సాక్ష్యం 21
పుల్లెల్లి అంతోని
కేసరపల్లి గ్రామము, గన్నవరం మండలం
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
నా
పేరు పుల్లెల్లి అంతోని. మాది
కేసరపల్లి గ్రామము. తండ్రి రాయప్ప. తల్లి మరియమ్మ.
నా వయస్సు ప్రస్తుతం 65 సం.లు. తంబి గారితో పరిచయమైనప్పుడు
నా వయస్సు పది సం.లు.
నేను అప్పుడు ఐదవ తరగతి చదువుతున్నాను.
ఆయన
మా గ్రామానికి ఎప్పుడు వచ్చారో తెలియదు కాని [1937],
ఆయన వచ్చినప్పటి నుండి జోజప్ప గారంటే కేసరపల్లి గ్రామస్తులందరికీ ఎంతో
ఇష్టం ఏర్పడినది. పిల్లల్లు, పెద్దలు,
ఉపాధ్యాయులు అందరు కూడా ఆయననుఎంతగానో గౌరవించేవారు. మా తండ్రి గారు మా గ్రామ పెద్ద. ఆయన గుడి విషయాలలో, ప్రార్ధన విషయాలలో,
మరియు బడి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ వహించేవారు.
కల్దిరారో స్వామి మా నాన్నకు ‘బంగారు పెద్ద,’ అని పేరు కూడా పెట్టారు. జోజప్ప
[జోసఫ్] తంబి గారు వచ్చినప్పుడు గుడికి ఎదురుగా,
ఒక బావి ఉండేది. ఆ బావికి కి ఎదురుగా మాకు పెద్ద ఖాళీ స్థలం వుండేది. ఆ ఖాళీ స్థలములోనే, జోజప్పగారు భక్తిపరుడు కాబట్టి, ఆయనకు ఒక చిన్న గుండ్రని ఇంటిని కట్టించారు మా
నాన్న గారు. తంబి గారిని ఇక అందులో
ఉండమన్నారు. మాది పెద్ద కుటుంబం. మా కుటుంబములో ఒక బిడ్డగా వుండేవారు. మా ఇంట్లోనే భుజించేవారు. మా తల్లిదండ్రులు ఆయనను కూడా సమానంగా చూసుకునే
వారు. ఆ విధంగా ఉంటున్నప్పుడు
రాత్రి కాలములో, ఆయన ఇంట్లోనే పడుకునే వారు. కొన్నిసార్లు మా నాన్న గారు వెళ్లి చూసేవారు.
అప్పుడప్పుడు తంబిగారు ఏం చేస్తున్నారా?
అని వెళ్లి చూసేవారట. ఎప్పుడు
వెళ్లి చూసినా కూడా తంబిగారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్ధన చేస్తుండే వారు.
ఒకసారి ఒక అద్భుతం జరిగింది. జోజప్పగారు మమ్ములను అనగా పిల్లలను పిలచి ఇలా అన్నారు. “నేను మందు ఇచ్చి అందరికి స్వస్థత జరుపబోవు చున్నాను; మీరందరూ గ్రామములోనికి వెళ్లి, వీధి వీధి తిరిగి, “తంబిగారు పిల్లలకు, పెద్దలకు, అందరకు మందులిస్తున్నారు, అందరు వచ్చి మందు తీసుకొని స్వస్థత పొందాలి అని మీరు వెళ్లి చెప్పాలి” అని అన్నారు. అప్పుడు మేము వెళ్లి బజారులో కేకలు వేసుకుంటూ ‘జోసఫ్ తంబిగారు అందరికీ మందులివ్వ బోతున్నారు, ఎవరైతే వ్యాధిగ్రస్తులో రండి, వచ్చి మందులు తీసుకోవాలి ... ఒహో,’ అని చాటింపు చేసాము. అలా చెప్పిన పిల్లలలో నేనూ ఒకడిని. అలా మేము చెప్పి