Sunday, July 5, 2020

కేరళ రాష్ట్రములో ...

అధ్యాయము 05
కేరళ రాష్ట్రములో ...

 క్రీ.శ. 1936వ సంవత్సరం. తమిళనాడు నుండి కేరళ చేరుకున్న జోసఫ్‌ తంబి అనేక చోట్ల తిరిగి త్రిశూరు జిల్లాకు చేరుకున్నారు. అచ్చట లతీను దేవాలయమును కనుగొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ ఉన్నన్ని రోజులు దివ్యపూజాబలిలో పాల్గొన్నారు. రాత్రి పుత్తూరు’ (‘పొన్నుకర’)లోని మిషన్‌ దేవాలయములో పడుకొనెడివారు. అప్పుడప్పుడు సిరియన్‌ గురువు చేసే దివ్యపూజాబలిలో కూడా పాల్గొనేవారు.

జోసఫ్‌ తంబి తన ప్రేషిత సేవను ఎక్కువగా ఎర్నాకులంప్రాంతములో కొనసాగించి యున్నారు. కొచ్చిన్‌ప్రదేశములోని వీధులలో తిరిగుతూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి గురించి, ‘తృతీయ సభగురించి బోధించాడు. అయితే, పోలీసు సిబ్బంది అతని వేషధారణను చూసి అనుమానించారు. వీధులో తిరిగి అడుగుకొనుటను అడ్డుకున్నారు. అతనిపై చేయికూడా చేసుకున్నారు.

‘వీరాపోలి’ అగ్రమేత్రాసణ అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి
జోసఫ్‌ తంబి అక్కడినుండి వెళ్ళిపోయి వీరాపోలిఅగ్రమేత్రాసణ అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారిని కలుసుకున్నారు. పీఠాధిపతులను చూసిన వెంటనే జోసఫ్‌ తంబి అతని కాళ్ళపై పడి పోలీసుల హింసనుండి కాపాడమని వేడుకున్నాడు. పీఠాధిపతులు జోసఫ్‌ తంబిని ఓదార్చి తన ఆధ్యాత్మిక జీవితమును జీవించుటను కొనసాగించుమని ప్రోత్సహించాడు.

జోసఫ్‌ తంబిగారు జీవించే సాదాసీదా జీవన శైలి, భిక్షాటనచేసి జీవించడం, భిక్షాటన ద్వారా వచ్చిన దానిని పేదలకు దానం చేయడం, ఆధ్యాత్మిక ధ్యాస తప్ప లౌకిక విషయాపట్ల ఆసక్తి లేకపోవడం, రోజువారిగా కూలీ పనులకు వెళ్ళడం, మొదలగు వాటి గురించి తెలుసుకొనిన పీఠాధిపతులు, ఒకింత ఆశ్చర్యానికి గురియైనను, మంత్రముగ్ధుడయ్యాడు. జోసఫ్‌ తంబిగారిపట్ల ఎంతో గౌరవం, అభిమానం కలిగింది.

జోసఫ్‌ అట్టిపెట్టి పీఠాధిపతులు ఎర్నాకులంలో నూతనముగా థెరేసియన్‌ సహోదరులసభను స్థాపించి యున్నాడు. ఒక చిన్న పాఠశాలను నడుపుతూ, వివిధ విచారణలో సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు. థెరేసియన్‌ సహోదరుతో ఉండుమని, వారికి కావలసిన తర్ఫీదును ఇవ్వుమని పీఠాధిపతులు జోసఫ్‌ తంబిగారిని కోరియున్నారు. జోసఫ్‌ తంబిగారు అందుకు సంతోషముగా అంగీకరించారు.

అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారు జోసఫ్‌ తంబిగారిని థెరేసియన్‌ సహోదరులసభ కేంద్రమైన, త్రిశూరు జిల్లాలోని పుత్తూర్‌అను స్థలమునకు వెళ్ళమని క్రీ.శ. 1936వ సంవత్సరము చివరిలో కోరియున్నారు. అగ్రపీఠాధిపతులు ఇద్దరు థెరేసియన్‌ సహోదరులను పుత్తూరులో ఉంచియున్నారు. వారు అచ్చట తమ సేవలను అందిస్తూ ఉండేవారు. పుత్తూరులో ఉంటూ, ఆ ఇరువురు సహోదరులకు తర్ఫీదు ఇవ్వుమని, ఆధ్యాత్మిక విషయాలలో వారికి సహాయము చేయమని పీఠాధిపతులు జోసఫ్‌ తంబిగారిని కోరియున్నారు.

