరిస్థితి. ఆరోజు సాయంత్రము అంతోని గారు జోసఫ్‌ తంబిగారి యింటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే జోసఫ్‌ తంబిగారు, ఇంటికి వెళ్లి లాంతరును తీసుకొని రమ్మన్నాడు. అంతోనిగారు లాంతరును తీసుకొని రాగా, తన యింట్లో నున్న లాంతరులోని కిరోసిన్‌ను అంతోనిగారి లాంతరులో నింపి యిచ్చాడు.

పవిత్ర గ్రంథములోని అంతిమ తీర్పును గురించిన సన్నివేశము (మత్తయి 25), జోసఫ్‌ తంబిగారిని ముందుకు నడిపించింది. “నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారమిచ్చితిరి. దప్పిక గొనినప్పుడు దాహము తీర్చితిరి. వస్త్రహీనుడై యున్నప్పుడు వస్త్రమునిచ్చితిరి. చెరసాలలో ఉన్నప్పుడు దర్శింప వచ్చితిరి. రోగినై యున్నప్పుడు నన్ను పరామర్శించితిరి’’ అని ప్రభువు పలికిన వాక్కు ననుసరించి జోసఫ్‌ తంబిగారు ఆకలి గొన్నవారికి ఆహారం పెట్టారు. దప్పిక గొన్నవారికి దాహం తీర్చారు. వస్త్రహీనులకు వస్త్రము నిచ్చారు. రోగులను పరామర్శించుటయే గాక వారికి స్వస్థత చేకూర్చారు.

జోసఫ్‌ తంబిగారి సేవకు ఎవరూ అనర్హు కారు. ఆయనకు కుల
, మత, జాతి భాషాభేదాలేమీ లేకుండా, ఆపదలోనున్న వారు ఎవరు అడిగినా, కాదు, లేదు అనకుండా అన్నీ చేసేవారు.

జోసఫ్‌ తంబిగారి ఉదార గుణానికి మకుటాయ మానంగా నిలిచేది అయన ప్రార్ధనా జీవితం. రేయింబగుళ్ళు ప్రార్ధిస్తూ ఉండేవారు. ప్రార్ధనతోనే అనేక వరాలు కురిపించే వారు. అట్టి వరాలలో ముఖ్యమైనవిగా చెప్పుకోగలిగినది ‘‘సంతాన వరము’’. బోయపాటి క్లారమ్మగారికి ఏనాడైతే, జోసఫ్‌ తంబిగారి ప్రార్ధన సహాయముతో పుత్ర సంతానం కలిగిందో, ఆనాటినుండి ఆయన కీర్తి దశదిశ పాకటంతో సంతాన లేమితో కృంగిపోతున్న అనేక మంది ఆయన శరణు వేడగా వారికి సంతాన భాగ్యం కలిగినది.

కేసరపల్లికి చెందిన మామిళ్ళ సూర్యనారాయణ, మంగమ్మ దంపతుకు కూడా జోసఫ్‌ తంబిగారి ప్రార్ధన సహాయముతోనే పుత్ర సంతానం కలుగగా, వారు హైందవులు అయినప్పటికిని, వారి కుమారునికి జోజిఅని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. యిటువంటి ఉదాహరణలు కోకొల్లలు! జోసఫ్‌ తంబిగారి ధార్మిక జీవితం, ఉదార స్వభావం, ప్రార్ధనా గుణం, అవుటపల్లి చుట్టుప్రక్కల విశ్వాస వ్యాప్తికై ఎంతగానో తోడ్పడ్డాయి.

స్వస్థతావర ప్రదాత

జోసఫ్‌ తంబి గారిని గురించి ఎవరైనా సంభాషణ మొదలు పెడితే మొదటగా గుర్తుకు వచ్చేది, గుర్తించేది అయన ఆరోగ్య వరప్రదాతఅన్న విషయమే!

వణుకూరు గ్రామమునందు సౌశీల్యమ్మ అను స్త్రీ ఎప్పుడూ కడుపు నొప్పితో బాధపడుచూ ఉండేది. నొప్పి ఎక్కువై నప్పుడు దయ్యము పట్టిన దానివలె ప్రవర్తించేది. ఆమె ఒంటినిండా అనేక తాయత్తులు కట్టుకునేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా, ఎన్ని తాయత్తులు కట్టినా ఆమె జబ్బు మాత్రం నయం కాలేదు. చివరికి ఆమె బంధువైన కూరగంటి శౌరిగారి ద్వారా జోసఫ్‌ తంబిగారి వైద్యం గురించి విని, శౌరిగారిని వెంటబెట్టుకొని అవుటపల్లి చేరుకున్నారు. వారిరువురు సరాసరి జోసఫ్‌ తంబిగారి యింట్లోకి వెళ్లి చూడగా, జోసఫ్‌ తంబిగారు పంచ గాయాలు పొంది రక్తం కార్చుట చూచి వెంటనే బయటకు వచ్చారు.

దాదాపు గంటసేపు తర్వాత జోసఫ్‌ తంబిగారు బయటకు వచ్చి వారిని పలకరించారు. వారి సమస్య విని వారికి ధైర్యం చెప్పారు. వారచటికి రాకముందే ఆమె ధరించిన తాయత్తులను తీసివేశారు. కాని జోసఫ్‌ తంబిగారు దివ్యదృష్టితో వారు ఇంతకు ముందు ధరించిన తాయత్తుల విషయం గుర్తించి, ‘‘ఇంకెప్పుడు కూడా తాయత్తులు ధరించ కూడదు’’ అని చెప్పి ఆయన వద్ద నూనెను ఆశీర్వదించి తలపై రాసు కోమన్నారు. అలా చేయడముతో ఆమెలో నున్న రోగ బాధలన్ని తొలగిపోయి సంపూర్ణ స్వస్థత పొందినది.

వారచట ఉన్నప్పుడే, మరియమ్మ అను స్త్రీ కడుపునొప్పితో బాధపడుచూ ఆచటకి రాగా ఆమెకు కూడా ఆశీర్వదించ బడిన తైలము నిచ్చాడు. ఆమెకూడా ఆ నూనెను తలకు అద్దు కొనగా కడుపునొప్పి మాయమై స్వస్థత పొందినది.