గుడి వద్దకు వచ్చాము. వచ్చేసరికి చాల మంది బారులుగా నిలబడ్డారు. వ్యాదిగ్రస్తు లందరూ వచ్చారు. తంబి గారు గుడి గుమ్మం దగ్గర ఒక కుర్చీ వేసుకొని, ఒక బిందె నిండా నీళ్ళు ప్రక్కన పెట్టుకున్నారు. ఆ బిందె మీద ఒక గ్లాసు వుంది. మా కాంపౌండ్ చుట్టూ వేప చెట్లు, దొండ చెట్లు, అట్లాంటివి ఏవేవో చెట్లు ఉండేవి. వాటి ఆకుల్ని కోసి, నూరి, ముద్దలుగా చేసి ఒక పళ్ళెంలో పెట్టుకున్నారు తంబిగారు. ఒక్కొక్కరు వచ్చినప్పుడు తంబిగారు, చిన్న ఉండ చేసి నోట్లో వేసి, గొంతులో నీళ్ళు పోసి వారిపై సిలుగ గురుతు వేసి ప్రార్ధించారు. అంతే! అందరరూ స్వస్థత పొందారు. అలా ప్రార్ధన చేసిన మా తమ్ముడికి ఈ రోజువరకు అసలు అనారోగ్యమంటే తెలియదు. ఏ జబ్బు లేకుండా చక్కగా, ఆరోగ్యముగా వున్నాడు. ఆ విధముగా గొప్ప అద్భుతం చేసారు తంబిగారు.
మా
నాన్న గారు మా గ్రామమునకు పెద్ద. మా
యొక్క వ్యవసాయ పనుల మీద తీరిక లేకుండా వుండేవారు.
అప్పుడు ఏడు ఎకరాల పొలములో చెరుకు వేసారు.
చెరుకు కొట్టడానికి, మా
నాన్నగారు మనుష్యులను తీసుకు వెళ్లారు. ఒకసారి
తంబిగారితో, ‘జోజప్ప గారా! మీరు కూడా రావచ్చు కదా కూలికి, మీకు కూడా దేనికయినా పనికి వస్తాయి కదా! మాతోపాటు రండి,’
అని మా నాన్న గారు తీసుకెళ్ళారు.
అందరు చెరుకు కొడుతున్నారు. తంబి గారు కూడా కొడుతున్నారు. చెరుకు కొట్టేటప్పుడు, మధ్యాహ్నం
భోజనానికి కొంచెం ముందు తంబిగారు చెరుకు నరికే కత్తి క్రింద పడేసి, అకాశమువైపుకు చూస్తూ దేవదూతతో మాట్లాడు తున్నారు. అందరు ఆయన దగ్గరకు వచ్చి, ‘ఏంటీ తంబిగారా! పైకి చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు? ఏమయింది,’
అంటూ తంబి గారి వైపే చూస్తున్నారు.
ఆ దేవదూత స్వరం ఆయనకు వినబడుతుంది.
ఈయన మాటలు అందరికి వినబడుతున్నాయి.
దేవదూత మాటలు ప్రజలకు వినబడుటలేదు.
ఆవిధముగా మాట్లాడుతుంటే ‘ఏంటి
జోజప్పగారా! ఏం మాట్లాడుతున్నారు,’ అని అందరు మరల అడిగారు.
అందుకు తంబిగారు, “మీ
ఇంట్లో దొంగలు పడ్డారు. మీ
కోడి పెట్ట ఒకటి, రెండు మానికల బియ్యం, ఏవో కొన్ని వస్తువులు పోయినవి. వెంటనే పని ఆపివేసి ఇంటికి వెళ్ళు అని దేవదూత
చెప్పింది” అని వారికి చెప్పాడు. అప్పుడు
‘సరే మీ ఇష్టం జోజప్ప గారా, ఇంటికి వెళ్లి రండి’
అని అందరు అన్నారు. మా
నాన్న కూడా ‘మీ ఇష్టం మీరు వెళ్ళండి,’ అన్నారు.
అప్పుడు ఇంటికి వచ్చి చూస్తే దేవదూత చెప్పినటువంటి వస్తువులు
అన్నీ దొంగతనం చేయబడ్డాయి.
