Thursday, May 7, 2020

సాక్ష్యం 25

సాక్ష్యం 25

జంపన మరియమ్మ
తేలప్రోలు, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
60 సంవత్సరములు

మాది తేలప్రోలు గ్రామం. తంబిగారు మా గ్రామమునకు వచ్చినపుడు మా ఊరు విచారణ కాలేదు. కల్దిరారో స్వాముల వారు నెలకు ఒకసారి అవుటపల్లి [విచారణ] నుండి ఇక్కడ నుండి వచ్చేవారు. ఈ తంబి గారు ఎలా వచ్చారో మాకైతే తెలవదు. కుడి చేతికి చిన్న సంచి ఉండేది. బజార్ల వెంబడి తిరుగుతూ వుంటే పిల్లలమైన మేము రాళ్ళు వేసే వాళ్ళం. మా చిన్నాన్న ఒకతనుఅమ్మా రాళ్ళు వేయకండిఅని ఆయనను తీసుకొని వచ్చి కూర్చో బెట్టి నాలుగు ఇండ్ల మధ్యన అన్నం పెట్టేవారు. అనగా మా నాలుగు ఇండ్లనుండి తీసుకువచ్చి పెట్టేవారు.

ఒక నెల గడచిన తర్వాత కల్దిరారో స్వామి వచ్చారు. మా పెద్దలు స్వామితోస్వామి.’ ఇది సంగతి. ఈయన ఇలా తిరుగు తున్నాడు. మాకు మతం గురించి చెప్పటానికి ఎవరూ లేరు. ఈయనను ఇక్కడ ఉంచితే మంచిది అన్నారు. అప్పుడు ఆయనకు తెలుగు కొద్ది కొద్దిగా తెలుస్తున్నది. అప్పటి వరకు ఎక్కడ తిరిగారో కాని, తెలుగు పదాలు అప్పుడప్పుడే వస్తున్నాయి. అప్పుడు కల్దిరారో స్వామిసరే ఇక్కడే ఉంచుదాంఅని చెప్పి వాసాలు, తాటాకులు మొదలైనవి కొని, అక్కడే ఒక చిన్న పాక వేసారు. నెలకు సరిపడ ఆహార పదార్ధాలు అక్కడకు తీసుకొని వచ్చి పెట్టేవారు. ఇక తంబి గారు ఆ పాక లోనే వుండేవారు.

మేము స్కూలుకు వెళుతుండే వారము. నేను, నా ఇద్దరు స్నేహితులు కలసి స్కూలుకు వెళ్లి వస్తుంటే, స్కూలు అయిపోయిన తర్వాత మమ్ములను ఆ పాక దగ్గరకు తీసుకొని పోయేవారు. చర్చి, స్కూలు, ఆ పాక ప్రక్కనే ఉన్నాయి. తీసుకొని వెళ్లినాకు కాస్త వంట చేయమనే వారు.” వంట పాత్రలు మూతలు అన్ని కల్దిరారో స్వామి ఇచ్చారు. ఇక మేము, కొన్ని బియ్యం తీసుకొని వండే వాళ్ళం. తంబిగారే బియ్యం ఇచ్చేవారు. మేము అన్నం వండి ఏ వంకాయలో ఏవో కోసేసి, చేతనైనా, చేతకాకున్నా వండి అక్కడ పెడితేఅమ్మా, మీరిక్కడే వుండండి. అందరం కలసి ఈ అన్నం తిందాం. మళ్ళీ మీరు స్కూలుకి  వెళ్ళాలి కదాఅని చెప్పారు. ‘స్వామి, కూతంత పిడతలో ఇన్ని బియ్యం వండారు. ఇది మీకే చాలదు. మాకెట్లా పెడతారు?’ అనే వాళ్ళం మేము. అంటే, “మీ కేందుకమ్మా! నేను పెడతానుగాఅనేవారు. అని మమ్మల్ని ముగ్గురిని కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. కుండని మాత్రం మమ్మల్ని చూడనిచ్చే వారు కాదు. మేము తినేసిన తరువాత స్వామి కొంచెం ఎటైనా బయటకు వెళితే,అమ్మో! అన్నం అంతా మనకే పెట్టేసారు. స్వామి ఏం తింటారు!’ అని భయం వేసి మేము వెళ్లి కుండ చూస్తే కుండంత అన్నం అట్లాగే వుంది. ఈ మాట ఖచ్చితం. మేము చూసాము. ఇక మళ్ళీ బడికి వెళ్ళేవాళ్ళం.