జోసఫ్‌ తంబిగారి స్వస్థతా వరమును గురించి కేసరపల్లికి చెందిన పుల్లెల్ల అంతోని గారు ఒక గొప్ప సాక్ష్యమును మనకందించారు.

ఒకరోజు జోసఫ్‌ తంబిగారు పిల్లలందరిని దగ్గరకు పిలిచి వారికి ఒక పని అప్పగించారు. అదేమంటే, పిల్లలందరు వీధులగుండా తిరుగుచూ, ‘జోసఫ్‌ తంబిగారు మందు లిస్తున్నారు. వ్యాధి గ్రస్తులంతా, త్వరపడి రండిఅని చాటింపు వేయడం. పిల్లలంతా హుషారుగా, ఊరంతా తిరుగుచూ, అరుచు కుంటూ రోగులందరు జోసఫ్‌ తంబిగారి దగ్గరకు వెళ్ళాలని చాటింపు వేశారు. పుల్లెల్ల అంతోని కూడా యిలా చాటింపు వేసిన పిల్లల గుంపులో ఉన్నాడు. వారి యిల్లు గుడి ముందే ఉండేది. యింటిచుట్టూ వేపచెట్లు, కూరగాయ పాదులు, పూల మొక్కులు ఉండేవి. జోసఫ్‌ తంబి గారు కేసరపల్లిలో ఉన్నప్పుడు, ఆ యింట్లోనే గడిపేవారు. ఆ యింటి చుట్టూ ఉన్న ఏవేవో చెట్ల ఆకులన్నీ కోసి, అన్నింటిని కలిపి నూరి, ముద్ద చేసుకున్నాడు. పిల్లలు చాటింపు వేసి తిరిగి వచ్చేసరికి జోసఫ్‌ తంబిగారు దేవాలయం గుమ్మం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నారు. వారు సిద్ధం చేసుకున్న ఆకు ముద్ద, ఒక బిందె నిండ నీళ్ళు ప్రక్కన పెట్టుకున్నారు.

ఊరు ఊరంతా అక్కడ గుమి కూడారు. ఎవరు ఏ వ్యాధితో వచ్చినా అందరికీ ఒకే మందు...! ఆకు ముద్దనుండి కొంచెం తీసుకోవడం, చిన్న ఉండలా దాన్ని తయారు చేసే కుడి చేయితో వ్యాధిగ్రస్తుల నోట్లో వేస్తూ, ఎడమ చేతితో నీళ్ళు త్రాగించి మౌనముగా ఒక్కొక్కరి కొరకు ప్రార్ధన చేసారు. అలా మందు తీసుకున్న వారు, ఆరోగ్య వంతులై యిండ్లకు తిరిగి వెళ్ళారు.

ఈ క్రమములోనే పుల్లెల్ల అంతోని గారి తల్లి తన చిన్న కుమారుని తీసుకొని వచ్చి, ‘తంబిగారా! మా చిన్నోడికి రోజు సాయంత్రం చలి జ్వరం వస్తోంది. అసలు ఇంకెప్పుడు రాకుండా ప్రార్ధించండిఅని వేడుకుంది. అందుకు, ‘‘ఓహో! అంతేకదమ్మా! నేను ప్రార్ధన చేసి మందు ఇస్తాను’’ అంటూ అందరికి ఇచ్చినట్లే, ఆ బాలునికి కూడా ఒక ముద్ద మందు తినిపించి, నీళ్ళు పట్టించి చాలా సేపు ప్రార్ధన చేసాడు. ఆ బాలుడు ముసలి ప్రాయుడై మరణించే వరకుకూడా ఎన్నడును అనారోగ్యము పాలు కాలేదు!

కొండూరుపాడులో ఉపదేశిగా పనిచేయుచున్న పుట్ల ఎలీశాగారి భార్య జ్వరముతో బాధపడు చున్నప్పుడు జోసఫ్‌ తంబిగారు వారింటికి వెళ్ళారు. అదేమి పట్టించు కోనట్లుగా జోసఫ్‌ తంబిగారు ఎలీశాను తనతో కిష్టవరం గ్రామమునకు రమ్మన్నప్పుడు, ‘తంబిగారా! మా ఆవిడకు బాగా జ్వరం ఉంది. ఆమెను వదిలి ఇప్పుడు రాలేనుఅని అన్నాడు. ‘‘సరేలే! రాకుంటే మానేసేయ్‌’’ అంటూ జోసఫ్‌ తంబిగారు ఒంటరిగానే కిష్టవరం బయలు దేరారు. అది గమనించిన ఎలీశాగారి భార్య జోసఫ్‌ తంబిగారికి తోడుగా వెళ్ళమని భర్తను ఆదేశించింది. జోసఫ్‌ తంబిగారు బయలు దేరిన ఐదు నిమిషాలకు ఎలీశాగారు పరుగెత్తుకుంటూ వెళ్లి దారిలో జోసఫ్‌ తంబిగారిని కలుసుకొని కిష్టవరం వెళ్ళారు.

అచ్చట వారి పని ముగించుకొని అవుటపల్లికి తిరిగి వచ్చి జోసఫ్‌ తంబిగారి యింట్లోనే ఎలీశాగారు పడుకున్నారు. మరుసటి దినం ఎలీశాగారు కొండూరుపాడు వెళ్ళిపోయారు. వెళ్లి చూడగా, అతని భార్య ఆరోగ్యంగా ఉంది. జ్వరం ఎప్పుడు తగ్గింది అని అడుగగా, ‘నిన్న మీరు యింటినుండి పరుగెత్తుకుంటూ వెళ్లి జోసఫ్‌ తంబిగారిని కలుసుకున్న క్షణముననే జ్వరం తగ్గిపోయిందిఅని చెప్పినది.

