Friday, June 12, 2020

జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము - అభివృద్ధి

అధ్యాయము 17
జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము - అభివృద్ధి

క్రీ.శ. 1927వ సంవత్సరములో గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు నిర్మించిన గురు నిలయము క్రీ.శ. 1985వ సంవత్సరము నుండి ‘బ్రదర్‌ జోసఫ్‌ తంబి ఆశ్రమం’గా పిలువ బడుచున్నది.

బ్రదర్‌ జోసఫ్‌ తంబి ఆశ్రమం

క్రీ.శ. 1916వ సంవత్సరములో నిర్మించ బడిన విచారణ దేవాలయము క్రీ.శ. 1977వ సంవత్సరములో సంభవించిన ఘోర తుఫానులో దెబ్బతినడం వలన, దాని స్థానములో క్రీ.శ. 1986వ సంవత్సరములో ప్రస్తుతం ఉన్న దేవాలయము [యేసు తిరు హృదయ దేవాలయం] నిర్మించడమైనది.

యేసు తిరు హృదయ దేవాలయం

క్రీ.శ. 2017-2018 కాలములో విచారణ దేవాలయమును సుందరము గాను, పుణ్యక్షేత్ర ప్రాంగణమును అందము గాను తీర్చిదిద్దడ మైనది. 18 ఫిబ్రవరి 2018న విజయవాడ మేత్రాణులైన తెలగతోటి జోసఫ్‌ రాజారావు వారి హస్తముల మీదుగా పునరంకితం చేయ బడినది. ప్రస్తుతము అవుటపల్లి విచారణకు 9 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిపై చిన్న ప్రార్దానాలయం నిర్మించడ మైనది. 15 డిసెంబరు 1990 నాటికి సమాధిపై నూతన ఆలయము నిర్మించబడి ఆశీర్వదింప బడినది. క్రీ.శ. 2019వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారి సమాధి ఆలయమును, దాని చుట్టుప్రక్కల ప్రాంగణమును సుందరముగా తీర్చిదిద్ద బడినది. 6 జనవరి 2019న విజయవాడ మేత్రాణులైన తెలగతోటి జోసఫ్‌ రాజారావు వారి హస్తముల మీదుగా పునరంకితం చేయబడినది.

బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధి


బ్రదర్‌ జోసఫ్‌ తంబి గారి కోరిక మేరకు గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో వారు క్రీ.శ. 1949వ సంవత్సరములో వృద్ధాశ్రమమును (సెయింట్ జోసఫ్ వృద్ధాశ్రమము) నిర్మించారు. క్రీ.శ. 1977వ సంవత్సరములో వచ్చిన ఘోర తుఫానులో దెబ్బతిన్న వృద్ధాశ్రమ భవనమును తొలగించి, క్రీ.శ. 1979వ సంవత్సరములో, కపూచిన్‌ గురువులు ప్రస్తుతమున్న రెండస్తుల వృద్ధాశ్రమ భవనము నిర్మించి యున్నారు. ఇప్పుడు ‘శాంతి సదన్‌’గా పిలువ బడుచున్నది. నిరాశ్రయులైన ఎంతో మంది వృద్ధులు ఇచ్చట చేరి, సంతోషముగా జీవించు చున్నారు.

 ‘శాంతి సదన్‌’

 క్రీ.శ. 2013వ సంవత్సరములో యాత్రికుల సౌకర్యార్ధం, సౌకర్య వంతమైన విశ్రాంతి భవనము నిర్మించ బడినది.

క్రీ.శ. 1995వ సంవత్సరము, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి 50వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రారభించబడిన ‘‘తంబి వెలుగు: కుటుంబ ఆధ్యాత్మిక పత్రిక’’ పుణ్యక్షేత్రము నుండి ప్రచురింప బడుచున్నది.

మూడు సభల కన్యాస్త్రీలు జోసఫ్‌ తంబిగారి పుణ్యక్షేత్రములో తమ సేవను అందిస్తున్నారు. ఎఫ్‌.సి.సి. సభకు చెందిన మఠకన్యలు పుణ్యక్షేత్ర పనులను, వృద్ధాశ్రమమును నడిపించుటలో సహాయము చేయుచున్నారు. సి.ఎఫ్‌.ఎం.ఎస్‌.ఎస్‌. సభకు చెందిన మఠకన్యలు జోసఫ్‌ తంబి ఆశ్రమం, యాత్రికుల విశ్రాంతి భవనం నడుపుటకు సేవలను అందిస్తున్నారు. సి.ఎస్‌.ఐ. సభకు చెందిన మఠకన్యలు తమ స్వంత స్కూలు, హాస్టలు ద్వారా విద్యను అందిస్తున్నారు.

