సాక్ష్యం 6
కొమరవల్లి భాగ్యమ్మ
తేలప్రోలు గ్రామము,
ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
60 సం.లు
నా పేరు కొమరవల్లి భాగ్యమ్మ. మాది తేలప్రోలు గ్రామము. మా అమ్మ ఎక్కువ విశ్వాసముతో ప్రార్ధన
చేసేది. మా అమ్మకు నలుగురు పిల్లలు పుట్టి
మరణించారు. వారు నాకంటే ముందుగా
పుట్టిన వాళ్ళు.
అమ్మకు ఎక్కువ
విశ్వాసం మూలాన తంబి గారు పరిచయం అయ్యారు. మా అమ్మ పుట్టు క్రైస్తవురాలు. కావున, తంబిగారు పరిచయం అయ్యారు. వారితో ప్రార్థన చేయించు కున్నాక నేను, మా తమ్ముడు పుట్టాము. మా అమ్మ ఎక్కువ భాషలలో ప్రార్థన చేసేది. అలా ప్రార్థన చేస్తే, మా నాన్న ‘సైతాను’ అని చీపురు కట్ట పెట్టి అమ్మను
కొట్టే వారు. ఆయన, ‘నీవు సైతానులా మాట్లాడు
తున్నావు’ అని అనేవారు. అప్పుడు మా నాన్న గారికి, తంబి గారి
గురించి
తెలియదు. తంబిగారు వచ్చినప్పుడు, మా అమ్మ
ఈ విషయం చెప్పింది.
అమ్మ
తంబిగారితో, ‘స్వామి నన్ను కొట్టారు, అప్పటి నుండి నాకు ప్రార్థన రావడం లేదు’ అని చెప్పింది. తంబిగారు మా నాన్నను పిలిచి, “నువ్వు ఎందుకు ఇంతపని చేశావు? ఆమెకు ఆత్మ వచ్చి ఆత్మ ప్రార్థన చేస్తుంటే
నీవు ఇంత పని చేశావు. కాబట్టి,
నీవు 21 రోజులు జబ్బుతో బాధ పడతావు”
అని చెప్పారు.
తంబి గారికి అన్నం
పెట్టేది మా అమ్మ. బాగా నీరు కాసి, స్నానాల గదిలో పెడితే స్నానం చేసేవారు. వారు ఎక్కువగా నెయ్యి, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, ఈ మూడు ఇష్టముగా తినేవారు. ఇక ఆ రోజు నుండి, “మీ ఇంటి దగ్గర నేను అన్నం తినను,” అని తంబిగారు అన్నారు. అప్పుడు అమ్మ బాగా ఏడ్చింది. అది
చూసి తంబిగారు, “అమ్మా! ఏడవకు! మీ ఆయనకు స్వస్థత చేకూరిన తరువాత, ఆయనకు ఆత్మ వచ్చిన తరువాత, నేను మీ ఇంటికి వస్తాను, కాని మీ ఇంటిలో ఏమీ ముట్టుకోను” అని చెప్పారు.
ఇది జరిగిన ఐదు రోజులకు, మా నాన్నకు జ్వరం వచ్చేసింది. మా నాన్న సంఘ పెద్ద. కల్దిరారో స్వామికి బాగా ఇష్టం. మా నాన్నను అవుటపల్లి ఆసుపత్రికి తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తరువాత తంబిగారు వచ్చి మా నాన్నతో, “అంతోని! నీవు 21 రోజులు ఏమీ తినవు. 21వ రోజున నేను తీసుకు వస్తాను. ఆ రొట్టె తిని నీవు బాగు పడు” అని చెప్పేసి వెళ్ళి పోయారు. మా నాన్న గారి పేరు అంతోని. ఇక 21వ రోజు గడిచిపోయింది. ఆరోజు అన్నం పెట్టిన తర్వాత, తంబిగారు, “నీవు ఇంటికి వెళ్ళు, నీకు ఏ జ్వరం రాదు. నీవు చచ్చిపోయే వరకు నీకు జబ్బు రాదు” అని చెప్పారు. చెప్పిన తరువాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి, మా నాన్నకు తంబి గారంటే చాలా ఇష్టం కలిగింది తంబి గారికి పంచ గాయాలు వస్తే, నాన్నగారు ముగ్గురు పెద్దలను తీసుకొని, ఒక గజం బట్ట తీసుకొని వెళ్ళారు. అప్పుడు తంబిగారు, “శుక్రవారం, శుక్రవారం నాకు వచ్చేటు వంటి పంచ గాయాలను చూడాలంటే మీరు ముగ్గురు తప్ప ఇంక ఎవరు రావద్దు” అని నాన్నతో చెప్పారు. అప్పటినుండి ప్రతీ శుక్రవారం, వారు తంబిగారిని చూడటానికి వెళ్లేవారు.