జోసఫ్‌ తంబిగారి అద్భుత స్వస్థత శక్తికి తార్కాణంగా నిలిచే గొప్ప అద్భుతం అవుటపల్లిలోనే జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన వంట శౌరిగారు దీనిని గురించి సాక్ష్యమిచ్చియున్నారు.

ఒకరోజు ఒక ముసలాయన కల్దెరారో గురువును కలవడానికి వచ్చాడు. ఆయన కాలిపై పెద్ద వ్రణం ఉంది. అది చీము కారుతూ దుర్వాసన కొడుతుంది. జోసఫ్‌ తంబిగారు ఆ ముసలాయనను తన యింటికి తీసుకువెళ్ళి ఒక మూలలో కూర్చోబెట్టి ఆయన కాలు తన ఒడిలో పెట్టుకొని నాకటం ప్రారంభించాడు. పూర్తిగా ఆ చీమంతా నాకిన తరువాత యింటిముందు ఉన్న గంగిరాయి చెట్టు ఆకు నలిపి పసరు పోసి కట్టు కట్టాడు. అదంతా అక్కడే ఉండి గమనిస్తున్న శౌరిగారు ముసలాయనను కసురుకుంటూ, ‘అది మందు కాదు ముసలోడా చస్తావుఅని అరిచారు. కట్టు కట్టిన తరువాత ఆ ముసలాయనను రెండు రోజుల తరువాత వచ్చి కనిపించ మన్నారు జోసఫ్‌ తంబిగారు.

ముసలాయన వెళ్ళిన తరువాత శౌరిగారు పరుగు పరుగున కల్దెరారో గురువు వద్దకు వెళ్లి పుండు నాకాడు స్వామిఅంటూ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కల్దెరారో గురువు జోసఫ్‌ తంబివైపు తీక్షణముగా చూస్తూ, ‘పిచ్చోడా! కుక్కలాగా పుండును నాకటమేమిటి! ఛీ ఛీఅంటూ కసురుకున్నారు.

జోసఫ్‌ తంబిగారు ఆదేశించిన విధంగానే రెండు రోజుల తరువాత ఆ వ్యక్తి జోసఫ్‌ తంబిగారి దర్శనార్ధం వచ్చాడు. అతను వచ్చినప్పుడు జోసఫ్‌ తంబిగారు అచ్చట లేరు. వంట శౌరిగారే మొదట ఆ వ్యక్తిని కలుసుకున్నారు. ‘ఏంటయ్యా! పుండు ఎలా ఉంది? అని వాకబు చేశాడు. అందుకు ఆ వ్యక్తి, ‘తగ్గిపోయింది. బానే అనిపిస్తుందిఅని సమాధానం ఇచ్చాడు. శౌరిగారు వెటకారం చేస్తూ, ‘అలాగే ఉంటుందిలే, మంచి మందు కాదుకదా! ఎట్లా తగ్గిపోతుంది! ఏదీ చూద్దాం. ఒకసారి ఆ కట్టు విప్పుఅన్నాడు. ఆ వ్యక్తి, ‘తీయనండి, ఆ సాధువుగారే రావాలి. ఆయన వచ్చినప్పుడే కట్టు విప్పుతాఅని అన్నాడు. ‘ఆయన లేడు. యింకో వారందాకా రాడు. ఏటో పోయాడులే’ అన్నాడు శౌరిగారు. ‘అయితే ఆయన వచ్చిన తరువాతే తీస్తాను’ అని అన్నాడు ఆ వ్యక్తి. ‘ఎహే, తియ్యి చూద్దాం’ అని కాస్తా కోపగించు కున్నాడు శౌరిగారు. అప్పుడా వ్యక్తి కట్టు విప్పాడు. గాయమంతా పూర్తిగా మాని మచ్చకూడా కనిపించకుండా కాలు పూర్తిగా శుభ్రముగా ఉంది. ఆశ్చర్య పోయిన శౌరిగారు, పరుగెత్తి వెళ్లి, కల్దెరారో గురువును పిలిచి చూపించాడు. యిక ఆశ్చ్యర్యపోవడం గురువు వంతు అయింది. అది గొప్ప అద్భుతమని వారంతా గ్రహించారు.

జోసఫ్‌ తంబిగారి స్వస్థత కార్య పరంపరలో ముందు వరుసలో నిలిచే ఒక సంఘటన బోయపాటి వారి కుటుంబములో జరిగింది. ఆ సంఘటనే ఆ యింటిలో విశ్వాస బీజాలు నాటింది.

బోయపాటి క్లారమ్మగారి నాయనమ్మ వేమూరి సుబ్బమ్మగారు మంచంమీదనుండి క్రిందపడటం వలన ఆమె కాలు విరిగింది. ఎంతమంది వైద్యులను పిలిచినా, ఎవరి వల్ల కాదు అని అన్నారు. ఆ యింట్లో పనిచేసే వారొకరు జోసఫ్‌ తంబిగారి గురించి చెబుతూ, ‘అమ్మా! గుడిదగ్గర జోసఫ్‌ తంబిగారని ఒక సన్యాసి ఉన్నారు. అతడు అనేకమందికి మందులిస్తూ, ప్రార్దిస్తుంటే బాగు పడుతున్నారు. యిక్కడ అమ్మగారి పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుంది. బాధకు తాళలేక విలవిలలాడి పోతుంది కదా! ఒకసారి ఆ సన్యాసిని పిలిచి మందు లిప్పించి చూడండిఅని చెప్పాడు.

యింటి వారు సరేనని గుడి దగ్గరకు వచ్చి జోసఫ్‌ తంబిగారిని పంప వలసినదిగా కల్దెరారో గురువులను కోరారు. అప్పుడు, ‘అతనిచ్చే మందుకేం తగ్గుతుంది!అని కసురుకున్నారు. వచ్చినవారు పట్టుబట్టడంతో జోసఫ్‌ తంబిగారిని వారితో పంపించారు కల్దెరారో గురువు.

