అధ్యాయము 16
అవుటపల్లిలో జోసఫ్ తంబిగారి కీర్తి
విజయవాడ మేత్రాసణములో అవుటపల్లి
గ్రామము పురాతన విచారణలలో ఒకటి. క్రీ.శ. 1905వ సంవత్సరములో గురుశ్రీ సాంతాబ్రోజియో
PIME వారు అవుటపల్లిలో మొట్టమొదటిగా జ్ఞానస్నానాలను ఇచ్చి యున్నారు.
క్రీ.శ. 1907వ సంవత్సరములో గురుశ్రీ సపోర్తి, గురుశ్రీ ఘిడ్డోని వారు అవుటపల్లి చుట్టు
ప్రక్కల సువార్తా బోధన చేసారు.
మొదటగా అవుటపల్లి గ్రామము ‘వెన్నెనపూడి’ విచారణ క్రింద
ఉండెడిది. క్రీ.శ. 1915 నుండి 1917 వరకు గురుశ్రీ పాస్కాలి PIME వారు అవుటపల్లిలో విచారణ వ్యవహారాను నిర్వహించారు. ఆ తరువాత, కొంతకాలం సరియైన
విచారణ గురువులు లేకయే అవుటపల్లి విచారణ కొనసాగింది.
అవుటపల్లిలో మొట్టమొదటి దేవాలయాన్ని
మోన్సిగ్నోర్ ఎచ్. పెజ్జోని వారు ‘జేసు తిరు హృదయం’ పేరిట నిర్మించారు. 23 నవంబరు 1916వ
సంవత్సరములో హైదరాబాదు మేత్రాణులు ‘దియోనిసియో విస్మారా’ వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్టించి
ఆశీర్వదించారు.
క్రీ.శ. 1925వ సంవత్సరములో
కొద్దికాలం పాటు గురుశ్రీ బందనాధం మరియన్న వారు విజయవాడ నుండి వస్తూ విచారణ బాధ్యతలను
నిర్వహించారు. పూర్తికాలపు విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించిన వారు గురుశ్రీ
అంతోని లాంజా PIME వారు. 1925 నుండి 1928 వరకు ఆయన ప్రజలలో
భక్తిభావాలు పెంపొందించారు.
గురుశ్రీ జాన్ బి. కల్దెరారో |
క్రీ.శ. 1933వ సంవత్సరములో ‘బెజవాడ’ (విజయవాడ)
మేత్రాసణముగా విడిపోయినప్పుడు, అవుటపల్లి విచారణ కేసరపల్లి, తేలప్రోలు, కొండపావులూరు, వట్లూరు, అజ్జంపూడి, కోయిగురప్పాడు, బండారుగూడెం, మాదుగూడెం, ఆనందాపురం, పోసానపల్లి, కానుమోలు మొదలగు
గ్రామాలతో అలరారినది.
నూజివీడు (1953), కేసరపల్లి
(1961), తేలప్రోలు
(1965), కొన్ని
గ్రామాలు ఉప్పూరు (1923) మరియు వట్లూరు (1936) అవుటపల్లి విచారణనుండి విడిపోయి
నూతన విచారణలుగా ఏర్పాడ్డాయి.
అంబ్రోస్ ది బత్తిస్త |
క్రీ.శ. 1968వ సంవత్సరములో
గురుశ్రీ అవిటో పొట్టుకులం, గురుశ్రీ జాన్ బి. కల్దెరారో వారికి సహాయ గురువుగా
ఉండి, 5
సెప్టెంబరు 1969వ సంవత్సరములో విచారణ గురువులుగా బాధ్యతలను స్వీకరించారు. తరువాతి
కాలములో అనేకమంది కపూచిన్ గురువులు ఆధ్వర్యములో అవుటపల్లి విచారణ అద్భుతమైన
పురోగతిని సాధిస్తూ ఉన్నది.
కపూచిన్ గురువులు గురుశ్రీ
అడాల్ఫ్ కన్నడిపర వారు అవుటపల్లిలో నూతన దేవాలయాన్ని నిర్మించారు. 14 జనవరి 1986వ
సంవత్సరములో విజయవాడ మేత్రాణులు జోసఫ్ తుమ్మా వారు నూతన దేవాలయమును ప్రతిష్టించి
ఆశీర్వదించారు.
1968వ సంవత్సరమునుండి కపూచిన్
సభకు చెందిన గురువులు విచారణ పరిధిలోగల గ్రామములోని ప్రజలతో విశ్వాస లక్షణములను
పెంపొందించుటయే గాక ఎన్నో సాంఘిక, సంక్షేమ, కార్యక్రమములను చేపట్టి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించు చున్నారు.
వృద్దాశ్రమమును నడుపుచున్నారు. విచారణలో నూతన దేవాలయమును నిర్మించి, అలాగే, విచారణలోని
గ్రామాలలో కొన్ని నూతన దేవాలయాలు నిర్మించి, విచారణను మిక్కిలి అభివృద్ధి పధంలో నడిపించు చున్నారు.
ప్రస్తుత కేంద్ర దేవాలయమును
బహువిధ ప్రతిష్టాత్మకంగా నూత్నీకరించి, పాలరాతి ప్రభతో ప్రతిష్టాత్మకంగా తయారు
చేసియున్నారు. నిత్యము వచ్చే పుణ్యక్షేత్ర దర్శనోత్సాహక భక్తులకు అసౌకర్యము కలుగని
విధంగా సకల ప్రాంగణమును సంస్కరించి, ప్రతిష్టాత్మకంగా రూపొందించి యున్నారు. అక్కడే నున్న
దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి సమాధిని సర్వాంకార సంశోభితంగా పాలరాతి
ప్రభతో తీర్చిదిద్ది యున్నారు.
