Monday, July 6, 2020

‘పచ్చమలై’కు పయనం

అధ్యాయము 04
‘పచ్చమలై’కు పయనం

క్రీ.శ. 1936వ సంవత్సరములో మణత్తిడల్‌గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్‌ వారి రాకతో జోసఫ్‌ తంబిగారు ముందుగా కొత్త పాలాయంఅను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పది రోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్‌ తంబిగారికి చక్కటి స్నేహం, అనుబంధం ఏర్పడినది.

కొత్త పాలాయంనుండి తొండమందురైఅను ప్రదేశమునకు వెళ్లి, అచటనుండి పచ్చమలైఅను మారుమూల గ్రామమునకు వెళ్లి యున్నారు. ఇది కొత్త పాలాయంవిచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పచ్చమలైఅనునది తిరుచిరాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. కుంభకోణంమేత్రాసణములోని తొండమందురైవిచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల (ఆదివాసీల) ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్‌ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. ఆరంభములో కొండజాతి ప్రజలు జోసఫ్‌ తంబిగారిని వింతగా చూసారు. కాలం గడిచే కొద్ది ప్రజలు అతనికి దగ్గరయ్యారు. జోసఫ్‌ తంబిగారు వారితోనే జీవించారు. వారు భుజించేదే, తాను భుజించాడు.

తను భిక్షాటన చేసి సంపాదించిన భోజనమును, దుస్తులను, సొమ్మును వారికి సహాయం చేసేవాడు. సాధారణముగా వారు ఎప్పుడు సగం దిగంబరులై ఉండేవారు. తరుచూ పాండిచ్చేరి వెళ్లి బట్టలను, సొమ్మును తీసుకొని వచ్చి, ఈ కొండజాతి ప్రజలకు సహాయం చేసేవారు.

బట్టలను పంచుతున్న జోసఫ్ తంబి

నిదానముగా వారికి దేవుని గూర్చి, దేవుని ప్రేమ, మహిమగూర్చి వివరించడం మొదలు పెట్టారు. ఒకరినొకరు సహాయం చేసుకోవాలని బోధించారు. జోసఫ్‌ తంబిగారు తనకు తెలిసిన నాటు మందులతో వారికి వైద్య సహాయాన్ని అందించారు.


పచ్చమలైలో దైవసేవను చేస్తున్నప్పుడుఅచ్చటి అటవీశాక అధికారి ఒకరు గిరిజన ప్రజల పట్ల చేస్తున్న అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని జోసఫ్‌ తంబిగారు తీవ్రముగా ఖండించారు. అందుచేత ఆ ఆఫీసర్‌ కోపముతో జోసఫ్‌ తంబిగారిపై చేయి చేసుకున్నాడు.

ఈ విషయాన్ని జోసఫ్‌ తంబిగారు తన మిత్రుడైన గురుశ్రీ అధిరూపం వారికి తెలియ జేశారు. గురుశ్రీ అధిరూపం వారు, పైఅధికారులకు ఫిర్యాదు చేయడముతో ఆ ఆఫీసరును అచ్చటనుండి సస్పెండ్‌ చేసారు.

జోసఫ్‌ తంబిగారు పచ్చమలైలో దేవాలయము కొరకు కొంత స్థలాన్ని సేకరించాడు. అచ్చట ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి వారికి క్రీస్తు గురించి బోధించి, క్రైస్తవ విశ్వాసాన్ని వారిలో నాటాలని తలంచాడు.

ఆ ప్రదేశాన్ని చూసి అక్కడి విషయాలను తెలుసుకోవాలని కొంతమంది గురువులు పచ్చమలైప్రాంతమునకు వచ్చియున్నారు. వారిలో జోసఫ్‌ తంబిగారికి తెలిసిన గురుశ్రీ అధిరూపం కూడా ఒకరు. కొండజాతి ప్రజలలోనున్న ఆచార వ్యవహారాను బట్టి అచట మతబోధ కష్టమని భావించారు.

జోసఫ్‌ తంబిగారుకూడా ఈ తలంపుతో ఏకీభవించి పచ్చమలైగ్రామాన్ని వీడి వెళ్లిపోయారు.

No comments:

Post a Comment