పెద్దఅవుటపల్లిలోని బోయపాటి
క్లారమ్మ గారికి మగ పిల్లలు లేరు. ఆమెకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె కోసం ప్రార్థన చేయండి అని చెప్పేవారు. తరువాత ఆమెకు ఒక
మగ బిడ్డ పుట్టాడు. అమ్మ, క్లారమ్మ
గారి ఇంటికి వచ్చేది. కేరళ
అమ్మగారు కూడా వచ్చేది. ఆమె
మరియు మామ కలిసి ప్రార్థన చేస్తుంటే “కృపావతమ్మా! ప్రార్థన చేయి” అనేవారు తంబి గారు భోజనాలయ్యాక. ప్రార్థన చేసుకొని వచ్చేవారు. అలా క్లారమ్మ గారికి, మా అమ్మ చాలా స్నేహంగా ఉండేది. ఇప్పుడు కూడా ఏదైనా బాధగా ఉంటే వారి
దగ్గరకు వెళ్లి ప్రార్థన చేయించుకొని వచ్చేది మా అమ్మ. సరే,
ఇక ఆ కాలం
అంత వరకు అయిపోయింది.
నాకు పెళ్లి అయిన తర్వాత, కొన్ని రోజులకు భర్త చనిపోయాడు. నాకు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు పుట్టారు. పుట్టిన కొన్ని రోజులకు ఒక బాబుకు విరోచనాలు, వాంతులు అయి
చనిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు, నేను బాధపడి, ‘తంబి గారా! మీ పాదాల దగ్గర ఉన్నాము. బిడ్డను ఇట్లా తీసుకున్నావు’ అని ప్రార్ధించాము.
మళ్ళీ మా ఆయనకు కలలో తంబిగారు, “ఆశీర్వాదం! నీవేం
తొందరపడవద్దు.
నీకు ఒక బిడ్డను
ఈయబోతున్నాను,
నీవు పవిత్రముగా
వుండాలి. నీవు ఏమి దొంగతనము చేయకూడదు”
అని జాగ్రత్తలు చెప్పి ఆశీర్వదించారు.
తరువాత మాకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ఇపుడు గురువు అయ్యారు. నా నాలుగవ అమ్మాయి సిస్టరు అయ్యింది. ఒకసారి మా పెద బాబుకు, పెద్ద జబ్బు చేసింది. ఏ హాస్పిటలుకి వెళ్ళినా తగ్గలేదు. రక్త విరోచనాలు అవుతున్నాయి. తగ్గక పోయే సరికి మా కుటుంబం అంతా కూడా
ప్రార్ధన చేసుకున్నాము. మేము ఇద్దరం భార్యా భర్తలం, ‘తంబి గారా! నీవున్నావు, డాక్టర్ కన్నా నీవు ఎక్కువ డాక్టరువు, కష్టాలన్నీ నీవే తీరుస్తావు. మా బిడ్డకు ఏ డాక్టరు కూడా జబ్బు నయం
చేయలేక పోయాడు’
అని ప్రార్ధన చేసుకున్నాక
మా బాబు పండుకున్నాడు. పడుకున్న తరువాత, కలలో, తంబి గారు కర్రపుచ్చుకొని వచ్చి, బాబు చుట్టూర తిరిగి, “బాలస్వామి! బాలాస్వామి! నేను వెళ్ళిపోతున్నా, లెగువు,” అని చెప్పాడట. వీడు ఒక్కసారిగా లేచి, ‘అమ్మా! తంబిగారు వచ్చారమ్మ, నాన్న లెగువు, తంబిగారు వచ్చారు’ అని అరిచాడు. మేము చూస్తే మాకేం కనబడలేదు, బాబుకే కనిపించారు. మా కొడుకు, ఇప్పుడు గన్నవరములో ఉంటున్నాడు. ఇప్పుడు తంబిగారంటే అతనికి ఎంతో ఇష్టం.
