దైవసేవకుడు జోసఫ్ తంబి: మరో అస్సీసిపుర
ఫ్రాన్సిస్!
రెవ. ఫా. ప్రవీణ్ గోపు OFM Cap.
వైస్ పోస్టులేటర్
దైవసేవకుడు జోసఫ్ తంబి మరో అస్సీసిపుర ఫ్రాన్సిస్! ఎందుకన, తంబిగారు, ఫ్రాన్సిసువారి సభను, ఆధ్యాత్మికతను మిక్కిలిగా ప్రేమించి, ఆ జీవిత విధానాన్ని, ముఖ్యముగా ఫ్రాన్సిసువారి దారిద్ర్యాన్ని మరియు జీవితమే ఓ సువార్తా ప్రచారం అను గొప్ప సుగుణాన్ని ఆలింగనం చేసుకున్నారు. అందుకే ఆ సభలో చేరి తృతీయ సభ్యునిగా జీవించారు. అస్సీసిపుర ఫ్రాన్సిసువారివలె, దారిద్ర్యాన్ని యిష్టపూర్వకముగా జీవించారు; తన జీవితమే సువార్త ప్రచారముగా మార్చారు. అనేకచోట్లకు వెళుతూ తన జీవితం, మాట, బోధన, అద్భుతకార్యాలద్వారా సువార్తను ప్రకటించారు. ఫ్రాన్సిస్ వారివలె పంచగాయాలను పొందారు.
11 నవంబరు 1886లో సైగోన్ (వియత్నాం)లోని ఇప్పుడు “హో షిన్ మిన్హ”గా పిలువబడుచున్న అప్పటి
ఫ్రెంచ్ కాలనీలో, ఉద్యోగ నిమిత్తమై వెళ్ళిన, కరైకాల్, పాండిచేరి వాస్తవ్యులైన
శవరిముత్తు, రోసమల్లె మరియ అను పుణ్యదంపతులకు జన్మించారు. ‘రాయప్ప జోసఫ్ శవరి’ అని
నామకరణం చేసారు. 1888వ సం.లో స్వదేశానికి తిరిగి రావడం వలన, రెండు సం.ల. వయస్సు
నాటినుండి, కరైకాల్, పాండిచేరిలోనే పెరిగారు. స్వగ్రామములోనే జ్ఞానస్నానం పొందారు.
తనకు ఒక తమ్ముడు మైకేల్ ధైరియాన్
తంబి (జననం 1891) ఉన్నారు. తన ఏడేళ్ళ వయస్సున, తల్లి ఆకస్మిక మరణముతో, తండ్రి
రెండవ వివాహం చేసుకున్నాడు (1894). పినతల్లికి యిష్టం లేకున్నను 1898లో భద్రమైన
అభ్యంగనం, దివ్యసత్ర్పసాదాలను స్వీకరించారు. పినతల్లి మేరితెరెసా పెట్టే కష్టాలను
తాళలేక, ఇల్లు విడచి, కేరళ రాష్ట్రములో ఒక పుణ్యాత్మురాలి నీడన పెరిగారు. తమ్ముడు
మైకేల్ ధైరియాన్ తంబికి (+1935) ముగ్గురు కుమారులు (ఆల్బర్టు +1941, రాబర్టు +1985,
విక్టరు +1979), ఒక కుమార్తె (గాబ్రియేల్ మరియ తెరెసా, 1913-1985). ఆమె
పాండిచేరిలోని కార్మెల్ మఠసభలో చేరి మఠకన్యగా జీవించినది. జోసఫ్ తంబిగారి
పినతల్లికి ఒక కుమార్తె కలదు.
1928లో ఉత్తరప్రదేశ్’లోని,
సర్ధానలో కపూచిన్ సభలోచేరి తృతీయసభ సభ్యునిగా మారారు. 1928 నుండి 1932 వరకు పాండిచేరిలో,
వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ, తన ప్రేషిత సేవలను కొనసాగించారు. 1933 నుండి 1935
వరకు తమిళనాడులోని మనత్తిడల్ గ్రామములో సువార్తా ప్రచారం చేసారు. అచట తృతీయ సభ
సంఘాలను కూడా స్థాపించారు. 1936వ సం.లో పచ్చమల అను కొండ ప్రాంతములో గిరిజనుల మధ్య
సువార్త ప్రచారం చేసారు.
1936 నుండి 1938 వరకు కేరళ (త్రిశూరు, ఎర్నాకుళం, మలబారు), జోసఫ్ అట్టిపెట్టి మేత్రాణులు స్థాపించిన ‘తెరేసియన్ సహోదరసభ’ సభ్యులకు కొంతకాలం తర్ఫీదును ఇచ్చారు. మరల 1939లో ఆంధ్ర రాష్ట్రము నుండి కేరళ రాష్ట్రమును, ముఖ్యముగా విజయవాడ మేత్రాసణములోని పేదవారికి ఆర్ధిక సహాయము చేయుటకు సందర్శించారు.