ఇంకా పుణ్యక్షేత్ర ఆవరణలో బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు ఆరు సంవత్సరాలు జీవించిన యింటిని, యింటి ముందు ఆయన వాడిన నీళ్ళ బావిని చూడవచ్చు.

తంబిగారు నివసించిన గృహము, వాడిన బావి


అలాగే ‘బ్రదర్‌ జోసఫ్‌ తంబి మ్యూజియం’ను కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో, జోసఫ్‌ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా, భక్తులు, విశ్వాసులు సమర్పించిన ఎన్నో జ్ఞాపికలను చూడవచ్చు. ఇవి వారి కృతజ్ఞతా భావమునకు జ్ఞాపికలు.

అలాగే, దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సంగ్రహ జీవిత చరిత్రను చిత్రపటాల ద్వారా అర్ధవంతముగా తిలకిస్తూ, ధ్యానించవచ్చు. ఇంకా దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారికి సంబంధించిన అనేకానేకమైన తీపి గురుతులను ఈ మ్యూజియములో తిలకించవచ్చు.

‘బ్రదర్‌ జోసఫ్‌ తంబి మ్యూజియం’


తంబిగారి సమాధి


















Wednesday, June 10, 2020

జోసఫ్ తంబిగారి ధన్యత/పునీత పట్టము

అధ్యాయము 18
జోసఫ్ తంబిగారి ధన్యత/పునీత పట్టము

జోసఫ్‌ తంబిగారు ఆంధ్రావనిలో అడుగిడిన కొన్ని రోజులలోనే అతనొక అసాధారణ వ్యక్తియని, భక్తి పరుడని, దైవాను భూతుడని, అద్భుత వ్యక్తియని, ప్రార్ధనా పరుడని, దేవుని కొరకు ‘పిచ్చివాడ’ని, నిరాడంబరుడని, సర్వసంఘ పరిత్యాగియని, దీనాత్ముడని, వినయాత్ముడని, పునీతుడని, ఆయనతో పరిచయ మున్నవారు, ఆయన గురించి విన్నవారు త్వరలోనే గ్రహించారు.

క్రీ.శ. 1999వ సంవత్సరములో కపూచిన్‌ గురువులు తమ సమావేశములో, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి ధన్యత / పునీత పట్టమును ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కపూచిన్‌ సభాధిపతికి [జనరల్‌ మినిష్టరు], వారి సలహా బృందానికి మరియు కపూచిన్‌ జనరల్‌ పోస్టులెటర్‌ వారికి తెలియ జేయగా, ఎంతగానో సంతోషించి అనుమతిని ఇచ్చియున్నారు. స్థానిక మేత్రాణులకు తెలియజేసి వారిని ఈ ధన్యత / పునీత పట్టం కార్యక్రమాన్ని ప్రారంభించుటకు కావలసిన అనుమతిని కోరమని చెప్పియున్నారు.

31 మార్చి 2004న వ్రాసిన లేఖ ద్వారా, ఆనాటి ఆంధ్ర-ఒడిశా కపూచిన్‌ వైస్‌ ప్రొవిన్షియల్‌ గురుశ్రీ తోమాస్‌ సెబాస్టియన్‌ వారు, అప్పటి విజయవాడ మేత్రాణులైన ప్రకాష్‌ మల్లవరపు వారికి తెలియజేసి, అనుమతిని ఇవ్వవసినదిగా కోరియున్నారు. సంతోషముగా ఇది దైవ నిర్ణయమని భావించి, తన మేత్రాసణ సలహా బృందముతో సంప్రదించిన తరువాత ధన్యత / పునీత పట్ట కార్యక్రమాన్ని ప్రారంభించుటకు 7 ఏప్రిల్‌ 2004న వ్రాసిన లేఖ ద్వారా అనుమతిని ఇచ్చియున్నారు.

