Thursday, July 9, 2020

కుటుంబము, బాల్యము, యౌవ్వనము

అధ్యాయము 01
కుటుంబము, బాల్యము, యౌవ్వనము 

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోస్ మల్లి మరియ. పుట్టు క్రైస్తవ కతోలిక విశ్వాసులు. వీరి స్వస్థలం దక్షిణ భారతదేశమున ఆగ్నేయ తీరమున నున్న కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోని ‘కారైకాల్‌’ పట్టణము. ఆనాటి పాండిచ్చేరి ఒక ఫ్రెంచి కాలని. వీరికి ఫ్రెంచి పౌరసత్వం ఉన్నది. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోస్ మల్లి మరియ గృహిణి.

ఉద్యోగ నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్‌’ దేశమునకు వెళ్ళాడు. ‘సైగోన్‌’ ప్రస్తుత వియత్నాం దేశములోని అప్పటి ఫ్రెంచి కాలని. ప్రస్తుతం ‘హోషిన్‌ మిన్హ’గా పిలువబడుచున్నది. వారు అచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు వారు ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’ అని పేరు పెట్టారు. ఈ ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’యే నేటి మన ‘దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి’ గారు.
‘తంబి’ అనగా తమిళములో ‘తమ్ముడు’ అని అర్ధం ఉన్నను, ఇంటిపేరుగాను, కుటుంబ నామముగాను వాడుతూ ఉంటారు. ‘తంబి’ కుటుంబీకులు పాండిచ్చేరిలోని ‘కారైకాల్‌’ గ్రామమునందు సుప్రసిద్ధులు, ఉన్నత వర్గానికి చెందినవారు. ఫ్రెంచి స్థావరమైన పాండిచ్చేరిలో, ‘తంబి’ కుటుంబీకులు అనేకమంది ప్రభుత్వోద్యోగులుగా పనిచేసేవారు. 

జోసఫ్‌ తంబికి రెండేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, అనగా క్రీ.శ. 1892వ సంవత్సరములో శవరిముత్తు, రోస్ మల్లి మరియ, బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, తన కుమారుని తీసుకొని భారతదేశమునకు తిరిగి వచ్చారు. ఆ తరువాత క్రీ.శ. 1893వ సంవత్సరములో శవరిముత్తు, రోస్ మల్లి మరియ దంపతులు మరొక కుమారునకు జన్మనిచ్చారు. ఆ కుమారునకు ‘మైకేల్‌ ధైరియాన్‌ తంబి’ అని పేరు పెట్టారు. 

క్రీ.శ. 1897వ సంవత్సరము. జోసఫ్‌ తంబికి ఏడు సంవత్సరములు. తల్లి ‘రోస్ మల్లి మరియ’ అకస్మాత్తుగా మరణించినది. ఇలా పిన్నవయస్సులోనే జోసఫ్‌ తంబి తన తల్లిని కోల్పోయాడు. 

అప్పుడు తండ్రి శవరిముత్తు, తన ఇద్దరి చిన్నారుల ఆలన, పాలనా చూసుకోవడానికి, మరో వివాహము చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు..త్వరలోనే ‘మేరి తెరేసా’ అను స్త్రీని రెండవ వివాహము చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె జన్మించినది. ఆ ముద్దుక కుమార్తెకు ‘మేరి’ అను పేరు పెట్టారు. 

అయితే జోసఫ్‌ తంబియొక్క సవతి తల్లి చాలా గర్విష్టి, అసూయపరురాలు. జోసఫ్‌ తంబిని ఇష్టపడలేదు. రోజూ చిటపటలు, చికాకులే! జోసఫ్‌ తంబిని ఎన్నో హింసలకు గురిచేసింది. రోజూ సరిగా భోజనం కూడా పెట్టేది కాదు. బహుశా, తనకు కుమార్తె పుట్టడముతో, శవరిముత్తు మొదటి భార్య పిల్లలంటే ఆమెకు అయిష్టం కలిగి ఉండవచ్చు! 