1938లో ఆంధ్రప్రదేశ్’లోని
నెల్లూరు మేత్రాసణములోగల బిట్రగుంట గ్రామములో, అటుపిమ్మట విజయవాడ సమీపములోని
కేసరపల్లి గ్రామములో కొంతకాలం సువార్తా సేవను చేసారు. 1939లో పెదావుటపల్లి
విచారణలో తన నివాసాన్ని ఏర్పరచుకొని, చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శిస్తూ,
సువార్తను ప్రకటిస్తూ, అద్భుతకార్యాలు చేస్తూ 15 జనవరి 1945లో ధన్యమరణాన్ని
పొందారు.
పెదావుటపల్లి ఓ చిన్న అస్సీసి
అని చెప్పుకోవచ్చు! వేలాదిమంది భక్తులు, జోసఫ్ తంబిగారి సమాధిని సందర్శించి, ఆయన
మధ్యస్థ ప్రార్ధనద్వారా దేవున్ని ప్రార్ధిస్తూ ఉంటారు. మొక్కుబడులు
చెల్లించుకుంటారు; నిద్రలు చేస్తూ ఉంటారు. ప్రశాంతతను పొందుతూ ఉంటారు.
పెదావుటపల్లి జోసఫ్ తంబిగారు
అనగానే మనకు గుర్తుకు వచ్చేవి – గొప్ప ప్రార్ధనాపరుడు, వినమ్రుడు, పేదరికం,
పేదవారికి సహాయం, ఆయన పొందిన పంచగాయాలు, చేసిన గొప్ప అద్భుతాలు, స్వస్థతలు,
తక్షణగమనవరం, దర్శనకారి, ప్రవచనవరం, పవిత్రజీవితం, చిన్నపిల్లలనగా ఎనలేని ప్రేమ...
జోసఫ్ తంబిగారు గంటల తరబడి
మోకాళ్లమీద ఉండి ప్రార్ధన చేసేవారు. ఆయన గొప్ప ప్రార్ధనాపరుడని, ప్రార్ధనలో
పంచగాయాలను పొందేవారని ఎంతోమంది గురువులు, విశ్వాసులు ప్రత్యక్షసాక్ష్యమిచ్చారు.
ఆయన ప్రార్ధనా జీవితం, పశ్చాత్తాపము, ఉపవాసముతో, దీక్షతో బలపడినది.
ఆయన జీవించియుండగనే ఎన్నో
అద్భుతాలు, స్వస్థతలు చేసారు. కాలుపైనున్న ఒక వ్యక్తి పుండును నాలుకతో నాకి
స్వస్థతపరచారు. ఎంతోమందికి ఏవో ఆకులురాసి, ప్రార్ధనచేసి, సిలువగురుతు వేసి స్వస్థతపరచేవారు.
తను వండుకున్న చిన్న కుండలోనుండి ఎంతోమందికి భోజనం పెట్టేవారు. క్షణములో తాను
అనుకున్న స్థలానికి వెళ్ళగలిగే అద్భుత తక్షణగమన వరాన్ని జోసఫ్ తంబిగారు కలిగియుండేవారు.
ఈ వరము వలననే, పెదావుటపల్లిలో ఉండగనే, తరచుగా కేరళ (1939), పాండిచేరి, ఉత్తరప్రదేశ్’లోని
ఝాన్సి (1944), అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనేక ప్రదేశాలలో కనిపించేవారు.
ఆయన పేదరికములో జీవిస్తూ, పేదవారిని
ఎప్పుడు అక్కున చేర్చుకొనేవారు. కేరళ, పాండిచేరి తరుచుగా వెళ్ళేది, ధనాన్ని
ప్రోగుచేసి పేదవారి సహాయమునకై విజయవాడ మేత్రాణులకు ఇచ్చేవారు. దుస్తులు, డబ్బును
పేదవారికి పంచేవారు. పేదవారి దుస్తులు తనువేసుకొని తన దుస్తులను వారికి ఇచ్చేవారు.
తన ప్రోద్భలముతోనే పెదావుటపల్లిలో అప్పటి విచారణ గురువులు జాన్ బి. కల్దెరారోగారు
వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. తన
జీవనోపాధి కొరకై తానే కాయకష్టం చేసుకొని సంపాదించుకొనేవారు. పనివారితో కలిసి పొలం
పనులకు వెళ్ళేవారు. ప్రజలతోనే ఉంటూ వారు ఇచ్చిన స్థలములో నివాసముండేవారు.