నిజముగా అది ఒక గొప్ప అద్భుతం.
ఒకసారి
సాయంకాల సమయం నేను మరియు నా స్నేహితుడు జోజప్ప గుడిముందో,
బడి ముందో ఆడుకుంటున్నాము. అప్పుడు
జోసఫ్ తంబిగారు గారు వచ్చారు. తంబి
గారు మా దగ్గరికి వచ్చి “అంతోని! జోజప్పా!
మీరిద్దరు ఎయిర్ పోర్ట్ ఎదురుగా కేసరపల్లి
- గన్నవరం మధ్య పెద్ద మర్రి చెట్టు వుంది కదా,
అక్కడ దాకా నాతో వస్తారా?” అని అడిగారు. మేము
సంతోషముగా ‘వస్తాము,’ అని చెప్పి ఒప్పుకొన్నాము. సాయంత్రం చల్ల గాలి వీస్తుంది. వాతావరణం మేఘావృతం అయివుంది. మేము తంబిగారిని వెంబడించాము. కేసరపల్లిలో ఉన్న లెప్రసీ ఆసుపత్రి వద్ద వున్న
ఆ మర్రి చెట్టు క్రింద కూర్చొని వున్నాము. ఆ సమయములో, ఒక ప్రక్క ఒక కుష్టు రోగి కూర్చొని వున్నాడు. అకస్మాత్తుగా జోసఫ్ తంబిగారు గారు ఆయన యొద్దకు వెళ్ళడం మేము చూసాము. అది సాయంత్రం కావున బాగా చలి వేస్తుంది. ఆ కుష్టురోగి వణుకు తున్నాడు. దండం పెట్టి శరీరం చూపించాడు. అప్పుడు జోసఫ్ తంబిగారు లుంగీపంచ ధరించి
ఉన్నారు. ఆ లుంగీపంచ తీసి ఆ
కుష్టురోగి ముఖం మీద పడేసాడు. వెంటనే
ఇంకొక లుంగీపంచ వచ్చి జోసఫ్ తంబిగారిని చుట్టుకుంది.
ఏం జరిగిందా? అని
మేము తంబి గారి వైపు చూస్తున్నాము. తంబి
గారి వంక, కుష్టురోగి వంక అలాగే
చూస్తుండి పోయాము. ఎవరూ మాట్లాడుట లేదు. కాసేపు సందిగ్ధత ఏర్పడింది. అక్కడే కూర్చున్నాము.
కాసేపు తర్వాత మేము గమనించామని జోసఫ్ తంబిగారు గ్రహించాడు. అప్పుడు తంబిగారు మాతో,
“మీకు ప్రొద్దు గూకి పోయింది. మీరు చిన్న పిల్లలు కదా! ఇక
ఇంటికి వెళ్ళరా? భయం వేయదా?” అని అడిగారు.
అప్పుడు మేము ‘మాకేం
భయం లేదు తంబిగారా, మేము హాయిగా వెళ్లిపోతాము,’ అని అన్నాము.
జోసఫ్
తంబిగారు నిదానముగా, ఎంతో దీనతతో మాట్లాడేవారు.
దైవీక శక్తి, ఆకర్షణ
శక్తి ఆయనలో ఉండేవి. ఆయన
అంటే ఎవరికీ ద్వేషం లేదు. అలాంటి
మంచి మనిషి తంబిగారు. నిదానముగా, దీనతగా,
స్పష్టముగా, విధేయతగా, భక్తిగా వుండేవారు.
ఆయన్ని చూస్తుంటేనే దైవీక శక్తి కనబడినట్లుగా ఉండేది. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన.
ఆ
మర్రి చెట్టు నుండి తంబిగారు అవుటపల్లి గ్రామమునకు వెళ్ళారు. మేము మా గ్రామమైన
కేసరపల్లికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాము. ఇంటికి చేరుకున్న మేము జరిగిన అద్భుతము
గురించి అందరికి చెప్పేసాము. ‘మా ముందే తంబిగారు
ఇలా చేసారు. తన లుంగీపంచని కుష్టురోగికి
ఇచ్చారు. వెంటనే మరియొక లుంగీపంచ
వచ్చి ఆయను చుట్టి వేసింది’ అని
అందరికి చెప్పాము.