జోసఫ్‌ తంబిగారు బోయపాటివారి యింటికి వెళ్లి సుబ్బమ్మగారి మంచం వద్దకు వెళ్లి మోకరించి ప్రార్ధన చేసారు. తరువాత పసరు పూసి కట్టుకట్టి వెళ్లిపోయారు. మరుసటిరోజు జోసఫ్‌ తంబిగారు మరల వచ్చి కట్టు విప్పి ప్రార్ధించి లేచి నడువమని ఆదేశించారు. సుబ్బమ్మగారు లేచి సంతోషంగా అటూ ఇటూ నడుస్తూ అందరిని ఆశ్చర్య పరచారు. ఈ అద్భుతం కళ్ళారా చూచిన బోయపాటి కుటుంబములో విశ్వాస బీజాలు చిగురించాయి.

ఇటువంటి స్వస్థతలు జోసఫ్‌ తంబిగారు అనేకం చేసారు. తను చేసే స్వస్థతలు తన శక్తి వలన గాక, దైవ చిత్తాను సారం జరుగు తున్నాయని జోసఫ్‌ తంబిగారు అనేకసార్లు చెప్పి యున్నారు. దీనిని గురించి జోసఫ్‌ తంబిగారి ప్రార్ధనా స్పర్శతో స్వస్థత పొందిన ఒక కుష్ఠరోగి సాక్ష్యమిస్తున్నాడు.

జోసఫ్‌ తంబిగారు ఒక రోజు గుడివాడకు వెళ్ళారు. అచ్చట ఇంతకుముందే జోసఫ్‌ తంబిగారు స్వస్థత పరచిన ఒక కుష్ఠరోగి ఉండెను. జోసఫ్‌ తంబిగారు ఆ వ్యక్తిని కౌగిలించుకొని ప్రార్ధన చేయగా అతనికున్న కుష్ఠరోగం మటుమాయమై సంపూర్ణ స్వస్థత పొందాడు. ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి వినయంగా ఇలా అన్నారు, ‘స్వామి! మీరు నా వద్దకు వచ్చి నన్ను స్వస్థపరచారు. నేనొక పాపిని. నన్ను స్వస్థపరచి నందుకు దేవునికి వందనములు తెలుపుకొను చున్నాను. ఎందుకంటే, మీరు ఒక పాపిని స్వస్థ పరచారు’. అందుకు జోసఫ్‌ తంబిగారు, ‘‘అది నా పని కాదు సోదరా! సర్వశక్తిగల దేవాది దేవుడే నిన్ను స్వస్థ పరచారు. నువ్వెప్పుడు ప్రార్ధించుట మరువ కూడదు. సదా దేవునికి స్తోత్రం చేసుకో!’’ అని చెప్పారు. ఆ వ్యక్తియు, కుటుంబ సభ్యులందరును ప్రభువును విశ్వసించారు.

దర్శన వర పూరితుడు

జోసఫ్‌ తంబిగారు దర్శన వరమును దండిగా పొంది యుండెను. రాబోవు కాలంలో జరగబోవు విషయాలను ముందే గ్రహించి ప్రజలను హెచ్చరిస్తూ ఉండేవారు. వర్తమాన కాలంలో కూడా ప్రజలు సాధారణముగా గ్రహించుటకు అవకాశము లేని విషయాలను జోసఫ్‌ తంబిగారు వివరించే వారు. అటువంటి కొన్న సంఘటనను పరిశీలిద్దాం.

పైన పేర్కొన్న వేమూరి సుబ్బమ్మగారి కాలు విరిగి మంచం పట్టినప్పుడు, ఆమె కోసం ప్రార్ధించుటకు జోసఫ్‌ తంబిగారిని పిలిచారు. జోసఫ్‌ తంబిగారు వెళ్ళారు కాని గుమ్మము వద్దనే నిలబడి పోయారు. ‘స్వామి! లోనికి రండి’ అంటూ బోయపాటివారి కుటుంబం ఆహ్వానించగా, “మీ యింట్లో సైతాను ఉంది. నేను రాను” అని అన్నాడు. ‘ఏది స్వామి? ఎక్కడుంది సైతాను? అని అడుగగా, “మజ్జిగ చిలికే కవ్వము క్రింద” అని అన్నారు. అప్పడు జోసఫ్‌ తంబిగారు చిన్నచిన్న పుల్లలను ఏరి మంటవేసి ఆ కవ్వము క్రిందనున్న మండ్రగబ్బను కనుగొని, “మంటల్లోకి వెళ్ళిపో!” అని ఆజ్ఞాపించగా అది నేరుగా మంటల్లోకి వెళ్లి మాడి మసి అయింది.

తేలప్రోలు గ్రామము నుండి ఒకరోజు సాయంత్రము చాలామంది ప్రజలు జోసఫ్‌ తంబి గారిని కలుసు కోవడానికి వచ్చారు. వారిలో ఒక మహిళ ప్రయాణ ఖర్చుల కోసం అని యింట్లోని పప్పును కొద్దిగా అమ్మినది. ఆ విషయం అత్తమామకు చెప్పలేదు. ఇలా దొంగతనంగా అమ్మిన విషయం జోసఫ్‌ తంబిగారు వెంటనే పసిగట్టాడు. “ఇంకెప్పుడు అలా చేయవద్దమ్మా. దొంగతనం చేయకూడదు” అంటూ ఆమెను మందలించాడు. ఆ తరువాత ఆమె వచ్చిన ఉద్దేశమును కూడా గ్రహించి, “వచ్చే ఏడాది ఈ రోజు వరకు నీకు సంతానము కుగుతుంది. నేను ప్రార్ధన చేస్తాను” అంటూ ఆమెను దీవించాడు. అన్నట్టుగానే మరుసటి యేడు పండంటి బిడ్డతో ఆమె జోసఫ్‌ తంబిగారిని దర్శించినది.

