Saturday, May 30, 2020

సాక్ష్యం 2


సాక్ష్యం 2

పేరు             :         గోడే ఇన్యాసి ఫ్రాన్సిస్ శౌరి
తండ్రి            :         జాన్
పుట్టిన తేది      :         01 - 03 - 1934
జన్మ స్థలం      :         వట్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

నా పేరు గోడే ఇన్యాసి ఫ్రాన్సిస్ శౌరి. అప్పుడు నాకు ఎనిమిది సంవత్సారాల వయస్సు. నేను వట్లూరు RCM స్కూలులో 3వ తరగతి  చదువు చున్నాను. మాకు ఆ రోజు పాస్ బెల్ కొట్టారు.  బ్రదర్ గారు ఏ టైంలో వచ్చారో నాకు తెలియదు. పిల్లలు స్కూలు నుంచి బయటకు రాగానే ఆయన మా దగ్గరికి వచ్చారు.  భాష యాసగా మాట్లాడుతూ, మనిషి మాసిన గడ్డం, కొంచెం పొట్టిగా ఉన్నారు. రింగు రింగుల జుట్టు. అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి ‘పిచ్చోడు,  పిచ్చోడు’ అని ఆయన అంగీ లాగుతూ ఆయనకు దొరకకుండా పారి పోయాను. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని మాస్టారు బయటకు వచ్చి, తంబి గారిని చూసి, ‘ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? పిల్లలు దడుసుకుంటున్నారు’ అని అన్నారు. అప్పుడు, హెడ్ మాష్టారు గారు బెల్లు టైము అవ్వకుండా బెల్లు కొట్టించారు. అందరం లోపలికి వెళ్ళాం.

మరియమ్మ గారి పండుగకు విచారణ గురువులు అయిన ఫాదర్ కే. జార్జి మరియు ఫాదర్ అంద్రాదే,  వట్లూరు నుంచి పెద్దఅవుటుపల్లికి వెళ్లారు. ఆ రాత్రి పండుగ తర్వాత నాటకం చూసి పొద్దున బయలుదేరారు. అవుటపల్లి నుండి వట్లూరు రావడానికి ఆ రోజులలో రైలు బండి ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. వీరుకూడా రైలుబండికి బయలుదేరారు.  ఆ రోజు ఉదయం మేము స్కూలుకి వచ్చాము.  వచ్చేసరికి తంబిగారిని హెడ్ మాష్టారు ప్రశ్నిస్తున్నారు, ‘నీవు ఫాదర్ గారి కోసం వచ్చాను అంటున్నావు. ఫాదర్ గారు అవుటపల్లికే వచ్చారు. నీవు అక్కడే కలవచ్చుగా’ అని అన్నారు. తంబి గారు వెళ్లి ఫాదర్ గారి ఇంటి మెట్ల దగ్గర కూర్చున్నారు. అవుటపల్లి నుండి తిరిగి వచ్చిన జార్జి ఫాదర్ గారు, తంబి గారిని చూసి, హెడ్ మాష్టారు గారి దగ్గరకు వచ్చి, ‘ఆయన ఎప్పుడు వచ్చారు?’ అని వాకబు చేశారు. అది నేను విన్నాను. అప్పుడు ఫాదర్ గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తదుపరి రోజు హెడ్ మాష్టారు గారు ఫాదర్ గారి మాటలు విన్న మేము, బ్రదర్ గారు అని తెలిసి కొంచెం భయం తగ్గి ఆయన దగ్గరకు వెళ్లడం ప్రారంభించాము.  అప్పుడు ఆయన మాకు పలహారం పెట్టారు. ఎంతమంది పిల్లలు వచ్చినా గుప్పెడు గుప్పెడు పెట్టేవారు. మాకు జపములు నేర్పడం ప్రారంభించారు. జపములు చెప్పేటప్పుడు మోకాళ్ళ మీద తప్పనిసరిగా ఉండాలనే వారు. ఎవరైనా భర్తలు తాగి, భార్యలను బహిరంగంగా కొడుతుంటే, వారి దగ్గరకు వెళ్లి వారిని వారించే వారు. పేకాట ఆడేవారిని మందలించి, వారితోనే పేక తినిపించే వారు. అయినా ఆయనకు ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. అప్పటికి మా వట్లూరు గ్రామం మహిళలకు ఆయనంటే సదభిప్రాయం కలిగింది.