జోసఫ్‌ తంబి రోజూ దేవాయమునకు వెళ్ళేవాడు. భక్తిభావాలతో దివ్యపూజాబలిలో, ఆరాధనలో పాల్గొనేవాడు. విచారణలో జరిగే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. అతనికి పన్నెండేళ్ల వయస్సులో, అనగా క్రీ.శ. 1902వ సంవత్సరములో తోటి పిల్లలతో కలిసి దివ్యసత్ప్రసాదము, భద్రమైన అభ్యంగనము పొందుటకు శిక్షణను పొందుతూ ఉన్నాడు. 

ఆ రోజు రానే వచ్చింది! దివ్య సంస్కారములను పొందుటకు ఎంతో ఆసక్తిగా, భక్తిశ్రద్ధలతో, దేవాలయమునకు వెళ్ళగా, సవతి తల్లి వచ్చి విచారణ గురువులకు తన అభ్యంతరాన్ని తెలియజేసింది. అప్పటికప్పుడు గురువు ఆమెకు సర్దిచెప్పి దివ్యసంస్కారాలను జోసఫ్‌ తంబికి ఇప్పించియున్నారు. చేసేది ఏమీ లేక, ఆమె కోపముతో అక్కడనుండి వెళ్లిపోయింది. 

ఈ సంఘటనతో, ఆగ్రహించిన సవతి తల్లి, జోసఫ్‌ తంబిని నిష్టూరముగా దూషించినది. అన్నంకూడా పెట్టకుండా, కడుపు మాడ్చి శిక్షించినది. ఇలా ఎన్నో హింసలకు, బాధలకు గురిచేసింది. 

సవతి తల్లి పెట్టే హింసలను, బాధలను తాళలేక జోసఫ్‌ తంబి చెట్టాపెట్టకుండా యింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. తన తమ్ముడు ‘మైకేల్‌ ధైరియాన్‌ తంబి’ మరీ చిన్నవాడు కనుక తండ్రి వద్దనే వదిలి వెళ్ళిపోయాడు. 

యింటినుంచి వెళ్లిపోయిన తంబి ఎక్కడికి వెళ్ళాడు? జోసఫ్‌ తంబి పొరుగు రాష్ట్రమైన కేరళకు చేరుకున్నాడు. తాను ఇదివరకు ఎన్నడు చూడని ప్రాంతం, ప్రజలు! అచ్చట ఎన్నో కష్టాలను, బాధలను ఎదుర్కొన్నాడు. 

తెగిన గాలిపటంలా, రెక్కలు విరిగిన పక్షిలా నిస్సహాయ స్థితిలోనున్న వేళ, దేవుడు తంబికి ఓ చక్కని మార్గాన్ని చూపాడు. ‘ఎర్నాకుళం’ అను ప్రదేశములో ఒక పుణ్యాత్మురాలి చల్లని పిలుపు తంబికి వినబడినది. ఆమె పిలుపును అనుసరించాడు. ఆ దయగల తల్లి సంరక్షణలో, ఆలనా పాలనలో, ఊరడింపులో, ఆదరణలో విద్యాబుద్ధులు నేర్చుకొంటూ పెరిగాడు. క్రైస్తవ విశ్వాసములోను, ఆత్మవిశ్వాసములోను, అంచలంచలుగా ఎదిగాడు. దేవుని సంరక్షణ, కాపుదల ఎంత అద్భుతమో గదా! 

యుక్త వయస్సు వచ్చిన తరువాత జోసఫ్‌ తంబి సైన్యములో చేరాడని, ఆతరువాత తిరిగి వచ్చేసాడని ఒక నానుడి! లేదా ఏదైనా మఠవాస సభలో చేరి దానిని వదిలినట్లుగా సమాచారం. దీనికి కారణం, జోసఫ్‌ తంబి లతీను భాషలో ప్రార్ధనలను జపించేవాడు. 