ఇప్పుడు అవుటపల్లి బ్రదర్
జోసఫ్ తంబి
మహిమలావిష్క్రుత పుణ్యక్షేత్రము
భక్త జనుల యాత్రా క్షేత్రము.
జోసఫ్ తంబి
గారి కీర్తి
గురుశ్రీ జాన్ బి. కల్దెరారో
వారు అవుటపల్లి విచారణ గురువులుగా ఉన్న సమయములో, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి
తృతీయ సభ సభ్యునిగా, బ్రదర్
జోసఫ్ తంబిగారు ఆంధ్రావనిలోనికి అడుగిడి, క్రీ.శ. 1939వ సంవత్సరములో అవుటపల్లిలో తన
నివాసమును ఏర్పరచుకొని పుణ్య జీవితమును జీవించారు. ఎంతోమంది హిందువులు క్రీస్తు
విశ్వాసములో నడచుటకు కృషి చేసాడు. ఆయన జీవించిన కాలములో ఒక లెజెండ్ వలె
జీవించినారు.
బ్రదర్ జోసఫ్ తంబిగారి
నిష్కపట మనస్సు, భక్తిపూర్వకమైన
జీవితం ఎంతో మందిని ఆకర్షించినది. క్రీస్తు శ్రమలలో పాలుపంచు కొనుటకు తరుచుగా పంచ గాయాలను
పొందారు. అద్భుత రీతిన స్వస్థతా వరమును, తక్షణ గమన వరమును పొంది యున్నారు.
క్రీ.శ. 1945వ సంవత్సరములో
దైవభక్తుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి మరణ రోజునుండి ఈనాటి వరకు కూడా ఆయనను
పూజ్యునిగా గౌరవించడం అధికమధిక మగుచున్నది. ఆయన సమాధి వద్ద ప్రార్ధనలు చేయుటకు, ఆయన మధ్యస్థ
ప్రార్ధన ద్వారా దైవాశీస్సులను, అనుగ్రహాలను పొందుటకు వేలాది భక్తులు, విశ్వాసులు
తరలి వస్తున్నారు. ఆయన సమాధిని సందర్శించే వారిలో కేవలం కతోలిక క్రైస్తవులు
మాత్రమే గాక, ఎంతో మంది
ఇతర క్రైస్తవ సంఘాల వారు,
హిందువులు,
ముస్లిములు, ఇలా
అన్ని మతాలవారు, అంతస్థులవారు
ఉండటం గమనార్హం!
బ్రదర్ జోసఫ్ తంబిగారి
సమాధిని, పుణ్యక్షేత్రమును
సందర్శించే వారిలో కేవలం తెలుగు రాష్ట్రాల వారేగాక, తమిళనాడు, కేరళ, కర్నాటక
రాష్ట్రాలనుండి కూడా తరలి వస్తున్నారు. ఇలా ఆయన కీర్తి పలు రాష్ట్రాలకు పాకి పోయింది.
అవుటపల్లిలోని ఆ మహనీయుని సమాధి వద్దకు నేటికీ దేశం నలుమూల నుండి ప్రజలు వచ్చి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక
స్వస్థతలను పొందు చున్నారు. వీరి మహిమల వలననే అవుటపల్లి పెద్ద పుణ్యక్షేత్ర
స్థాయికి ఎదిగినది.
బ్రదర్ జోసఫ్ తంబిగారి
మధ్యస్థ ప్రార్ధనల ద్వారా ఎంతో మంది అద్భుతాలను చవి చూస్తున్నారు. వారి జీవితములో
పొందిన అద్భుతాలను వ్రాతపూర్వకముగా సాక్ష్యమును ఇస్తున్నారు. విశ్వాసులు పొందే
దైవానుగ్రహాలలో పిల్లలు లేని దంపతులు పిల్లలను పొందటం, వివిధ రకాలైన
అనారోగ్యము నుండి స్వస్థత పొందటం, అపాయము నుండి రక్షింప బడటం మొదలగునవి.
ఆయన మరణ వార్షికోత్సవమును
పురస్కరించుకొని ప్రతీ సంవత్సరము 13,14,15 జనవరి తేదీలలో ఆయన పేరిట ఉత్సవాలు
ఘనముగా, వైభవముగా
కొనియాడ బడుచున్నాయి. ఈ వేడుకలలో అనేక రాష్ట్రాలనుండి, ఆయన భక్తులు, వేలమంది, అవుటపల్లిలోని
ఆయన సమాధిని సందర్శించి,
మొక్కుబడులు చెల్లించి ప్రార్ధనలు చేయు చున్నారు. వేలాది మంది యాత్రికులు కుల, మత, జాతి బేధము
లేకుండా ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఈ మూడు రోజులు కూడా దివ్యపూజా బలులు అర్పించ
బడుచున్నాయి.
కేవలము వర్ధంతి వేడుకలకు
మాత్రమే గాక, సంవత్సరం
పొడవునా, వేలమంది
భక్త జనులు ఆయన సమాధిని సందర్శిస్తున్నారు. ప్రసన్న వదనాలతో ప్రార్ధనలు చేయుచున్నారు.
ఈ విధముగా, అవుటపల్లి
దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి కీర్తితో ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా వెలుగొందు
చున్నది.
No comments:
Post a Comment