ఇలాంటి
అద్భుతాలు మా ఇండ్లలో కూడా చాలా చేశారు తంబిగారు.
అనేక సార్లు జోసఫ్ తంబిగారు పంచ గాయలను పొందటం మా అమ్మ గారు కళ్ళారా చూసారు.
ఒకసారి
నేను విన్నదేమిటంటే, కేసరపల్లిలో
జోసఫ్ తంబిగారు ఉన్నప్పుడు మా ఇంటిలోనే ఉండేవారు.
చివరి సారిగా వచ్చినప్పుడు మా ఇంటి ముందు నిలిచి, చేతులెత్తి ఆశీర్వదించారు, “ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను”
అని అన్నారు. అప్పుడు,
‘ఏంటి జోజప్ప గారా!
ఎందుకు అలా అంటున్నారు?’ అని మా అమ్మ నాన్నలు అడిగారు. అందుకు జోసఫ్ తంబిగారు, “కాదు
ఇక నేను దేవుని దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఇక నేను రాను. ఈ
ఊరికి రావడం ఇదే ఆఖరిసారి. నేను
మీ ఇంటిని ఆశీర్వదిస్తున్నాను,” అని రెండు చేతులు పైకెత్తి మా ఇంటిని ఆశీర్వదించారు. అందరం, మాకోసం ప్రార్ధన చేయమన్నారు. ఇక ఆయన వెళ్ళిపోయారు.
జోజప్ప
తంబిగారు కేసరపల్లి గ్రామము నుండి అవుటపల్లికి వెళ్ళినప్పుడు అతని వయస్సు 45 నుండి 50 సంవత్సరాలు వుంటాయి. నా
వయస్సు పది సంవత్సరాలే కదా! నాకు
ఆయన వయస్సు ఎంత ఉంటుందని అంతగా అవగాహన లేదు. చాలాఆకర్షణీయంగా ఉండేవాడు. నల్ల
గడ్డం వుండేది. ఎవరైనా ఆయనను చూస్తే
ఆయనలో ఎదో గొప్ప శక్తి, ఆకర్షణ ఉండేది అని గ్రహించేవారు.
దేవుని శక్తి ఆయనలో ఉన్నట్లుగా ఉండేది.
ఒకసారి
జోసఫ్ తంబిగారిని ‘కొండబాదు’కు పిలిచారట. కల్దిరారో స్వామికి తంబి గారంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన జోజప్ప తంబిగారిని ఛీ కొట్టే వారు. ఒక రోజు కల్దిరారో స్వామి పెద్దబండి మీద ‘కొండబాదు’కు
పూజకు వెళ్లారు. అప్పుడు
తంబిగారు, “స్వామి! నేను కూడా వస్తాను” అని
అన్నారు. అందుకు కల్దిరారో స్వామి, ‘ఏయ్
మాతో ఎందుకు ? వద్దు,’ అని అన్నారు. తంబిగారు మరల, “స్వామి! నన్ను రానీయండి,”
అన్నారు. అప్పుడు ‘నాతో
వద్దు. ఎట్లా వస్తావు?’ అని స్వామి అన్నారు. అందుకు జోజప్ప తమిగారు, “సరేలే
స్వామి,” అని స్తోత్రం చెప్పారు. అంతలోనే కల్దిరారో స్వామి బయలు దేరారు. తంబి గారు కూడా బయలు దేరారు. అప్పుడు దేవుని హస్తం వచ్చి తంబిగారిని ఇక్కడ
నుండి తీసి ‘కొండబాదు’లో పెట్టింది.
అక్కడికి
వెళ్ళగానే ఉపదేశి మాష్టారు గారు తంబి గారిని చూసి నమస్కారం చేసాడు. తంబిగారు, “నేను గుడిలో ప్రార్ధన చేసుకుంటాను,
తలుపు తీయి,” అన్నారు. ఉపదేశి గుడి తలుపులు తీశారు. తంబిగారు ప్రార్ధన చేసుకొని దాదాపు ఇరవై ఐదు నిమిషాలు
తర్వాత బయటకి వచ్చేసరికి బయట బండి మోత వినిపించింది.