19 మార్చి 2005న లేఖ ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ బిషప్స్‌ కౌన్సిల్‌’ అధ్యక్షలు కాగితపు మరియదాస్‌ మేత్రాణులు ఇతర మేత్రాణులను సంప్రదించిన తరువాత, వారి అనుమతిని కూడా ఇచ్చియున్నారు.

ఈ ప్రక్రియలో వాటికన్‌ కూడా తన సమ్మతిని తెలపడం తప్పనిసరి. 15 అక్టోబరు 2005న లేఖద్వారా ఎలాంటి అభ్యంతరం లేదని సర్టిఫికేట్‌ ఇచ్చియున్నది. 

14 మే 2004న లేఖ ద్వారా గురుశ్రీ ఇన్నయ్య పోలిశెట్టి వారిని వైస్‌ పోస్టులేటరుగా నియమించమని వైస్‌ ప్రొవిన్షియల్‌ గురుశ్రీ తోమాస్‌ సెబాస్టియన్‌ వారు పోస్టులేటరు గురుశ్రీ ఫ్లోరియో తెసారి వారిని అభ్యర్ధించారు. 20 జూన్‌ 2004న ఇన్నయ్య పోలిశెట్టి వారు వైస్‌ పోస్టులేటరుగా నియమితులైనారు.

24 జూన్‌ 2007న అధికారికముగా బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు ‘‘దైవ సేవకుడిగా’’ ప్రకటింపబడినారు.

గురుశ్రీ ఇన్నయ్య పోలిశెట్టి వారు తమ బాధ్యతలను 2012 వరకు కొనసాగించారు. వీరి తరువాత వైస్‌ పోస్టులేటరు బాధ్యతలను గురుశ్రీ చెరియన్‌ పాలుకున్నెల్‌ వారు 28 జనవరి 2012న స్వీకరించి 2015 వరకు కొనసాగారు.

ప్రస్తుతం, గురుశ్రీ ప్రవీణ్‌ కుమార్‌ గోపు వారు వైస్‌ పోస్టులేటరుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరు 16 జూన్‌ 2015న ప్రస్తుత పోస్టులేటరు గురుశ్రీ కార్లో కల్లోనిచే నియమింపబడినారు. వీరి ఆధ్వర్యములో ధన్యత / పునీత పట్టం ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది.


Sunday, May 31, 2020

సాక్ష్యం 1

సాక్ష్యం 1

పేరు             :         పసల తోమస్
తండ్రి            :         లూర్దయ్య
గ్రామం          :         లూర్ధునగర్, D. No. 47-1-15, మదర్ తెరెసా స్ట్రీట్, గుణదల, విజయవాడ.
జన్మస్థలం       :         గొట్టుముక్కల గ్రామం, జగన్నాధపురం విచారణ.
వయస్సు        :         93 సం.లు  (1915 Jan 14)

నాకు 20 సంవత్సరముల వయస్సులో విజయవాడ రావడం జరిగినది. కల్దరారో స్వామి దగ్గర పని చేసే వంట [మాదాను] శౌరి మా బావగారు. అందుచే ప్రార్ధన నిమిత్తం తంబి గారిని గొట్టుముక్కల అను మా గ్రామమునకు పంపటం జరిగినది. అది శుక్రవారము మరియు తపస్సు కాలము. ఆ రోజు షుమారు మధ్యాహ్నం 2 గంటల సమయములో తంబిగారు మా గ్రామములోని దేవాలయం దగ్గరకు వచ్చి, “ప్రార్ధన చేసుకుంటాను, దేవాలయం తాళం తీయండి” అని మా నాన్నగారిని అడగటం జరిగింది. మా నాన్న గారు ఉపదేశి అగుటచే దేవాలయం తాళం మా ఇంటి వద్దే వుండేది. అప్పుడు మా నాన్న గారు నాకు తాళం ఇచ్చి గుడి తలుపులు తెరువమని చెప్పారు. అప్పుడు తాళం చెవి తెచ్చి నేను తాళం తీయటం జరిగినది.