ఆదివారం ప్రార్ధన జరిపేవారు. మాకు ఎవరికైనా ఏదైనా భాద వచ్చినపుడు వచ్చి ప్రార్ధన చేసే వారు. ఇండ్ల వెంబడి తిరిగిమీరు ఎలా వున్నారమ్మా, మరియమ్మ, భాగ్యమ్మా మీరు బాగున్నారా?” అని అందరిని పేరు పేరున పలకరించే వారు. అతనికి అందరి పేర్లు తెలుసు. అన్ని ఇండ్లు తిరిగేవారు. అందరి మంచి, చెడ్డలు తెలుసుకునే వారు. “మీరేం పనులకు వెళ్తారు? ఏం చేస్తుంటారు?” అని మా తల్లిదండ్రులను, పెద్దవాళ్ళను అడిగేవారు. నాకు తల్లి లేదు. నన్ను మాత్రం బాగా చూసారు. “అమ్మ లేదు. నీవు బాగా తిను. ఇక్కడ వుండి బాగా చదువుకోఅనేవారు. నాలుగవ తరగతి వరకే అక్కడ వున్నది. ఇక ఐదవ తరగతి నుండి ఊర్లో చేర్పించారు. ఇక ఊర్లో చదువుతున్నాము.

ఇక స్వామి, ఆ శుక్రవారం వచ్చినప్పుడయితే, మా గ్రామములో వున్న చిన్న గుడిలో తలుపులు వేసుకునే వారు. అది మధ్యాహ్నం సమయం. తలుపులు వేసుకొని, గోడకు చేతులు చాచిపెట్టి, తలవంచి, కాలుపై కాలు వేసుకొనే వారు. ఇక మేము చిన్న పిల్లలం కదా! కిటికీలు బొక్కల్లోనుండి, తలుపులు బెజ్జాల్లో నుండి మేము చూస్తుండే వాళ్ళం. ఇక మన సోయి ఏదీ ఉండేది కాదు. అలా వుంటుంటే, ఎటు నెట్టినా ఏ తలుపుగాని, కిటికీ గాని వచ్చేది కాదు. ఇక సాయంత్రము మూడు అయిన తర్వాత తలుపులు తెరుస్తే, మా కంటే పెద్దవాళ్ళు ఇంతింత గుడ్డలు తెచ్చుకొని, స్వామి దగ్గరికి వెళ్లి, తల, చేతులు, కాళ్ళు, అద్దు కొని ముద్దు పెట్టుకొని, మాకు కూడా ముద్దు పెట్టేవారు. అవి తీసుకెళ్ళి దాసుకొనే వారు. మేము తెచ్చుకొన్న గుడ్డలను అద్దనిచ్చే వారు కాదు. వారు పెద్దోళ్ళు కదా! అలా జరుగుతూ వున్నది.

అలా జరుగుతూ వుండగా, ఒకరోజు కల్దిరారో స్వామి వచ్చారు. ‘తంబిగారికి ఇలా జరుగుతుంది స్వామి’ అని చెబితే! నేను నమ్మను మీ మాట. నేను చూడాలిఅన్నారు. ‘స్వామీ, ఒక శుక్రవారం వచ్చి చూడండి’ అన్నారు పెద్దలు. విచారణలోని అన్ని గ్రామాలు తిరుగుతూ రెండు మూడు నెలలు అయ్యాక, శుక్రవారం స్వామి వచ్చారు. ఆ సమయం వచ్చినప్పుడు, స్వామికి కూడా తలుపులు తీయలేదు. రెండు, మూడు రోజులైతే చాలా వేదన పడి పోయారు. అన్నం చేయించుకునే వారు కాదు. తినేవారు కాదు.