ఎదేమైనప్పటికిని, కేరళలోని ఆ పుణ్యాత్మురాలి ఇల్లు విడచిన తరువాత, వివిధ ప్రదేశాలు తిరుగుతూ, దైవాన్వేషణలో దైవ పిలుపు కోసం పరితపిస్తూ కాలాన్ని గడిపియున్నాడు. ఈవిధముగా కొన్ని సంవత్సరాల పాటుగా భిక్షాటన చేస్తూ, తన జీవితమునకు ఓ సరైన గమ్యాన్ని వెతుక్కొంటూ సంఘ పరిత్యాగియై తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 

పెరిగి పెద్దవాడైన జోసఫ్‌ తంబి, శ్రీసభ విశ్వాసములో ఎదిగాడు. కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములోను, ఆ తరువాత కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములోను జోసఫ్‌ తంబి, గురువులకు సహాయకునిగా, పరిచారకునిగా, ఉపదేశిగా దైవసన్నిధిలో తన సేవను అందించియున్నాడు. 

మానవత్వమున్న ప్రతీ మనిషిలో కన్నవారిపై, తోబుట్టువులపై, బంధువులపై, ఆప్తులపై మరచిపోలేని మమకారాలు సహజముగా ఉంటాయి. అలాంటి గొప్ప మానవత్వమున్న జోసఫ్‌ తంబి తరచుగా స్వస్థలమును సందర్శించేవాడు. కాని ఎవరుకూడా ఆయనను గుర్తించేవారు కాదు. ఎందుకన, వేషం మారింది, రూపం మారింది, వయోజనుడయ్యాడు. అలాగే, భిక్షాటన చేస్తూ వెళ్ళేవాడు. అందుకే ఎవరూకూడా తనను గుర్తింప లేకపోయారు. 

ఒకానొక సందర్భములో కన్నతండ్రి కూడా జోసఫ్‌ తంబిని గుర్తించలేదు. భిక్షాటనకు వెళ్ళినప్పుడు, ఒక అణా ధర్మం చేసి పంపించి వేసాడు. జోసఫ్‌ తంబి కూడా తన గురించి ఎవరికి చెప్పేవాడు కాదు. 

అయితే, ఒకసారి, అతని బంధువు అంత్యక్రియలో పాల్గొనుటకు వచ్చిన జోసఫ్‌ తంబిని అతని నాయనమ్మ గుర్తించడం జరిగింది. 

క్రీ.శ. 1916వ సంవత్సరము. జోసఫ్‌ తంబికి 26 సంవత్సరాలు. ఒకరోజు ‘పుదువై’లోని ‘పునీత జ్ఞాన ప్రకాశియార్‌’ అను మఠకన్య నిలయానికి భిక్షాటనకు వెళ్ళాడు. మదర్‌ లాంతార్క్‌ వారు అక్కడ ఉన్నారు. ‘యుక్తవయస్సులో ఉన్నాడు కదా! ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నాడు!’ అని మదర్‌ లాంతార్క్‌తో పాటు, ఇతర మఠకన్యలు తమ అనుమానాన్ని వ్యక్తపరచారు. అప్పడు జోసఫ్‌ తంబి, “నన్ను అనుమానించకండి. నేను పాండిచ్చేరి ప్రాంతము వాడిని. చిన్నవయస్సులో, మా నాన్నగారికి తెలియకుండా ఇంటినుండి వెళ్లిపోయాను. ఇప్పటికి కూడా వారికి నాగురించి తెలియదు” అని చెప్పాడు. 

‘కాట్పాడి’ అనే ప్రాంతములో భక్తిగల క్రైస్తవ కుటుంబము ఒకటి ఉండేది. జోసఫ్‌ తంబి ఆ కుటుంబమును తరుచుగా సందర్శించేవాడు. అందువలన పొరుగువారు ఈర్ష్యతో ఆ కుటుంబమును నాశనము చేయ ప్రయత్నం చేసారు. ఆ కుటుంబమును ఎన్నో ఇబ్బందుకు, బాధలకు గురిచేసారు. 

