సాక్ష్యం 24
కూరేటి మిఖాయేలమ్మ
ముస్తాబాద, గన్నవరం మండలం,
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
70 సంవత్సరాలు
నా స్వగ్రామం అవుటపల్లి. తంబి గారు మా ఊరికి వచ్చినప్పుడు, నాకు పది సంవత్సరములు వయస్సు. తంబి గారు వచ్చినపుడు ‘పిచ్చోడు, పిచ్చోడు’, అని రాళ్ళు వేస్తున్నారు పిల్లలు. మా ఇంటి దగ్గరికి వచ్చి మా నాయనకు చెప్పారు
తంబిగారు. నేను చేయి పుచ్చుకొని నడిస్తే
రాళ్ళు వేయరని,
భయమేసి, నా చేయి పుచ్చుకొని నడిచారు. మా ఇంటి వద్ద భోజనం కూడా చేశారు. మా అమ్మ చేపల కూర వేస్తే, మజ్జిగ కూడా అందులో పోసుకొని తాగాడు. మా అన్నయ్య గారి భార్య, మా వదిన అది చూసి ‘ఎబ్బే’ అన్నారు. చెరువుకు, నీళ్ళకు వెళ్ళాము. నీళ్ళకు వెళితే, అక్కడ ఒక అమ్మాయి, తంబి గారిని
చూసి, ‘ఎబ్బే రోతోడా!’ నీళ్ళలో ముంచావు అని అంది. ఆమె తల మీద చిన్నకుండ మాత్రమే వుంది. అక్కడ నుండి ఇంటికి రావటానికి క్లారమ్మ
గారి ఇంటి ముందు నుండే దారి, అక్కడికి వచ్చిన తరువాత “మిఖాయేలమ్మా! నీవు
వెళ్ళు. నేను వీళ్ళ ఇంటికి వెళ్లి నీళ్ళు
త్రాగి వస్తాను”
అంటే, ‘ఇది కదా స్వామి మంచి నీళ్ళు’ అని అన్నాను. అపుడాయన ఆగు, వాళ్ళింటికి రక్షణ వచ్చిందేమో నాకు తెలియదు. హా! నేను వస్తాను, నీవు వెళ్ళిపో! నీవు వెళ్ళిపో! అన్నాడు.
అపుడాయన క్లారమ్మ గారి ఇంటికి వెళ్లి, “తన్నికుడు” అని ఎంటో అంటుంటే ఆమె మంచి నీళ్ళు ఇచ్చింది. మజ్జిగ కూడ ఇచ్చింది. ఆ మజ్జిగ త్రాగాడు. త్రాగిన దగ్గరనుండి మేము మతం తీసుకుంటాము, మతం తీసుకుంటాము, అని వచ్చారు. బాలాస్వామి గారి కొడుకు స్వామి అయ్యారు కదా! ఆ బాలస్వామి గారు, మతంలోకి వచ్చాక పుట్టారు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకు మాలోల్ల దేవుడు, అని కమ్మోళ్ళు అంటుంటే క్లారమ్మ గారు బాగా చింతన పడ్డారు. ఈ బాల స్వామి గారికి రక్తం వస్తుంటే తగ్గనపుడు, తంబిగారు బోర్ల పడుకుని ప్రార్ధన చేస్తే, అది శుభ్రముగా పోయింది. మందులు వేస్తే పోలేదు. ఇక బాలస్వామి బాగానే వున్నారు.
ఆ తర్వాత ఏర్పానుగూడెం రెడ్డాయనకు, ఒంటి కాలు మీద పుండు లేసింది. ఇక్కడ కల్దిరారో స్వామి మందు పెట్టించినా, హాస్పిటలుకి రోజూ వస్తుండేవారు. నేను కూడా అపుడు కాస్త జబ్బు చేసి, ఆ హాస్పిటలుకి వస్తున్నా. అప్పటికే నాకు పెళ్ళయింది. ఇద్దరు బిడ్డలు కూడా. ఆ రెడ్డాయన ఎక్కడెక్కడో తిరిగాడట. పుండు లేచి మూడు సంవత్సారాలు అయిందట. ఎక్కడ తిరిగినా నయం కాకపోయే సరికి, ఇక ఇక్కడికి వచ్చారు. నాలుగైదు సార్లు తంబి గారు ఆ వ్యక్తిని
చూసి, “అయ్యా! నీ కాళ్ళు చాపు,” అన్నారు. చాపే సరికి, అయిదారుగురు చూస్తుండగానే
ఆ పుండును నాకేసారు. మూడు
రోజుల తర్వాత వచ్చి చూస్తే, అక్కడ మచ్చ కూడా లేదు. అటు వెళ్ళి, ఏవో
ఆకులు తీసుకువచ్చి,
నలిపి, దాని మీద వేసి, కట్టి, వెళ్ళమన్నాడు. ఆ అద్భుతం దగ్గర నుండి కల్దిరారో స్వామి, తంబిగారిని, ఎక్కడకీ వెళ్ళనివ్వ లేదు. ఇక సంస్థలోనే ఉంచాడు. ఆ రోగులెవరైనా వస్తే “హే! బయట, బయట” అని వెల్లగొట్టేవారు. ఒకసారి స్వాములవారి కాలు వాసింది. ఎందుకో తెలియదు. స్వామి బందరు ఆసుపత్రికి, గుంటూరు ఆసుపత్రికి వెళ్లారు. నయం కాలేదు. అప్పుడు జోజప్ప మా నాన్న తో “యాగప్ప! నేను ప్రార్ధన చేస్తాను, స్వామి కాలుకే, నేను ప్రార్ధన చేస్తాను,” అని అన్నారు. తెల్లారేపాటికి ఆ కాలు వాపు తగ్గిపోయింది. అవి నేను చూసిన అద్భుతాలు.