రెండవ ప్రపంచ యుద్ధకాలములో
జరుగుతున్న సంఘటనలను ప్రార్ధనలో ఎన్నో దర్శనాలద్వారా గాంచేవారు. అవే మరుసటిరోజు
వార్తలలో వచ్చేవి. హైందవులైన బోయపాటి ఫ్రాన్సిస్, క్లారమ్మ దంపతులు జ్ఞానస్నానం
తీసుకుంటే, ఎన్నో ఏళ్లనుండి మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న వారికి మగబిడ్డ పుడతాడని
ప్రవచించారు. అలాగే, వారికి మగబిడ్డడు పుట్టడం జరిగింది. వారి ముగ్గురికి జోసఫ్
తంబిగారే జ్ఞానతండ్రిగా ఉండటం రికార్డులలో చూడవచ్చు! మరణావస్థలోనున్న ఒక బాలుడు
బ్రతుకుతాడని, పెదావుటపల్లి గ్రామములో అగ్నిప్రమాదం జరుగునని, బోయపాటివారి యింటికి
మాత్రము ఏమీకాదని, అలాగే పెదావుటపల్లి గ్రామములో ముగ్గురు గురువులు ఉన్నప్పటికీ తాను
అవస్థ అభ్యంగనం పొందలేనని చెప్పారు. అవన్నీ అలాగే జరిగాయి. జోసఫ్ తంబిగారి ఆదర్శ
జీవితం, అద్భుతకార్యాల వలన, పెదావుటపల్లి, చుట్టుప్రక్కల గ్రామాలలో ఎంతోమంది హైందవ
కుటుంబాలు క్రైస్తవాన్ని పుచ్చుకున్నాయి. తన మరణం గురించి మూడు నెలలు ముందుగానే
ప్రవచించారు. శవపేటికను చేయించుకొని, అప్పుడప్పుడు దానిలో పడుకొని మరణం గురించి
ధ్యానించేవారు. వారు చెప్పిన తేదీ, సమయానికే బోయపాటివారి గృహములో తుదిశ్వాసను
విడిచారు.
ఎవరైనా దొంగతనం చేసినను, మనసులో
దుష్టతలంపులు తలంచినను, జోసఫ్ తంబిగారు చెప్పేవారు. వారు మారుమనస్సు పొందునట్లు
చేసేవారు. యిండ్లలో దాచిపెట్టిన వస్తువులు ఫలానాచోట ఉన్నాయని ఖచ్చితముగా
చెప్పేవారు. భవిష్యత్తులో ఫ్రాన్సిసువారి సభకు చెందిన మఠవాసులు, మఠకన్యలు
పెదావుటపల్లిలో సేవలు అందిస్తారని చెప్పినవిధముగానే 1968 నుండి ఫ్రాన్సిస్కన్
కపూచిన్ మఠవాసులు, 1979నుండి ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ మఠకన్యలు సేవలను
అందిస్తున్నారు.
జోసఫ్ తంబిగారికి చిన్నపిల్లలు
అనగా ఎంతో ప్రేమ. వారిని ప్రేమతో ఆదరించేవారు. విద్యాబుద్ధులు నేర్పించేవారు. ఏ
ప్రదేశానికి వెళ్లినను, ప్రార్ధనలు, సత్యోపదేశము, బైబులు గాధలను చెప్పేవారు. పిల్లలు
చెప్పినమాట విననప్పుడు, మోకాళ్లమీదనుండి వారిని ప్రాధేయ పడేవారు. కుటుంబాలను
సందర్శించేవారు. పెద్దవారిని జపమాలకు పిలిచేవారు. విచారణ దేవాలయానికి
దివ్యపూజాబలికి తీసుకొని వెళ్ళేవారు. విచారణ గురువులకు సహాయముగా ఉండేవారు. ఇవన్నీకూడా
ఆయన దైవాంకిత జీవితానికి, దైవసేవకు, సువార్తా ప్రచారానికి తార్కాణం.
జోసఫ్ తంబిగారికి మరియతల్లి యెడల
ఎనలేని భక్తి, విశ్వాసం. ఎప్పుడు తనతో సిలువను, జపమాలను తీసుకొని వెళ్తూ ఉండేవారు.
ప్రతీరోజు జపమాలను జపించేవారు. పునీతులపట్ల, ముఖ్యముగా పునీత అంతోనివారిపట్ల ప్రత్యేకమైన
భక్తి కలిగియుండేవారు. ఆయన వెళ్ళిన అన్నిచోట్ల అంతోనివారి దేవాలయం ఉండేది
(బిట్రగుంట, కేసరపల్లి). జోసఫ్ తంబిగారికి జేసుతిరు హృదయంపట్ల చాలా భక్తి, ప్రేమ. తాను పెదావుటపల్లికి
వచ్చినపుడు తనతో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి స్వరూపాన్ని తీసుకొని వచ్చారు.