మా గ్రామములో ఎవరైనా పోట్లాడుకుంటే
ప్రక్క, ప్రక్కన కూర్చోబెట్టి సమాధాన
పరచేవారు తంబిగారు.
ఇద్దరు చెప్పేది
కూడా వినేవారు.
పెద్దవాళ్ళయినా
సరే, విని తంబిగారు ప్రార్ధన చేయమంటే,
‘మేము ఇక ఎప్పుడు పోట్లాడుకోము తంబిగారా’ అని ఇద్దరు సమాధాన పడి వెళ్ళిపోయేవారు. తరువాత పోట్లాడుకోనేవారు కాదు. తంబిగారంటే భయం వేసేది. ఈయనలో ఉన్నటువంటి శక్తి అటువంటిది. తంబి గారు ఉన్నంత సేపు, మగవాళ్ళు కూడా దడిసేవారు. అక్కడున్నంత వరకు, ఆయనకు జ్వరం రావడం లాంటివి ఏం జరగలేదు. అక్కడి నుండి వచ్చేసిన తర్వాత నెలలో
మొదటి శుక్రవారం,
మొదటి ఆదివారం
తప్పక రమ్మని చెప్పేవారు. ఐదుగురు
సభ తల్లులు, మేమిద్దరం కలిసి ఎప్పుడూ అవుటపల్లికి
వెళ్తుండే వాళ్ళం.
వచ్చినప్పుడు భోజనం
పెట్టి “మళ్ళీ మంచిగా మొదటి శుక్రవారం, మొదటి ఆదివారం రండి” అని చెప్పేవారు. మేము అవుటపల్లికి వచ్చినపుడల్లా భోజనం
పెట్టేవారు. భోజనం చేసి మేము వెళ్ళిపోయే
వాళ్ళం. మా అత్తగారి ఇల్లు శోభనాద్రిపాలెం.
నా చిన్న కొడుకుకు 10వ తరగతి చదివేటప్పుడు మార్కులు మంచిగా
రావట్లేదు. వాళ్ళ అన్నగారు బాగా కొట్టేవారు. అప్పుడు చిన్న కొడుకు, ‘నేను చచ్చిపోతాను, స్కూలుకి వెళ్తే నన్ను ఏమో చేస్తున్నారు, ఇక్కడ అన్నయ్య కొడుతున్నాడు, నేను ఎందుకు బ్రతకాలి?’ అని నిర్ణయించుకున్నాడు. నేను బ్రతిమిలాడి ఏడ్చాను. ‘బాబు మనకొచ్చిన భాదలన్నీ, తంబి గారికి చెప్పుకుంటే తీరుస్తారు. నీవు బాధ పడవద్దు’ అని చెబితే, ఆ రోజంతా ఉపవాసము వుండి తెల్లవార్లు
ప్రార్ధన చేసి మేమిద్దరం పడుకొన్నాము.
తెల్లవారు జామున, తంబిగారు బాబు
దగ్గరకు వచ్చి,
“ప్రకాష్ లెగువు, నీవు ఫస్ట్ మార్కులతో పాసవుతావు లెగువు” అని మూడు సార్లు వీపు మీద కొట్టారు. తరువాత, ‘అమ్మా! నన్ను తంబిగారు లేపుతున్నారు’ అని చెప్పి
ఇక అప్పటి నుండి మనసు మార్చుకుని స్కూలుకి వెళ్ళాడు. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు.