ఆ సమయములో మలబారుప్రాంతమంతా తిరుగుతూ తన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించాడు. అలాగే, ఆ ఇరువురు సహోదరులకు కావలసిన ఆధ్యాత్మిక సలహాలను, తర్ఫీదును ఇస్తూ ఉండేవాడు. అయితే అక్కడ కూడా జోసఫ్‌ తంబిగారిని పోలీసులు వేధింపులకు, హింసలకు గురిచేసారు.

పుత్తూర్‌కు దగ్గరిలో నాదతరవిచారణ ఉన్నది. విచారణ గురువుగా గురుశ్రీ మాత్యూ మురింగతెరి మరియు సహాయక విచారణ గురువుగా గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ ఉన్నారు. నాదతరలో సహాయక విచారణ గురువుగా ఉంటూనే, గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారు పుత్తూరులోని సిరియన్ దేవాలయ నిర్వహణ బాధ్యతను కూడా చూసేవారు.  

జోసఫ్‌ తంబిగారు పుత్తూరులో ఉంటూ త్రిశూరులోనున్న లతీను దేవాలయమునకు దివ్యపూజలో పాల్గొనడానికి వెళ్ళేవాడు.  త్రిశూరులోనున్న లతీను దేవాలయమునకు వెళ్ళుటకు వీలుకాని సమయములో పుత్తూరులోనే సిరియన్‌ దివ్యపూజాబలిలో పాల్గొనేవాడు.

ఈ సమయములోనే గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారితో జోసఫ్‌ తంబిగారికి మంచి స్నేహం, అనుబంధం ఏర్పడినది. వీరి కలయిక జోసఫ్‌ తంబిగారి జీవితములో ఆధ్యాత్మికముగా ఎంతగానో ప్రభావితం చూపింది. జోసఫ్‌ తంబిగారు మొదటిసారిగా 28 జనవరి 1939వ సంవత్సరములో జోసఫ్‌ చుంగాత్‌ వారు కొనియాడిన సిరియన్‌ దివ్యపూజాబలిలో పాల్గొన్నారు. ఈ స్నేహము వలననే జోసఫ్‌ తంబిగారు నాదతరవెళ్లి జోసఫ్‌ చుంగాత్‌ వారిని కలుసుకొనేవారు.

గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌
గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారి ద్వారా జోసఫ్‌ తంబిగారి గురించి మనకు ఎన్నో విషయాలు తెలిసాయి. గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారు ఇచ్చిన సాక్ష్యమునుండి జోసఫ్‌ తంబిగారి గురించి క్లుప్తముగా తెలుసుకుందాం.

క్రీ.శ. 1937వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునకు వచ్చియున్నారు. క్రీ.శ. 1939వ సంవత్సరమునుండి అవుటపల్లి గ్రామములోని విచారణ దేవాలయ ప్రాంగణములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవుటపల్లినుండి క్రీ.శ. 1939వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారు కేరళకు వెళ్ళిరావడం జరిగింది.

క్రీ.శ. 1939వ సంవత్సరములో తపస్కాలములోని ఒక శుక్రవారము మధ్యాహ్నము ఒంటిగంట సమయములో జోసఫ్‌ తంబిగారు నాదతరకు వెళ్ళారు. గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారు జోసఫ్‌ తంబిగారిని ఆహ్వానించి భోజనము పెట్టారు. మధ్యాహ్న భోజనము ముగిసిన వెంటనే, జోసఫ్‌ తంబిగారు జోసఫ్‌ చుంగాత్‌ వారిని గురునిలయములోనికి తీసుకెళ్ళారు.

అక్కడ ఆఫీసులోనున్న బెంచ్‌పైన కూర్చున్నారు జోసఫ్‌ తంబిగారు. జోసఫ్‌ చుంగాత్‌ వారు తన కుర్చీలో కూర్చున్నారు. ఎదురుగానున్న బల్లపై ఒక సిలువ స్వరూపము ఉన్నది. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందారు. దాదాపు 20 నిమిషాల పాటు శ్రమలను పొందియున్నారు. బాధతో నేలపై పడిపోయారు.