ఒకరోజు జోసఫ్‌ తంబిగారు ఆ యింటిని సందర్శించినప్పుడు, యింటి యజమానురాలైన శిరోమణి చాలా బాధతో ఉండటం చూసారు. విషయాన్ని తెలుసుకున్న జోసఫ్‌ తంబి, “పొరుగువారు ‘చేతబడి’ చేశారు. మిమ్మును నాశనం చేయాని చూస్తున్నారు” అని ఆమెతో చెప్పారు. చేతబడి చేసిన వ్యక్తి పేరు కూడా చెప్పియున్నారు. శిరోమణి వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి చేతబడిని తీసివేయించినది. 

వీటన్నింటి వలన కుటుంబ యజమానికూడా బాగా కలత చెందాడు. అనారోగ్యం పాలయ్యాడు. జోసఫ్‌ తంబిగారు ప్రార్ధన చేసి, అతనిపై సిలువ గురుతు వేయగా, తిరిగి అతను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందియున్నాడు. 

క్రీ.శ. 1938వ సంవత్సరములో ఒకరోజు జోసఫ్‌ తంబిగారు ‘ఉలవర్కారి’ అనే ప్రదేశములోనున్న మఠకన్య నిలయానికి బిక్షాటనకు వెళ్ళారు. మఠకన్యలు అతనికి భోజనమును ఏర్పాటు చేసారు. అప్పుడు తంబిగారు నేలను తుడిచి, పల్లెములోని భోజనమును నేలపై పెట్టి, రెండు చేతులను వెనుకకు పెట్టుకొని, మోకాళ్ళ మీద వంగి తిన్నాడు. ఇది జోసఫ్‌ తంబిగారి దీనత్వాన్ని సూచిస్తున్నది. 

భోజనము తరువాత, ప్రార్ధనాలయములోనికి వెళ్లి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి ప్రతిమ ముందు మరియు క్రీస్తు సిలువ చెంత ప్రార్ధన చేయుచుండగా, జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందాడు. మఠకన్యలను ఒక తెల్ల గుడ్డను అడిగి తీసుకొని గాయమునుండి కారుచున్న రక్తమును తుడచుకున్నాడు. 

జోసఫ్‌ తంబి తోబుట్టువు తమ్ముడైన ‘మైకేల్‌ ధైరియాన్‌ తంబి’ ఉద్యోగ నిమిత్తమై ‘సైగోన్‌’ దేశమునకు వెళ్లియున్నాడు. అక్కడే ‘మరియ తెరెసా’ను వివాహమాడాడు. వారికి నలుగురు సంతానం. ఆల్బర్ట్ తంబి, విక్టర్‌ తంబి, రాబర్ట్‌ తంబి అను ముగ్గురు కుమారులు. గాబ్రియేల్‌ మరియ థెరేసా తంబి అను ఒక కుమార్తె. 

జోసఫ్‌ తంబిగారు ‘సైగోన్‌’లోనున్న తన వారిని కూడా సందర్శించి యున్నాడు. అయితే ఆ రోజులో సామాన్యులకు విమాన ప్రయాణాలు అందుబాటులో ఉండేవి కావు. కనుక సుదూర దేశములోనున్న తన వారిని జోసఫ్‌ తంబిగారు సందర్శించడం ఆశ్చర్యకరమైన విషయమే! అది ఎలా సాధ్యమైనది! అది జోసఫ్‌ తంబి ‘ద్వంద్వ దర్శన’ వరము వలన సాధ్యమయినది! ఒకే సమయములో రెండు చోట్ల ఉండే వరాన్ని దైవ వరముగా జోసఫ్‌ తంబిగారు పొందియున్నారు. అయితే చాలా వరకు, జోసఫ్‌ తంబిగారు ‘తక్షణ గమనం’ అనే వరాన్ని కూడా కలిగియున్నారు. ఒకచోట నున్న జోసఫ్‌ తంబిగారు క్షణములో తను అనుకున్న చోటులో ప్రత్యక్షం అయ్యేవారు. ఇది దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప వరం. 