అప్పుడే కల్దిరారో స్వామి అక్కడికి వచ్చారు.
తంబి గారు అప్పుడే గుడి నుండి బయటకు వచ్చారు.
కల్దిరారో స్వామి ఆయనను చూసి నిర్ఘాంత పోయారు.
‘ఏంటి ఈయన నాతో అక్కడ మాట్లాడాడు కదా! నా కంటే ముందు ఎలా వచ్చాడు? నన్ను దాటి ఏ బండి రాలేదు కదా!’ అని అనుకుంటా
అట్లాగే చూస్తుండి పోయారు. అప్పుడు
ఎదురుగా వున్న ఉపదేశి, ‘ఏంటి
స్వామి! ఈయన జోజప్ప తంబిగారు’ అన్నారట.
అందుకు స్వామి, ‘ఏయ్
నాకు తెలుసు, కాని ఇక్కడికి ఆయన ఎలా వచ్చారు? ఎంత సేపు అయింది వచ్చి?’ అని అడిగారు. అందుకు ఉపదేశి, ‘ఈయన వచ్చి ఒక అరగంట అయింది స్వామి,’ అని అన్నారు. స్వామి టైం చూసుకున్నారు.
అప్పుడు తంబిగారు కల్దిరారో స్వామి దగ్గరకు వచ్చి, “ఏంటి స్వామి!
అలా నిర్ఘాంత పోయారు,”
అని అన్నారు. అప్పుడు స్వామి, ‘జోజప్పగారూ...’ అని అన్నారు.
పూజానంతరం,
కల్దిరారో స్వామి జోజప్పగారిని పిలిచి, ‘నేను ఇక్కడ విచారణ గురువును. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
మీరు దానికి సమాధానం చెప్పాలి. ఏం అనుకోవద్దు.
నేను తెలుసుకోవాలి. మీరు ఇక్కడికి ఎలా
వచ్చారు? మీరు నాతో
వస్తానని నన్ను అడిగారు, నేను కాదన్నాను. అయితే ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చారో నాకు
సమాధానం చెప్పండి?’ అని ప్రశ్నించారు. అప్పడు తంబిగారు
“స్వామి! ఒక
హస్తం వచ్చి నన్ను లేపి ఇక్కడ పెట్టింది. ఒక సెకనులో... కన్నులు మూసుకొని తెరిచేలోగా నేను ఇక్కడికి వచ్చేసాను,” అని సమాధానం చెప్పారు.
ఈ విధముగా, కల్దిరారో స్వామి పెద్దఅవుటపల్లిలో బండి స్టార్ట్ చేసేలోగానే,
తంబిగారు ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. ఇది
గొప్ప అద్భుతం. ఇటువంటి అద్భుతాలు
జోజప్ప తంబిగారి జీవితములో ఎన్నో ఉన్నాయి.
గన్నవరములో
ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. అది
రెండవ ప్రపంచ యుద్దకాలం. సైనికులంతా
ముమ్మరంగా అచట పనిచేస్తున్నారు. అప్పుడు
బిల్డింగ్ పని కోసం సిమెంట్ వుంటుంది కదా! దేని కయినా పనికొస్తుంది అని కొంత సిమెంట్ తీసుకు వచ్చారు మా గ్రామ
ప్రజలు. మా అమ్మ గారు కూడా
కొంత సిమెంటు తెచ్చి కుండలో దాచి పెట్టారు. ఆ సంగతి జోజప్ప గారికి తెలియదు. సాధారణంగా అందరి వద్ద ఎంతో కొంత సిమెంటు వుంది.