మానికొండకు చెందిన చదవాడ జోజప్ప బృందము ఒకసారి కేసరపల్లిలో డ్రామా వేయుటకు వచ్చారు. జోసఫ్‌ తంబిగారు కూడా డ్రామా చూచుటకు కేసరపల్లి వెళ్ళారు. మానికొండ నుండి వస్తున్నప్పుడు బృందములోని కొందరు సభ్యులు దారిలో దొంగతనంగా మామిడి కాయలు కోసుకొని తిన్నారు. జోసఫ్‌ తంబిగారు వారినందరినీ దగ్గరకు పిలుచుకొని, “కూర్చోండి” అనగా, అందరు జోసఫ్‌ తంబిగారి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు, “మీరు చేసిన పనియేమీ బాగా లేదు” అని అన్నారు. ‘మేమేమి చేశాము స్వామీ? అని వారు అడుగగా, “దారిలో మీరు మామిడి కాయు కోశారు. మంచివి తిన్నారు. పుల్లవి పడేశారు కదా” అని అన్నారు.

యితరులకు జరిగే విషయాలే కాదు. తనకు జరిగే విషయాలు కూడా జోసఫ్‌ తంబిగారు ముందుగానే గుర్తించే వారు. ఆయనకు పరలోక మందున్న దూతతో సరాసరి నిత్య సంబంధం ఉన్నట్లు అనిపించేది. ఒకసారి జోసఫ్‌ తంబిగారు కేసరపల్లికి చెందిన పుల్లెల్ల అంతోనితో కలిసి చెరుకు కొట్టే పనికి కూలికి వెళ్ళాడు.

మధ్యాహ్న భోజన విరామ సమయానికి కొంచెం ముందు, అకస్మాత్తుగా జోసఫ్‌ తంబిగారు తాను చెరుకు నరుకుతున్న కత్తిని నేలపై పడేసి స్వర్గం వైపు చూస్తూ ఎవరో అదృష్య శక్తితో మాట్లాడుతున్నారు. ఆయన స్వరం మాత్రం ప్రజలు వింటున్నారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో వారి స్వరం మాత్రం వినబడటం లేదు. ప్రజలందరు పనులు ఆపి జోసఫ్‌ తంబిగారిని చుట్టుముట్టారు. ‘ఏమిటి తంబిగారు, పైకి చూస్తూ మాట్లాడుతున్నారు!’ అంటూ గుసగుసలు మొదలు పెట్టారు. అప్పుడు వారందరు దగ్గరికి వచ్చి, ‘ఏమిటి జోసఫ్‌ తంబిగారా! ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అని అందరు ముక్త ఖంటంతో అడిగారు. దానికి సమాధానమిస్తూ, ‘మా యింట్లో దొంగలు పడ్డారు. ఒక కోడిపెట్ట, రెండు మానికల బియ్యం, ఇంకా ఏవో కొన్ని వస్తువులు పోయాయి. వెంటనే పని ఆపి యింటికి వెళ్ళు అని దేవదూత నాతో చెప్పింది’ అని అన్నారు. “నేను యింటికి వెళ్లి వస్తాను” అంటూ చెరుకు తోట యజమాని అనుమతితో యింటికి వచ్చి చూడగా, నిజముగనే దొంగలు పడ్డ విషయం, సరిగా ఆయన చెప్పిన వస్తువులే పోవడం జరిగింది.

జోసఫ్‌ తంబిగారి మరణం గురించి కూడా వారు స్పష్టముగా ప్రవచించారు. కేసరపల్లికి వెళ్ళినప్పుడు జోసఫ్‌ తంబిగారు పుల్లెల్ల అంతోనిగారి యింట్లోనే ఎక్కువగా ఉండేవారు. చివరి సారిగా వెళ్ళినప్పుడు ఆ యింటి ముందు నిలబడి రెండు చేతులెత్తి ఆ యింటిని దీవించాడు. “యిక నేను వెళ్ళిపోతున్నాను. ఇదే చివరిసారి. ఇకమీదట మీ యింటికి రానుఅని పలికారు. అంతోనివారి తల్లిదండ్రులు కంగారుపడి, ‘ఏమిటి జోసఫ్‌ తంబిగారా! అలా మాట్లాడుచున్నారు?’ అని అడిగారు. “అమ్మా! నేను దేవుని వద్దకు వెళ్లిపోవు చున్నాను. ఇక నేను రాను. ఈ ఊరికి రావడం, ఇదే ఆఖరు సారి. నేను మీ యింటిని ఆశీర్వదిస్తాను” అంటూ రెండు చేతులెత్తి యింటిని ఆశీర్వదించారు. ‘మాకోసం ప్రార్ధన చేయండి జోసఫ్‌ తంబిగారా!’ అంటూ అందరు కన్నీటి పర్యంత మయ్యారు. ఇక జోసఫ్‌ తంబిగారు కేసరపల్లి నుండి అవుటపల్లికి వచ్చేసారు.

జోసఫ్‌ తంబిగారి ముందు ఏ విషయము కూడా దాచలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే, ఎక్కడ ఏది దాచినా ఆయనకు కనిపించేది. ఒకసారి కేసరపల్లి గ్రామములో ఉన్నప్పుడు, గుడిలో పీఠము వద్ద కాస్త పగుళ్ళు వచ్చినందున మరమత్తు చేయ సంకల్పించారు జోసఫ్‌ తంబిగారు. “గుడి వెనుక పీఠము దగ్గర పగిలింది. మీలో ఎవరి వద్దనయినా సిమెంటు ఉంటే మీ తల్లిదండ్రులను అడిగి తీసుకొని రండి” అని జోసఫ్‌ తంబిగారు పిల్లలందరినీ పురమాయించారు. పిల్లలందరూ తమతమ యిండ్లకు వెళ్లి తల్లిదండ్రులను అడిగి సిమెంటు తెచ్చారు.