ఎక్కడైనా అన్నం పెడితే అన్నం
తినేవారు. మరి ఎప్పుడు తినేవారో, ఎంత తినేవారో తెలియదు. క్లారమ్మ గారి ఇంటికి వెళ్ళేవాడు. మరి ఆయన వేసుకున్న మొలకు కట్టుకున్న
గుడ్డ, తగల బెట్టినా తగలడ లేదు. మురికి, తగల బెట్టినా తగల బడదు. లోపలికి ఏమో మడత బెట్టి గట్టిగా బిగించి
పెట్టేవాడు గోషీ... పైన గుడ్డ చుట్టే వారు. కాలువలో నీళ్ళు పోసు కుంటుంటే, నేను చూసాను ఏలూరు కాలువలో. ‘ఎబ్బే! రోత, మేము చచ్చి పోతాము స్వామి’ అంటే, ‘హే! మీకేమి తెలుసు! ఎందుకు అట్లా మాకు చెపుతున్నావు’, అని కసురు కునేవారు.
“స్వామి! నేను ఫలానా తారీఖు బుధవారం చచ్చిపోతున్నా” అని తంబి గారు చెప్పారు. పదిహేనవ తారీఖున
ఆయన చెప్పిన సమయానికే చనిపోయారు. అంతకు ముందే సమాధి కట్టించుకున్నారు. “చెరుకు మోసి ఎంతో కొంత సంపాదించుకొన్నాను” అని ముందు, పెట్టె చేయించుకున్నాడు. “సమాధి త్రవ్వి దాంట్లో పెట్టేసేయ్యండి” అన్నారు. తప్పకుండా ఆ వారం చచ్చిపోతానంటే కల్దిరారో
స్వామి నమ్మలేదు.
అట్లాగే చచ్చిపోయారు. చనిపోయినాక నమ్మారు. రెండు సంవత్సరములు గడిచి మూడో సంవత్సరములో
సమాధిని తీసి చూడాలని ప్రయత్నించారు. తీసి చూడాలంటే అది ఎక్కడ్నుంచో ఆర్డర్ రావాలని, అన్నారు.
ఏదేమైనా, మనిషికి శుద్దిలేదు. అదవరకేమో, రాళ్ళు రువ్వారు. నేను కూడా ఒకరాయి వేసాను. అపుడు మా నాయన అందరిని పిలిచి, ఎవరి పిల్లల్ని వారు జాగ్రత్త చేసుకోండి. యేసయ్య తరువాత రెండవ వ్యక్తి, ఆయన విస్వాస పరుడు, భక్తిపరుడు. మీరు రావద్దు, మీరు రావద్దు, అని చెప్పారు. ప్రార్ధన చేస్తే శబ్ధం వినపడేది కాదు. వారి ఇంట్లో ప్రార్ధన చేసుకునే వాడు. ఒక శుక్రవారం, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఊరికనే, నేను అటు వెళ్లాను. అప్పుడు, తంబిగారు పడుకొని ఉన్నారు. వెల్లకిలా పడుకున్నారు. యేసు ప్రభుని, సిలువ చేస్తున్నట్లు పడుకున్నారు. కొద్దిగా అరచేతుల్లో రక్తం చూశాను. చూసి “అయ్యా! మరేమో తంబిగారు ఇలా పడుకున్నారు. రక్తం వస్తుందయ్యా అని ఇంటికాడ చెప్పాను. ఆ ఒక్కసారే తంబిగారి పంచ గాయాలను చూసాను.
కూరేటి మిఖాయేలమ్మ, ముస్తాబాద
No comments:
Post a Comment