కొద్దిసేపు తరువాత గాయానుండి కారుచున్న రక్తమును తుడుచుకొనుటకు గుడ్డముక్కను అడిగారు. అప్పుడు జోసఫ్‌ చుంగాత్‌ వారు ఒక పాత గుడ్డ ముక్కను తెచ్చి ఇచ్చారు. గాయాలను తుడచిన తరువాత రక్తపు మరకలతో నున్న గుడ్డ ముక్కను తిరిగి జోసఫ్‌ చుంగాత్‌ వారికి ఇచ్చియున్నారు.

జోసఫ్‌ చుంగాత్‌ వారు ఆ గుడ్డ ముక్కను త్రిశూర్‌ సివిల్‌ ఆసుపత్రిలో పనిచేయుచున్న కార్మలైట్‌ సిస్టర్స్‌ వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆసుపత్రి కాన్వెంట్‌ సుపీరియర్‌ అయిన మదర్‌ మేరి ఆగ్నెస్‌ దానిని ల్యాబ్‌లో పరీక్షింపగా నిజమైన మానవ రక్తం అని తేలింది. పరీక్షింపబడిన ఆ గుడ్డ ముక్కను జోసఫ్‌ చుంగాత్‌ వారు తిరిగి తీసుకొనలేదు.

ఈవిధముగా జోసఫ్‌ చుంగాత్‌ వారు ఆరు పర్యాయములు జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందటం కళ్ళారా చూసారు. రక్తపు మరకలతో నున్న గుడ్డ ముక్కను భద్రముగా దాచుకున్నారు.

అలాగే జోసఫ్‌ తంబిగారు వాడినటువంటి జపమాలోని ఒక పూసను ఒక వ్యక్తి, ఝాన్సి (ఉత్తర భారతదేశం) నగరమునుందు మిలిటరీలోనున్న జోసఫ్‌ చుంగాత్‌ వారి స్నేహితుని ద్వారా పంపించియున్నారు. ఆ పూసను రక్తపు మరకతోనున్న గుడ్డ ముక్కలో చుట్టి జోసఫ్‌ చుంగాత్‌ వారు తన దగ్గరే భద్రముగా దాచుకొని యున్నారు.

జోసఫ్‌ తంబిగారు ఆంధ్రదేశమునకు తిరిగి రావడానికి, జోసఫ్‌ చుంగాత్‌ వారిని కొంత డబ్బు సహాయం అడిగారు. జోసఫ్‌ చుంగాత్‌ వారు తన దగ్గర డబ్బు లేదని, ఈ దినాలలో పూజలు కూడా ఏమి రాలేదని చెప్పి యున్నారు. అప్పుడు జోసఫ్‌ తంబి, ‘‘అయితే మనం భిక్షాటనకు వెళదాం, వస్తారా?’’ అని అడిగినప్పుడు జోసఫ్‌ చుంగాత్‌ వారు దానికి సంతోషముగా సమ్మతించారు.

వారు అలా ఒక ధనవంతుని ఇంటి వద్దకు చేరుకోగా, జోసఫ్‌ తంబిగారు ఆ ఇంటిలోనికి ప్రవేశించుటకు నిరాకరించారు. అప్పుడు జోసఫ్‌ చుంగాత్‌ వారు మాత్రమే ఇంటిలోనికి వెళ్లి ధన సహాయం అడుగగా ఆ వ్యక్తి ఒక రూపాయి సహాయం చేసాడు. తిరిగి వస్తుండగా జోసఫ్‌ తంబిగారు, ‘‘ఆ వ్యక్తి మన సందర్శనకు అర్హుడు కాదు’’ అని  చెప్పారు. బహుశా ఎవరు ఎలాంటి వారో జోసఫ్‌ తంబిగారికి ముందుగానే తెలుసుఅని జోసఫ్‌ చుంగాత్‌ వారు మనసులో అనుకున్నారు.