పుల్లెల్ల అంతోని కూడా తల్లి వద్దకు వెళ్లి, ‘అమ్మా! జోసఫ్‌ తంబిగారికి సిమెంటు కావాలట! ఉంటే అడిగి తెమ్మన్నారుఅని చెప్పాడు. అందుకు ఆ తల్లి, ‘సిమెంటు మనింట్లో లేదురా. వెళ్లి లేదని చెప్పుఅని చెప్పి పంపింది. జోసఫ్‌ తంబిగారి వద్దకు వచ్చి, ‘లేదటండీ సిమెంటుఅని చెప్పాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు, ‘‘సిమెంటు లేదా! ఇంట్లో కుండలో ఉన్నది. నేను చెప్పానని చెప్పు’’ అని అన్నారు. అంతోని మరల యింటికి వెళ్లి, ‘‘అమ్మా! సిమెంటు కుండలో ఉన్నదంటా! ఆ కుండ ఆ మూలలో ఉన్నదంటా!అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మగారు, ‘దానిని నిన్ననే తెచ్చి యున్నాను. ఎయిర్‌ పోర్టు పనికి వెళ్ళినప్పుడు, దేనికైనా పనికి వస్తుంది కదా అని కొద్దిగా తెచ్చి కుండలో దాచాను. జోసఫ్‌ తంబిగారు అప్పటినుండి మన యింటికి రాలేదు. ఆయనకెలా తెలిసింది ఈ విషయం!అంటూ ఒకింత ఆశ్చర్యముతో కుండలోని సిమెంటును తీసి ఇచ్చింది. అంతోని సిమెంటుతో తన వద్దకు రాగా, ‘‘మరి నేను చెప్పానుకదా ఉందని! అప్పుడెందుకు అబద్ధం చెప్పావు?’’ అని అంటుంటే, ‘లేదు తంబిగారా! అమ్మ లేదు అని చెప్పమన్నదిఅని చెప్పాడు.

జోసఫ్‌ తంబిగారి దర్శన వరమును గురించి మాట్లాడు చున్నప్పుడు, తప్పక గుర్తుకు వచ్చు రెండు సంఘటనను చూద్దాం. మొదటిది, అవుటపల్లికి అగ్నివలన కలుగబోయే పెను ముప్పు, రెండవది, రెండవ ప్రపంచ యుద్ధ కాల దర్శనం.

ఒకరోజు తంబిగారు వల్లాభాపురపు జోసఫ్‌ గారింటికి వెళ్ళారు. వారు అవుటపల్లి వాస్తవ్యులే. జోసఫ్‌ తంబిగారు వారింటికి వెళ్లి మంచముపై కూర్చున్నారు. ‘ఎక్కడికి వెళ్లి వస్తున్నారు స్వామి? అని జోసఫ్‌ అడుగగా, “గన్నవరం నుండి వస్తున్నాను” అని చెప్పారు. ఆ సమయములో, జోసఫ్‌ తంబిగారి ముఖం ధ్యానమందు మునిగి యున్నట్లు అగుపించినది. గన్నవరం ఎందుకు వెళ్ళారు తంబిగారా?’ అని జోసఫ్‌ ప్రశ్నించగా, జవాబు చెప్పకుండా అకస్మాత్తుగా మంచం పైనుండి లేచి తన యింటికి వడివడిగా నడుస్తూ వెళ్ళారు. జోసఫ్‌ కూడా తన పనులను ప్రక్కన పెట్టేసి, జోసఫ్‌ తంబిగారిని అనుసరించాడు. యింటికి చేరుకోగానే, జోసఫ్‌ తంబిగారు ఉత్తర దిక్కువైపు చూస్తూ, ‘‘అగ్ని, అగ్ని, అగ్ని...చూడు, చూడు, చూడు!’’ అని గట్టిగా అరుస్తున్నాడు. జోసఫ్‌ ఆశ్చర్యముతో, ‘జోసఫ్‌ తంబిగారా! అక్కడెక్కడ మంట లేదుకదా!అని అన్నాడు. జోసఫ్‌ తంబిగారు మరల, ‘‘మంటలు...మంటలు...లేస్తున్నాయి. చూడు...చూడు’’ అంటూ ఉత్తర దిక్కువైపు చూపిస్తున్నారు. జోసఫ్‌కు భయం వేసింది. యిలా మూడవసారి జోసఫ్‌ తంబిగారు, ‘‘మంటలు...మంటలు...’’ అంటూ క్రిందపడి పోయారు. మొదట జోసఫ్‌ తంబిగారిని ముట్టు కొనుటకు జోసఫ్‌ సాహసించలేదు. కొంచెంసేపు తరువాత ధైర్యం కూడ గట్టుకొని తంబిగారిని లేవనెత్తి, తను కూర్చొని, జోసఫ్‌ తంబిగారి తలను తన ఒడిలో పెట్టుకున్నాడు.

జోసఫ్‌ తంబిగారు కాస్త తేరుకొని ఏడుస్తూ ప్రార్ధించు చున్నారు. కన్నీరు కారుస్తున్నారు. అది చూస్తున్న జోసఫ్‌, ‘ఎందుకు స్వామి ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారు?’ అని అడిగాడు. దానికి జవాబుగా, జోసఫ్‌ తంబిగారు, “నేను నీ కోసమే కన్నీరు కారుస్తూ ప్రార్ధిస్తున్నాను. నీవు దేవున్ని కోపానికి గురి చేస్తున్నావు. దేవుని కోపం నీ మీద పడకుండా ప్రార్ధిస్తున్నాను” అని అన్నారు. అప్పుడు జోసఫ్‌ ఆయనను తన యింటికి తీసుకొని వెళ్లి, వేడి నీళ్ళతో స్నానం చేయించిన తరువాత, త్రాగుటకు పాలు యిచ్చారు. జోసఫ్‌ తంబిగారు బైఋలు గ్రంథం తీసుకురమ్మని ఆజ్ఞాపించగా తెచ్చి యిచ్చాడు. జోసఫ్‌ తంబిగారు కొన్ని వాక్యములను చదివి, ‘‘నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని జోసఫ్‌తో చెప్పారు.

జోసఫ్‌ తంబిగారు చూచిన ఈ అగ్నిమంట ప్రవచనం 4 జూన్‌ 1972వ సంవత్సరములో నెరవేరింది. ఆనాడు అవుటపల్లిలో మంటలు చెలరేగి చాలా ప్రాంతం కాలి బూడిదయ్యింది. అవుటపల్లిలో ప్రారంభమైన మంటలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, వెన్నూత గ్రామము వరకు విస్తరించాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు.