ఎయిర్ పోర్టులో పని చేస్తుండటముతో అందరు ఎంతో కొంత తీసుకు వచ్చి దాచుకునే
వారు. ఆ రోజు జోజప్ప
తంబిగారు, “గుడి వెనుక పీఠం దగ్గర
గోడ పగిలింది. మీలో ఎవరి వద్దనయినా
సిమెంటు వున్నదా?” అని అడిగారు. అప్పుడు, ‘మేం తెస్తాం,’ అని
అక్కడ ఉన్న పిల్లలు అందరము అన్నాము. తంబిగారు,
“మీరుఇంటికి వెళ్లి పట్టుకు రండి,” అన్నారు.
అప్పుడు నేను కూడా వెళ్లాను, వెళ్లి ‘సిమెంట్
ఉన్నదా అమ్మా? తంబి గారు అడుగుతున్నారు. అందరినీ తీసుకు రమ్మంటున్నారు. అందుకే నేనూ వచ్చాను’
అని అన్నాను మా అమ్మతో. అప్పుడు
మా అమ్మ ‘అరే సిమెంట్ లేదు
పోరా! సిమెంట్ ఏమి లేదు.’ అన్నారు.
అపుడు వెళ్లి ‘మా
అమ్మగారు లేదు అన్నారు,’ అని
తంబిగారితో చెప్పాను. అప్పుడు తంబిగారు, “లేదా!... మీ ఇంట్లో కుండలో సిమెంట్ వుంది.
నేను చెప్పానని చెప్పు,” అన్నారు. మళ్ళీ
వెళ్లాను. అమ్మతో, ‘సిమెంట్ ఎక్కడో కుండలో
వుందట అమ్మా, ఇక్కడ దాపున వుందట,’ అని అన్నాను
. న్దుకు అమ్మ, ‘అరేయ్
నేను సిమెంటు సాయంత్రమే తెచ్చినాను. తంబిగారికి ఆ సంగతి తెలియదు. అప్పటి నుంచి ఆయన ఇంకా మన
ఇంటికి రాలేదు. ఆయనకు ఈ విషయం
ఎలా తెలిసింది?’ అని ఒకింత
ఆశ్చర్యముతో అన్నది. అప్పుడు
నేను సిమెంటును కొంత తీసుకొని గుడి దగ్గరికి వెళ్లాను. అప్పుడు తంబిగారు నన్ను
చూచి, “నేను చెప్పాను కదా మీ ఇంట్లూ సిమెంటు ఉన్నదని.
అప్పడు ఎందుకు అబద్దం చెప్పావు,” అని అన్నారు తంబి గారు. అందుకు
నేను, ‘లేదండీ! మా అమ్మగారు లేదని చెప్పింది!’ అని చెప్పాను. ఈ విధంగా జోజప్ప తంబిగారు ఎన్నో
అద్భుతాలు చేశారు.
ఎంతో
మంది ఆయనను గురించి, అద్భుతాలు
చేసాడని చెప్పేవారు. నా
విషయములో అయితే ఆ లుంగీపంచ విషయములో, ఆ
చెరుకు నరికే విషయంలోను, ఇంట్లో
దొంగలు పడే విషయంలోను, ఇట్లు
ఎన్నో అద్భుతాలు చేశారు.
మా
చివరి సంభాషణ ఏమిటన, తంబిగారు
మా ఊరు రావడం అదే చివరిసారి. తను
చనిపోవుటకు ముందు మా కుటుంబమునకు వచ్చి, “మీ ఇంటిని ఆశీర్వదిస్తాను,” అని చెప్పి మా ఇంటిని ఆశీర్వదించారు. అప్పుడు మా తల్లిదండ్రులు, ‘ఎందుకండి!’
అని అడిగితే, తంబిగారు, “ఇక
నేను రాను,” అని అన్నారు.
మొదటగా
జోసఫ్ తంబిగారు ఆమంటే ఎవరో తెలియదు. ఆయనఎక్కడ
నుంచి వచ్చారో తెలియదు. మా
గ్రామానికి వచ్చినప్పుడు, మా ఇంట్లోనే వున్నారు. మా స్థలములోనే ఆయనకు ఇల్లు కట్టారు. మాతో మాట్లాడుతూ వుండేవారు. మా ఇంట్లో భోజనం చేసేవారు. వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేవారు.
No comments:
Post a Comment