జోసఫ్ తంబిగారు ఎక్కడికి
వెళ్లినను, పునీతుల పేరిట పీఠములను నిర్మించి, అచ్చట ప్రార్ధనలు చేసేవారు.
మనత్తిడల్ గ్రామములో పునీత స్తెఫాను పేరిట పీఠమును నిర్మించారు. పెదావుటపల్లి
గ్రామములో బోయపాటి గృహములో అస్సీసిపుర ఫ్రాన్సిసువారి పేరిట పీఠమును నిర్మించారు.
అలాగే పెదావుటపల్లిలో తాను నివసించిన గృహములో పీఠమును నిర్మించారు. అచట ప్రతీ
శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకు పంచగాయాలను పొందేవారు.
జోసఫ్ తంబిగారు శాంతిప్రదాత,
సఖ్యత చేకూర్చువారు! ప్రజలమధ్య, కుటుంబాలమధ్య సఖ్యత చేకూర్చి అందరు శాంతి,
సమాధానాలతో జీవించాలని కోరేవారు. బాధలలోనున్నవారిని ఓదార్చేవారు. వారికోసం
ప్రార్ధన చేసేవారు. ఎవరిమీద కోపపడినా, వెంటనే క్షమాపణ కోరేవారు.
ఆయన జీవితం అద్భుతం, పవిత్రం!
ఆయన నిష్కపట మనస్సు, భక్తిపూర్వకమైన జీవితం ఎంతోమందిని ఆకర్షించినది. అందుకే, లక్షలాది
ప్రజలు ఆయన సమాధిని సందర్శించి, ఆయన మధ్యస్థ ప్రార్ధనలను వేడుకుంటున్నారు. ఆయన
సమాధిని కతోలిక క్రైస్తవులు మాత్రమేగాక, ఇతర క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు
కూడా సందర్శిస్తూ ఉంటారు.
పిల్లలులేని దంపతులకు పిల్లలు
కలగడం, అనారోగ్యాల నుండి స్వస్థత పొందడం... గురించి అనేకమంది సాక్ష్యాన్ని ఇస్తున్నారు.
జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనలద్వారా ఎంతోమంది ఎన్నో మేలులను, స్వస్థతలను
పొందుచున్నారు.
నేడు జోసఫ్ తంబిగారిపట్ల భక్తి
అనేక చోట్ల ప్రాచుర్యం చెందినది. ఆయన మధ్యస్థ ప్రార్ధనలద్వారా మేలులు పొందినవారు,
స్వతహాగా ఆయన స్వరూపాలను, ప్రార్ధనా మందిరాలను (విజయవాడ మేత్రాసణములోని మానికొండ,
ఉప్పులూరు; నెల్లూరు మేత్రాసణములోని
బిట్రగుంట; తెలంగాణలోని వరంగల్ మేత్రాసణములోని తిమ్మరావుపేట) ప్రతిష్టించడం
చూడవచ్చు. పెదావుటపల్లిలోకూడా బ్రదర్ జోసఫ్ తంబిగారి పుణ్యక్షేత్రము ఎల్లప్పుడు భక్తులతో
కళకళలాడుచూ ఉన్నది.
జోసఫ్ తంబిగారి మరణ
వార్షికోత్సవాన్ని జనవరి 13, 14, 15 తేదీలలో లక్షలాదిమంది భక్తులతో
కొనియాడబడుచున్నది. ఆయన జీవించిన, ప్రదర్శించిన పవిత్ర జీవితమునుబట్టి, 24 జూన్
2007న తల్లి శ్రీసభ జోసఫ్ తంబిగారిని ‘దైవసేవకుడిగా’ ప్రకటించినది. త్వరలోనే పునీత
పట్టం రావాలని ప్రార్ధన చేద్దాం.
జోసఫ్ తంబిగారు దైవానుభూతులు,
అద్భుతవ్యక్తి, ప్రార్ధనాపరులు, దీనులు, ధన్యులు, గొప్పవేదప్రచారకులు! ఎంతోమందిని
క్రైస్తవ విశ్వాస పధములో నడిపించాడు. దైవసేవకుడు జీవించిన నిరాడంబర జీవితం నేటికీ
ఎంతోమందికి ఆదర్శనీయం. దక్షిణ భారత రాష్ట్రాలలో ఆయన కీర్తి అమోఘం!
దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా పొందిన మేలులను, స్వస్థతలను, అద్భుతాలను ఈ క్రింది చిరునామాకు తెలియజేయగలరు.
Rev. Fr.
Praveen Gopu, OFM Cap.
Vice
Postulator of Joseph Thamby Cause
Peddavutapally
– 521 286
Unguturu,
Krishna Dist., Andhra Pradesh
955 0629 255 (WhatsApp)