Saturday, May 30, 2020

సాక్ష్యం 2


సాక్ష్యం 2

పేరు             :         గోడే ఇన్యాసి ఫ్రాన్సిస్ శౌరి
తండ్రి            :         జాన్
పుట్టిన తేది      :         01 - 03 - 1934
జన్మ స్థలం      :         వట్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

నా పేరు గోడే ఇన్యాసి ఫ్రాన్సిస్ శౌరి. అప్పుడు నాకు ఎనిమిది సంవత్సారాల వయస్సు. నేను వట్లూరు RCM స్కూలులో 3వ తరగతి  చదువు చున్నాను. మాకు ఆ రోజు పాస్ బెల్ కొట్టారు.  బ్రదర్ గారు ఏ టైంలో వచ్చారో నాకు తెలియదు. పిల్లలు స్కూలు నుంచి బయటకు రాగానే ఆయన మా దగ్గరికి వచ్చారు.  భాష యాసగా మాట్లాడుతూ, మనిషి మాసిన గడ్డం, కొంచెం పొట్టిగా ఉన్నారు. రింగు రింగుల జుట్టు. అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి ‘పిచ్చోడు,  పిచ్చోడు’ అని ఆయన అంగీ లాగుతూ ఆయనకు దొరకకుండా పారి పోయాను. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని మాస్టారు బయటకు వచ్చి, తంబి గారిని చూసి, ‘ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? పిల్లలు దడుసుకుంటున్నారు’ అని అన్నారు. అప్పుడు, హెడ్ మాష్టారు గారు బెల్లు టైము అవ్వకుండా బెల్లు కొట్టించారు. అందరం లోపలికి వెళ్ళాం.

Thursday, May 28, 2020

సాక్ష్యం 4

సాక్ష్యం 4

పేరు             :         కలపాల మరియమ్మ
వయస్సు        :         75 స.లు
గ్రామం          :         తేలప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

నా పేరు కలపాల మరియమ్మ. నాకు 7 సం.లు  వయస్సు ఉండగా, జోసఫ్ తంబిగారు తేలప్రోలు వచ్చారు. బజారు, బజారు తిరిగి పిల్లలను తంబిగారు పిలుస్తుంటే నేను కూడా వారితో కలిసి వెళ్లాను. పిల్లలందరూ గుడిలో జపమాల చెప్పుతుండగా, తంబిగారు గుడి గుమ్మము దగ్గర కూర్చొని జపమాల చెప్పేవారు. తరువాత తంబి గారితో నేను కొద్ది సేపు అడుకొనే దానిని.

తపస్సు కాలంలో స్లీవమార్గం జరుగు తుండగా, తంబిగారు ప్రారంభం నుండి చివరి వరకు మోకాళ్ళ మీద ఉండేవారు. అప్పుడు వారికి పంచ గాయాలు వచ్చి సొమ్మసిల్లి పడిపోయే వారు. దేవరపల్లి కృపావల్లి గారు వచ్చి పంచ గాయములను తుడుస్తూ వుంటే, “వద్దు వద్దు. నన్ను అంటుకోవద్దు” అని అన్నారు. ఒక రోజున, తేలప్రోలు గుడి దగ్గర పాము ముళ్ళు తంబిగారికి గుచ్చుకుంది, కాలు వాసి లావు అయింది, వెంటనే ఎడ్ల బండి మీద పెద్దవుటపల్లి పంపించారు.

ప్రతీ నెల మొదటి ఆదివారము కృపావల్లి, కత్తిరేనమ్మ, సంతోషమ్మ అనే సభ తల్లుల వెంట మేము అవుటపల్లి వెళితే, మాకు తంబి గారు అన్నము పెట్టేవారు, పండ్లు ఇచ్చేవారు, తల మీద చేతులు వేసి ఆశీర్వదించే వారు.

Wednesday, May 27, 2020

సాక్ష్యం 5

సాక్ష్యం 5


పేరు             :         చౌటపల్లి జ్వాన్నేసు
వయస్సు        :         80 సం.లు
గ్రామము        :         తేలప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

 

నాకు 17 సం.ల వయస్సులో తంబి గారు మా గ్రామము అయిన, తేలప్రోలు వచ్చి చిన్న పిల్లలకు ప్రార్ధనలు నేర్పించేవారు. మా గ్రామంలో రెండు వర్గముల మధ్య పెద్ద పోట్లాటలు వచ్చాయి. మా పెద్దలు పెద్దవుటపల్లి విచారణ గురువు కల్దిరారో స్వామి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు స్వామి అచ్చట లేరు. చాలా ఆలస్యంగా వచ్చారు. ఈ మధ్య కాలంలో తంబి గారు మా దగ్గరకు వచ్చారు. అన్నం తిందురుగాని రండి అన్నారు. పిడతలో వండిన కొద్ది అన్నమును అది ఒక్కరికే సరి పోతుంది. కాని తంబి గారు 9 మందికి సంపూర్తిగా భోజనం వడ్డించారు. ఈ అద్భుత విషయమును పెద్దలు చుట్టు ప్రక్కల వారి అందరికి చెప్పారు. అనారోగ్యముతో ఉన్నవారికి కొన్ని చెట్ల ఆకుల పసరతో బాగు చేసెడి వారు, అని పెద్దలు చెప్పేవారు.