రెండు మైళ్ళ అనంతరం పరయిల్‌అను ఇంటికి వెళ్ళారు. ఆ యింటి యజమాని జబ్బుతో బాధపడుచున్నాడు. ఆయన కుమార్తె అన్నమ్మ విధవరాలు, తండ్రితోపాటే ఉంటుంది. తను మఠవాస సభలో చేరి మఠకన్యగా జీవించాలని జోసఫ్‌ చుంగాత్‌ వారితో చర్చిస్తున్నది.

కొద్దిసేపటి తరువాత, జబ్బుతో బాధపడుచున్న వ్యక్తిని పాపసంకీర్తనం చేయవలసినదిగా జోసఫ్‌ చుంగాత్‌ చెప్పినప్పుడు ఆ వ్యక్తి పాపసంకీర్తనం చేయడానికి నిరాకరించాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు కలుగ జేసుకొని ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, అతను వెంటనే పాపసంకీర్తనం చేయటానికి సిద్ధమయ్యాడు. జోసఫ్‌ తంబి ఆ వ్యక్తితో మాట్లాడిన ఉత్సాహపూరితమైన మాటలను విని  జోసఫ్‌ చుంగాత్‌ వారు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురియైనారు.

సాయంత్రం ఇద్దరు కలిసి ‘‘నాదతరగుడి వద్దనున్న సమాధుల స్థలములోనికి వెళ్లి, మెట్లమీద కూర్చొని కొంచెం సేపు ప్రార్ధన చేసుకున్నారు. అప్పుడు జోసఫ్‌ తంబి కొద్దికాలం క్రిందట తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను జోసఫ్‌ చుంగాత్‌ వారితో పంచుకున్నారు:

“ఒకరోజు నేను అవాటు చొప్పున ఒక గ్రామములో ప్రార్ధన చేయుటకు వెళ్ళాను. అయితే, పంట కోత కాలము కనుక, ఆ రోజు ప్రార్ధనకు ఎవరు రాలేదు. నేను ఎంతో నిరాశ చెందాను. అప్పుడు నేను సమాధు స్థములోనికి వెళ్లి, ‘ఉత్థరించు స్థములోనున్న ఆత్మలారా! మీరైనా నా మాటను ఆకించుటకు రండిఅని ప్రార్ధించగా, తెల్లని వస్త్రములతోనున్న కొంతమంది నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. వారి సాన్నిధ్యానికి నేను కృతజ్ఞతలు తెలిపియున్నాను.”

జోసఫ్‌ చుంగాత్‌, జోసఫ్‌ తంబిగారు సమాధుల స్థమునుండి కాన్వెంటు దేవాలయము వైపుకు వెళ్ళుచుండగా, వరండాలో మదర్‌ ఉర్సులాను కలిసారు. అప్పుడు తంబిగారు జోసఫ్‌ చుంగాత్‌ వారితో, ‘‘మదర్‌ ఉర్సులాను మీరు ఒదార్చవలయును, ఎందుకన, ఆమె నిజాయితీ పరురాలు, భక్తి పరురాలు’’ అన్నారు. మదర్‌ ఉర్సులా గురించి జోసఫ్‌ తంబిగారికి ఎలా తెలుసునని జోసఫ్‌ చుంగాత్‌ వారు మిక్కిలి ఆశ్చర్యపోయారు!

అంబరఖాడ్‌లో సహాయక గురువుగానున్న గురుశ్రీ పౌల్‌ ఖజూర్‌, జోసఫ్‌ చుంగాత్‌ వారి తోటి సహచరుడు. ఒకేసారి గురువులైరి. మరుసటి రోజు ఉదయం పాల్‌ ఖజూర్‌ వద్దకు వెళ్లాని నిశ్చయించుకున్నారు. ముందుగా జోసఫ్‌ తంబిగారిని వెళ్ళమని, తాను తరువాత సాయంత్రం వరకు వస్తానని  జోసఫ్‌ చుంగాత్‌ వారు జోసఫ్‌ తంబిగారికి చెప్పారు.

అంబరఖాడ్‌నకు వెళ్ళే ముందురాత్రి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. జోసఫ్‌ తంబిగారు బెంచ్‌ మీద కూర్చొని యున్నాడు. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందారు. జోసఫ్‌ చుంగాత్‌ వారు తన రుమాలును ఇవ్వగా రక్తముతో నున్న గాయాలను తుడచుకున్నాడు. పంచగాయాల అనంతరం, కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత వారు నిద్రకుపక్రమించారు. జోసఫ్‌ చుంగాత్‌ వారు, జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందటం కళ్ళార చూడటం ఇది రెండవసారి!