ఆ శుక్రవారం తర్వత శనివారం, ఆదివారం లేసి ప్రార్ధన జరిపేవారు. ఆదివారము రాని వాళ్ళను లిస్టు చేసుకునేవారు. “మీరెందుకు రాలేదు” అని రాణి వారిని ఖండించే వారు. ఇంత పెద్ద లిస్టు ఉండేది. నేను రాలేదు అనుకోండి, ఆమె వచ్చిందను కోండి, “ఆమెను చెంపదెబ్బ కొట్టమ్మా, ఎందుకు రాలేదో” అని మాలోనే ఒకర్తో ఒకర్ని కొట్టించే వారు. మరి నేనయితే స్కూలు నుండి వచ్చి ఇంటికి వెళ్ళకుండా వంట చేస్తున్నాను అనుకోండి, మా నాయనమ్మను కొంచెం సేపు ఆడిద్దాం, నవ్విద్దాం అనేవారు. అని నన్ను లోనికి తీసుకు వెళ్లి మూలన, నిల్చో బెట్టారు. “లేదు. మీ అమ్మాయి, ఎక్కడికి వెళ్లిందో మాకు తెలవదు. ఏమయి పోయిందో మాకు తెలియదుఅంటుంటేఅమ్మో! ఎక్కడికి వెళ్ళిపోయిందో అని, ఇక అక్కడే పడి ఏడుస్తూ ఉండేది. కాసేపు నవ్వి నన్ను బయటకు తీసుకొని వచ్చి, మా నాయనమ్మకు చూపించిన తరువాత ఆమె నెమ్మది పడినాక ఇక వెళ్లి పోయేదాన్ని. అలాంటి అద్భుతాలు చేశారు. స్కూలు అయి పోయాక జపదండ సమయం దాకా ఇక్కడే ఉండే వాళ్ళం. ఇంచుమించుగా, వారు మాకు మంచి ప్రార్ధనా విషయాలు చెప్పేవారు. “ఇలా తిరగాలి పిల్లలూ! ఇదిగో ఇట్లుండాలి” అని, నాకు మరీ ఎక్కువగా, “నీకు అమ్మ లేదమ్మా, నీవు జాగ్రత్తగా వుండాలి” అని చెప్పేవారు. “ఆరోగ్యం బాగా చూసుకోవాలిఅనేవారు. ముసలమ్మకి (నానమ్మ) ఏమీ తెలిసేది కాదు. అది స్వామికి తెలుసు. “ఆమె ముసల్ది, ఏమీ తెలియదు. జాగ్రత్తగా వుండాలమ్మా. జాగ్రత్తగా చదువు కోవాలిఅనేవారు. ఊర్లో, స్కూలుకి పంపించేటపుడైతే మాకు ఎన్నో చెప్పి పంపించారు. “రోడ్ల వెంబడి గొడ్లు వస్తుంటాయి. మరి చాలా దూరం వెళ్ళాలి. అక్కడ నుండి మీరు జాగ్రత్తగా రావాలిఅని చెప్పి చేర్పించారు.

ఇక అక్కడ నుండి, పదమూడు సంవత్సరాలకే, నాకు పెళ్లి చేశారు. నేను అత్తగారింటికి వెళ్ళి పోయాను. ఇక తంబిగారిని గూర్చి తెలియదు. చనిపోయినప్పుడు మాత్రం తెలుసు. అయన సమాధికి వచ్చాము. బాల్యం, చిన్నతనములో ఐదు, ఆరు సంవత్సరములపుడు పరిచయ మయ్యారు తంబిగారు. అప్పటినుండి, పదమూడు సంవత్సరాల వరకు ఇక్కడే వున్నాను. ఇంటికంటూ వెళ్ళేవాళ్ళం కాదు. తేలప్రోలులో రెండు మూడు సంవత్సరాలు వున్నారు తంబిగారు. ఎప్పుడయినా వెల్లాలను కున్నప్పుడు బయటకి వెళ్ళిపోయే వారు. ఎక్కడికి వెళ్ళేవారో తెలియదు. ఆయన లేనప్పుడు, స్కూలు నుండి ఇంటికి రావడం, ఇల్లు చూసు కోవడం చేసేవాళ్ళం. మీరు లేనప్పుడు ఇట్లా బాధ లొచ్చినాయి స్వామి. మీ కోసం చూశాము, వెదికాము అనే వాళ్ళం. అక్కడి వరకు సరిగ్గా గుర్తున్నాయి. తంబి గారు ఆరోగ్యం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. 

జంపన మరియమ్మ, తేలప్రోలు

No comments:

Post a Comment