చౌటపల్లి జ్వాన్నేసు, తేలప్రోలు
4 జూన్ 2009

చౌటపల్లి జ్వాన్నేసు

Tuesday, May 26, 2020

సాక్ష్యం 6

సాక్ష్యం 6

కొమరవల్లి భాగ్యమ్మ
తేలప్రోలు గ్రామము, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
60 సం.లు

నా పేరు కొమరవల్లి భాగ్యమ్మ. మాది తేలప్రోలు గ్రామము. మా అమ్మ ఎక్కువ విశ్వాసముతో ప్రార్ధన చేసేది. మా అమ్మకు నలుగురు పిల్లలు పుట్టి మరణించారు. వారు నాకంటే ముందుగా పుట్టిన వాళ్ళు. అమ్మకు ఎక్కువ విశ్వాసం మూలాన తంబి గారు పరిచయం అయ్యారు. మా అమ్మ పుట్టు క్రైస్తవురాలు. కావున, తంబిగారు పరిచయం అయ్యారు. వారితో ప్రార్థన చేయించు కున్నాక నేను, మా తమ్ముడు పుట్టాము. మా అమ్మ ఎక్కువ భాషలలో ప్రార్థన చేసేది. అలా ప్రార్థన చేస్తే, మా నాన్న ‘సైతాను’ అని చీపురు కట్ట పెట్టి అమ్మను కొట్టే వారు. ఆయన, ‘నీవు సైతానులా మాట్లాడు తున్నావు’ అని అనేవారు. అప్పుడు మా నాన్న గారికి, తంబి గారి  గురించి తెలియదు. తంబిగారు వచ్చినప్పుడు, మా అమ్మ ఈ విషయం చెప్పింది. అమ్మ తంబిగారితో, ‘స్వామి నన్ను కొట్టారు, అప్పటి నుండి నాకు ప్రార్థన రావడం లేదు’ అని చెప్పింది. తంబిగారు మా నాన్నను పిలిచి, “నువ్వు ఎందుకు ఇంతపని చేశావు? ఆమెకు ఆత్మ వచ్చి ఆత్మ ప్రార్థన చేస్తుంటే నీవు ఇంత పని చేశావు. కాబట్టి, నీవు 21 రోజులు జబ్బుతో బాధ పడతావు” అని చెప్పారు. తంబి గారికి అన్నం పెట్టేది మా అమ్మ.  బాగా నీరు కాసి, స్నానాల గదిలో పెడితే స్నానం చేసేవారు. వారు ఎక్కువగా నెయ్యి, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, ఈ మూడు ఇష్టముగా తినేవారు. ఇక ఆ రోజు నుండి, “మీ ఇంటి దగ్గర నేను అన్నం తినను,” అని తంబిగారు అన్నారు. అప్పుడు అమ్మ బాగా ఏడ్చింది. అది చూసి తంబిగారు, “అమ్మా! ఏడవకు! మీ ఆయనకు స్వస్థత చేకూరిన తరువాత, ఆయనకు ఆత్మ వచ్చిన తరువాత, నేను మీ ఇంటికి వస్తాను, కాని మీ ఇంటిలో ఏమీ ముట్టుకోను”  అని చెప్పారు.