ఇటువంటిదే, మరియొక అగ్ని ప్రమాదం రాబోవుచున్నదని, ఆరోజున బోయపాటివారి యిల్లు తప్ప, దాని చుట్టుప్రక్కల యిండ్లన్ని కాలి పోతాయని, బోయపాటివారి యింట్లో ఉన్న వస్తువులు’ ఏవీ కూడా బయట వేయ కూడదని, బోయపాటి ఫ్రాన్సిసు గారిని ఆదేశించారు.

జోసఫ్‌ తంబిగారి మరణం తరువాత, ఈ విషయం మరచిన బోయపాటి ఫ్రాన్సిసు గారు చాలా వస్తువులను యింటి బయట వేసారు. తరువాత జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో, ఆ యింటి పరిసర ప్రాంతాలో నున్న యిండ్లన్ని దగ్ధమయి పోయాయి. బోయపాటివారి ఇల్లు మాత్రం రక్షింప బడినది. అయితే, బయట పెట్టిన వస్తువులన్నీ కాలి పోయాయి. ఈవిధంగా, జోసఫ్‌ తంబిగారు జరగబోవు ప్రమాదములను ముందుగానే పసి గట్టేవారు.

అది రెండవ ప్రపంచ యుద్ధకాలము! యుద్ధ సమయములో జరుగుచున్న నరమేధము జోసఫ్‌ తంబిగారు తత్కాల సమయ మందే చూస్తూ ఉండేవారు. ఎక్కడో దూరదేశ మందు జరుగుచున్న యుద్ధాలను ప్రత్యక్ష సాక్షివలె అప్పటికప్పుడు జరుగుచున్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించేవారు.

ఒకరోజు జోసఫ్‌ తంబిగారు అకస్మాత్తుగా తన దగ్గర వున్న వాళ్ళందరిని, ‘‘ప్రార్ధన చేద్దాం రండి’’ అంటూ తొందర చేశారు. అందరు గుడిలోనికి వెళ్లి ప్రార్ధన చేయుచుండగా, అతను మాత్రం యుద్ధ దర్శనం పొందు చున్నారు. అనేకమంది యువకులు పారాచూట్‌ సహాయముతో విమానాల్లోంచి దిగుతుంటే సైనికులు వారిని పిట్టల్లా కాల్చుతున్నట్లు దర్శనములో చూసారు. సిలువదారియైన క్రీస్తు అతనికి దర్శనం యిచ్చి, ‘‘ఇదిగో! చూడు. నా బిడ్డలు ఒకరినొకరు ఎలా కాల్చు కుంటున్నారో! ప్రపంచ శాంతి కోసం ప్రార్ధన చేయి. ఒక గంటసేపు దేవాలయములో ప్రార్ధించుటకు గురువును పిలువు’’ అని కోరారు. జోసఫ్‌ తంబిగారు అలాగే చేసారు. జోసఫ్‌ తంబిగారు కన్నీటితోను, నిట్టూర్పుతోను గంటసేపు ప్రార్ధన చేసారు.

ప్రార్ధన ముగిసిన పిమ్మట బయటకి వచ్చినప్పుడు, ‘ఇదంతా ఎక్కడ జరుగుచున్నది స్వామి?’ అని అడుగగా, జోసఫ్‌ తంబిగారు తన వ్రేలితో నేలమీద బొమ్మ గీస్తూ ఒక ద్వీపము ఉత్తర భాగాన్ని చూపిస్తూ, ‘‘ఇదిగో! ఇక్కడ’’ అంటూ వివరించారు.

మరుసటిరోజు దినపత్రికలు ఇదే వార్తను ప్రచురించాయి. క్రీట్‌ ద్వీపము మీదున్న మాలేమివిమాన స్థావరముపై సైనికులు పారాచూట్లతో దిగడం, దానిని పహారా కాస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సైన్యం జర్మన్‌ సైనికుల్ని గాలిలోనే కాల్చివేయడం వంటి విషయాలు సరిగా జోసఫ్‌ తంబిగారు చెప్పిన సమయానికి జరిగినట్లు వివరించాయి.

ఆరోజు యుద్ధ వార్తను వింటూనే జోసఫ్‌ తంబిగారు నిశ్చేష్టుడై ధ్యానం లోనికి మునిగి పోయాడు. ఎంత కదిపినా, పిలిచినా, ఫలితం లేకపోయే సరికి ఒక అగ్గిపుల్లను గీసి జోసఫ్‌ తంబిగారి కళ్ళముందు ఉంచారు. అయినా చలనం లేదు. కాలుతున్న అగ్గిపుల్లను జోసఫ్‌ తంబిగారి చేతుల క్రింద ఉంచారు. అయినా చలనం లేదు. కాసేపయ్యాక జోసఫ్‌ తంబిగారు బయటకువచ్చి, ‘‘మాలేమి విమానాశ్రయాన్ని జర్మన్‌ సైనికులు స్వాధీనం చేసు కున్నారని, ఇప్పుడు యుద్ధం లోపలి భూభాగంలో నడుస్తున్నది’’ అని అన్నారు.

ఈవిధముగా, అనేక విషయాలు, జరిగినవి, జరుగు చున్నవి, జరుగ బోయేవి, జోసఫ్‌ తంబిగారు దర్శన వరము ద్వారా గ్రహించి ప్రజలను హెచ్చరించే వారు.