ఒకరోజు మా నాన్నగారు, ఆయన బృందం బ్యాండ్ వాయించి, ఏలూరు నుంచి చేపలు తెచ్చుకుని వండుకొని తిన్నారు. సెంటర్లో ఒకచోట కధలు చెబుతున్నారు అని తెలిసి, అందరూ అక్కడికి వెళ్లారు. నేను కూడా ఆ కథలు చెప్పే వారి దగ్గరే ఉన్నాను. ఇంతలో గుజ్జుల వెంకయ్య అనే జ్వాన్నేసు, కొంచెం తాగి అక్కడే కధ ఆలకిస్తున్నాడు. అప్పుడు తంబి గారు అక్కడికి వచ్చారు. తంబి గారిని చూసి చాలామంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు.   జ్వాన్నేసు మాత్రం ఆ కథ చెప్పే అతని కథను సవరిస్తూ ఉన్నాడు. అప్పుడు తంబి గారు, “నీ పేరేంటి?” అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి ‘గుజ్జుల వెంకయ్య’ అని చెప్పాడు. అప్పుడు తంబి గారు, “కాదు, కాదు. నీ పేరు జ్వాన్నేసు” అని చెప్పాడు. “నీవు క్రైస్తవుడవై ఉండి హిందువుల కథను సరి చేస్తావా!” అని తంబిగారు అని, అతనిని నోరు తెరచి నాలుక చూపమన్నారు. ఆ నాలుక మీద ‘+’ [స్లీవ] గురుతు వేశారు. వెంటనే ఆయన మాట పడిపోయింది.  ఆయన ఇంటికి వెళ్లాడు. ఆయన  భార్యతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే, ఆయనకు మాట రావడం లేదు. అప్పుడు అతని భార్య జరిగిన సంగతి తెలుసుకొని తెల్ల వారి దివ్యపూజా బలికి ఆయనను తీసుకొని వచ్చింది. పూజ ముగిసిన తర్వాత జార్జి స్వాముల వారి దగ్గరకు తీసుకు వచ్చారు. స్వామి దగ్గర తంబి గారు ఉన్నారు. స్వామి దగ్గర, గుజ్జుల వెంకయ్యను చూసి తంబి గారు లోపలికి వెళ్లిపోయారు. స్వామి, తంబి గారిని  పిలిచారు. జరిగిన విషయాన్ని అక్కడే నున్న నన్ను చెప్పమని తంబి గారు అన్నారు. నేను ఆ రాత్రి జరిగిన సంఘటన మొత్తం చెప్పాను. జార్జ్ స్వామి తంబి గారితో,  ‘మీ శక్తి మాకు తెలుసు. అలా శపించడం కాదు, మీరు క్షమించాలి’ అని అన్నారు. అప్పుడు తంబి గారు ఫాదర్ గారి మాట చొప్పున అతని నాలుక చూపమన్నారు. మరల ‘+’ [స్లీవ] గురుతు వేయగా వెంటనే అతను మాట్లాడ గలిగాడు. తరువాత ఆయన బ్యాండ్ గ్రూపులో clarinet [క్లారినెట్] కూడా వాయించు కుంటూ జీవనం సాగించాడు. తంబి గారితో పాటు సహవాసం చేసి ఆయన అద్భుతములను  ప్రత్యక్షంగా చూసినందుకు నేను ధన్యుడను.

గోడే ఇన్యాసి ఫ్రాన్సిస్ శౌరి
11-09-2008

No comments:

Post a Comment