Sunday, May 24, 2020

సాక్ష్యం 8

సాక్ష్యం 8

దయాల మరియమ్మ
వట్లూరు, ఏలూరు, పశ్చిమ గోదారి జిల్లా, ఆంధప్రదేశ్
74 సంవత్సరాలు

నా మేరు దయాల మరియమ్మ. వట్లూరు విచారణ జార్జ్ ఫాదర్ గారు అవుటపల్లికి వచ్చారు. తంబిగారు, “వట్లూరు చూడాలి” అని అంటే, జార్జ్ ఫాదర్ గారు, ‘మోటర్ సైకిల్ మీద నేను తీసుకు వెళ్తాను’ అని అన్నారట. అప్పుడు తంబిగారు, “మీ వెనకాల నేను కూర్చో లేను, మీరు వెళ్ళండి. నేను వస్తాను” అన్నారట. అయితే, వెమ్మటే తంబిగారు వట్లూరు వచ్చేసారు. వెనుక ఫాదర్ గారు వచ్చారు. ఒక బస్సు గాని, బండి గాని అప్పుడు లేవంట. స్వామి రాకముందే తంబిగారు వెళ్ళి వరండాలో కూర్చున్నారట. ‘బస్సు లేదు, బండి లేదు, ఎట్లా వచ్చారు’ అని ఆయన భయపడిపోయారు. తంబిగారు ఇక్కడకు వచ్చే వరకు కూడా వరండా తలుపు తీయలేదు. దొడ్లో నుంచి అటువైపు వెళ్ళిపోయి, తలుపు తీసారు.

తంబి గారు ఇక్కడికి వచ్చినపుడు, ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. ఆ రోజు జార్జ్ స్వాములవారు, లాజరు మాష్టారును పిలచి, ‘మరి ఆ బ్రదర్ గారు, నాతో వస్తానంటే, నేను వెనుక కూర్చో మన్నాను ఆయన నేను కూర్చోను, నేను వస్తాను, మీరు వెళ్ళండి అని అన్నారు తంబిగారు. బస్సుగాని, బండిగాని లేవు. మరి నా కంటే ముందు వచ్చి, వరండాలో కూర్చున్నారు. నాకు భయంగా వుంది. బడిలోకి వెళ్లి కూర్చోమనండి’ అని చెప్పారు. అప్పుడు లాజరు పంతులు గారు, తంబిగారితో, ‘బ్రదర్ గారు! ఫాదర్ గారు మిమ్ములను బడిలో కెళ్ళి కూర్చో మంటున్నారు,’ అని చెప్పారు. అందుకు తంబిగారు, “ఎందుకు వెళ్ళాలి. నేను ఫాదరుకి చెప్పే వచ్చాను కదా! నేను ఇక్కడే, వరండాలోనే కూర్చుంటాను” అని చెప్పారు. సర్లే! అని ఊరుకున్నారు. అపుడు నా వయస్సు 12 సం.లు.

Saturday, May 23, 2020

సాక్ష్యం 9


సాక్ష్యం 9

పేరు             :         కైలే వెంకటరత్నం
వయస్సు        :         75 సం.లు
వృత్తి             :         రిటైర్డ్ టీచర్
అడ్రస్            :         కైలే ఇమ్మనియేలు
పెద్దావుటపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

1944 ఏప్రిల్ నెలలో తంబి గారు, మా కృష్ణాపురం గ్రామానికి సాయంత్రం 3-4 గంటల సమయంలో వచ్చారు. ఆయన ముందు ఒక కుర్చీ వేసారు గుడి దగ్గర. ఎందుకంటే ప్రజలకు తంబి గారు అంతకు ముందే తెలుసు గనుక. అందరితో పాటు నేను కూడా తంబిగారిని చూడాలని వెళ్లాను. ఆయన ప్రార్ధన ద్వారా వ్యాధి బాధలు నయం చేయడం, పంచ గాయాలు పొందడం నేను విన్నాను. అప్పుడు నాకు 14 సం.ల వయస్సు. తంబి గారు నన్ను ఒక గ్లాసు మజ్జిగ అడిగారు. నేను వెళ్లి మా అమ్మకు చెప్పగానే, అప్పుడు మా అమ్మ ఒక గ్లాసులో మజ్జిగ అలాగే వేరుశనగలు కొంచెం ఇచ్చింది. అవి తెచ్చి తంబిగారికి ఇచ్చాను. అవి తిని త్రాగిన తర్వాత, తంబి గారు మాకు ప్రార్ధన యొక్క గొప్పతనం, దానధర్మములు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఎక్కువగా ప్రార్ధనలు చేసేవారు, అలాగే ప్రార్ధనలు నేర్పించారు.
ఆ తర్వాత నేను మళ్ళీ తంబిగారిని చూడలేదు కాని, 15/01/1945న చనిపోయారని మాత్రం విన్నాను. ఇది నా యొక్క అనుభవము.
కైలే వెంకటరత్నం, కృష్ణాపురం