మరుసటి రోజు ఉదయం దివ్యబలి పూజకు ముందుగా ధ్యానం కోసం గుడిలోనికి వెళ్లారు. వీరిరువురు పూజా వస్త్రాల గదిలో ధ్యానం చేసుకుంటున్నారు. వారికి ఎదురుగా గోడకు సిలువ స్వరూపము వ్రేలాడుచున్నది. మఠకన్యలు గుడిలోపల ధ్యానంలో ఉన్నారు. ధ్యానములో ఉండగా మరల జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందారు. ఈసారి జోసఫ్‌ తంబి తన వద్దనున్న రుమాలుతోనే గాయాలనుండి కారుచున్న రక్తమును తుడచుకున్నాడు. ఈ విషయాన్ని గుడిలోనున్న మఠకన్యలుకూడా గమనించారు. ధ్యానం తరువాత జోసఫ్‌ చుంగాత్‌ వారు దివ్యపూజాబలిని సమర్పించారు. జోసఫ్‌ తంబి, మఠకన్యలు దివ్యసత్ప్రసాదమును స్వీకరించారు.

అల్పాహారము తీసుకున్న తరువాత జోసఫ్‌ తంబిగారిని అంబరఖాడ్‌నకు వెళ్ళమని జోసఫ్‌ చుంగాత్‌ వారు కోరారు. తాను ఇరింజ్ఞాలగూడలోని మఠకన్యల వద్దకు వెళ్లి, వారి పాపసంకీర్తనాలను విని వస్తానని తెలిపియున్నారు.

గురుశ్రీ పౌల్‌ ఖజూర్
జోసఫ్‌ తంబిగారు ఒక్కరే అంబరఖాడ్‌నకు చేరుకొని, గురుశ్రీ పౌల్‌ ఖజూర్‌ని కలుసుకున్నారు. చేరుకోగానే మంచినీరు ఇవ్వమని కోరారు. ఆ సమయములో పనివారు ఎవరు లేనందున స్వయముగా పౌల్‌ ఖజూర్‌ వారే మంచినీరు తేవడానికి లోనికి వెళ్ళారు. మంచినీరు తెచ్చేసరికి జోసఫ్‌ తంబిగారు పంచగాయాలతో శ్రమలననుభవించడం పౌల్‌ ఖజూర్‌ వారు చూశారు. అయితే మొదటగా, జోసఫ్‌ తంబిగారు రుమాటిక్‌ మూర్చతో బాధపడుచున్నారని భావించారు.

కాళ్ళను మర్దన చేయడానికి ప్రయత్నించగా, రెండు కాళ్ళు కూడా సిలువలో కొట్టబడిన తీరుగా గట్టిగా బిగుసుకు పోయాయి. ఆసమయములో జోసఫ్‌ తంబిగారు ఎంతో వేదననుభవించాడు. కొద్దిసేపు తరువాత, కూర్చొని మామూలుగా మాట్లాడసాగారు. పౌల్‌ ఖజూర్‌ తెచ్చిన నీటిని తాగారు. రక్తముతో తడసిన తన చేతును, కాళ్ళను చూపుతూ తుడుచుకొనుటకు ఏదైనా గుడ్డను ఇవ్వమని అడిగారు. తుడచిన గుడ్డను తిరిగి పౌల్‌ ఖజూర్‌ వారికే ఇచ్చియున్నారు.

సాయంత్రం 7.30 గంటలు! జోసఫ్‌ చుంగాత్‌ వారు కూడా అంబరఖాడ్‌నకు చేరుకున్నారు. సాయంత్రం భోజనము తరువాత 9 గంటలకు రేపటి కార్యక్రమము గురించి చర్చించుకుంటున్నారు. ఉదయం 6 గంటలకే దివ్యపూజాబలిని సమర్పిస్తానని జోసఫ్‌ చుంగాత్‌ వారు చెప్పారు. జోసఫ్‌ చుంగాత్‌ వారు వెమ్మటే నిద్రపోవడానికి వెళ్ళారు. జోసఫ్‌ తంబిగారు, పౌల్‌ ఖజూర్‌ వారు కొద్దిసేపు ముచ్చటించుకొనిన తరువాత  నిద్రకుపక్రమించారు.

