Saturday, May 9, 2020

సాక్ష్యం 23

సాక్ష్యం 23

లింగ తోటి శిఖామణి
మానికొండ గ్రామము, ఆంధ్రప్రదేశ్
66 సంవత్సరములు

నా పేరు లింగతోటి శిఖామణి.  మా గ్రామం మానికొండ. నా వయసు ప్రస్తుతం అరవై ఆరు సంవత్సరములు. తంబి గారితో పరిచయం అయినప్పుడు, నా వయసు 10 సంవత్సరాలు. వారు ఒక పెట్టె చేయించుకొని, ఇంట్లో పెట్టుకొనిరి. కుర్చీ పక్కనే పెట్టె ఉండేది. ఒకసారి నేను, స్వామి! ఈ పెట్టె ఎందుకండి,’ అని అడిగాను. అప్పుడు తంబి గారు,నేను ఒక మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో, పొనుగుమాడ అను గ్రామం వెళ్ళాను. నా కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఏప్రిల్ నెల, కాళ్లు బాగా కాలుతున్నాయి. తొందర తొందరగా నడచి, బజారు వెంబడి వెళ్లుచున్నాను. ఇద్దరు పిల్లలు ఎదురుగా తీగలతో ముళ్ళ కిరీటంలాగా చేసి, నా కాళ్ళ మధ్యన పడేసి పారిపోయారు. ఇది ఎందుకు జరిగింది చెప్పు,” అని నన్ను అడిగారు. అప్పుడు నేను,స్వామి! పది సంవత్సరముల వయస్సులో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలనా?’ అన్నాను. అందుకు తంబిగారు, నీవు చెబుతావు, చెబుతావు,  చెప్పు,” అని చిన్నగా కొట్టారు. అప్పుడు నేను, స్వామి!  యేసు ప్రభువు, సిలువ మీద పెట్టి కొట్టినప్పుడు, తల మీద ముళ్ల కిరీటం పెట్టారు కదా  అన్నాను. అప్పుడు ఆయన అయితే, నేను కూడా చచ్చి పోవాలి కదా!  అని నన్ను చిన్నగా ఒక దెబ్బ వేసారు. అందుకు నేను, అది కాదు స్వామి! మీరు అడిగారు,  నేను చెప్పాను,’ అని అన్నాను. అందులకు తంబిగారు, సరే ఇది రైటే,” అన్నారు.

అలాగే, మరల తంబిగారు, “ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు, ఈ ఇంటి నడి కప్పు మీద ఇద్దరు పిల్లలు కూర్చుని నన్ను రమ్మని పిలుస్తున్నారు,” అని అన్నారు. వెమ్మటే నేను, మరి వారికి రెక్కలు ఉన్నాయా స్వామి?’ అని అడిగాను. తంబిగారు, నీకేం తెలుసు,” అని అన్నారు. అప్పుడు నేను, మరి పసి పిల్లలు అంటే దేవదూతలు అంటారు కదా! దేవదూతలకు రెక్కలు ఉంటాయి కదా మరి’ అని అన్నాను. అప్పుడు తంబిగారు, ఒరేయ్! నా కంటే ముందు నీకే బాగా తెలుసే” అని అన్నారు. అప్పుడు నేను, అట్లయితే మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు చచ్చిపోతారు,’ అని అన్నాను. అందుకు తంబిగారు, ఇప్పుడు కూడా, నేను చచ్చి పోవాలా?” అని ఇంకొక దెబ్బ వేశారు. అందుకు నేను, మీరు అడిగారు నేను చెప్పాను,’ అని అన్నాను. వెమ్మటే తంబిగారు, అందుకే నేను చచ్చిపోతాను, నాకు పెట్టె చేయించి పెట్టే వాళ్ళు ఎవరు లేరని, మూడు నెలలు ముందుగానే పెట్టె చేయించుకొని, ఇక్కడ పెట్టుకున్నాను.  నా సమాధికి తీసుకువెళ్లడానికి పెట్టె ఇది,” అని అన్నారు తంబి గారు. అందుకు నేను, అయితే మీరు ఇప్పుడే చచ్చిపోరుగా’? అని అన్నాను. తంబిగారు, నీకెవరు చెప్పారు,” అని అన్నారు. అప్పుడు నేను, ‘మూడు నెలలుగా ఉపవాసం ఉంటూ మంచినీళ్ళే త్రాగుతున్నారు. ఎత్తి పోస్తుంటే లోటాలు, లోటాలు వెళ్ళిపోతున్నాయి నీళ్లు’ అని అన్నాను. ఆయన గదిలో, ఒక మట్టి కుండ ఉండేది.  త్రాగే పాత్ర కూడా మట్టిదే. నేను,స్వామి నేను ముంచి ఇస్తానులే,’ అని అన్నాను. అందుకు ఆయన, సరే ముంచి ఇవ్వు,”  అన్నారు. వారికి మరణ సూచన ఆ విధంగా వచ్చింది. నా చేత చెప్పించు కున్నారు. ప్రత్యక్షంగా,  ముఖాముఖిగా నేను తంబిగారు మాట్లాడుకున్నాము.  వారు ప్రశ్నలు వేసేవారు. నేను జవాబులు చెప్పేవాన్ని.