 కైలే వెంకటరత్నం


Friday, May 22, 2020

సాక్ష్యం 10

సాక్ష్యం 10

పేరు             :         తుల్లిమిల్లి రాయప్ప
వయస్సు        :         01/01/1930
వృత్తి             :         రిటైర్డ్ టీచర్
అడ్రస్           :         తేలప్రోలు గ్రామము, పోస్ట్, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

వివాహానికి ముందు నా తల్లి గారైన తుల్లిమిల్లి మరియమ్మ హిందువుగా జీవించేవారు. వివాహములో మా అమ్మ జ్ఞానస్నానము ద్వారా కతోలిక శ్రీసభలో చేరారు. నేను పుట్టక ముందు ముగ్గురు మగ బిడ్డలు పుట్టి చనిపోయారట. అప్పుడు మా అమ్మ ఓక తాడు [రక్షాతాడు] ఎప్పుడూ చేతికి కట్టుకొని తిరిగేది. అదే సమయంలో బ్రదర్ జోసెఫ్ తంబి గారు మా ఇంటి మీదుగా బజారులో నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. ఆయన మా అమ్మ గారిని పిలిచారు. వెంటనే మీ ఇంట్లో దెయ్యము సంచరించు చున్నది అని చెప్పారు. అప్పడు మా అమ్మ ఆ రక్షాతాడుని ఒక మట్టి కుండ ప్రక్కన పడేసింది. వెంటనే తంబిగారు మా ఇంటి లోపలకి వెళ్లి తిన్నగా ఆ కుండ దగ్గరకు వెళ్లి ఒక తాడు పైకి తీసారు. ఎందుకు నీవు ఈ రాక్షత్రాడు ఇంటి లోపలకి తెచ్చావు, అదే ఒక దయ్యం అని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు పిల్లల గురించి చెప్పారు. వెంటనే ఇంటిలో వున్న చిన్న పిల్లవాడు అతని పేరు ఆరోగ్యం అతని అస్వస్థతగా ఉన్నట్లు కడుపు నొప్పితో భాద పడుతున్నట్లు, విరోచనం అవక, పాసుకి వెళ్లక చాలా బాధ పడుతున్నాడు అని తంబి గారికి చెప్పగా, తంబిగారు ప్రార్ధన చేసి, అతని పొట్టపై చేయివేసి రుద్ది సిలువ గుర్తు వేశారు వెంటనే బాబు మంచి ఆరోగ్యంతో వున్నాడు. అతను ఇప్పుడు గొప్ప స్థితిలో వున్నాడు.

చిక్కవరం అనే గ్రామం నుంచి ఒక చౌదరిగారు చేయికి పెద్ద వ్రణముతో వుండేవారు. ఆ సమయంలో అదే గ్రామం నుంచి R.C.M. స్కూల్ హెడ్ మాష్టారు జోజప్ప గారు పని చేయుచున్నారు. ఆ చౌదరి గారికి హెడ్ మాష్టారు బ్రదర్ జోసఫ్ తంబి గారిని కలుసుకోమని సలహా ఇచ్చారు. ఆయన అవుటపల్లి వచ్చి విచారించగా, తంబి గారు ఆయనతో, “నీవు క్రీస్తును విశ్వసిస్తున్నావా?” అని అడిగారు. అప్పుడు అతను, ‘నేను విశ్వసిస్తున్నాను’ అని చెప్పారు. అప్పుడు తంబిగారు, “నీ చేయి చూపించు” అని చెప్పగా ఆ చేయి పై ఏవో ఆకులు తీసుకువచ్చి కట్టుకట్టి, “ఈ కట్టు మూడు రోజులు పాటు ఊడదీయ కూడదు; అలాగే వుంచి మరలా మూడవ రోజు ఇక్కడకు రావాలి” అని చెప్పారు. మూడు రోజులు తర్వాత ఆయన అవుటపల్లి వచ్చారు. ఈయన కట్టు విప్పేసరికి అద్భుతం, గాయం పూర్తిగా మాని పోయింది. ఈ వ్యక్తి జ్ఞానస్నానం తీసుకోలేదు, కాని ఈయన తలంపు నందు దేవుడు వున్నాడు, అని చెప్పారు. కొంత కాలానికి తంబిగారు మరణించగా ఆయన ఏడ్చుకుంటూ, ఆరోజే ఈ సాక్ష్యం చెప్పారు.