శాంతి ప్రదాత – సఖ్యత చేకూర్చువారు

జోసఫ్‌ తంబిగారు అనేక సందర్భాలలో ప్రజల మధ్య, కుటుంబాల మధ్య సఖ్యత చేకూర్చి, అందరు శాంతి సమాధానాలతో జీవించాలని తాపత్రయ పడేవారు. ఒకరోజు వల్లభాపురపు జోసఫ్‌ గారింటికి వెళ్ళినప్పుడు, వారి మనస్సులోని అలజడిని గ్రహించి మందలించారు. జోసఫ్‌ తన భార్యను అనుమానించుట వలన, కుటుంబములో కలహాలు చోటుచేసు కున్నాయి. కాని ఎవరూ దాని గురించి జోసఫ్‌ తంబిగారికి చెప్పలేదు. జోసఫ్‌ తంబిగారే కల్పించుకొని, ‘‘జోసఫ్‌! నీవు నీ భార్యను అనుమానిస్తున్నావు. అది చాలా తప్పు. ఆమె చాలా మంచిది’’ అని చెప్పారు. మనసులోని అలజడి సమసి పోయి ఊరట పొందాడు జోసఫ్‌. యిక అప్పటినుండి వారి కుటుంబము శాంతి సమాధానాలతో జీవించినది.

మరియొక సారి వల్లభాపురపు జోసఫ్‌ ఎవరితోనో కోట్లాడి బండభూతులు తిట్టి వచ్చాడు. జోసఫ్‌ తంబిగారు వారింటికి వెళ్లి, “నీవు తప్పు చేస్తున్నావు. పశ్చాత్తాప పడు” అని అన్నారు. ‘జోసఫ్‌ తంబిగారా! ఆ విషయం మీకు ఎలా తెలుసు?’ అని అడుగగా, “దేవుడే తెలియ పరుస్తున్నాడు. నీవు శాంతిగా జీవించాలని దేవుని కోరిక” అని అన్నారు.

మరియొక సారి తెలగతోటి పౌలుగారు తన భార్యకు చెప్పకుండా ఒక క్రొత్త చొక్కాను కుట్టించు కున్నాడు. 25-26 డిసెంబరు తారీఖులలో దానిని ధరించాడు. 27వ తారీఖున, నీళ్ళ తొట్టి వద్ద కాలు జారి క్రిందపడి చేయి విరగొట్టు కున్నాడు. చేతి మణికట్టు దగ్గర అయిన గాయం బాగా నొప్పిగా ఉండటము వలన, పౌలుగారి అత్త లేయమ్మ అతడిని జోసఫ్‌ తంబిగారి వద్దకు తీసుకొని వెళ్ళింది. జోసఫ్‌ తంబిగారు పౌలు ముఖము లోనికి చూస్తూ, ‘‘నీవు, నీ భార్యకు చెప్పకుండా క్రొత్త చొక్కాను కుట్టించు కున్నావు. ఇసారికి సరే. ఇంకెప్పుడు అలా చేయవద్దు’’ అని అన్నారు.

ఆశీర్వదించిన తైలమును పూసి, గాయమునకు కట్టుకట్టి, ప్రార్ధన చేసారు. మరుసటి రోజు ఆ గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈవిధంగా, శారీరక స్వస్థత మాత్రమే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా యిచ్చేవారు జోసఫ్‌ తంబిగారు.

జోసఫ్‌ తంబిగారి యింకొక సుగుణం గురించి ఇచ్చట చెప్పవసి యున్నది. ఎవరైనా బాధతో ఉంటే, వారిని ఓదార్చే వారు. వారి కోసం ప్రార్ధించే వారు. వారిలోని భయాందోలనలను తొలగించే వారు. ఒక గురువారము రోజున జోసఫ్‌ తంబిగారు తనకోసం కొంచెం బియ్యం, పచ్చ పెసర్లు కొనుక్కు రమ్మని అవుటపల్లికి చెందిన నాగదేశి ఆరోగ్యమ్మను కోరగా ఆమె అలాగే చేసింది. మరుసటి రోజు శుక్రవారం.

ఉదయం పూజ ముగియగానే జోసఫ్‌ తంబిగారు వడివడిగా తన గదికి వెళ్ళిపోయారు. నిన్నటి డబ్బు అడుగుదామని ఆరోగ్యమ్మ జోసఫ్‌ తంబిగారి గదికి వెళ్లి, ‘నిన్నటి దినుసులకు డబ్బు ఇవ్వండి తంబిగారా?’ అని అడిగింది. అప్పుడు జోసఫ్‌ తంబిగారు కోపంతో ఆమె కళ్ళలోకి చూస్తూ, రుసరుస లాడుతూ, గదిలోనికి వెళ్లి, బియ్యం పెసర్లు ఉన్న కుండను తెచ్చి ఆమె ముందు ఎత్తివేశాడు. కుండ పగిలి గింజలు నేలమట్ట మయ్యాయి. ఆరోగ్యమ్మ భయపడి ఏడుస్తూ యింటికి వెళ్ళి పోయింది. భయముతో ఆమె శరీరం వణుకుతుంది. ‘ఈరోజు శుక్రవారం కదా! ఆయన దగ్గరకు ఎందుకు వెళ్లావు? అని తోటివారు అన్నప్పుడు, ‘క్షమించండి, తప్పయిపోయింది’ అని అంటూ వెళ్ళిపోయింది.

మరుసటి రోజు ఉదయం. జోసఫ్‌ తంబిగారే స్వయంగా ఆరోగ్యమ్మ యింటికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళారు. ఇంటిముందు నిలబడి పేరు పెట్టి పిలిచారు. ఆమె భయపడి బయటికి రాకపోయే సరికి మళ్ళీ పేరుపెట్టి ప్రేమ నిండిన గొంతుతో పిలువగా, ధైర్యం తెచ్చుకొని, బయటికి వచ్చి, ‘క్షమించండి తంబిగారాఅంటూ వణుకుతున్న స్వరంతో క్షమాపణ కోరింది. “నన్ను చూసి భయపడ వద్ధమ్మా” అని అన్నారు జోసఫ్‌ తంబిగారు.

ఆ తరువాత, “అమ్మా! నీకు ఏ ఆపద వచ్చినా, నీ కష్ట కాలంలో నన్ను తుచుకుంటే చాలు, నీ కష్టాలు తొలగి పోతాయి’’ అని వాగ్దానం చేసారు. ఆమె తరువాత, జీవితంలో జోసఫ్‌ తంబిగారి వాగ్దానంతో ఎంతో ఊరట నొంది ప్రశాంతంగా జీవించినది.

No comments:

Post a Comment