అది రెండవ ప్రపంచ యుద్ధ కాలం. క్రీ.శ. 1942వ సంవత్సరములో, కొందరు పునీత అలోషియస్‌ గొంజాగ సభకు చెందిన మఠకన్యలు, బర్మా దేశమునుండి నలుబది రోజులు ప్రయాణము చేసి భారతదేశమునకు వచ్చినప్పుడు, జోసఫ్‌ తంబిగారు, వారికి తెలియకుండా వెంబడిస్తూ వారికి మార్గదర్శియైనాడు. పాండిచ్చేరి కథేద్రల్‌ ప్రక్కన ఉన్న వారి మదర్‌ హౌసునకు వారిని సురక్షితముగా చేర్చారు. పాండిచ్చేరి చేరుకున్నాక వారు, ‘మీరెవరు?’ అని జోసఫ్‌ తంబిగారిని ప్రశ్నింపగా, ఏ జవాబు చెప్పకుండా అక్కడనుండి అదృష్యుడైనారు. 

విద్యావంతుడు, విశేష విజ్ఞానఘని అయిన జోసఫ్‌ తంబి పట్టుదలతో ఎక్కడికి వెళ్ళినను స్థానిక భాషను నేర్చుకునేవారు. ఈవిధముగా జోసఫ్‌ తంబికి మాతృభాషయైన తమిళంతో పాటు మళయాళం, ఫ్రెంచి, లతీను, ఆంగ్లము, తెలుగు భాషలను నేర్చుకున్నారు. 

జోసఫ్‌ తంబి సోదరుడు, ‘మైకేల్‌ ధైరియాన్‌ తంబి’ కుటుంబం భారతదేశమునకు తిరిగి వచ్చిన అనంతరం, ‘మైకేల్‌ ధైరియాన్‌ తంబి’ కుమార్తెయైన ‘గాబ్రియేల్‌ మరియ థెరేసా తంబి’ పాండిచ్చేరిలోని కార్మెల్‌ మఠసభలో చేరింది. 14 అక్టోబరు 1932న కార్మెల్‌ మఠసభలో తన మాటపట్టును ఇచ్చియున్నది. ఈ మాటపట్టు సాంగ్యానికి జోసఫ్‌ తంబిగారు కూడా హాజరై యున్నారు. ఈ సందర్భములో జోసఫ్‌ తంబి పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి తృతీయ సభకు చెందిన అంగీని ధరించియున్నారు. 

తన సోదరుని పెద్ద కుమారుడైన ఆల్బర్ట్ తంబి వివాహమునకు కూడా జోసఫ్‌ తంబి హాజరై యున్నారు. వివాహము రోజునే ఏదో కీడు సంభవించునని జోసఫ్‌ తంబి అక్కడి వారందరికి తెలియజేసియున్నారు, కాని అతని మాటలను ఎవ్వరు పట్టించుకొనలేదు. త్వరలోనే ఆల్బర్ట్తంబి అస్వస్థుడై మూడు వారాల వ్యవధిలో మరణించాడు. అతని భార్య ఫిలోమిన పుట్టింటికి వెళ్లి మఠవాస సభలో చేరి, తన పేరును ‘మేరి ఏంజెల్‌’గా మార్చుకొని మఠకన్యగా జీవించినది. 

విక్టర్‌ తంబి, రాబర్ట్‌ తంబిలు కూడా వివాహం చేసుకున్నారు. విక్టర్‌ తంబి అనతికాలములోనే మరణించాడు. రాబర్ట్‌ తంబి తన భార్య ‘మార్త’తో ఫ్రాన్స్‌ దేశములో స్థిరపడినాడు. 

క్రీ.శ. 1984వ సంవత్సరములో రాబర్ట్‌ తంబి కుటుంబ సభ్యులు, అవుటపల్లిలోని బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిని సందర్శించి యున్నారు. 

జోసఫ్‌ తంబి సవతి తల్లి ‘మేరి తెరేసా’ మొదట మరణించగా, సోదరుడు మైకేల్‌ ధైరియాన్‌ తంబి క్రీ.శ. 1935వ సంవత్సరములో మరణించాడు.

తంబిగారి బంధువులుతంబిగారి బంధువులు


తంబిగారి బంధువులు

No comments:

Post a Comment