తంబి గారికి పంచ గాయలు రావటం నేను చూసాను. నేను ఆయనను మంచంపై పరుండ బెట్టుటకు సహాయం చేసేవాడిని.

తుల్లిమిల్లి రాయప్ప, తేలప్రోలు
13 జులై 2009

తుల్లిమిల్లి రాయప్ప


Thursday, May 21, 2020

సాక్ష్యం 11

సాక్ష్యం 11

పేరు             :         వనమాల జోసఫ్
S/O             :         రంగయ్య
వయస్సు        :         63 సం.లు
అడ్రస్           :         కోడూరుపాడు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా, 521 110, ఆంధ్రప్రదేశ్

అప్పుడు నా వయస్సు 10 సం.లు. కోడూరుపాడు సంఘ పెద్దలు 1. రెంటపల్లి శాంతయ్య, 2. దాసరి దేవ సహాయం, 3. వేమూరి శౌరయ్య, 4. పొనుగుమాటి మద్ది రామయ్య, 5. కొండ్రు ముసలయ్య అను వారలు మాట్లాడుకుంటూ బ్రదర్ జోసఫ్ తంబి గారి విషయములు చర్చించుకొనే సమయమున ఆయనకు వచ్చినటువంటి పంచ గాయాల గురించి నేను విన్నాను. అప్పుడు హిందువుగా వున్న నేను తంబి గారి ప్రార్ధన కొరకు క్రైస్తవుడుగా మారాలని నిశ్చయించుకొని, కతోలిక క్రైస్తవునిగా జ్ఞానస్నానం తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు కతోలిక ఉపాధ్యాయ, ఉపదేశిగాను వీరవల్లి కతోలిక సంఘంలో ప్రార్ధనలు చేస్తున్నాను.

నా చిన్న కుమార్తె పేరు వనమాల సమతా. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ నివాసియైన కర్రె సుదీర్ కుమారుకు ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఆమెకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టినది. తరువాత రెండవ కాన్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బిడ్డ కొద్దిగా అనామకంగా వుంటుంది. భర్త ఆమెను నానా ఇబ్బందులు పెడుతూ, ‘నీకు మగ పిల్లవాడు పుడితేనే మరల నా దగ్గరకు వస్తావు’ అని ఆమెను భయపెట్టాడు. ఆ పరిస్థితిలో, నేను, మా కుటుంబం, జోసఫ్ తంబి గారి సమాధి వద్దకు వెళ్లి తంబిగారికి  ప్రార్ధన చేసుకున్నాం. ఆ తరువాత ఆమెకు గర్భం వచ్చింది. ప్రతీ నిత్యం, ‘మగ పిల్లవాడు పుడితేనే నా దగ్గర ఉంటావు, లేనిదే నీవు రావు’ అని భయపెట్టిన పరిస్థుతులలో నవ మాసాలు నిండి, పిన్నమనేని సిద్దార్ధ హాస్పిటలు నందు బిడ్డకు కాన్పుకు జాయిను చేసాము. బిడ్డకు జూన్ 11, 2008 తారీఖు బుధవారం రోజున ఆపరేషన్ చేసేటప్పుడు బిడ్డ భయంతో వణికిపోయి, తంబి గారికి ప్రార్ధన చేసుకుని, నాతో, ‘నాన్న గారు, నాకు మగపిల్లవాడు పుడతాడా?’ అని ప్రశ్నించింది. నేను, ‘అంతా దేవుని చిత్తం, తంబి గారి మహత్యం, తప్పక నీకు మగబిడ్డ పుడతాడు’ అని చెప్పి ఆపరేషన్ థియేటరుకు పంపాను. ఆపరేషన్ తరువాత, తంబిగారి అద్భుత కార్యం వల్ల, నా కుమార్తెకు మగ పిల్లవాడు కల్గినాడు. బిడ్డకు “తంబి ప్రకాష్” అని పేరు పెట్టుకున్నాం. ఇది నా గొప్ప సాక్ష్యం. ఇది యదార్ధం.

వనమాల జోసఫ్, కోడూరుపాడు.
13 జులై 2009

వనమాల జోసఫ్