పౌల్‌ ఖజూర్‌ వారు జోసఫ్‌ తంబిగారిని గమనించుటకు తన గదిలోనే మంచమును ఏర్పాటు చేసియున్నారు. జోసఫ్‌ తంబిగారు పడుకొనేముందు గదిలోనున్న జేసు తిరు హృదయ పటము వద్ద మోకరిల్లి ప్రార్ధన చేసుకున్నారు. రాత్రి వేళలో జోసఫ్‌ తంబిగారిని గమనించాలని తలంచిన పౌల్‌ ఖజూర్‌ వారు ఎన్నడూ నిద్రపోనంత ప్రశాంతముగా ఆ రాత్రి నిద్రపోయారు. ఉదయం 5.30 గంటకు లేచి చూస్తే, ప్రక్కన జోసఫ్‌ తంబిగారు లేరు. ఉదయం 3 గంటకే లేచి ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళారు.

ఉదయము 6 గంటలకే బయలు దేరాలని జోసఫ్‌ తంబిగారు జోసఫ్‌ చుంగాత్‌ వారితో చెప్పడముతో, దివ్యపూజాబలి సమర్పించకుండానే పులియికున్నువెళ్లి అక్కడనుండి బస్సుపై పుదుక్కాడ్‌కు వెళ్ళారు. అచ్చట కాన్వెంట్‌ దేవాలయములో దివ్యపూజాబలిని సమర్పించారు. పాపసంకీర్తనము వినుటకు పుదుక్కాడ్‌నుండి చౌక్‌నకు వెళ్ళారు. జోసఫ్‌ తంబి జోసఫ్‌ చుంగాత్‌ వారిని అనుసరించారు.

చౌక్‌నకు చేరుకున్న తరువాత, అక్కడ కాన్వెంటులో జోసఫ్‌ చుంగాత్‌ వారు పాపసంకీర్తనమును వినుచుండగా, జోసఫ్‌ తంబిగారు స్కూల్‌ వద్దనున్న బెంచ్‌పై కొద్దిసేపు విశ్రాంతిని తీసుకున్నారు.

ఆ సమయములో ఎన్‌.జె. జేకబ్‌ అనే ఒక యువకుడు జోసఫ్‌ చుంగాత్‌ వారిని చూడటానికి వచ్చియున్నాడు. జోసఫ్‌ చుంగాత్‌ వారిని కుసుకున్న తరువాత, అక్కడనున్న జోసఫ్‌ తంబిగారి వద్దకు వెళ్ళాడు. ఆ సమయములో జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందారు.

అనంతరం, జోసఫ్‌ తంబిగారు ఆ యువకునితో, ‘‘నీవు భద్రమైన అభ్యంగనము పొందుటకు ముందు మంచి పాపసంకీర్తనం చేయలేదు’’, అని పలికి ఆ యువకుడు చేసిన పాపాలను తెలియ జేశారు. అది విన్న ఆ యువకుడు ఎంతో బాధపడ్డాడు, కన్నీరు పెట్టుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే జోసఫ్‌ చుంగాత్‌ వారి దగ్గరకు వెళ్లి మంచి పాపసంకీర్తనం చేశాడు.

ఈ సంఘటన తరువాత జోసఫ్‌ చుంగాత్‌, జోసఫ్‌ తంబిగారు కలిసి త్రిశూరు వెళ్లి అక్కడనుండి ఇరువురు విడిపోయారు.

అదేరోజు రాత్రి జోసఫ్‌ చుంగాత్‌ వారు, తనను త్రిశూరు లతీను దేవాలయమునకు జోసఫ్‌ తంబిగారు ఆహ్వానిస్తున్నట్లుగా కలగన్నాడు. ఉదయమే 4 గంటలకు లేచి తన స్నేహితుడైన పైలీని పిలిచాడు. ఈ సమయములో రిక్షా దొరకడం కష్టమని, త్రిశూరుకు నడచి వెళదాం అని పైలీచెప్పడముతో, వారిరువురు త్రిశూరు వరకు నడచి వెళ్ళారు.