నా మనవడికి జరిగిన ఇంకో విషయం. వాళ్ళమ్మ, బట్టలు కుట్టుకుంటూ ఆ సూది ఎందుకు మరచి
పోయిందో, మంచం మీద వదిలి పెట్టింది. నా మనమడు, ఆడుకుంటూ, గబుక్కున స్కూలు నుంచి వచ్చి, ఆ మంచం మీద పడుకున్నాడు. పడుకునే సరికి ఆ సూది ప్రక్కటెకముకలో
గుచ్చుకుని, లోనికి వెళ్ళిపోయింది. ఏ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళినా, ఇక మా వల్ల కాదు అన్నారు. మా అబ్బాయి రాయుడు గారు, హాస్పిటలులో
జీపు తోల్తాడు. అక్కడకు తీసుకు వెళ్లి డాక్టరు గారికి
ఫోన్ చేస్తే,
‘మీకేం భయం లేదు, నేను ఆపరేషన్ చేస్తాను. నేను వచ్చేవరకు, మౌనంగా వుండండి’ అని ఆయన చెప్పారు. ఇక అందరు కలసి నన్ను, నా చిన్న కొడుకుని తిడుతున్నారు. తిడుతుంటే, ‘మనకేం గత్యంతరము లేదు బాబూ! తంబి గారి ఫోటో, యేసు తిరు హృదయం ఫోటో ప్రక్కన పెట్టుకొని
మనం అడుగుదాము.
ఈ ప్రార్ధనలోనే
దేవుడు మనకు మేలు చేస్తారు’ అని చెప్పి మేమిద్దరం రాత్రంతా ప్రార్ధన చేసాము. ఆ తెల్లవారు జామున, ఏడింటికి వచ్చి డాక్టర్ గారు ఆపరేషన్
చేశారు. ఎనిమిదింటికి, ఆ సూది తీసుకు వచ్చి చూపించారు. అప్పుడు తంబి గారికి కృతజ్ఞతలు చెప్పి, మూడవ రోజున ఇంటికి తీసుకు వెళ్ళకుండా, ఆ బాబును ఇక్కడికే [అవుటపల్లి
గుడికి] తీసుకువచ్చి, మాకు
తోచినంత కానుకలు వేసి, ఆయనకు
కృతజ్ఞతలు చెప్పి,
అప్పుడు ఇంటికి
వెళ్ళాము.
తంబిగారికి గడ్డం, బాగా పెరిగి పోయి వుండేది. దానిని ఎప్పుడూ కత్తిరించే వారు కాదు. అప్పటి ఫోటో ఇప్పుడు మా ఇంట్లో వున్నది. జుట్టు కూడా మామూలుగా వుండేది. నప్పుల నప్పుల తల. మొదట్లో ఫోటో, ఇప్పటి వరకు దాచు కున్నాను. బట్టలు మాత్రం, మమ్ము ఉతకనిచ్చే వారు కాదు. మురికిగా ఉండేవి. ఒక్కొక్క రోజున మా ఇంట్లో పడుకొని, మా అమ్మతో కలసి కొంచెం సేపు మాట్లాడే వారు. ఆయన పడుకోవాలనుకుంటే పడుకునే వారు, లేదంటే “కృపావతమ్మా! నేను ఇచ్చట ఉండను. నేను నా ఇంటికి వెళ్ళి పోతున్నాను” అని చెప్పి వెళ్ళిపోయే వారు. నాకు చిన్న తనం కదా! మరి ఎన్ని గంటలు పడుకునే వారో తెలియదు. మా అమ్మకైతే అన్నీ తెలుసు. నా దగ్గర ఉన్న ఫోటో ఆయన చేతితో ఇచ్చింది కాదు. ఒకప్పుడు తీసిన ఫోటోను బట్టి తీసిందే.
కొమరవల్లి భాగ్యమ్మ, తేలప్రోలు
గ్రామము
4 జూన్ 2009
కొమరవల్లి భాగ్యమ్మ |
No comments:
Post a Comment