Friday, June 12, 2020

జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము - అభివృద్ధి

అధ్యాయము 17
జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము - అభివృద్ధి

క్రీ.శ. 1927వ సంవత్సరములో గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు నిర్మించిన గురు నిలయము క్రీ.శ. 1985వ సంవత్సరము నుండి బ్రదర్‌ జోసఫ్‌ తంబి ఆశ్రమంగా పిలువ బడుచున్నది.

బ్రదర్‌ జోసఫ్‌ తంబి ఆశ్రమం

క్రీ.శ. 1916వ సంవత్సరములో నిర్మించ బడిన విచారణ దేవాలయము క్రీ.శ. 1977వ సంవత్సరములో సంభవించిన ఘోర తుఫానులో దెబ్బతినడం వలన, దాని స్థానములో క్రీ.శ. 1986వ సంవత్సరములో ప్రస్తుతం ఉన్న దేవాలయము [యేసు తిరు హృదయ దేవాలయం] నిర్మించడమైనది.

యేసు తిరు హృదయ దేవాలయం

క్రీ.శ. 2017-2018 కాలములో విచారణ దేవాలయమును సుందరము గాను, పుణ్యక్షేత్ర ప్రాంగణమును అందము గాను తీర్చిదిద్దడ మైనది. 18 ఫిబ్రవరి 2018న విజయవాడ మేత్రాణులైన తెలగతోటి జోసఫ్‌ రాజారావు వారి హస్తముల మీదుగా పునరంకితం చేయ బడినది. ప్రస్తుతము అవుటపల్లి విచారణకు 9 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిపై చిన్న ప్రార్దానాలయం నిర్మించడ మైనది. 15 డిసెంబరు 1990 నాటికి సమాధిపై నూతన ఆలయము నిర్మించబడి ఆశీర్వదింప బడినది. క్రీ.శ. 2019వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారి సమాధి ఆలయమును, దాని చుట్టుప్రక్కల ప్రాంగణమును సుందరముగా తీర్చిదిద్ద బడినది. 6 జనవరి 2019న విజయవాడ మేత్రాణులైన తెలగతోటి జోసఫ్‌ రాజారావు వారి హస్తముల మీదుగా పునరంకితం చేయబడినది.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధి


బ్రదర్‌ జోసఫ్‌ తంబి గారి కోరిక మేరకు గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు క్రీ.శ. 1949వ సంవత్సరములో వృద్ధాశ్రమమును (సెయింట్ జోసఫ్ వృద్ధాశ్రమము) నిర్మించారు. క్రీ.శ. 1977వ సంవత్సరములో వచ్చిన ఘోర తుఫానులో దెబ్బతిన్న వృద్ధాశ్రమ భవనమును తొలగించి, క్రీ.శ. 1979వ సంవత్సరములో, కపూచిన్‌ గురువులు ప్రస్తుతమున్న రెండస్తుల వృద్ధాశ్రమ భవనము నిర్మించి యున్నారు. ఇప్పుడు శాంతి సదన్‌గా పిలువ బడుచున్నది. నిరాశ్రయులైన ఎంతో మంది వృద్ధులు ఇచ్చట చేరిసంతోషముగా జీవించు చున్నారు.

 శాంతి సదన్‌

 క్రీ.శ. 2013వ సంవత్సరములో యాత్రికుల సౌకర్యార్ధం, సౌకర్య వంతమైన విశ్రాంతి భవనము నిర్మించ బడినది.

క్రీ.శ. 1995వ సంవత్సరము, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి 50వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రారభించబడిన ‘‘తంబి వెలుగు: కుటుంబ ఆధ్యాత్మిక పత్రిక’’ పుణ్యక్షేత్రము నుండి ప్రచురింప బడుచున్నది.

మూడు సభల కన్యాస్త్రీలు జోసఫ్‌ తంబిగారి పుణ్యక్షేత్రములో తమ సేవను అందిస్తున్నారు. ఎఫ్‌.సి.సి. సభకు చెందిన మఠకన్యలు పుణ్యక్షేత్ర పనులను, వృద్ధాశ్రమమును నడిపించుటలో సహాయము చేయుచున్నారు. సి.ఎఫ్‌.ఎం.ఎస్‌.ఎస్‌. సభకు చెందిన మఠకన్యలు జోసఫ్‌ తంబి ఆశ్రమం, యాత్రికుల విశ్రాంతి భవనం నడుపుటకు సేవలను అందిస్తున్నారు. సి.ఎస్‌.ఐ. సభకు చెందిన మఠకన్యలు తమ స్వంత స్కూలు, హాస్టలు ద్వారా విద్యను అందిస్తున్నారు.

ఇంకా పుణ్యక్షేత్ర ఆవరణలో బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు ఆరు సంవత్సరాలు జీవించిన యింటిని, యింటి ముందు ఆయన వాడిన నీళ్ళ బావిని చూడవచ్చు.

తంబిగారు నివసించిన గృహము, వాడిన బావి


అలాగే బ్రదర్‌ జోసఫ్‌ తంబి మ్యూజియంను కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో, జోసఫ్‌ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా, భక్తులు, విశ్వాసులు సమర్పించిన ఎన్నో జ్ఞాపికలను చూడవచ్చు. ఇవి వారి కృతజ్ఞతా భావమునకు జ్ఞాపికలు.

అలాగే, దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సంగ్రహ జీవిత చరిత్రను చిత్రపటాల ద్వారా అర్ధవంతముగా తిలకిస్తూ, ధ్యానించవచ్చు. ఇంకా దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారికి సంబంధించిన అనేకానేకమైన తీపి గురుతులను ఈ మ్యూజియములో తిలకించవచ్చు.

బ్రదర్‌ జోసఫ్‌ తంబి మ్యూజియం


తంబిగారి సమాధి


















No comments:

Post a Comment