త్రిశూరులోని లతీను దేవాయమునకు ఉదయం 6 గంటకు చేరుకున్నారు. అక్కడ జోసఫ్‌ తంబిగారిని కలుసుకున్నారు. ఆ తరువాత, జోసఫ్‌ తంబిగారు జోసఫ్‌ చుంగాత్‌ వారిని నాదతరలో కలుసుకొని యున్నారు.

పౌల్‌ ఖజూర్‌ వారు నాదతరకు బదిలీ అయ్యే సమయానికి, జోసఫ్‌ తంబిగారు అచ్చటనుండి వెళ్ళిపోయారు. ఎందుకనగా, ‘థెరేసియన్‌ సహోదరులుజోసఫ్‌ తంబిగారిని అర్ధం చేసుకోలేక పోయారు. అతను చెప్పే లఆకించక పెడచెవిన పెట్టారు. వారు అతనిని ఇష్టపడలేదు, ఓ పిచ్చివానిగా భావించారు.

జోసఫ్‌ తంబిగారు నాదతరలో ఉండగా ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి దానిని పునీత పాదువాపురి అంతోని వారికి అంకితం చేశారు. అగ్రపీఠాధిపతులు జోసఫ్‌ అట్టిపెట్టి గారు, ఈ చిన్న దేవాయాన్ని సందర్శించి, అచ్చట దివ్యపూజాబలిని సమర్పించి, ఒక హిందూ కుటుంబానికి జ్ఞానస్నానము కూడా ఇచ్చియున్నారు. ఈ కుటుంబాన్ని జోసఫ్‌ తంబిగారే విశ్వాస జీవితానికి సంసిద్ధం చేసియున్నారు. ఆ రోజున పౌల్‌ ఖజూర్‌ వారుకూడా అచ్చట ఉన్నారు.

క్రీ.శ. 1939 తపస్కాలము తరువాత జోసఫ్‌ చుంగాత్‌ వారు మరల తంబిగారిని 1941వ సంవత్సరములో మద్రాస్‌ లోని రోయపురములో కలుసుకున్నారు. జోసఫ్‌ చుంగాత్‌ వారిని చూసిన వెంటనే జోసఫ్‌ తంబిగారు పాపసంకీర్తనం చేసారు. ఈ రోజు నేను ఒక పునీతుని పాపసంకీర్తనమును విన్నానుఅని జోసఫ్‌ చుంగాత్‌ వారు తన సాక్ష్యములో తెలిపి యున్నారు.

రోయపురములోని దేవాలయములో దివ్యపూజాబలిని సమర్పించిన తరువాత, ఇద్దరు కలిసి మద్రాసులోని జనరల్‌ ఆసుపత్రికి వెళ్ళారు. అనారోగ్యముతోనున్న జోసఫ్‌ చుంగాత్‌ వారి తల్లిని పరామర్శించారు. జోసఫ్‌ తంబిగారు ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేసారు.

మరుసటిరోజు జోసఫ్‌ తంబిగారు ముందుగానే పార్క్‌-టౌన్‌దేవాయానికి వెళ్ళారు. ఆ తరువాత, జోసఫ్‌ చుంగాత్‌ వారు, త్రిశూరు నుండి మెడికల్‌ స్టూడెంట్‌ అయిన పి.డి. లోనప్పన్‌తో కలిసి అక్కడకు వచ్చాడు. జోసఫ్‌ చుంగాత్‌ వారు వెళ్లేసరికి జోసఫ్‌ తంబిగారు దేవాలయములో ముందు వరుసలో కూర్చిని ప్రార్ధన చేయుచున్నారు. పి.డి. లోనప్పన్‌ జోసఫ్‌ చుంగాత్‌ వద్ద పాపసంకీర్తనం చేసాడు.

జోసఫ్‌ చుంగాత్‌ ఒక్కరే ఆసుపత్రికి తిరిగి వెళ్ళిపోయారు. పి.డి. లోనప్పన్‌ జోసఫ్‌ తంబిగారిని మెడికల్‌ హాస్టల్‌కు తీసుకొని వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్‌ అందరు కూడా జోసఫ్‌ తంబిగారి వేషధారణను చూసి నవ్వారు, హేళన చేసారు. వారితో పి.డి. లోనప్పన్‌ కూడా చేరాడు. తరువాత తన తప్పును తెలుసుకొని, బాధపడుతూ ఈ విషయాన్ని పి.డి. లోనప్పన్‌ మరుసటిరోజు జోసఫ్‌ చుంగాత్‌ వారితో చెప్పియున్నాడు.

