Wednesday, May 20, 2020

సాక్ష్యం 12

సాక్ష్యం 12

పేరు             :         కనకాల విజయమ్మ [వేరోనికమ్మ]
W/O             :         జోసఫ్
వయస్సు        :         82 సం.లు
వృత్తి             :         గృహిణి
అడ్రస్           :         బోయపాటి బాలాస్వామి, పెద్దావుటపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా.

నేను మూడవ తరగతి చదువుతూ వుండగా, మా ముత్త అమ్మగారు కాలు జారిపడి ఎడమ కాలు గుత్తికి పైభాగమున విరిగి పోయింది. అప్పుడు ఈ గ్రామము నందు సరిగ్గా వైద్య సదుపాయం లేని రోజులు! అప్పుడు ఒక సన్యాసి, పెద్ద దేవాలయము వద్దకు వచ్చారు అని ఎవరో చెప్పగా, మా నాన్న గారైన బోయపాటి బసవయ్య గారు కల్దిరారో స్వామి దగ్గరకు వచ్చి, ముసలమ్మ గారికి కాలు విరిగింది, మీ దగ్గరకు ఒక సన్యాసి వచ్చారు కదా!. ఆయనను మా ఇంటికి ఒకసారి పంపగలరు, అన్న కోరిక మీదట అక్కడ డాక్టరు గారిని మరియు వంట శౌరిని ఇచ్చి పంపి యున్నారు. డాక్టరు గారు చూచి ఇది నా వల్ల కాదు కాని నాలుగు వెదురు బద్దలతో కట్టు వేసి వెళతాను అని కట్టువేసి వెళ్ళినారు. తరువాత పావు గంటకు వంటశౌరి మరియు తంబి గారు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి రాగానే తంబిగారు, “జమ్మి కర్ర క్రింద ‘3’ సైతానులు వున్నాయి. నేను లోపలకి రాను” అని చెప్పగానే, ముసలమ్మను బయటకు తీసుకెళ్ళి చూపగా, ముసలమ్మకు ‘+’ [సిలువ] గురుతు వేసి, ప్రార్ధన చేయగా, ముసలమ్మకు మొత్తం తంబిగారు ఆ ముసలమ్మతో, “లేచి కూర్చుంటావా” అని అడిగితే, ఆమె లేచి కూర్చుంది. తరువాత నడిచింది కూడా. ఆమె తరువాత జ్ఞానస్నానం తీసుకుంది. ఎంతో విశ్వాసాన్ని ప్రకటించింది. అప్పుడు ఆమె పేరు ఎలిజబేతమ్మ, అని నామకరణం చేశారు. ఆమెని మా మేనమామ గారైన వేమూరు సుబ్బయ్య గారు, మానికొండ తీసుకు వెళ్లారు. ఆమె అక్కడే మరణించినది.

ఆ సమయంలో మా గృహము నందు, తన స్వహస్తాలతో మట్టితో, ఒక బలిపీఠం నిర్మించటం జరిగింది. దానికి నా వంతుగా, నేను మట్టి అందించుట జరిగింది. ఆ పీఠం ఒక్క రోజులోనే నిర్మించటం, తదనంతరం నాన్నగారు దానిని తీసి వేయాలని ప్రయత్నించి ‘పలుగు’ పైకి ఎత్తగా,  ఆయన చేతులు అలాగే గాలిలో ఆగి పోయాయి. ఈ అద్భుతం నేను కళ్ళారా చూసాను. ఇప్పటికీ నా కనులలో, ఆ దృశ్యం మెదులుతూ వుంది.

తరువాత మా మేనమామ గారైన బోయపాటి సుబ్బయ్య గారు, ఇక్కడే వుండి జపాలు నేర్చుకొని, తొమ్మిది వారాలు జపదండ చెప్పటం జరిగింది. అదే  సమయంలో అమ్మ [బోయపాటి క్లారమ్మ] గర్భం దాల్చటం జరిగింది. మూడవ శుక్రవారానికి ఇతర భాషాలలో ప్రార్ధన చేయటం ప్రారంభించింది.

మానికొండలో బసవయ్య గారి గృహం వద్ద పీఠం నిర్మించి, ప్రతిష్టించిన రోజు అమ్మ, నాన్న, చెల్లి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను ఇంటి వద్దనే వున్నాను. తంబి గారు ఆ రోజు నా చేత అన్నం పెట్టించుకొని తిన్నారు. అదే సమయంలో మానికొండలో ఉన్నట్లుగా అమ్మ, నాన్న, చెప్పారు.

తంబి గారు తన మరణం గూర్చి, మూడు నెలల ముందే అమ్మా, నాన్నలకు చెప్పారు. ప్రక్క ఇంట్లో గల వేప కర్రను కొని ఇమ్మని నాన్న గారిని తంబి గారు అడుగగా, దానిని కొని ఇచ్చారు. ఆ కర్రలతో ముందుగానే శవపేటికను తయారు చేయించు కున్నారు. తదుపరి, ఒక శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం, మా ఇంటికి వచ్చి కొంచెం అన్నం తిని, కొద్దిగ వదిలి పెట్టి, నన్ను తినమని చెప్పారు. నేను దానిని తిన్నాను.

అది జనవరి 15, 1945 సంవత్సరం ఉదయం పూజానంతరం, మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు తన స్వహస్తములతో నిర్మించిన పీఠం దగ్గరకు వచ్చి తను తల స్నానం చేసి, తన చెప్పులు, అంగీ, అన్నీ వదలి, మా నాన్న గారి పంచె కట్టుకొని, పీఠం ముందు కూర్చుని, సాయంత్రం 5 గంటలకు ఆ ప్రభువు నందు నిద్రించారు. ఇది యదార్ధ సంఘటన నా కనులారా చూసిన సాక్ష్యం.

కనకాల విజయమ్మ [వేరోనికమ్మ], పెద్దావుటపల్లి
13 జులై 2009

కనకాల విజయమ్మ


No comments:

Post a Comment