తంబిగారు బాగా నీరసించి పోయారు, ఈజీ చైర్ లో పడుకునేవారు. కుండ పక్కనే పెట్టుకునేవారు. త్రాగడానికి కూడా ఆయనకు శక్తి లేదు. ఆ విధంగా అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు, మూడు నెలలు ఉన్నారు. అనగా 1944వ సంవత్సరము అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉపవాసం చేశారు. 1945వ సంవత్సరం జనవరి నెలలో తంబిగారు చనిపోయారు. అతడు మరణించినప్పుడు, నేను అతని తల దగ్గరే కూర్చున్నాను. అలా కూర్చున్నప్పుడు, తంబి గారు, “నేను బండి ఎక్కి వెళతాను, సాయంత్రం అయిదు గంటలకు. నీవు వెళ్ళద్దు,”  అని నాతో అన్నారు. నేను, స్వామి, ఇక్కడికి ఏ బండి రాదు ఎడ్ల బండి తప్ప,’ అని అన్నాను. అప్పుడు ఆటోలు, రిక్షాలు ఏమీ లేవు. మరల నేను, ‘ఎడ్ల బండే కదా స్వామి, ఇక్కడ ఎడ్ల బండి లేదే! ఏ బండి వస్తుంది?’  అని అడిగాను. అందుకు ఆయన, నీకు అదంతా అనవసరం. నీవు నా దగ్గర కూర్చో, నేను బండెక్కే వరకు,” అని అన్నారు.  సరే అని అలాగే కూర్చున్నాను. బోయపాటి బసవయ్య గారి ఇంట్లో గోడ గడియారం ఊగుతోంది.  వారి కుమార్తె ఒకరు బయటికి వచ్చి, ‘స్వామి! ఐదు గంటలు అయిందిఅన్నది. అప్పుడు తంబిగారు,అయ్యిందా?  అయితే బండి బయలు దేరింది అమ్మా,” అని అన్నారు.  నేనేమో అర్ధంకాక అటు ఇటు వెతుకు తున్నాను.  ‘ఏ బండి లేదు కదా స్వామి!’ అని అన్నాను. ఇక తంబిగారు ఏమీ మాట్లాడ లేక పోతున్నారు.  ఆయన పడిపోతున్నారు. విపరీతమైన జ్వరం.

నేను మాట్లాడుతున్నా ఏమి చెప్పలేక పోతున్నారు. నేను, ఏ బండి లేదు కదా స్వామి!’ అంటే, “ఇదిగో వచ్చింది ... మధ్య లోనికి వచ్చిందిఅని అంటుండగానే ఆయన ప్రాణం పోయింది.  క్లారమ్మ గారు బయటికి వచ్చేసి, తంబి గారి తలను ఒడిలో పెట్టుకున్నారు. అప్పటికే ప్రాణం పోయింది. విచారణ గురువులకు చెప్పాలని పరిగెత్తుకు వచ్చాను. కల్దిరారో స్వామి ఇక్కడే ఉన్నారు అప్పుడు. నేను వెళ్లి, స్వామి, తంబి గారు చనిపోయారు,’ అని చెప్పాను. అందుకు ఆయన,ఏయ్, ఎవరు చెప్పారు?’  అన్నారు. అందుకు, నేను చూసి వచ్చాను స్వామి,’ అని అన్నాను. ఆయన, నిజమా!  నేను వెళ్ళి చూస్తాను,’ అని బయలు దేరారు. స్వామి, ‘ఇదిగో తంబిగారు పందెం వేశారు. ఇక్కడ ముగ్గురు విచారణ గురువులు ఉన్నారు. అయినా నా మరణ సమయంలో ఒక్కరు కూడా, నాకు అవస్థ ఇవ్వలేరు,’ అని అంటూ బసవయ్య గారి ఇంటి వైపు పరుగెత్తారు స్వామి. ఆయన నడవలేదు.  పరిగెత్తాడు.  చూస్తే ప్రాణం పోయింది.  తిరిగి వచ్చిన తర్వాతపందెం నెరవేరి పోయింది.  జోజి వేసిన పందెం నెరవేరింది  అని కల్దిరారోస్వామి అన్నారు.

ప్రొద్దుటూరు అను ఊరిలో లేయమ్మ, అనే ఒక భక్తురాలు తంబి గారికి సన్నిహితంగా ఉండేది. ఆమెకు తంబి గారి మరణ వార్త చెప్పటానికి, నేను ప్రొద్దుటూరు వెళ్లాను. అప్పుడు రాత్రి 9:30 నిమిషాలు అయింది. ఆమెఇప్పుడు వచ్చావు, ఏమి?’ అని అడిగితేతంబి గారు చనిపోయారు,’ అన్నాను.  ఆ రాత్రి నేను అక్కడే ఉన్నాను, ఆమె మధ్య రాత్రిలో ఎప్పుడు లేచి వచ్చిందో తెలియదు. నేను సొంత ఊరు వెళ్లి పోయాను. సమాధి రోజున నేను రాలేదు. బ్రదర్ గారి చివరి మాటనీవు ఇక్కడే కూర్చో. నా దగ్గర కూర్చోఅని అన్నారు. నన్ను దీవించడం కాని, నేను దీవించమని అడగడం కాని చేయలేదు. చిన్నవాడిని కదా! భయం వేసేది. ‘స్వామి, స్వామి’ అని అనేవాడిని. అలాకాక ఇంత తెలివి ఉన్నట్లయితే క్షమాపణ అడగడమో...  దేవుని వరాలలో, ఒక వరం  ఇవ్వమనటమో చేసేవాడిని.

లింగ తోటి శిఖామణి, మానికొండ

No comments:

Post a Comment