క్రీ.శ. 1944 వరకు జోసఫ్‌ తంబిగారు జోసఫ్‌ చుంగాత్‌, పౌల్‌ ఖజూర్‌ వారికి  లేఖను వ్రాసియున్నారు. ఆ లేఖను బట్టి జోసఫ్‌ తంబిగారు, పాండిచ్చేరిలో, పచ్చమలైలో, అలాగే ఉత్తర భారత దేశములోకూడా అనేకచోట్ల ఉన్నట్లు, ఉదాహరణకు ఝాన్సిమొదగు ప్రదేశాలను సందర్శించినట్లుగా మనకు తెలియుచున్నది. అలాగే జోసఫ్‌ తంబిగారి స్నేహితులు, ఆయనద్వారా క్రైస్తవ మతములోనికి వచ్చినవారు ఆయనకు లేఖలు వ్రాసేవారు.

అయితే జోసఫ్‌ తంబిగారు, ఒకానొక సందర్భములో తనవద్ద వ్రాతపూర్వకముగా నున్న ప్రతీ దానిని నాశనం చేసేశారు. ఆయన వద్ద ఒక డైరీ కూడా ఉండేది. దానిలో ఎన్నో విషయాలు తన గురించి వ్రాసుకొని యున్నారు. బహుశా, వీటిద్వారా తన గురించి ఇతరులకు తెలియటం జోసఫ్‌ తంబిగారు ఇష్టపడక పోయి ఉండవచ్చు! అంత సాధారణమైన జీవితాన్ని ఆయన మహా గొప్పగా జీవించాడు.

గురుశ్రీ పౌల్‌ ఖజూర్‌ వారు వ్రాసిన సాక్ష్యములో జోసఫ్‌ తంబిగారి గురించి ఈ క్రింది విషయాలు మనకు తెలియుచున్నవి.

జోసఫ్‌ తంబిగారిని మొదటగా చూసినప్పుడు, చాలామంది పిచ్చివానిగా భావించారు. దానికి కారణం, ఆయన జీవన విధానం చాలా సాదాసీదాగా ఉండేది. వీధుల్లో తిరిగుతూ భిక్షాటన చేసేవాడు, చెట్ల నీడలో పరుండేవాడు. ఆయన జీవితం ప్రజల మధ్యలో, అనేక విమర్శతో ముళ్ళ పాన్పులా ఉండేది. అందుకే ఆయన పొందిన పంచగాయాలను కూడా చాలామంది అర్ధం చేసుకొనలేక, వాటిని దైవీకంగా గాక ఇంకేదో అని చెప్పుకొనెడివారు.

పరిచయం అయినప్పటినుండి జోసఫ్‌ తంబిగారు పౌల్‌ ఖజూర్‌ వారి కొరకు ప్రార్ధన చేసియున్నారు. పౌల్‌ ఖజూర్‌ వారు జోసఫ్‌ తంబిగారి మాటలలో, చేతలలో ఏదో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్నదని గ్రహించాడు.

జోసఫ్‌ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన శక్తి ఎంత బలమైనదో ఈ సంఘటన నుండి మనం తెలుసుకోవచ్చు. పౌల్‌ ఖజూర్‌ వారు వడకాంచేరిఅను స్థలములో వడకాన్ని ఇచ్చినప్పుడు, ఆయన ఎంతో శక్తివంతముగా, ఫవంతముగా వాక్యాన్ని బోధించాడు. ప్రజలు ఎంతగానో ఆశ్చర్యపోయారు.

మరల ఒక వారం తరువాత, ‘చిలకరఅను ప్రదేశములో మఠకన్యలకు 10 రోజుల వడకాన్ని ఇచ్చియున్నారు. దేవుని వాక్యమును విన్న మఠకన్యలు కన్నీటి పర్యంతమైయ్యారు.

పంచగాయాలు పొందిన జోసఫ్‌ తంబిగారి ప్రార్ధన వలననే తాను ఇంత శక్తివంతముగా దేవుని వాక్యాన్ని బోధించగలిగానని పౌల్‌ ఖజూర్‌ వారు సాక్ష్యమిచ్చియున్నారు.

No comments:

Post a Comment